Online Puja Services

తంగిడి రాతికోడి కూసిందంటే

3.141.244.201

తంగిడి రాతికోడి కూసిందంటే, ఇక జలప్రళయమేనా ?
లక్ష్మీ రమణ 

జలప్రళయంవచ్చి ఈప్రపంచం అంతమై పోతుందని, ఆసమయంలో తానూ  శాయినై ఆవిర్భవిస్తానని భగవానుడు స్వయంగా చెప్పారు .  ఈకలియుగంలో ముంచెత్తుతున్న సునామీలు , జలవిలయాలూ , ప్రక్రుతి వైపరీత్యాలు మనం గమనిస్తూనే ఉన్నాం కదా! చాలా మంది ఇక , ప్రపంచం అంతమయ్యే సమయం ఆసన్నమయిందని కూడా అభిప్రాయపడుతున్నారు . ఇలాంటి సమయంలోనే తంగిడి కోడి శాశనం మళ్ళీ వినిపిస్తోంది . 

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌ జిల్లా కృష్ణా మండల పరిధిలోని తంగిడి గ్రామంలో సంగమేశ్వరుడి ఆలయం ఉంది. కర్ణాటక సరిహద్దు లో తంగిడి గ్రామం ఉంది . ఈ  ప్రాంతంలో ఒకవైపు కృష్ణానది, మరోవైపు భీమానది పరవళ్లు తొక్కుతుంటాయి. ఈ నదుల సంగమ స్థానం ఇది . దీన్నే నివృత్తి సంగమం అని అంటారు . నివృత్తి సంగమంలో ఎందరో మునులూ , ఋషులూ తపస్సు చేశారు . ఈ పవిత్ర సంగమ స్థలి పేరే ఆ అభౌతిక తత్వాన్నిప్రతిఫలిస్తూ ఉండడం విశేషం .  ఇక్కడ దత్తప్రభువు మొదటి అవతారమైన శ్రీ శ్రీపాద శ్రీవల్లభులు తపస్సు చేసినట్టు గా చెబుతారు .   

శ్రీపాద శ్రీవల్లభుడు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించారు .  ఇప్పటికీ ఆయన జన్మించిన ఇల్లు అక్కడ సజీవంగా ఉంది . 16 సంవత్సరాల వరకు అక్కడే జీవించిన ఆయన అనంతరం  దేశసంచారం నిమిత్తం వెళ్లిపోయాడు. ఆలా వెళ్లిన శ్రీపాదులు  కొన్ని సంవత్సరాల పాటు ఎవరికీ కన్పించకుండా మాయమయ్యారు . ఆ తరువాత కార్తీక పౌర్ణమి నాడు తంగిడిలోని నివృత్తి సంగమంలో ప్రత్యక్షమయ్యారని కథనం . 

ఈ సంగమ స్థలిలో  కొన్ని సంవత్సరాల పాటు తపస్సు ఆచరించి ఇక్కడినుంచి, ఆపై  ఆయన  కర్ణాటకలోని కుర్మగడ్డకు వెళ్లారని  చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇప్పటికీ ఈ సంగమంలో శ్రీపాద శ్రీవల్లభులు  పూజించిన వినాయక విగ్రహం, ఆయన పాదుకలు, శివలింగం ఉన్నాయి. ఆయన ఇక్కడినుంచి కుర్మగడ్డకు కాలినడకన వెళ్లిన మార్గంలో నదిలోని రాళ్లు నల్లరాయితో రోడ్డు వేసినట్లు ఇప్పటికీ ప్రత్యక్షంగా కన్పిస్తాయి. 

ఇంతటి విశేషమైన ఈ స్థానాన్ని తెలుసుకున్న విఠల్‌బాబా అనే స్వామి ఇక్కడ ఓ ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. అందులో భాగంగానే ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ దత్తభీమేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఈ నివృత్తి సంగమంలో స్నానం ఆచరించిన వ్యక్తుల పాపాలు నివృత్తి అవుతాయని విశ్వాసం . 

ఈ ప్రాంతంలో పురాతనమైన ఒక శిలాశాసనం , ఒక బురుజుపైన శిలారూపంలో కోడి ఉంటాయి . ఆ శిలా శాసనం ప్రకారం , ‘తంగిడి సంగమంలో ఓ శక్తి పుడుతుంది. ఆ తరువాత సంగమంలోని రాతి కోడి కూస్తుంది. ఆ కోడి కూసిన రోజు ఈ ప్రపంచమంతా జలసమాధి అయిపోతుంది’ అంటూ రాసుంది. ప్రస్తుతం ఈ శాశనం, కోడి రెండూ కూడా శిధిలావస్థలో ఉన్నాయి .  

కానీ ఈ ప్రాంత ప్రజలు మాత్రం ఈ మాటలను ఎప్పుడూ తలచుకుంటూనే ఉంటారు. కృష్ణమ్మ , దుర్గాదేవి ముక్కుపుడుకని అందుకోవడం, లేపాక్షి బసవన్న రంకె  వెయ్యడం , తంగిడి కోడి కుయ్యడం  ఇవన్నీ ఒకే సారి జరుగుతాయేమో మరి !

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore