సర్ప స్వరూపంలో నేరుగా దర్శనమిచ్చే దేవతలు !

3.230.142.168

సర్ప స్వరూపంలో నేరుగా దర్శనమిచ్చే దేవతలు !
-లక్ష్మీరమణ 

సర్పాలని దేవతలుగా ఆరాధించడం భారతీయులకి అనాదిగా ఉన్న సంప్రదాయమే. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయంలో మాత్రం ముగ్గురు దేవతా మూర్తులు సర్పాలై సంచరిస్తుంటారు . ఇక్కడ వారి దర్శనం సర్పరూపంలో ప్రత్యక్షంగా చేసుకున్నవారు ఎందరో. కాకతీయులకు ఇలవేల్పుగా పూజలందుకున్న ఈ దేవత ఇప్పటికీ ఆలయంలో ఇలా ప్రత్యెక్షదర్శనాన్ని ఇస్తారని, స్థానికులు చెబుతూ ఉండడం విశేషం .

ఈ ఆలయం మన దేశంలోనే, కాకతీయుల పాలనకు ప్రతీకగా , వారి సంస్కృతీ వారసత్వానికి ప్రతిబింబంగా విలసిల్లుతున్న తెలుగు ప్రాంతం  తెలంగాణా లోనే ఉంది . మహబూబాబాద్‌ రూరల్‌ జిల్లా గార్ల మండలంలో కొలువుదీరిన కొండలమ్మ ఆలయం ఇది. ఈ దేవాలయం ఎంతో ప్రాచీనమైనది. కాకతీయుల కాలంలో నిర్మించినది. వేయిస్తంభాల గుడితోపాటే, ఇక్కడ ఈ ఆలయాన్ని కూడా కాకతీయులు నిర్మించారని చెబుతుంటారు . 

 కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ  కొండలమ్మ ఆలయం. రుద్రమదేవి పాలన కాలంలో కొండలమ్మ ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. గారమ్మ, కొండలమ్మ, భయమ్మ అనే ముగ్గురు దేవతలు మనకి గర్భాలయంలో దర్శనమిస్తారు. వీరు ముగ్గురూ అక్కా చెల్లెల్లని , వీరి  పేరుమీదనే జిల్లాలో మూడు చెరువులు నిర్మించినట్లుగా చెబుతున్నారు. గార్ల చెరువు, బయ్యారం చెరువు, కొండలమ్మ చెరువు ఈ ముగ్గురు దేవతలా పేర్లమీదన ఏర్పడినవే ! ఈ ముగ్గురమ్మలూ ఆ ముగ్గురమ్మలకి ప్రతిరూపాలేనని స్థానికుల నమ్మకం. 

అయితే, ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడి ఆలయంలో భక్తులకు అడుగడునా పాములు కనిపిస్తాయి. కానీ అవి భక్తుల జోలికి రావు. ఎప్పుడూ ఏ భక్తుడిని కాటు వేసిన చరిత్రే లేదు. వీటికి భక్తులు పూజలు కూడాచేస్తారు. దేవతలుగా పూజలందుకుంటున్న ఆ  అక్కా చెల్లెల్లే ఇలా పాముల రూపంలో ప్రత్యక్షమవుతుంటారని ఇక్కడి భక్తుల విశ్వాసం.  

ఈ పురాతన ఆలయంలో ఉగాదిని పురస్కరరించుకుని ఏటా నాలుగు రోజుల పాటు జాతర నిర్వహిస్తుంటారు. పండగ సందర్బంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.

Quote of the day

The season of failure is the best time for sowing the seeds of success.…

__________Paramahansa Yogananda