Online Puja Services

నీరాజనం

18.117.152.251

నీరాజనం

          సి.ఎన్.చంద్రశేఖర్
           (9490050214)

    "గుడ్ మార్నింగ్ నాన్నా!"
"గుడ్ మార్నింగ్ తల్లీ!"        కూతురు సౌమ్య గొంతు ఫోన్ లో విన్న ప్రసాద్ ఆనందంగా అన్నాడు.
        "ఈరోజు మీ రిటైర్మెంట్ డే కదా నాన్నా...హ్యాపీ రెటైర్డ్ లైఫ్"
            "థాంక్యూ"
"మీకు బాధగా ఉందా నాన్నా?"
             "లేదురా....అట్లని సంతోషంగానూ లేదు. అయితే తృప్తిగా మాత్రం ఉంది. ముప్ఫై అయిదేళ్ళు సంస్థ అభివృద్దికోసం కృషి చేశాను. ఇన్నేళ్ళలో బాధ్యత మరచిన క్షణం లేదు. క్రమశిక్షణ తప్పిన సంఘటన లేదు. అన్యాయంగా ఆర్జించింది లేదు. ఆ తృప్తి చాలు నాకు" 
     "నాకు తెలుసు నాన్నా.  ఈ ఏడేళ్ళలో నేను ఉద్యోగంలో ఈ స్థాయికి చేరడానికి కారణం మీరే నాన్నా. పనిమీద విసుగొచ్చిన ప్రతిసారీ మీరు గుర్తొస్తూంటారు. ముఖ్యంగా మీరంటూంటారు-'నేను
ప్రతిరోజూ ఆరోజే ఉద్యోగంలో చేరినట్లు భావిస్తూంటాను. అందుకే అంత ఉత్సాహంగా పనిచేస్తాను ' అని. చాలా చక్కని ఆలోచన అది. మీ ఆలోచనల్నీ, భావాల్నీ నేను కాపీ కొట్టేస్టూంటాను, బహుమతులూ , ప్రొమోషన్లూ కొట్టేస్తూంటాను"
         "గుడ్. ఐ యాం ప్రౌడ్ ఆఫ్ యు రా తల్లీ"
       "మీరు రిటైర్ అవుతూంటే నాకు సంతోషంగా ఉంది నాన్నా"
            "ఎందుకురా?"
               "నాకు ఉద్యోగం వచ్చినప్పటినుంచీ మీకు దూరంగా వచ్చేశాను. అంతలో నాకు పెళ్ళి అయింది. మీరు మా ఇంటికి ఎప్పుడు వచ్చినా నాలుగురోజులయ్యేసరికి 'ఆఫీసులో చాలా పని ఉంది...' అని వెళ్ళిపోయేవారు. ఇకపై అలా అనే అవకాశం మీకు లేదు. నేను రమ్మన్నప్పుడల్లా రావాలి...నేను వెళ్ళమన్నప్పుడే వెళ్ళాలి"
         "ఎస్ బాస్" నవ్వుతూ అన్నాడు ప్రసాద్.
           "మేము మధ్యాహ్నం బయలుదేరి సాయంత్రం ఫంక్షన్ టైముకు వచ్చేస్తాం నాన్నా, పిల్లలు మిమ్మల్నీ, అమ్మనూ చూడాలని ఆత్రుత పడుతున్నారు:
       "అలాగే...జాగ్రత్తగా రండి"
   
 *            *          *          *
         
ప్రసాద్ టిఫిన్ తింటూంటే ఫోన్ రింగయింది.
          "లేచిన దగ్గరనుంచీ ఫోన్లతోనే సరిపోతూంది మీకు. మీరు టిఫిన్ తినండి. నేను మాట్లాడుతాను" అంది రాధ.
        "ఫోన్ చేసింది మన సుపుత్రుడే బాబూ"
-అని నవ్వుతూ రిసీవర్ తీశాడు ప్రసాద్.
          "ఈరోజు లాస్ట్ డే ఇన్ ఆఫీస్ కదా నాన్నా?" భార్గవ్ అడిగాడు తండ్రిని.
          "అవునురా.."
"నాకు బాధగా ఉంది నాన్నా"
      "నీకెందుకురా బాధ?" ఆశ్చర్యంగా అడిగాడు ప్రసాద్.
          "మీ సంస్థతో మీకున్న అనుబంధం గురించి నాకు తెలుసు కాబట్టి. మీ సంస్థ గురించి ఎంత ఆలోచించేవారు, ఎంత గర్వంగా చెప్పుకునేవారు? ఇచ్చిన పని పూర్తిచేసేదాకా నిద్రపోని తత్వం మీనుంచే నాకు అలవడింది. టాప్ మేనేజ్మెంట్ నుంచీ, ఓవర్సీస్ క్లైంట్స్ నుంచీ నాకు అభినందనలు వస్తూంటే మీరే గుర్తుకువచ్చేవారు. మీనుంచి నేను నేర్చుకున్నవాటిలో ముఖ్యమైనది...పనిచేస్తున్న సంస్థ పట్ల అంకిత భావం!"
     "లైక్ ఫాదర్...లైక్ సన్" నవ్వుతూ అన్నాడు ప్రసాద్.
            "మేము ఇంకాసేపట్లో బయలుదేరుతున్నాం....భోజనానికి అక్కడ ఉంటామని అమ్మతో చెప్పండి"
          "అలాగే"

         *        *          *         *

              "ఇన్నాళ్ళూ ఆఫీసు పనులంటూ బిజీగా ఉన్నారు. రేపట్నుంచి ఎలా ఉంటారో చూడాలని నాకు ఆత్రుతగా ఉంది"
        -అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటున్న భర్తతో అంది రాధ. 
          "ఇంకా బిజీగా ఉంటాను. ఇన్నాళ్ళూ ఇల్లూ, ఆఫీసూ అనే చిన్న ప్రపంచంలో ఉన్నాను. ఇకపైన జగమంతా నాదే. మంచి సినిమాలు చూస్తాను, సంగీతం వింటాను, వాకింగ్ కి వెళతాను,సాహితీ సభలకూ, సంగీత కచేరీలకూ, ఆధ్యాత్మిక ప్రసంగాలకూ వెళ్తాను. నా దగ్గర రిటైర్మెంట్ తాలూకు డబ్బు ఉంటుంది కాబట్టి చదువులకూ, పెళ్ళిళ్ళకూ ఎవరికైనా డబ్బు అవసరమైతే నా తాహతుకు తగ్గ సహాయం చేస్తాను. అనాథాశ్రమాలకు వెళ్ళి పిల్లలకు ఆప్యాయత పంచుతాను. పదిమందిని కలుపుకుని ఓ సంస్థగా ఏర్పడి సమాజసేవ చేస్తాను"
      "ఏమండోయ్ ప్రసాద్ గారూ - తమరి వయసు ఇరవై కాదండోయ్...అరవై" నవ్వుతూ అంది రాధ.
        ప్రసాద్ కూడా నవ్వుతూ అన్నాడు-
         "మనసుకు ముసలితనం రాదండోయ్...రాధగారూ!"
      ఆ మాట నిజమేననుకుంది రాధ. ప్రసాద్ ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. తన వయసుకంటే పదేళ్ళు తక్కువగానే కనబడతాడు. ఇప్పటికీ తలపై జుట్టు ఒత్తుగానే ఉంటుంది. తెల్లవెంట్రుకల శాతం కూడా తక్కువే. అందుకు కారణం...బహుశా అతను ఎప్పుడూ వర్తమానంలో ఉండటమేనేమో. భవిష్యత్తు గురించి భయపడడు. గతం గురించి ఆలోచించడు. పిల్లల్లో పిల్లవాడిగా, పెద్దల్లో పెద్దవాడిగా కలిసిపోతాడు. అతని మనసు కూడా పసిమనసే. ఎవరైనా బాధపడితే చూడలేడు. తననెవరైనా హర్ట్ చేస్తే కంటనీరు పెడతాడు.
'భగవాన్ - ఇతనెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండేలా చూడు స్వామీ' అనుకుంది రాధ మనసులో.
  
     *         *        *          *
             ఉదయం ఎనిమిది గంటలకు టూత్ బ్రష్ నోట్లో పెట్టుకుని హాల్లోకి వచ్చిన భర్తని చూసి మనసులోనే విసుక్కుంది సునీత.
      "పేపరు రాలేదా?" భార్యను అడిగాడు నాగరాజు.
         "వచ్చింది...లోకేష్ చదువుతున్నట్లున్నాడు" అంటూ వంటగదిలోకి వెళ్ళి కాఫీ గిన్నెను స్టౌ మీద పెట్టింది.
                'ఈ రోజు భర్త రిటైరవుతున్నాడు. కనీసం చివరి రోజైనా ఆఫీసుకు సకాలంలో వెళ్తాడేమోనని ఎదురుచూస్తోంది తను. ఆఫీసు వేళల్లో ఇంట్లో పడుకుని నిద్రపోవడం, ఆఫీసులో పనిచెయ్యకుండా తప్పించుకుని తిరగడం అతని లక్షణాలు. తను స్కూల్లో టీచరుగా పనిచేస్తూంది..... ఆరువేల జీతానికి. ప్రొద్దున ఎనిమిదికి వెళ్ళి సాయంత్రం ఆరు వరకూ విశ్రాంతి లేకుండా పనిచేస్తోంది. తనకంటే పదిరెట్లు ఎక్కువ జీతం తీసుకునే భర్త-తన కష్టంలో పావుశాతం కూడా పడకపోవడం తను జీర్ణంచేసుకోలేని నిజం. తన తండ్రి తనకు కష్టపడటం నేర్పాడు. చిత్తశుద్దీ, క్రమశిక్షణా బోధించాడు. అవి తన భర్తకు నేర్పాలని ప్రయత్నించి విఫలమైంది. తర్వాత రాజీపడింది. అయితే అవన్నీ కొడుకుకి నేర్పింది కానీ, అతను ఎంత ప్రయత్నించినా మంచి ఉద్యోగం దొరకడం లేదు' అనుకుంది.
        "ఈరోజు మీ కొలీగ్ ప్రసాద్ గారు కూడా రిటైర్ అవుతున్నారట కదా"  కాఫీగ్లాసు భర్త చేతికిస్తూ అడిగింది సునీత.
     "అవును...నీకెలా తెలుసు?"
      "ఈరోజు లోకల్ ఎడిషన్ మొత్తం ఆయన ఆప్తులు తెలిపిన శుభాకాంక్షలతో నిండిపోయింది"
      అంతలో లోకేష్ వచ్చి "గుడ్ మార్నింగ్ డాడ్. హ్యాపీ లాస్ట్ డే ఇన్ ఆఫీస్!" అంటూ న్యూస్ పేపర్ అందించాడు. 
      "థాంక్యూ' అంటూ పేపర్ అందుకున్నాడు నాగరాజు.
      "సాయంత్రం ఎన్ని గంటలకు మీటింగ్?" సునీత అడిగింది.
         "ఆరు గంటలకు. నేను మధ్యాహ్నం వచ్చేస్తాను. కాసేపు పడుకుని లేచి బయలుదేరదాం" అన్నాడు నాగరాజు.
   
