Online Puja Services

దుర్యోధనుడికి ఒక దేవాలయం ఉంది

3.148.113.155

దుర్యోధనుడికి ఒక దేవాలయం ఉంది . ఇక్కడి ఆచారాలే  వేరు ! 
-లక్ష్మీ రమణ 

దుర్యోధనుడనగానే దుష్ట స్వభావం గల బలాఢ్యుడైన వ్యక్తి రూపం భారతీయుల మదిలో మెదలడం ఖాయం . ఆయన కురువంశ సార్వభౌముడైనా , వ్యక్తిత్వం అలాంటిది మరి . పాండవులని తన సోదరులనికూడా చూడకుండా, కొద్దిగా కూడా కనికరం లేకుండా ఆయన సాగించిన కుటిల తంత్రాలు, అవలంభించిన రాజనీతి సూత్రాలూ అలాంటివి. కానీ ఆయనకీ ఈ దేశంలోని ప్రజలు ఒకచోట గుడికట్టి ఆరాధిస్తారు . కొలుపులు చేసి , జాతరలు చేస్తారు . ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం మరి ! 

దుర్యోధనుడు ఒకవైపు దుష్టత్వానికి ప్రతీక అయితే, మరోవైపు స్నేహానికీ, స్వాభిమానానికీ ప్రతీక. సూతపుత్రునిగా ఉన్న కర్ణుడి ధైర్యసాహసాలు, అనితరసాధ్యమైన విలువిద్యా ప్రావీణ్యతని చూసి అతనితో స్నేహం చేస్తాడు దుర్యోధనుడు. అంగరాజ్యానికి  ఆయనని రాజుగా అభిషక్తుడిని కూడా చేస్తాడు . అదే సమయంలో లాక్షాగృహంలో పాండవులని మట్టుబెట్టాలనుకుంటాడు . మాయా జూదంలో దౌపదిని పందెంకట్టి, నిండుసభలో తన వదినని దారుణంగా అవమానిస్తాడు . ఓడిపోయిన పాండవులని అరణ్యవాసం పేరుతో అడవుల పాలు చేసిందేకాక, అజ్ఞాతవాసంలో  వాళ్ళు ఎక్కడున్నారని కనిపెట్టి, మల్లి అరణ్యవాసానికి పంపించాలని కుట్ర పన్ని వెంబడిస్తాడు . ఇలాంటి రెండు పార్శ్వాలు దుర్యోధనుడి పాత్ర చిత్రణలో కనిపిస్తుంది . 

 కానీ సరిగ్గా ఇలా దుర్యోధనుడు  అజ్ఞాతవాసంలో పాండవులని వెతుకుతూ వెళ్లడమే, ఆయనకీ ఆలయం కట్టేందుకు కారణం అయ్యింది . కేరళలో కొల్లం జిల్లాలో పోరువళి అనే చిన్న గ్రామం ఉంది. అక్కడి కొండ మీదే ఈ దుర్యోధనుడి ఆలయం ఉంది. ఆ కొండని మలనాడ అని పిలుస్తారు. మలనాడ అంటే ఆలయం ఉన్న కొండ అని అర్థం! ఈ ఆలయం వెనుక చాలా వింత చరిత్రే వినిపిస్తుంది. 

అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల ఉనికిని కనుక్కోగలిగితే, మళ్లీ వారు మరో 12 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని చేయవలసి ఉంటుంది. అందుకే అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల జాడను కనుగొనేందుకు దుర్యోధనుడు బయల్దేరాడు. అలా వెళ్తూ వెళ్తూ కేరళలోని ఈ మలనాడు ప్రదేశానికి చేరుకున్నాడట. ఇక్కడికి రాగానే దుర్యోధనుడికి విపరీతంగా దాహం వేసింది. దాంతో తన దాహార్తిని తీర్చేందుకు ఎవరన్నా కనిపిస్తారేమో అని ఎదురుచూడసాగాడు.

దుర్యోధనుడి బాధను గమనించిన ఓ వృద్ధురాలు తన దగ్గర ఉన్న కల్లుని ఆయనకు అందించి దాహాన్ని తీర్చింది. కల్లు రుచి చూసిన దుర్యోధనుడు మహా సంబరపడిపోయాడు. అక్కడి ప్రజల ఆతిథ్యాన్నీ, అక్కడి ప్రకృతి అందాలను చూసి ముగ్ధుడయ్యాడు. వెంటనే ఆ కొండ మీద కూర్చుని ఆ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచమంటూ పరమేశ్వరుని ప్రార్థించాడు. ఇక అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఓ వంద ఎకరాల పొలాన్ని ఆ ప్రాంత వాసులకు దానం చేశాడు. ఇప్పటికీ ఆ ప్రదేశం ప్రభుత్వ రికార్డులలో దుర్యోధనుడి పేరు మీదుగానే ఉంటుందని అంటారు.

ఇదంతా జరిగిన ప్రదేశంలో దుర్యోధనుడికి ఓ ఆలయాన్ని నిర్మించారు ఆ ప్రాంతవాసులు. కాకపోతే ఆ ఆలయంలో దుర్యోధనుడి విగ్రహం మాత్రం ఉండదు. గుడిలో ఒక ఎత్తైన ఖాళీ వేదిక మాత్రమే దర్శనమిస్తుంది. గుడిలోకి చేరుకునే భక్తులు తమ మనసులోనే ఆ మూర్తిని ఊహించుకుంటారు. అక్కడ దుర్యోధనుడు కొలువుతీరతాడని ఇక్కడివాళ్ళు నమ్ముతారు . ఈ ఆలయంలోని ‘కురవ’ అనే కులానికి చెందిన వారు మాత్రమే పూజారులుగా సాగడం మరో విచిత్రం. దుర్యోధనుడికి కల్లుని అందించిన వృద్ధురాలు ‘కురవ’ స్త్రీ కావడంతో ఈ ఆచారం మొదలై ఉంటుంది.
 
మలనాడకి ప్రతిరోజూ భక్తులు వస్తూనే ఉంటారు. కానీ మార్చిలో జరిగే ‘కెట్టుకజ’ ఉత్సవానికి మాత్రం రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది జనం వస్తారు. మన బోనాల సందర్భంగా ఎలాగైతే వెదురుతో తొట్టెలు చేస్తామో... అలాగే 70. 80 అడుగుల ఎత్తున అలంకరణలు చేసి వాటిని భుజాన మోస్తారు. ఉత్తర భారతంలో అక్కడక్కడా దుర్యోధనుడిని ఆరాధించే ప్రజలు కనిపిస్తారు. కానీ దక్షిణభారతదేశంలో మాత్రం బహుశా ఈ ఒక్క ప్రదేశంలోనే ఆయన పూజ కనిపిస్తుంది.

ఇక ఈయనకి, నైవేద్యంగా కల్లుని, మద్యాన్ని సమర్పిస్తారు . ఈ ఆలయందగ్గర వీటి అమ్మకాలుకూడా జోరుగానే సాగుతుంటాయి . ఈ గుడిలో దుర్యోధనుడితో పాటు అతడి భార్య భానుమతి, తల్లి గాంధారీ, గురువు ద్రోణుడు, మిత్రుడు కర్ణుడులను కూడా పూజిస్తారు.

ఇలా చేరుకోవాలి :
కేరళలోని కొల్లాం నుంచి మలనాడకు 31 కిలోమీటర్లు దూరం ఉంటుంది. కొల్లాం రైల్వే స్టేషన్ నుంచి నేరుగా దేవాలయానికి క్యాబ్ లేదా బస్సు ద్వారా చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం ద్వారా వచ్చే వారికి కేరళ నుంచి 246 కిలోమీటర్లు, కొచ్చి నుంచి 125 కిలోమీటర్ల దూరంలో మలనాడ ఉంటుంది.

విమానం ద్వారా వచ్చే వారు సమీప విమానాశ్రయం త్రివేండ్రంలో దిగాలి. అక్కడి నుంచి మలనాడ 88 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. త్రివేండ్రం నుంచి కొల్లాం వరకూ రైలులో వెళ్లి అక్కడి నుంచి క్యాబ్ లేదా బస్సు ద్వారా మాలనాడ చేరుకోవచ్చు.

Quote of the day

God can be realized through all paths. All religions are true. The important thing is to reach the roof. You can reach it by stone stairs or by wooden stairs or by bamboo steps or by a rope. You can also climb up by a bamboo pole.…

__________Ramakrishna