తల్లి దీవెన

18.204.2.231

తల్లి దీవెన


 సి.ఎన్.చంద్రశేఖర్
(9490050214)

               సెల్ ఫోన్ రింగయితే నంబరు చూశాడు మురళి. తమ్ముడు గోపి నంబరు అది. కాల్ రిసీవ్   చేసుకుని "చెప్పరా గోపీ" అన్నాడు.
            "నేను గోపీ వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నానండీ "  అవతల వైపు నుంచి వినపడింది.
                        "నేనెవరో తెలుసాండీ"నవ్వుతూ అడిగాడు మురళి. 
   "నువ్వు...నువ్వు...సావిత్రమ్మ కొడుకువి కదూ"
         "అరె..ఎంతబాగా గుర్తుందీ...అంటే మీరు నన్ను మర్చిపోలేదన్నమాట"
                "రేయ్. ఇక నీ సెటైర్లు ఆపు. నేను రేపు చిత్తూరు వస్తున్నాను"
             "అలాగా!"
          “ అదేమిట్రా. నీకు సంతోషంగా లేదూ?"
                "నువ్వు చిత్తూరుకు వస్తే నాకెందుకమ్మా సంతోషం? మా ఇంటికొస్తే నాకు సంతోషం గానీ"
          "నేను చిత్తూరు ఎందుకు వస్తాను చెప్పు? నా కొడుకు ఇంట్లో కొన్ని రోజులు ఉందామని వస్తున్నాను"
             "ఆహా..చిన్నకొడుకు గోపీకృష్ణ ఇంట్లో మూడు నెలలూ..కూతురు రమ్య ఇంట్లో నాలుగు నెలలూ--పెద్దకొడుకు మురళీకృష్ణ ఇంట్లో మాత్రం కొన్ని రోజులు...బాగుందమ్మా!"
                    "మూడు నెలల్ని రోజుల్లో చెబితే తొంభై రోజులు కదరా"
              "కానీ...ముఫై రోజులు దాటితే లెక్క నెలల్లో కడతారమ్మా"
               "తల్లి ప్రేమకు లెక్కలుండవురా"
                 మురళి ఏం మాట్లాడలేకపోయాడు"
        తర్వాత "నిన్ను ప్రేమతోనే గెలవలేకపోయాను. ఇక మాటలతో ఏం గెలుస్తాను?" అన్నాడు.
                    "నిన్ను మించి ప్రేమించేవాళ్ళు ఎవరుంటార్రా? ఆ విషయంలో నువ్వు మహారాజువి" 
                    "అందుకేనా నాకు మూడో స్తానాన్ని ఇచ్చావు?"
                 "తప్పేరా. అందుకు పరిహారంగా నేను బతికున్నంతవరకూ మీ ఇంట్లోనే ఉంటాను"
           "అంత సీరియస్ డైలాగ్ ఎందుకులేమ్మా? నేను తమాషాకన్నాను"
                    "నేను సీరియస్ గానే అంటున్నాన్రా"
                "సరే. రేపు ఎప్పుడు బయలుదేరుతున్నావు?"
                 "ఉదయం ఎనిమిది గంటలకు బస్సు. బస్సు కదిలాక గోపీ నీకు ఫోన్ చెస్తాడు”
            "అలాగే. నేను స్టేషన్ కు వస్తాను"
                  అత్తగారు వస్తున్న విషయం విని శిరీష ఎంతో సంతోషించింది.
                 "మనం సాయంత్రం మార్కెట్ కు వెళ్ళి కూరగాయలూ, పండ్లూ తీసుకురావాలి. ఆవిడ మనింట్లో ఉన్నన్ని రోజులు ఆవిడకిష్టమైనవన్నీ చేసిపెట్టాలి" అంది భర్తతో.
            పిల్లలు శ్రీరామ్ , శ్రీలతలు కూడా ఎంతో సంబరపడ్డారు.
      *               *                  *                 *             *
                 ఆటో ఇంటిముందు ఆగగానే శ్రీరాం వచ్చి మురళి చేతినుంచి లగేజి అందుకున్నాడు.
                ఇంట్లో అడుగుపెట్టిన సావిత్రికి శిరీష ఎదురొచ్చి చిరునవ్వుతో పలకరించింది. సోఫాలో కూర్చున్నాక శ్రీలత మంచినీళ్ళు తెచ్చి నాన్నమ్మకిచ్చింది. 
                   "మురళి పిల్లలనిపించుకున్నారా!" అంది సావిత్రి నవ్వుతూ.
                సావిత్రి ఆ ఇంటికి వచ్చి నెల దాటింది.
                రోజులు వేగంగా గడచిపోతున్నట్లనిపించసాగింది ఆమెకు. 
                సావిత్రి ఊర్లో ఉన్న విషయం తెలుసుకున్న మురళి స్నేహితులూ,ఇరుగుపొరుగు వారు వచ్చి ఆమెతో మాట్లాడేవారు. మురళి, శిరీషలతో తమకు గల అనుబంధం గురించి చెప్పేవారు. 
                  "అంతమంది మనుషుల్ని ఎలా గెలుచుకున్నార్రా?" అని అడిగింది సావిత్రి కొడుకునీ,కోడల్నీ.
           "ఏముందమ్మా..కనిపిస్తే కాస్త పలకరింపూ, దగ్గరైతే కాస్త ప్రోత్సాహపు మాటలూ, అవకాశం వస్తే కాసింత సహాయం..అంతే మేము చేసింది. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఆ కృతజ్ఞత చూపిస్తున్నారు..."అన్నాడు మురళి.
              ప్రతి ఆదివారం సావిత్రిని గుడికి తీసుకెళ్ళేవారు మురళి, శిరీష.
              అలాగే కాణిపాకం వినాయకస్వామి దర్శనం,అర్థగిరి ఆంజనేయస్వామి దర్శనం చేయించారు. కంచి కామాక్షి గుడికీ, వేలూరు దగ్గరి గోల్డెన్ టెంపుల్ కీ పిలుచుకెళ్ళారు.  వేపంజేరి లక్ష్మీనారాయనస్వామి ఆలయం, తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయం కూడా చూపించారు.
              "తిరుమలకు కూడా ఓసారి వెళ్ళిరావాలని ఉందిరా.టీవీలో అక్కడి రష్ గురించి చెప్తూ ఉంటే భయమేస్తూంది. కాళ్ళనొప్పి గదా... అన్ని గంటలు నిలబడలేనేమో అనిపిస్తోంది" అంది ఓ రోజు మురళితో సావిత్రి.
            మురళి ఏం మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తూండిపోయాడు.
            ఓ రొజు ఆఫీసు నుంచి రాగానే "అమ్మా. మనం తిరుమల వెళ్తున్నాం....వెంటనే రెడీ అవు" అన్నాడు తల్లితో మురళి.
             "అదేమిట్రా...ఇంత సడెన్ గా?" 
                  "తిరుమలలో పనిచేస్తున్న నా ఫ్రెండు గోవిందస్వామికి రష్ తక్కువగా ఉన్న సమయం చూసి చెప్పమన్నాను. ఇందాకే అతను ఫోన్ చేసి చెప్పాడు...చాలా కంపార్ట్ మెంట్లు ఖాళీగా ఉన్నాయట" అన్నాడు మురళి. 
                శిరీష,పిల్లలు కూడా త్వరగానే తయారయ్యారు.
                స్వామివారి దర్శనం చేసుకుని, ఆ రాత్రి కాటేజి తీసుకుని అందులో బస చేశారు. తల్లి నడవలేదని కొడుకుని హోటల్ కి పంపి భోజనాలు గదికే తెప్పించాడు.
                భోజనాలయ్యాక అందరూ కాటేజీ బయటౌన్న సిటౌట్ లో కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు.
                  "మురళీ. నాకు చాలా సంతోషంగా ఉందిరా. చాలా రోజుల్నుంచి మనసులో ఉన్న కోరిక ఈరోజు తీరింది. మీ చిత్తూరు నాకు చాలా నచ్చిందిరా. ఎన్నో ప్రసిద్ద పుణ్యక్షేత్రాలు మీ ఊరి చుట్టుప్రక్కల ఉన్నాయి. నాలుగు రోజులు మీ ఇంట్లో ఉంటే చాలు..అన్నీ చూసి రావొచ్చు" అంది సావిత్రి.
           "అందుకే కదమ్మా..మన ఇంటికి బంధువులు తరచుగా వస్తూంటారు. నువ్వన్నట్లే నాలుగు రోజులు మన ఇంట్లో ఉండి అన్నీ చూసుకుని వెళతారు" అన్నాడు మురళి.
                   "మరి మీకు శ్రమా, ఖర్చూ ఉంటుంది కదరా?" 
                   "దానిదేముందిలేమ్మా..ఇల్లన్నాక పదిమంది వస్తూ పోతూ ఉంటేనే బాగుంటుంది. లేకుంటే ఇంటికీ,గోడౌన్ కీ తేడా ఏముంటుంది?" 
                 కొడుకు వైపు మెచ్చుకోలుగా చూసింది సావిత్రి.
                  "ఇంటికెవరైనా వస్తే ఈయనకు ఎంత ఆనందమో చెప్పలేను. లీవు పెట్టి మరీ వాళ్ళతో వెళ్ళి అన్నీ చూపించి వస్తారు"  అంది శిరీష.
                   "వీడిలో ఓ అద్భుతమైన గుణం ఉంది. అదేమిటో మీలో ఎవరైనా చెప్పగలరా?" అని అడిగింది సావిత్రి.
                  "మంచితనం" అంది శిరీష.
                    "కాదు..."
               "చురుకుదనం" అంది శ్రీలత.
                కాదన్నట్టు తల అడ్డంగా ఊపింది సావిత్రి. 
                   "దానగుణం. మా కాలనీలో గూర్కాకు అందరూ నెలకు ఇరవై రూపాయలిస్తే..నాన్న యాభై రూపాయలిస్తారు"  అన్నాడు శ్రీరామ్.
                   "కాదు.. బాద్యతల్ని స్వీకరించే  గుణం”

   *      *        *            *                                                             

            ఓరోజు సావిత్రికి జబ్బు చెస్తే ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు మురళి.
          తల్లి తనతో తెచ్చుకున్న రిపోర్ట్స్ ని ఆయనకు చూపించాడు. ఆయన సూచన మేరకు తల్లిని మంచి హాస్పిటల్లో చేర్పించాడు.
                   "ఆమెకు హార్ట్ సర్జరీ చెయ్యాలి. అయితే అది సక్సెస్ అవుతుందని గ్యారంటీ ఇవ్వలేను. ముందు ఆమె ఆరోగ్యం స్టడీ అవాలి. అందుకు కొంత సమయం పడుతుంది. ఆ తర్వాతే సర్జరీ గురించి ఆలోచిద్దాం. మీరు రిసెప్షన్లో అడ్వాన్స్ కట్టి రండి. మేము ట్రీట్ మెంట్  మొదలుపెడతాం" అన్నాడు హాస్పిటల్ డాక్టర్ మురళితో.
                   "శ్రీరాం కాలేజీ ఫీజుకని ఇంట్లో ఉంచిన డబ్బు తెచ్చాను. ఇప్పటికి ఇది సరిపోవచ్చు. తర్వాతి ఖర్చులకు ఏం చెస్తారు?"అంది శిరీష అతని చేతికి డబ్బులిస్తూ.
     "మా కొలీగ్స్ ని అడుగుతాను"  
  "వద్దు...ఇవి తాకట్టు పెట్టండి " అంటూ తన చేతికున్న బంగారుగాజుల్ని తీసి 
అతనికిచ్చింది.
         "ఇవి...మీ అమ్మవాళ్ళు ఇచ్చినవి" ఇబ్బందిగా చూస్తూ అన్నాడు.
          "ఈవిడ కూడా నాకు అమ్మేనండీ" అంది శిరీష.
            రిసెప్షన్ లో డబ్బులు కట్టిన తర్వాత-తమ్ముడికీ, చెల్లిలికీ ఫోన్లు చెసి విషయం చెప్పాడు మురళి.
     వారం రోజులు గడచినా సావిత్రి ఆరోగ్యం మెరుగు పడలేదు.
    గోపీ,రమ్యలు వచ్చి నాలుగు రోజులుండి మళ్ళీ వస్తామని వెళ్ళారు.
                ఇంతలో...మురళి ఉద్యోగరీత్యా తప్పనిసరిగా ఓ ట్రైనింగ్ ప్రోగ్రాంకి హైదరాబాదు వెళ్ళాల్సి వచ్చింది.
      అతను వెళ్ళగానే సావిత్రి కోమాలోకి వెళ్ళిపోయింది.
       అయితే శిరీష భర్తకు ఆ విషయం చెప్పలేదు.

    *         *       *       *         *                                           
            ట్రైనింగ్ ముగించుకుని వచ్చిన మురళి-బస్సు దిగి నేరుగా హాస్పిటల్ కు వెళ్ళాడు. 
                 తల్లి ముఖానికి ఆక్సిజన్ ట్యూబు అమర్చి ఉండటం చూసి కంగారుపడ్డాడు. తల్లిని సమీపించి "అమ్మా..." అని పిలిచాడు గద్గద స్వరంతో.
       సావిత్రిలో ఎటువంటి కదలికా లేదు.
       "సిస్టర్. అమ్మ మాట్లాడటం లేదు" అన్నాడు అక్కడికి వచ్చిన నర్సుతో.
                  "మీరు బయట కూర్చోండి. డాక్టరు గారు కాసేపట్లో రౌండ్స్ కు వస్తారు. ఆయనతో మాట్లాడుదురుగాని" అంది నర్సు.
కళ్ళనీళ్ళతో బయట బెంచీపైన కూర్చున్నాడు మురళి.
    ఇంతలో...భుజంపైన చేయి పడితే తలెత్తి చూసాడు.
     ప్రక్కన శిరీష నిలబడి ఉంది.
           "అమ్మేమిటి...అలా...?" అతనికి దుఖంతో మాట రాలేదు.
              భర్తను అలా చూసి కదలిపోయింది శిరీష. తల్లిపైన అతనికున్న ప్రేమ ఆమెకు తెలుసు. తన తల్లి ఇక 'స్పృహలోకి రాదు 'అన్న విషయం తెలిస్తే అతనేమవుతాడో అని భయం వేసింది ఆమెకు.   
              పైకి మాత్రం "అమ్మకేం కాదు. ...మీరు ధైర్యంగా ఉండండి. ముందు మీరు ఇంటికెళ్ళి రిలాక్స్ అయి రండి. డాక్టరొస్తే నేను మాట్లాడుతాను" అంది అతనితో.
               అంతలో...నర్సు అతని దగ్గరకు వచ్చి " మురళి అంటే మీరేనా?" అని అడిగింది.
                  'అవు 'నన్నట్టు తలూపాడు మురళి లేచి నిలబడి.
ఆమె అతని చేతికి ఓ కవరిచ్చి "మీరు రాగానే ఇమ్మని మీ అమ్మగారు నాలుగురోజుల క్రితం ఇచ్చారు" అంది.
                కవరు చించి అందులోని కాగితాన్ని బయటకు తీశాడు మురళి.
               సావిత్రి అతనికి రాసిన ఉత్తరం అది. 
               బెంచీ పైన కూర్చుని చదవసాగాడు. 
మురళీ...
             నువ్వంటే నాకిష్టం రా! నన్ను బాగా చూసుకున్నందుకు కాదు...మన కుటుంబం మొత్తాన్నీ బాగా చూసుకున్నందుకు.
              పదేళ్ళ వయసు నుంచీ కుటుంబ బాధ్యతలు నెత్తిన వేసుకున్నావు నువ్వు. ఆ వయసులోనే ఇంటిపనీ, బయటపనీ చూసుకునేవాడివి. వ్యాపారం నిమిత్తం మీ నాన్న ఊర్లు తిరిగుతుండేవారు. నువ్వు ఇంటిపనిలో నాకెంతో సహాయం చేసేవాడివి. నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు వంటకూడా చేసేవాడివి. ఇంత చేసినా మళ్ళీ చదువులోనూ ముందుండేవాడివి. మంచి మార్కులతో ప్రతి పరీక్షా పాసయ్యేవాడివి. 
               నీ తోబుట్టువుల చదువు గురించి పట్టించుకునేవాడివి. వాళ్ళకు పుస్తకాలు కొనిచ్చి,వాటికి అట్టలు వేసి, లేబుల్స్ అంటించి, వాళ్ళ పేర్లూ,క్లాసూ వగైరాలు రాసిచ్చేవాడివి. వాళ్ళను సినిమాలకూ,సర్కస్ లకూ తీసుకెళ్ళేవాడివి. ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళేవాడివి. వాళ్ళకు నడక మేము నేర్పితే..'నడవడిక 'నువ్వు నేర్పావు. ఫీజులు మేము కడితే..దగ్గరుంది నువ్వు చదివించావు. నువ్వు వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళను ప్రయోజకుల్ని చేశావు.
               నీకు ఉద్యోగం వచ్చినప్పట్నుంచీ మమ్మల్ని ఆర్థికంగా కూడా ఆదుకోవడం మొదలుపెట్టావు. నీకు హైదరాబాదు ట్రాన్స్ ఫర్ అయితే సిటీలైఫ్ ఎంజాయ్ చేయాలని అనుకోలేదు నువ్వు. మాకు అండగా ఉండాలని పట్టుబట్టి కడపకి పోష్టింగ్ తెచ్చుకున్నావు. మాకు ఏ అవసరం వచ్చినా అడగకుండానే డబ్బులు ఇచ్చేవాడివి. నీకోసం, నీ పిల్లలకోసం నువ్వు దాచుకుంది ఏమీలేదని నాకు తెలుసు.
                మీ నాన్నగారు ఇల్లు కట్టిస్తున్నప్పుడు ఆయనకు నువ్వు ఎంత అండగా నిలబడ్డావో నాకు గుర్తుంది. ఆయన దగ్గర డబ్బులు ఖాళీ అయినప్పుడల్లా నీ స్నేహితుల దగ్గర అప్పు తెచ్చి పని జరిపించేవాడివి. దగ్గరుండి పనులు పర్యవేక్షించేవాడివి. నువ్వు లేకుంటే ఇల్లు పూర్తి చేసేవాడిని కాదని మీ నాన్న ఎన్నోసార్లు నాతో అన్నారు.
                ఆ తర్వాత నువ్వు తీసుకున్న అతిపెద్ద బాధ్యత...రమ్య పెళ్ళి చెయ్యడం.
                మీ నాన్నగారు వ్యాపారంలో దివాలా తీసి,చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా ఉన్నారు. ఆ సమయంలో రమ్యకు మంచి సంబంధం కుదిరింది. నువ్వు మీ నాన్నగారికి ధైర్యం చెప్పి,పెళ్ళి జరిపిస్తానని అన్నావు. నీ మంచితనం, నీ మీది నమ్మకం వల్ల ఎంతోమంది నీకు పెద్దమొత్తాల్ని అప్పుగా ఇచ్చారు. రమ్య పెళ్ళి మన తాహతుకు మించి వైభవంగా జరిపించావు. ఆ అప్పుల్ని నువ్వూ,గోపీ తర్వాత తీర్చారు. ఆరోజు పెళ్ళి నిర్విఘ్నంగా జరిగి,ఈ రోజు రమ్య హాయిగా కాపురం చేసుకుంటూ ఉందంటే...అది నీ దయే. ఆ విషయం రమ్యకు గుర్తుందో,లేదో గానీ...నేను మాత్రం ప్రతిరోజూ గుర్తుచేసుకుంటాను.
                    రమ్య అత్తారింటికి పోతూంటే ఎంత బాధపడ్డావు? ఆ వెంటనే ప్రొమోషన్ పై నీకు చిత్తూరుకు ట్రాన్స్ ఫర్ అయితే...మమ్మల్ని వదలిపోతున్నప్పుడు ఎంత దిగాలుపడ్డావు?
                   మీ నాన్నగారికి ఏక్సిడెంట్ అయినప్పుడు విషయం తెలియగానే పరుగెత్తుకొచ్చావు. నువ్వు
ప్లాటు కొనడానికి తీసుకున్న పి.ఎఫ్.లోను తాలూకు డబ్బులు ఆయన ట్రీట్ మెంట్ కు ఖర్చు చేశావు. అదీ చాలక ఊరంతా అప్పులు చేశావు. లక్షల రూపాయలు ఖర్చయిపోతున్నా 'ఇక నావల్ల కాదు. మీరూ ఎక్కడి నుంచైనా డబ్బులు తీసుకురండి 'అని నీ తోబుట్టువులతో ఏనాడూ అనలేదు నువ్వు. ఆయనకు ట్రీట్ మెంటు అందించడం కూడా ఆపలేదు నువ్వు. ఆయన చివరిక్షణం వరకూ వైద్యం అందించావు నువ్వు.
                  అంతేనా? రమ్య కాన్పులూ, నాన్న సంవత్సరీకాలూ అన్నీ జరిపించావు.
దేన్నీ 'ఇది నా పని కాదు ' అని ఏనాడూ నువ్వు అనుకోలేదు. ఖర్చులకు వెనుకంజ వేయలేదు. 
                  మన కుటుంబం కోసం,కుటుంబ సభ్యులకోసం నువ్వు అనుక్షణం తపించావు. నీలాంటివాడు కుటుంబంలో ఒక్కడుంటే చాలు..సమాజం మొత్తం బాగుంటుంది.

మాకోసం నువ్వు ఏం చేసినా అడ్డు చెప్పని శిరీష, నువ్వు ఏమిచ్చినా సర్దుకుపోయే పిల్లలూ...నీకు భగవంతుడిచ్చిన వరాలు. నీకు ఆ భగవంతుడి అండ ఎప్పుడూ ఉంటుంది. కలకాలం చల్లగా ఉంటావు నువ్వు.
                  మీ నాన్నగారు పోయాక ఓ సంవత్సరం పాటు ఆ ఇంట్లోనే ఉంటాననీ, ఆ తరువాత మీ ఇళ్ళకు వస్తాననీ అన్నాను. మీరు ఒప్పుకున్నారు.
                  ఆమధ్య తరచుగా గుండెల్లో నొప్పి వస్తూంటే...డాక్తర్ కి చూపించాను. నా గుండె పాడయిపోయిందనీ, సంవత్సరం కంటే ఎక్కువ కాలం బ్రతకననీ డాక్టరు నర్సుతో చెబుతూంటే విన్నాను. మొదట భయపడ్డాను,తర్వాత బాధపడ్డాను,ఆ తర్వాత సమాధానపడ్డాను.
                   నాన్న సాంవత్సరీకాలు పూర్తవగానే ముందుగా ఎవరింటికి వస్తావని అడిగారు మీరు. నేను ముందు రమ్య ఇంటికీ,ఆ తర్వాత గోపీ ఇంటికి వెళ్ళి,అక్కడ్నుంచి మీ ఇంటికి వస్తానని చెప్పాను. అలాగే చేశాను కూడా. ఆ విషయంలో నిన్ను బాధ పెట్టి ఉంటానని నాకు తెలుసు. కానీ, అన్ని మజిలీలు  పూర్తి చేసుకుని ఆఖరి రోజులు నీ దగ్గర గడపాలని నాకు అనిపించింది. ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకని ప్రశాంతత మీ ఇంట్లో నాకు దొరుకుతుంది. మీ ఇంట్లో అరుపులూ,కొట్లాటలూ వినిపించవు..మీది అన్యోన్యమైన దాంపత్యం కనుక! పిల్లలను తిట్టడం,కొట్టడం ఉండవు-వాళ్ళకు బాధ్యతలు తెలియజేశారు కనుక! టీవీ రోజంతా మోగదు-మీరు సమయం విలువ తెలిసిన వారు కనుక! ఇవన్నీ నాకిష్టమైన అంశాలు.
                  అంతే కాదు-
                   శ్రీలత వేసే ముగ్గులతో కళకళలాడే మీ ఇంటిముంగిలి నాకిష్టం...
ఉదయాన్నే స్నానం చేసి పూజగదిలో నువ్వు పాడే భక్తి గీతాలూ, సాయి హారతి పాటలూ నాకిష్టం...అతిథులతో కళకళలాడే మీ హాలు ఇష్టం...వెన్నెల భోజనాలతో అతిధుల్ని అలరించే మీ బాల్కనీ ఇష్టం...నా దగ్గర ఏనాడూ నోరు జారని శిరీష అంటే ఇష్టం...ఆమె ఆప్యాయంగా వడ్డించే వంటలు ఇష్టం..నేను మంచి మాటలు చెబితే 'సుత్తి 'అనుకోకుండా వినయంతో వినే నీ పిల్లలు ఇష్టం..నాకోసం అనుక్షణం తపించే నువ్వు ఇష్టం! 
                    అందుకేరా...చివరి మజిలీగా నీ ఇల్లు ఎన్నుకున్నాను.
                   నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమిస్తావు కదూ...?   
                                ఆశీస్సులతో
                            మీ అమ్మ                                                                                   

                    ఉత్తరం చదివిన మురళి కంట్లో నీరు తిరిగింది.
                   "సార్. డాక్టర్ గారు వచ్చారు" అన్న నర్సు మాటలు విని వేగంగా తల్లి బెడ్ ని సమీపించి, అక్కది దృశ్యం చూసి స్థాణువులా నిలబడిపోయాడు. 
                   వెనకే వచ్చిన శిరీషకు-సావిత్రి ముఖానికి ఉన్న ఆక్సిజన్ ట్యూబ్ ని తొలగిస్తున్న డాక్టర్ కనిపించారు. ఆ తర్వాత ఆయన పెదవి విరిచి వెళ్ళిపోవడం కనిపించింది. 
                   ఆమెకు దుఖం ముంచుకొచ్చింది. భర్త గుండెపై తల ఆనంచి ఏడవసాగింది.

       *        *          *        *                                         

           చూస్తూండగానే పదేళ్ళు గడచిపోయాయి.
                   శ్రీరామ్, శ్రీలతల చదువులు పూర్తయ్యాయి. శ్రీరామ్ ఉద్యోగంలో చేరి మూడేళ్ళు దాటాయి. శ్రీలత క్యాంపస్ సెలెక్షన్ లో ఉద్యోగం తెచ్చుకుంది.
                  ఇంతలో...శ్రీలత పెళ్ళి నిశ్చయం అయింది.
                 "అబ్బాయి అందంగా ఉన్నాడు. మంచి ఉద్యోగం,మంచి కుటుంబం...అంతకంటే మనకేం కావాలి? మనకున్నది ఒక్కతే అమ్మాయి కాబట్టి పెళ్ళి ఘనంగా చెయ్యాలండీ" అంది శిరీష మురళితో.
                 "నాకూ అలా చేయాలనే ఉంది. కానీ, జీవితమంతా అప్పులు చేయడం, వాటిని తీర్చడంతోనే సరిపోయింది. వాళ్ళు కట్నకానుకలు కోరకుండా తమ సంస్కారం నిరూపించుకున్నారు. పెళ్ళికి ఎంత లేదన్నా ఆరు లక్షలు అవసరం అవుతుంది. పి.ఎఫ్.లోను తీసుకుందామన్నా అది ఇదివరకే పిల్లల చదువులకు అవసరమై  తీసుకున్నాను. మళ్ళీ బయట అప్పులు చేయాలి. చేస్తాను...నా బంగారు తల్లి కంటే నాకు డబ్బులు ఎక్కువ కాదు కదా!" అన్నాడు మురళి.
                    "శ్రీరాం కి ఓసారి ఫోన్ చెసి చెల్లెలి పెళ్ళికి వాడేమైనా డబ్బు సర్దగలడేమో కనుక్కోండి" 
                    "వాడి జీతం నలభై వేలైనా బెంగళూరులో ఇంటి అద్దె, హోటల్ ఖర్చులూ...అనీ పోను వాడికి ఎంత మిగులుతుంది చెప్పు? ఇవి కాక ఇన్కమ్ టాక్సూ, సెల్ ఫోన్ బిల్లులూ, పెట్రోల్ ఖర్చులూ...! ఫ్రెండ్స్ తో ఓ సినిమాకెళితే రెందు వేలు ఖర్చయిందని చెప్పాడు మొన్న. వాడి దగ్గరుంటే మనం అడగకముందే పంపేవాడు కదా!  మనకోసం తపించే మనసు వాడిది. అడిగి వాడిని బాధపెట్టడం నాకిస్టం లెదు"
                     "మీరన్నది  నిజమే....డబ్బు విపరీతంగా ఖర్చయిపోతూందని చిరాకు పడ్డాడు ఈమధ్య" అంది శిరీష.
           రోజులు గడుస్తున్నకొద్దీ మురళికి ఆందోళన పెరగసాగింది.
             "ఒకటి కాదు...రెండు కాదు...ఆరు లక్షలు! ఎవరిస్తారు? ఎవరైనా ఇచ్చినా...ఓ యాభై వేలు ఇవ్వగలరేమో! అలా ఓ పన్నెండుమంది దగ్గర అప్పు తీసుకుంటే గానీ ఆ మొత్తం సమకూరదు. ఒకవేళ సమకూరినా  మళ్ళీ ఆ అప్పు తన రిటైర్మెంట్ డబ్బులతోనే తీర్చగలడు. అంతవరకూ వారికి అవసరం రాకుండా ఉండాలి! అనుకున్నాడు మురళి.
                     మొదటి ప్రయత్నంగా ఓ స్నేహితుణ్ణి అడిగితే- అరవై వేలు మురళి అక్కౌంట్ కు జమ చేస్తానని అక్కౌంట్ నంబరు తీసుకున్నాడు.
                     నాలుగు రోజుల తర్వాత బ్యాంకుకు వెళ్ళి తన పాస్ బుక్ లో ఎంట్రీలు వేసుకుని చూసుకున్నాడు మురళి.
               ఆరు లక్షలు జమ అయినట్లు పాస్ బుక్  చూపుతోంది.
          ఖాళీ గా ఉన్న ఓ కౌంటర్ దగ్గరికెళ్ళి "అమ్మా...నాకు రావలసింది అరవై వేలు. కానీ, ఆరు లక్షలు జమ అయినట్లు నా పాస్ బుక్ చూపుతోంది. మీ బ్యాంక్ వాళ్ళు పొరపాటుగా ఓ సున్నా ఎక్కువ వేసి ఉండరు కదా?!" అని అక్కడ పనిచేసుకుంటున్న అమ్మాయిని అడిగాడు.
                     ఆ అమ్మాయి "చూస్తాను....మీరు కూర్చోండి" అని కంప్యూటర్ లో చూసి,"మీకు అరవై వేలు ఎవరు పంపాలి?" అని అడిగింది.
              "మారుతి అనీ...నా స్నేహితుడు" 
       "ఆయన ఇంకా పంపలేదు. ఈ ఆరు లక్షలూ శ్రీరామ్ అనే వ్యక్తి పంపింది"
       మురళికి ఆనందంతో నోట మాట రాలేదు.
  ఆమెకు కళ్ళతోనే కృతజ్ఞతలు తెలియజేసి ఇంటికి వచ్చాడు.
                   వాకిట్లోనే ఎదురొచ్చిన శిరీష "శ్రీరామ్ డబ్బు పంపాడటండీ. వాడు నెలనెలా ఖర్చులకు పోను దాచుకున్నదీ, సెలవు రోజుల్లో పనిచేసి సంపాదించిందీ, అవార్డులుగా గెలుచుకున్నవీ...అన్నీ కలిపి ఆరు లక్షలు మీ అకౌంట్ కు పంపాడట....ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు" అని చెప్పింది ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ.
             హాల్లో కనిపిస్తున్న తల్లితండ్రుల ఫోటో వైపు చూశాడు మురళి. 
                     'భాద్యతల్ని తీసుకునే గుణం నీనుంచి నీ పిల్లలకు తప్పకుండా వస్తుందిరా. వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు. మంచి మనసు నీది. కలకాలం చల్లగా ఉంటావు నువ్వు" తల్లి పలుసార్లు తనతో అన్న మాటలు గుర్తొచ్చి కళ్ళలో నీరు తిరిగింది మురళికి.

Quote of the day

Our nature is the mind. And the mind is our nature.…

__________Bodhidharma