  *            *          *           *
          ఆఫీసు కాంపౌండులో అడుగుపెట్టిన ప్రసాద్ - స్టాఫంతా బయటే నిలబడి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు.
        "ఏమిటీ...మీరు...ఇలా?!" అని అడిగాడు.
      "మిమ్మల్ని గ్రీట్ చేద్దామని" అంటూ అతనికి బొకే అందించి, అభినందనలు తెలిపి, అతని సీటు వరకూ అతన్ని అనుసరించారు అందరూ.
     "ఐ యాం ఆనర్డ్...థాంక్యూ" అన్నాడు ప్రసాద్ ఆనందంగా.
          "సార్,,,మాకు పని నేర్పించారు, నడవడిక నేర్పించారు. ఒత్తిడిలో కూడా నవ్వడం నేర్పించారు. మేము ప్రతి మీటింగ్ లో నీ స్పీచ్ కోసం ఎదురుచూసేవాళ్ళం. మీ స్పీచ్ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉండి, సంస్థ కోసం పనిచేయాలన్న తపన మాలో కలిగించేది. రేపట్నుంచి ఆ స్పూర్తి మాకెవరిస్తారు సార్?" అన్నాడు వినోద్.
       "ఆఫీసులో గేమ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి మాలోని లేటెంట్ టాలెంట్స్ ని ప్రోత్సహించారు. విహారయాత్రలు నిర్వహించి మా అందరిమధ్యా స్నేహాన్ని పెంచారు. ఉద్యోగులందరూ కుటుంబ సభ్యుల్లా కలసిపోయేలా చేసి ఆఫీసును ఇల్లులా మార్చారు. మీరు వెళ్ళిపోతే ఇవన్నీ మేం మిస్ అవుతాం సార్" అంది మాధురి కళ్ళనీళ్ళతో.
      "మంచి సాంప్రదాయాలు ఎవరో ఒకరు మొదలుపెడతారు. వాటిని కొనసాగించడం ముఖ్యం. మీరు ఆ పని చేయండి. నా సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ ఉంటాయి" అన్నాడు ప్రసాద్.
           అందరూ తమ సీట్లకు వెళ్ళాక - ప్రసాద్ తన సీట్లో కూర్చుని పని చేసుకోసాగాడు.
           కొంతసేపటికి జనరల్ మేనేజర్ మురళి వచ్చి అతని ఎదురుగా కూర్చుని "ఏం చేస్తున్నారు మీరు? మీ పనంతా నిన్నే పూర్తి చేశారు కదా! ఈరోజు మీకు ఏ పనీ ఇవ్వవద్దని అక్కౌంటెంట్ కి చెప్పాను కూడా!" అన్నాడు.
      "ఈ సీటులో ఎటువంటి పనులు ఉంటాయో, వాటిని ఎలా చెయ్యాలో, ఏ రిజిష్టర్ ఎక్కడ ఉందో అన్నీ వివరంగా రాసిపెడుతున్నాను. రేపట్నుంచి ఈ సీట్లో కూర్చున్నవాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుంది..." అన్నాడు ప్రసాద్.
      "మీలో నాకు ఎక్కువగా నచ్చేది మీ కమిట్మెంట్, మీ పాజిటివ్ దృక్పథం ప్రసాద్. హేవ్ ఎ హ్యపీ డే. సాయంత్రం మీటింగ్  లో కలుద్దాం" అని మురళి వెళ్ళిపోయాడు.
 
        *          *        *          *
           
  పదకొండు గంటలకు నాగరాజు ఆఫీసుకొచ్చాడు.
తన సీట్లో కూర్చుని కొంతసేపు తనకొచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి లెక్కలు కట్టాడు. తర్వాత ఆఫీసు ఫోన్ తీసుకుని తెలిసినవాళ్ళందరినీ సాయంత్రం ఫంక్షన్ కు రమ్మని ఆహ్వానించాడు. మధ్యలో ప్రసాద్ వచ్చి అతనికి శుభాకాంక్షలు చెప్పి వెళ్ళాడు. తర్వాత ఆఫీసు స్టాఫంతా ప్రసాద్ కు స్వాగతం చెప్పిన విషయం తెలిసి నాగరాజు అవమానంతో రగిలిపోయాడు. 
    ఇంతలో - స్టాఫ్ యూనియన్ సెక్రెటరీ విజయ్ వచ్చి అతనికి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపాడు.
          "ప్రసాద్ కు స్టాఫ్ మొత్తం బయట నిలబడి స్వాగతం చెప్పారటగా. మరి, నాకలా చెప్పలేదేం?" అని అడిగాడు నాగరాజు కోపంగా.
            "ఆయన తొమ్మిది ముప్పావుకు వచ్చారు కాబట్టి అలా చెప్పగలిగాము. పదకొండు గంటలకు స్టాఫంతా బయట నిలబడితే జి.ఎం. మెమో ఇస్తారు" అన్నాడు విజయ్.
             "నాకు ఫోన్ చేసుంటే నేనూ తొందరగా వచ్చేవాణ్ణిగా"
           "మేము  ప్రసాద్  గారికి ఫోన్ చేయలేదు"
                 నాగరాజు ముఖం జేపురించింది ఆ సమాధానానికి. బొకేను తీసి విసురుగా డస్ట్ బిన్ లో పడేశాడు.
 
       *          *          *         *
            
లంచ్ అవర్లో కొలీగ్స్ తో కలిసి భోజనం చేస్తున్న ప్రసాద్ తో - "ప్రసాద్! ఈరోజు నీవు ఇంటికెళ్ళాల్సింది...మీ పిల్లలు వచ్చారు కదా!" అన్నాడు కొలీగ్ రామకృష్ణ. 
          "ఈ అఫీసులో మీతో కలసి భోజనం చేసే చివరిరోజు ఇది. ఈ అవకాశాన్ని ఎలా మిస్ కాగలను?" అన్నాడు ప్రసాద్.
           కొన్నేళ్ళుగా కేడర్ తో సంబంధం లేకుండా తెచ్చుకున్నవి అందరితో పంచుకుని తినే బ్యాచ్ అది.
        "అన్నట్టు మీకు ఇవ్వమని సేమియా పాయసం పంపింది మా ఆవిడ. అందరూ తీసుకోండి...ప్లీజ్" బాక్స్ మూత తీసి అందరిముందూ ఉంచాడు ప్రసాద్.
         "ప్రసాద్...నిన్నొక ప్రశ్న అడగాలి. నువ్వు ఉద్యోగంలో చేరిన క్రొత్తలో నీ ఆదాయం ఎంత?" రామకృష్ణ అడిగాడు.
        "అప్పుడు నా జీతం వెయ్యి రూపాయలు"
                "ఇప్పుడు మీ కుటుంబం ఆదాయం ఎంత? మీ కోడలి, అల్లుడి జీతం కూడా కలుపుకుని చెప్పు "
            ప్రసాద్ కొన్ని క్షణాలు ఆలోచించి "ఆరు లక్షలు " అన్నాడు.
          "చూశావా ఎంత మార్పో? కానీ, నీలో మార్పు రాలేదు ప్రసాద్. ఉద్యోగంలో చేరినప్పుడు ఎలా ఉన్నావో...ఈరోజూ అలాగే ఉన్నావు. అదే చిరునవ్వూ, అదే కలుపుగోలుతనం, అదే మంచితనం"
          "ఆర్థికంగా ఎదగడం గొప్పని నేను భావించడం లేదు రామకృష్ణా. ఉన్నదానితో తృప్తిగా బ్రతికే తత్వం, సాటివారికి సాయం చేసే మనసూ... ఆ భగవంతుడు నాకిచ్చాడు. అంతకంటే ఐశ్వర్యం ఏం కావాలి నాకు" అన్నాడు ప్రసాద్.
           "అంతే కాదు, నీకోసం తపించే భార్యాపిల్లలూ, అభిమానించే బంధుమిత్రులూ, గౌరవించే సహోద్యోగులూ...ఇవి కూడా నీకు లభించిన ఐశ్వర్యాలే" అన్నాడు రామకృష్ణ.
             "నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది సార్. ఆ సార్ నోట్లో మంచి తప్ప మరోటి రాదు కదా" అన్నాడు అటెండర్ వరదయ్య. 
      "ఏమిటీ...ఈరోజు అందరూ ఇలా వరసబెట్టి పొగిడేస్తున్నారు? సాయంత్రం ఇంటికెళ్ళి లూజుచొక్కా వేసుకురావాలి నేను. ఇలాగే ఉంటే నేను లావై చొక్కా చిరిగిపోతుంది" అన్నాడు ప్రసాద్ నవ్వుతూ.
 
     *            *           *           *

సాయంత్రం సభ ప్రారంభమయ్యే ముందు భార్గవ్ తన తండ్రి దగ్గరకు వచ్చి-
        "నాన్నా...ఇతను లోకేష్! నా క్లాస్ మేట్!" అంటూ తనతో ఉన్న యువకుణ్ణి పరిచయం చేశాడు.
         "హాయ్...నైస్ టు మీట్ యూ" అంటూ కరచాలనం చేశాడు ప్రసాద్.
               "ఇంకో విషయం నాన్నా...లోకేష్ నాగరాజు అంకుల్ కొడుకు"
               "అరె. ఆ విషయం నాకెప్పుడూ చెప్పలేదు నువ్వు?"
                "నాకూ ఇప్పుడే తెలిసింది. అప్పట్లో అంకుల్ విజయవాడలో పనిచేసేవారట!"
             అంతలో - ప్రసాద్ ని ఎవరో పిలవటంతో "మీట్ యు ఎగైన్" అని లోకేష్ తో చెప్పి వెళ్ళిపోయాడు ప్రసాద్.
       "ఊ. ఇప్పుడు చెప్పు- ఏం చేస్తున్నావు నువ్వు?" అంటూ లోకేష్ తో సంభాషణ ప్రారంభించాడు భార్గవ్.
 
    *        *        *         *
         
 సౌమ్య ప్రార్థనాగీతంతో సభ ప్రారంభమైంది.
          ఒక్కొక్కరూ స్టేజీ పైకి వచ్చి ప్రసాద్ గురించీ,నాగరాజు గురించీ ప్రసంగించసాగారు.     అయితే-వారి ప్రసంగంలో తొంభై శాతం ప్రసాద్ కే కేటాయించడం జీర్ణం చేసుకోలేకపోతున్నాడు నాగరాజు. తమ తండ్రి గురించి భార్గవ్, సౌమ్యలు కూడా స్టేజీ పైకి వచ్చి మాట్లాడ్డం చూశాక తన కొడుకు కూడా తన గురించి మాట్లాడతాడని ఎదురు చూసిన నాగరాజుకు నిరాశే మిగిలింది.
         తరువాత రామకృష్ణ వచ్చి మైకు అందుకున్నాడు -
          "ప్రసాద్ వయసులో నాకంటే పెద్దవాడు. కానీ, ఈ సంస్థలో నా తర్వాతే చేరాడు. ఉద్యోగంలో చేరిన కొత్తలో అతని మెతకతనం వల్ల ఎన్నో అవమానాలు పొందాడు. అయితే- తన క్రమశిక్షణతో, సమర్థతతో, మంచితనంతో మనుషుల్ని గెలుచుకున్నాడు. తను ఎప్పుడూ ఆనందంగా ఉంటూ, తన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఆనందంగా ఉండాలన్న తపనతో అందరికీ తనకు తోచిన సలహాలు ఇస్తూ, సహాయాలు చేస్తూ ఆఫీసులో ఓ చక్కని కుటుంబ వాతావరణాన్ని నెలకొల్పాడు.
అతడు ఆఫీసుకు లేటుగా వచ్చిన సందర్భాలూ, ముందుగా వెళ్ళిపోయిన సందర్భాలూ వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు.
             క్రమశిక్షణా,ప్రణాళికా కలిగిన మనిషి తన జీవితాన్ని ఎంత అద్భుతంగా మలచుకోవచ్చో...ప్రసాద్ జీవితాన్ని పరిశీలించిన వారికి అవగతమవుతుంది. ప్రసాద్ కి పాతికేళ్ళకు పెళ్ళయింది. ముఫై ఏళ్ళు వచ్చేసరికి అతను ఇద్దరు పిల్లల తండ్రి. నలభై ఏళ్ళకు సొంతిల్లు కట్టుకున్నాడు. యాభైఏళ్ళకు పిల్లలు చదువులు పూర్తయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. యాభైనాలుగేళ్ళకు పిల్లల పెళ్ళిళ్ళు అయ్యాయి. ఆ అదృష్టం ఎంతమంది తండ్రులకు దక్కుతుంది?
         అతని ఇల్లు అభిమాన బంధాలతో అల్లుకున్న పొదరిల్లు. వచ్చీపోయే అతిథులతో ఆ వాకిలి కళకళలాడుతూ ఉంటుంది. ఆ ఇంటి ఇల్లాలి వంట రుచి చూడనివాళ్ళు ఈ ఆఫీసులో చాలా తక్కువ మంది ఉంటారు. ఇంటికి వచ్చిన అతిధి బయలుదేరినప్పుడు కుటుంబమంతా బయటిగేటు వరకూ వచ్చి సాగనంపే సంస్కారం వారిది.   
             నా ఆప్తమిత్రుడు కలకాలం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే నాగరాజుగారి రిటైర్మెంట్ లైఫ్ ఆనందంగా సాగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.
         తర్వాత నాగరాజునూ, ప్రసాద్ నూ మాట్లాడమని కోరారు సభాధ్యక్షులు.  
        నాగరాజు మాట్లాడుతూ-
"నాకు కాకా పట్టడం రాదు. నటించడం తెలియదు. ఏది మాట్లాడినా ముక్కు సూటిగా మాట్లాడుతాను. ముఖం మీదే మాట్లాడుతాను. అందువల్ల నా గురించి మాట్లాడే వాళ్ళు తక్కువగానే ఉంటారు. అయితే, అందువల్ల నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక్క పైసా కూడా తగ్గదు. నన్ను ఇష్టపడేవాళ్ళూ ఉన్నారు. నేను పొగడ్తలకు పొంగిపోయే మనిషిని కాదు. అందుకే వాళ్ళు స్టేజీ పైకి రాలేదు. నేను బాగుండాలని కోరుకునే ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు " అన్నాడు.
         ప్రసాద్ మాట్లాడుతూ-
"నేను జీవితంలో ఎవరికీ భయపడలేదు- ఒక్క నా మనస్సాక్షికి తప్ప. అది అడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వగలిగినంతవరకూ నేను నిజాయితీగా పనిచేస్తున్నట్లు లెక్క.  ఒకవేళ నేను దాన్ని తాత్కాలికంగా నిద్రపుచ్చినా...రిటైర్ అయ్యాక అది నిద్రలేచి అడిగితే నా దగ్గర సమాధానం ఉండదు. సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. అందుకే నా మనస్సాక్షిని అనుక్షణం మెలకువగానే ఉంచి పనిచేశాను.
       చిన్నప్పట్నుంచీ నేను ఆడుకున్న కేరమ్స్ ,చెస్, షటిల్ లాంటి ఆటలు నాకు ప్లానింగ్ నేర్పాయి. చదివిన పుస్తకాలు సంస్కారం నేర్పాయి. మంచిగా మాట్లాడటం మా అమ్మ నేర్పింది. సాటివారికి సాయపడటం మా నాన్న నేర్పారు. చదువు మా గురువులు నేర్పారు. ఆఫీసులో పని మా సీనియర్లు నేర్పారు. మనుషుల్ని ఆదరించడం నా భార్య నేర్పింది. మరికొంతమంది జీవితంలో పాఠాలు నేర్పారు. వీళ్ళందరూ నాకు గురువులే. వీరందరికీ నా కృతజ్ఞతలు.
       నన్నూ, నా కుటుంబాన్నీ ఇన్నాళ్ళు పోషించిన సంస్థకూ, నన్ను అభిమానంగా చూసుకున్న మీకూ, నా విధినిర్వహణలో అన్నివిధాలా సహకరించిన నా భార్యాపిల్లలకూ కృతజ్ఞతలు 
తెలియజేసుకుంటున్నాను" అన్నాడు.
     
*         *       *          *
     
 "మాట్లాడటం ఒక కళ. అదే మనసుతో మాట్లాడితే మరింత కళాత్మకంగా ఉంటుంది. ప్రసాద్ అంకుల్, రామకృష్ణ అంకుల్ మనసుతో మాట్లాడారు. అందుకే వారి స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది..." అన్నాడు లోకేష్ ప్రక్కనున్న తల్లితో.
      "తన గురించి ఎవరూ సరిగ్గా మాట్లాడలేదని మీ నాన్నగారికి కోపం. అందుకే ఆయన అలా మాట్లాడారు. ఆయన కోపంలో కూడా న్యాయం ఉందిగా" అంది సునీత.
       "మనం గోదావరికి ఎంత చెంబు తీసుకెళితే అంతే నీరు మనకు దొరుకుతుందమ్మా"
        "ఏరా...నిన్నూ ప్రసాద్ అంకుల్ ఆవహించాడా ఏమిటి?" వ్యంగ్యంగా అడిగింది సునీత.
"ఆవహించలేదమ్మా...ఆలోచింపజేశారు. మనిషిగా నేను ఎలా బ్రతకాలో, నా ఇంటిని ఎలా ఉంచుకోవాలో, నా పిల్లల్ని ఎలా పెంచాలో ఆయన్ను చూసి నేర్చుకున్నాను"
        సునీత ఏం మాట్లాడలేదు. కొడుకు ముందు భర్త ఇమేజ్ ను కాపాడటానికి ప్రయత్నించింది. కానీ, నిజం ఆమెకూ తెలుసు.
      అంతలో...లోకేష్ సెల్ కు కాల్ రావడంతో అతను అక్కడ్నుంచి దూరంగా వెళ్ళాడు.
      
