Online Puja Services

కాలసర్పదోషాన్ని తొలగించే నాగలోకపు దారి

3.12.71.237

కాలసర్పదోషాన్ని తొలగించే నాగలోకపు దారి !!
- లక్ష్మి రమణ 

నాగలోకానికి వెళ్లడం, నాగ కన్యలని వివాహం చేసుకోవడం, నాగలోకంనుండీ నాగమణిని తీసుకురావం వంటి ఇతిహాసాలలో, పురాణాలలోని కథలు భలే ఆసక్తికరంగా ఉంటాయి . ఇప్పటికీ ఫిక్షన్ తో కూడిన ఇటువంటి కథలు బుల్లితెరమీదో , వెండితెరమీదో వచ్చినా దాన్ని చూసేందుకు ప్రజలు అత్యధికమైన ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.  మరి నిజంగానే నాగలోకానికి దారి ఉంది అని చూపిస్తే, వెళ్లే సాహసం చేస్తారా ? కాశీలో ఉన్న ఈ దారి ఎలా ఉంటుంది ? నాగదోషాలని పరిహరించే  ఈ క్షేత్రాన్ని ఒకసారి దర్శిస్తూ ఆసక్తి కరమైన ఇటువంటి విశేషాలని చెప్పుకుందాం రండి . 

 వారణాసి ప్రముఖ శైవక్షేత్రం. జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా వెళ్ళాలని తపించే క్షేత్రం . తుది శ్వాస విడిస్తే , ఆ క్షేత్రంలోనే ఆ కాలం సమీపించాలని ప్రతి  హిందువూ తపించే క్షేత్రం . మోక్షధామం కాశీ క్షేత్రం . ఈ క్షేత్రంలో అడుగడుగునా ఒక శివ క్షేత్రం ఉంది. ఆ మాటకొస్తే విశ్వేశ్వరుడు ఉన్న చోట, గాలిలోని ప్రతి అణువూ కూడా లింగా కారమై అనుగ్రహాన్ని కురిపిస్తుంటుంది . 

ఇక నాగలోకానికికున్న దారి కూడా ఈ క్షేత్రంలోనే ఉంది.  వారణాసి లోని జయత్పురా ప్రాంతంలో ఉన్న పోఖారా అంటే చెరువు లోపల ఒక బావి ఉంటుంది. దీనినే నాగ్ కుండ్ అంటారు . ఆ బావి నుండీ నాగలోకానికి దారి ఉందనేది స్థానికుల విశ్వాసం . దాదాపు 45 మీటర్ల లోతున నాగలోకానికి వెళ్లే స్వారం ఒకటి ఉంటుందని స్థానికులు చెబుతుంటారు . అక్కడ ఒక ఇనప తలుపు లేదా మూత లాంటిది కూడా చూడొచ్చు. అయితే, ఆ తలుపు దాటితే నాగలోకముందా ? లేదా పురాతన రాజులు దాచి ఉంచిన అనంత సంపద ఉందా ? అన్నది కొంతమంది అనుమానం. కానీ ఈ క్షేత్రం చరిత్రకారుల లెక్కలకన్నా పురాతనమైనది అన్నది మాత్రం తిరుగులేని సత్యం అంటారు ఇక్కడి స్థానికులు . 

నాగలోకానికున్న దారి సంగతి పక్కన పెడితే,  ఈ బావిలోపల ఒక శివలింగం ఉంటుంది. ఈయనని కర్కోటక నాగేశ్వరుడు అని పిలుస్తారు . ఈ ప్రాంతాన్ని సాధారణంగా పర్యాటకులు దర్శించరు. ఎక్కువగా ఈ ప్రాంతం గురించి అవగాహన లేకపోవడమే అందుకు కారణం కాదు. ఈ బావిలోని కర్కోటక నాగేశ్వరుడు కేవలం ఏడాదికి ఒకసారి మాత్రమే దర్శనమిస్తారు . అది కూడా కేవలం నాగపంచమికి మాత్రమే .  విచిత్రమేమంటే,ఒక్క త్యకారు నీళ్లని తొలగించడం ద్వారా నాగపంచమి నాడు దర్శనమిచ్చే పరమేశ్వరుడు , ఆ రోజు తర్వాత అనంత జలరాశిలో మునిగి ఉంటారు. ఆ తర్వాత యెంత నీరు తోడినా ఆ స్వామీ దర్శనం కష్టమే . తిరిగి కర్కోటక నాగేశ్వరుని చూడాలంటే, నాగపంచమి వరకూ వేచి ఉండడం తప్ప మరో మార్గం లేదు . 

నాగులకి ఆరాధ్యదైవం పరమేశ్వరుడే నన్న విషయం తెలిసిందే ! ఈ శివలింగాన్ని నాగులు ఆరాధిస్తుంటారని విశ్వశిస్తారు. అయితే ఈ నాగేశ్వరున్ని ఆరాధించడం వలన కాలసర్పదోషాలు , సర్ప దోషాలు , పెళ్లి కాకపోవడం, సంతానం కలగకపోవడం, ఉద్యోగంలో ఎంత ప్రయత్నించినా ఎదగలేకపోవడం వంటి సమస్యలు తొలగిపోతాయి.    

ఈ నాగ్ కుండ్ / నాగ్ కూప్ గా పిలువబడే కర్కోటకనాగేశ్వరుని ఆలయం వారణాశిలోని జయత్పురా పోలీస్ స్టేషన్ కి దగ్గరలోనే ఉంటుంది . ఈ ఆలయానికి వెళ్లాలనుకునేవారు జయత్పురా పోలీస్ స్టేషన్ వరకూ ఆటోలో వెళ్లి , అక్కడి నుండీ కాలినడకన వెళ్లడం మంచిది . 

శుభం !!

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi