లోవలోని తలంపులమ్మ - సులభప్రసన్న

100.24.115.215

​లోవలోని తలంపులమ్మ - సులభప్రసన్న . 
-లక్ష్మీ రమణ 

తునిపట్టణం, తూర్పు గోదావరి జిల్లాలో తాండవ నది ఒడ్డున ఉంది. తుని నుండి 5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే లోవకొత్తూరు చేరుకొంటాం. అక్కడే ఉంది తలుపులమ్మ లోవ. మది తలుపులు తెరిచి లోపలికెళితే ... తలంపులు తీరుస్తుంది అమ్మల గన్న అమ్మ తలుపులమ్మ.

 ఆ నీలి గగనాన విహరించే ఏ మేఘాలకు సందేశాలు అందజేస్తున్నాయో అనిపించే కొబ్బరి తోటల నడుమ నెలకొని ఉంది తుని. హౌరా- చన్నై రైలు తుని మీదుగానే పరుగులు తీస్తుంది. ఇక్కడికి ఆంద్రప్రదేశ్లోని ప్రధాన పట్టణాల నుండి రైలు సౌకర్యం ఉంది. తునినుండి తలుపులమ్మ లోవ దాదాపు 5 km. పురివిప్పిన ప్రకృతి సౌదర్యం,  అడుగడుగునా పచ్చటి తివాచీలు పరచి ఆహ్వానం పలుకుతుంది. ఘాట్ రోడ్ ప్రవేశ ద్వారం పై తలపులమ్మ తల్లి చిరునవ్వుతో "దర్శన ప్రాప్తిరస్తు" అని ఆశీర్వదిస్తుంది.

తలుపులమ్మ గా ప్రసిద్ధి చెందిన దేవత అసలు పేరు తలంపులమ్మ. మనసారా తలుచుకొంటే చాలు, ముగురమ్మల మూలపుటమ్మ కరిగిపోతుంది. అక్కున చేర్చుకొని తలంపులన్నీ  నెరవేరుస్తుంది. ఆపదలు రాకుండా కాపాడుతుంది. అందుకే ... ఇక్కడి కొండ రాళ్ళ పై భక్తులు తమ వాహనాల నెంబర్ లు రాస్తుంటారు. అలా రాస్తే ఇక వారి వాహనాలను ఏ ఆపదలు చేరలేవని విశ్వసిస్తారు. తలుపులమ్మ కొండమీద వాహన పూజ చేసి రక్షా వస్త్రం వాహనానికి కడతారు.

ఘాట్ రోడ్ దాటి కొండ మీదికి చేరుకొన్నాక తలుపులమ్మ లోవ దేవస్థాన ప్రవేశ ప్రాకారం కనువిందు చేస్తుంది. ప్రాకారం పై గర్జిస్తున్న సింహాలు దైవ  శక్తి కి ప్రతీకలు. సభక్తికంగా నమస్కరిస్తున్న ఏనుగులు మానవ తత్వానికి ప్రతీకలు. నడుమ దేవి చతుర్భుజాలతో ఆశీనురాలై దుష్ట శక్తులను తన భక్తుల దరిచేరవద్దని  హెచ్చరిస్తుంటుంది. ఆ ముందరే గాయత్రీ దేవి అష్ట లక్ష్ములతో కొలువుతీరిన తీరు ముచ్చట గొలుపుతుంది. జీవకళ ఉట్టిపడుతూ చూపరులను కట్టిపడేస్తాయి ఈ శిల్పాలు.   

తలుపులమ్మ లోవకి ప్రయాణం ఒక ప్రకృతి పారవశ్యం. తలంపులమ్మ తల్లి స్వయంభువు గా ఈ లోవలో వెలసింది. లోవకి చేరుకొనే మెట్ల దారి పొడవునా ... మెట్టుమెట్టుకూ  పసుపు కుంకుమలు అద్ది,  తమ పసుపుకుంకుమలు కాపాడమని వేడుకొంటారు ఆడపడుచులు. మెట్ల దారిలో విఘ్నేశ్వరుని దర్శనం ప్రాప్తిస్తుంది. మరెన్నో వర్తక మజిలీలు ఆకర్షిస్తాయి.

తలుపులమ్మ కి రావిచెట్టు నీడలో అఖండ దీపం వెలిగిస్తారు సువాసినులు. నూరు లేదా వేయి వత్తులతో జ్యోతి వెలిగించి వేడుకొంటే ... జీవితాంతం ఐదోతనం తో విలసిల్లుతారని నమ్మకం. ఇక మెట్ల దారిలో మరింత ముందుకు సాగితే .. తలుపులమ్మ దర్శనానికొచ్చె భక్తుల విఘ్నాలను నాశనం చేస్తూ వినాయకుడు దర్శనమిస్తాడు. మూషిక వాహనం వినాయకుని ఎదురుగా వినమ్రంగా నిలిచి, స్వామిని ప్రధమ దర్శనం చేసుకోమని ప్రభోదిస్తుంటుంది. అక్కడ నుండి కొండను తొలచి విశాలం గా మలచిన మెట్ల మీదుగా మళ్ళి ప్రయాణం కొనసాగుతుంది. చుట్టూ తలుపులమ్మ చిత్తరువుల విపణి అమ్మ దర్శనాకాంక్షను  మరింత ధృఢ పరుస్తుంది.

వరాలు అనుగ్రహించమని, కష్టాలు దూరం చేయమని దేవికి ముడుపులు కడతారు భక్తులు. యెర్రని వస్త్రంలో కట్టే ముడుపులు అక్కడి వ్యాపారులకు అమ్మ అందించిన జీవనాధారాలు.  అల్లంత దూరాన తలుపులమ్మ ఆలయ విమానం కనిపిస్తుంటుంది. కళ్ళేదుట పరమ శివుని సుందర రూపం సాక్షాత్కరిస్తుంది. ఓంకార నాదానుసంధానమైన పరమేశ్వరుడు రుద్రాక్షలు ధరించి యోగముద్రలో ఉంటాడు. రుద్రాక్షలు ధరించేవారి పాపాలు ఏరోజు కారోజే భస్మమైపోతాయి. ఆ విషయాన్ని తెలిపేందుకే నేమో రుద్రుడు తన కన్నీటిని విడిచి, రుద్రాక్షకి జన్మనిచ్చి, వాటినే ధరించి చరించడం.

ఆ శివ సన్నిధి నుండి ఆలయ విమానం వైపు చూస్తే ... త్రిమూర్తుల శక్తి రూపాలు లక్ష్మి, సరస్వతి, పార్వతీ మాతలు దర్శన మిస్తారు.

అక్కడే మరో వైపు ఆదిదంపతులు సుఖాసీనులై శుభాశీస్సులు అందిస్తుంటారు. సర్వమంగళ కారకమైన ఆదిదంపతులను దర్శించుకొని అలా చూపు సారిస్తే ... చతుర్భుజాలతో సౌందర్యమంతా పోతపోసినట్లున్న వనదేవత తలుపులమ్మ తల్లి కనిపిస్తుంది.

ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఢమరుకం దేవి పాదాల నాశ్రయించిన వారి జోలికొస్తే,ఊరుకోమని హెచ్చరిస్తుంటాయి. ఇంకొక వైపు పాన పాత్ర దేవి పాదాలను శరణన్నవారింట అమృత వర్షం కురుస్తుందని తెలియ జేస్తుంటుంది. మరో హస్తం అభయ ముద్రలో అనుగ్రహ వృష్టి ని కురిపిస్తుంటుంది.

కళ్యాణ కట్ట లో తలుపులమ్మకి తలనీలాలు సమర్పించి అరిషట్ వర్గాలలో అహంకారాన్ని నీపాదాల చెంత వదిలేస్తున్నామని భక్తులు శరణు వేడతారు.

తలుపులమ్మ కోసమే విరిసిన పూలవనం పరిమళిస్తుంటుంది . ఇక్కడి ప్రతి సుమం తలుపులమ్మ పాదాలను చేరేందుకు తహ తహ లాడుతుంటుంది. అమ్మకే మేము  అంకితం అని ముగ్ధ మోహనంగా చెబుతుంటుంది .          

తలుపులమ్మ తల్లి ఈ  లోవలో శక్తి స్వరూపిణి గా నిత్య పూజ లందుకొంటోంది. గ్రామ దేవతే అయినప్పటికీ... మహిమాన్వితమైన తల్లి గా పేరుగాంచడం వల్ల ఈ క్షేత్రానికి దేశం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తారు. తలంపులమ్మ అమ్మవారి ఆవిర్భావం వెనుక ఒక పురాణ గాథ ప్రాచుర్యం లో ఉంది.

అంబర వీధిని తాకేలా పెంచిన వింధ్యుని మేని గర్వానికి ప్రాణి కోటి మొత్తం విలవిలలాడింది. అప్పుడు బయలుదేరారు అగస్త్య మహాముని. వింధ్య పర్వతానికి అగస్త్యులే గురువు . ఆయన కాశీ మహా క్షేత్రం నుండి బయలుదేరి ఉత్తర దేశ యాత్రలన్నీ చేస్తూ ...వింధ్య పర్వతాన్ని చేరుకొన్నారు. వంగి వినమ్రంగా గురువుగారికి పాదాభివందనం చేశాడు వింధ్య పర్వతం. దక్షిణ దేశ యాత్ర ముగించుకొని వచ్చేవరకు నువ్వు లేవడానికి వీలు లేదన్నారు అగస్త్యుల వారు.గురువుగారి ఆజ్ఞని శిరసా వహించాడు వింధ్యుడు.  అలా వింధ్యుపర్వతుని గర్వమణిచి, దక్షిణ దేశ యాత్రలు చేస్తూ ... తుని దగ్గరికి చేరుకొన్నారు. లోవ ప్రాంతాన్ని దాతుండగా చీకటి పడింది. కారడవి లో మునీంద్రులకు ఆకలి తీరే మార్గం కనిపించలేదు. కనీసం  అర్ఘ్యం ఇచ్చేందుకు గుక్కెడు నీళ్ళయినా కనిపించలేదు. దాంతో ఆయన ఆదిదంపతులను ఆవాహన చేశారు.

 అప్పుడు ఒక వృక్ష సముదాయం లో దేదీప్యమానమైన వెలుగు సాక్షాత్కరించింది. ఆ వెలుగుల నడుమ ఒక అశరీర వాణి పలకరించింది. లలితా దేవి నైన తాను లోవలో వనదేవతగా సంచరిస్తున్నానని పరిచయం చేసుకొంది. తీయటి నీటి ధారని, కమ్మటి భోజనాన్నిప్రసాదించింది.  అమ్మ ఆత్మీయతలో కరిగిపోయాడా మునీంద్రుడు. తలచినంతనే ప్రత్యక్షమైన అమ్మని తలంపులమ్మగా కొలువై భక్తులను అనుగ్రహించమని వేడుకొన్నారు. ఇక అప్పటి నుండి తలంపులమ్మ ఈ లోవలో కొలువైంది. ఆ తర్వాత వాడుకలో తలుపులమ్మ గా మారి కొలుపులు అందుకొంటోంది.  

పురాణ కాలం లోనే కాదు, తలుపులమ్మ ఇప్పటికీ తలుచుకోగానే ఆపదలు బాపే తల్లి. లోవ లో అమ్మ మాహాత్శ్యానికి ప్రతీకలు భక్తులకు అనుభవమవుతూనే ఉన్నాయి. తలుపులమ్మ కొండ మీద 5. 30 దాటితే తలుపులు ముతపడతాయి. ఆ తర్వాత నరసంచారం ఉండదు. ఆ సమయం లో తలుపులమ్మ తల్లి వనదేవతగా ఆ పరిసరాలలో సంచరిస్తుందని స్థానిక విశ్వాసం.  ఇప్పటికీ ఈ కట్టుబాటు ఇక్కడ కట్టు దిట్టంగా అమలవుతోంది.

5ఏళ్ళ తమ చిన్నారితో కలిసి అమ్మని దర్శించు కొన్నారు ఒక జంట. తిరిగి వచ్చేటప్పుడు హడావిడిలో పడి పాప తమ వెంట రాని విషయాన్ని గమనించలేదు. కొండ దిగే సరికి 5. 30 దాటింది. గుడి మూసేసి అర్చకులు కూడా కిందికి వచ్చేశారు. పాప రాలేదని గమనించి, పైకి వెళ్లేందుకు ప్రయత్నించారు తల్లిదండ్రులు. కానీ కట్టుబాటు తప్పరానిదని ఆపేశారు పూజారులు.

ఆ రాత్రి క్షణమొక యుగం లా గడిచింది ఆ తల్లి దండ్రులకి . తెల్ల వారింది. పాప కన్నతల్లి ఆతురతగా కొండపైకి పరుగులు తీసింది. తలుపులమ్మ సన్నిధిలో పాప ఆడుకొంటూ కనిపించింది. పాపని దగ్గరకి తీసుకొని రాత్రంతా ఒక్కదానివే ఎలా వున్నావమ్మా ? భయమేయలేదా  !! ఆకలి వేయలేదా !  అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు . ఆ పాప "నువ్వు రాత్రి నాదగ్గరే వున్నావు కదా ! అన్నం కూడా పెట్టావు. నిద్రపుచ్చావు . " అని చెప్పేసరికి తెల్లబోవడం తల్లిదండ్రుల వంతయ్యింది. ఇలా తలుపులమ్మ పిచిన పలికే దైవంగా, మాతృ స్వరూపిణిగా లోవలో నిలిచి పూజ లందు కుంటోంది. ప్రతినెలా తలుపులమ్మ తల్లి జన్మ నక్షత్రమైన స్వాతీ నక్షత్రం వున్నా రోజున అమ్మవారికి ప్రత్యెక పూజలు జరుగుతాయి. ఆషాడమాసం లో తలుపులమ్మ జాతర అంగరంగ వైభవం గా జరుగుతుంది .  


 సత్యమున్న చల్లని తల్లి శ్రీ తలుపులమ్మ. సుప్రభాతమైనా, నైవేద్యమైనా... మరే సేవ చేయాలన్నా .. గర్భాలయం తలుపు తట్టి లోపలి వెళతారు పూజారులు. మంగళ వాద్యాలు, గుగ్గిల ధుపాల నడుమ అమ్మ కి ప్రసాద నివేదన, నవ హారతి సమర్పణ జరుగుతుంది.

 పచ్చటి ఆవాసాలలో, మంగళ వాయిద్యాలలో, ధూప దీపాలలో దేవి కొలువై ఉంటుంది. పైగా ఆమె వనదుర్గ. "వనాలలో ఎక్కడన్నా సంచరిస్తున్నావేమోతల్లీ !! మా ఆకలి తీర్చే అమ్మవు నీవు . నీకు నైవేద్యం తీసుకొచ్చాం. రా అమ్మా !" అని  దేవిని పిలవడమే నైవేద్యం తీసుకొచ్చేటప్పుడు మంగళ వాద్యాలను వినిపించడం. ఇక గుగ్గిలం దుష్ట శక్తులను దూరంగా తరిమే సాధనం. అమ్మకి సమర్పించే నైవేద్యం  పవిత్రంగా ఉండాలనే ఉద్దేశ్యం తో గుగ్గిలం వేస్తారు.

ఇక్కడ చిన్న గా  మూడు మూర్తులు గా దేవి దర్శనమవుతుంది . వీరు స్వయంభువులు. మధ్యలో వున్న దేవీ రూపం తలుపులమ్మ తల్లి. దేవికి  కుడి వైపు పోతరాజు,  ఎడమ వైపు అమ్మవారిదే మరో శక్తి రూపం కొలువై వుంటారు. ఆ పైన ఉండే  మూల మూర్తి తలపులమ్మ ప్రతిష్టితం. 

 నైవేద్యం  గర్భ గుడికి చేరాక కూడా ... తలుపు తట్టి వెళ్ళడం తలుపులమ్మ లోవలో మనం గమనించవచ్చు. నైవేద్యానంతరం మంగళ హారతి. నవవిధాలైన మహా హారతి అమ్మవారికి సమర్పిస్తారు. నవవిధ హారతులలో ఏకవర్తి హారతి నించి అష్టవర్తి హారతుల వరకు సమర్పించిన అనంతరం కుంభ హారతిని సమర్పిస్తారు. ఈ నవ విధ హారతులు సృష్టి క్రమాన్ని మనకి బోధిస్తాయి ఆధ్యాత్మిక వున్నతిని సాధించిన జీవుడు తిరిగి పరబ్రహ్మంలో లీనమై పరిపూర్ణుడు కావటమే కుంభ హారతి లోని అంతరార్థం.
 హారతి వెలుగుల్లో, ఆధ్యాత్మిక వికాసంతో భక్తులు తలుపులమ్మని దర్శించుకొంటారు. అనంతరం పూజారులు  దేవికి సేద తీరుస్తూ చామరం వీస్తారు. ఆ తర్వాత దేవి పాదాలకు సర్వస్య శరణాగతి చేయమని ఉద్భోదిస్తూ ... శఠగోపం ఇస్తారు.

 తలుపులమ్మ ని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి,  భక్తులు తృప్తిగా వెనుతిరుగుతారు. అమ్మ దివ్య దర్శనం తో మనమూ తరించాం కదా !

శుభమ్

Quote of the day

It is easy to talk on religion, but difficult to practice it.…

__________Ramakrishna