 *         *          *          *
          "ఇప్పుడు ప్రసాద్, నాగరాజు గార్లకు సన్మానం జరుగుతుంది"
-అంటూ ప్రకటించాడు సభాధ్యక్షుడు.
      "ఒక్క నిమిషం...ప్లీజ్! మీ అందరి అనుమతితో నేను రెండు నిమిషాలు మాట్లాడుతాను..." అంటూ స్టేజీ పైకి వచ్చిన కొడుకును చూసి నాగరాజు ముఖం వికసించింది.
                "నా పేరు లోకేష్. నాగరాజు గారి అబ్బాయిని. ప్రసాద్ గారి అబ్బాయి భార్గవ్, నేనూ బీటెక్ లో క్లాసుమేట్స్ మి. చాలా ఏళ్ళ తర్వాత ఇక్కడ కలిశాం. మీ అందరి మాటల్లో ప్రసాద్ గారి క్రమశిక్షణా,చిత్తశుద్దీ, సేవాగుణమూ గురించి విన్నాను. నాకో విషయం గుర్తోచ్చి మీతో పంచుకోవాలని ఈ స్టేజీ పైకి వచ్చాను.
       బీటెక్ పూర్తికాగానే భార్గవ్ ఉద్యోగంలో చేరాడు. మా క్లాసుమేట్ సునీల్ కూడా అదే కంపెనీలో చేరాడు. ఓరోజు సునీల్ చెల్లెలు మేడమీద నుంచి క్రిందపడింది. తలకు బాగా గాయాలయ్యాయి. ఆపరేషన్ కి ఒకటిన్నర లక్ష అవుతుందని డాక్టర్లు చెప్పారు. సునీల్ నాన్న చిరుద్యోగి. సునీల్ అప్పుడే ఉద్యోగంలో చేరాడు కాబట్టి దాచుకున్నది ఏమీ లేదు. అప్పుడు భార్గవ్ అయిదువేలు సునీల్ కి ఇచ్చాడు. తర్వాత మా బ్యాచ్ వాళ్ళందరికీ పరిస్థితి వివరిస్తూ 'ఎవరికి ఎంత వీలైతే అంత పంపు 'మని చెప్పాడు. అలా లక్ష రూపాయలు సేకరించాడు భార్గవ్. మీకు అతిశయోక్తి అనిపించొచ్చు కానీ. ఇది నిజం.          
           సునీల్ కంపెనీ నుంచి యాభైవేలు అప్పు పొందాడు. ఆపరేషన్ జరిగి ఆ అమ్మాయి ప్రమాదం నుంచి బయటపడింది. ఆ తర్వాత ఎవరెవరి నుంచి ఎంత తీసుకుందీ లిస్ట్ తయారుచేసి సునీల్ కు ఇచ్చి వీలున్నప్పుడు వారి అప్పు తీర్చేయమని చెప్పాడు భార్గవ్. అయితే, సునీల్ ఎంత వెతికినా ఆ లిస్ట్ లో భార్గవ్ పేరు కనిపించలేదు"
         సభంతా చప్పట్లతో నిండిపోయింది.
         "ఆమధ్య సునీల్ ని కలిసినప్పుడు ఈ విషయం చెప్పాడు. ఇంకో విషయం...భార్గవ్ ప్రసాద్ గారి లాగే చిత్తశుద్దితో పనిచేసి, తన కంపెనీలో ఎదిగి ఇప్పుడు కీలకమైన పోస్ట్ లో ఉన్నాడు. నాకు మంచి ఉద్యోగం లేదని తెలుసుకుని నా ముందే తన హెచ్.ఆర్. డిపార్ట్మెంట్ తో మాట్లాడి నాకు ఇంటర్వ్యూ ఫిక్స్ చేశాడు. నాకు తప్పకుండా ఉద్యోగం వచ్చేలా చూస్తానన్నాడు. మా బంధువుల్లో చాలామంది పెద్ద పొజిషన్ లో ఉన్నారు. కానీ, నా ఉద్యోగం గురించి ఇంత వేగంగా స్పందించినవారు లేరు."
       మళ్ళీ చప్పట్లు మ్రోగాయి.
    "ఆ స్పందించే గుణం ప్రసాద్ గారి నుంచి భార్గవ్ పొందిన వారసత్వపు ఆస్తి. తల్లిదండ్రులు పిల్లలకు ఏం చేర్చిపెట్టామన్నది కాకుండా-ఏం నేర్పిపెట్టామన్న దానిపై దృష్టి పెడితే ఈ ప్రపంచంలో ప్రతి ఇల్లూ ప్రసాద్ గారి ఇంటిలా ఓ స్వీట్ హోం అవుతుంది.
అప్పుడు సమాజంలో హత్యలూ, దోపిడీలూ,మానభంగాలూ ఉండవు. ప్రేమ, సేవ ఉంటాయి. కక్షలూ, కుట్రలూ ఉండవు. దయా,కరుణా ఉంటాయి"
                  లోకేష్ స్టేజి దిగుతూంటే అందరూ లయబద్దంగా చప్పట్లు కొట్టసాగారు...నాగరాజుతో సహా.

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha