Online Puja Services

గమ్యం చేరేవరకు విశ్రమించకండి'

3.138.105.31

'లేవండి..మేల్కోండి.. గమ్యం చేరేవరకు విశ్రమించకండి' - స్వామీ వివేకానంద 
సేకరణ 

1863, జనవరి 12 న కోల్‌కతాలో జన్మించారు నరేంద్రనాధ్.  తదనంతర కాలంలో స్వామి వివేకానందుడిగా ప్రసిద్ధి చెందారు. సత్యాన్వేషణ కోసం చేస్తున్న ప్రయత్నంలో ఒకసారి నరేంద్రుడు తన స్నేహితులతో కలిసి దక్షిణేశ్వర్‌లోని రామకృష్ణ పరమహంస వద్దకు వెళ్లాడు. అక్కడ ఆయన ప్రసంగాలను శ్రద్దగా ఆలకించాడు. ఆ సమయంలో రామకృష్ణ పరమహంస దృష్టి నరేంద్రుడిపై పడింది. నరేంద్రుడిని చూసి పరమహంస తెలియని తాద్యాత్మతకు లోనయ్యారు . ఆ తర్వాతి కాలంలో పరమహంస శిశ్యుడిగా మారిపోయిన నరేంద్రుడు నెమ్మదిగా ప్రాపంచిక సుఖాలపై వ్యామోహం తగ్గి సన్యాసిగా,  వివేకానందుడిగా మారిపోయారు . ఆయన బోధనలు దేశంలో ఇప్పటికీ ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.

'ఇనుప కండరాలు,ఉక్కు నరాలు,వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం', 'లేవండి..మేల్కోండి.. గమ్యం చేరేవరకు విశ్రమించకండి' వంటి వివేకానంద సూక్తులు ఇప్పటికీ ఎంతోమంది యువతకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. అసలు ఆయన నోటి నుండీ వచ్చిన ప్రతిమాటా ఇప్పటికీ యువతకి మార్గనిర్దేశం చేస్తూ , సరికొత్త స్పూర్తినిస్తూ ఉంటుంది. 

వివేకానందుడి ప్రస్తావన ఎక్కడ వచ్చినా 1893 సెప్టెంబర్ 11వ తేదీన చికాగో వేదికగా జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో ఆయన చేసిన ప్రసంగం ప్రస్తావన తప్పకుండా వస్తుంది. ఈ ప్రసంగం భారత ప్రతిష్టను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ ప్రసంగంలో వివేకానందుడు ఏం చెప్పారన్నది కేవలం కొద్దిమందికి మాత్రమే తెలుసు. వివేకానందుడి ఆ ప్రసంగంలోని ముఖ్యాంశాలు చూద్దాం:

అమెరికా సోదరులు, సోదరీమణులారా.. ! నన్ను ఆహ్వానించడంలో మీరు ప్రదర్శించిన ఆత్మీయతతో నా హృదయం నిండిపోయింది. ప్రపంచంలోని అత్యంత పురాతన సంస్కృతికి నెలవు, అన్ని ధర్మాలకూ జనని అయిన భారతదేశం తరఫున నేను మీకు ధన్యవాదాలు చెబుతున్నాను. అన్ని కులమతాలకు చెందిన కోట్లాది మంది భారతీయుల తరపున మీకు కృతజ్ఞతలు.

మతసహనం అన్న భావన తూర్పు దేశాల నుంచి వచ్చిందని ఈ సదస్సులో వెల్లడించిన కొందరు వక్తలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మతసహనం, అన్ని మతాల పట్ల సమాన ఆదరణలాంటి లక్షణాలను ప్రపంచానికి చాటి చెప్పిన మతం నుంచి వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను. మేం కేవలం మతసహనాన్ని నమ్మడమే కాకుండా, అన్ని ధర్మాలను నిజ రూపంలో స్వీకరిస్తాం.
నేను అన్ని మతాలకు, అణగారిన ప్రజలందరికీ ఆశ్రయం ఇచ్చిన దేశానికి చెందిన వాడినైనందుకు గర్వపడుతున్నాను.

రోమన్ నిరంకుశ పాలకులు ఇజ్రాయిలీయుల పవిత్ర స్థలాలను ధ్వంసం చేసినప్పుడు, ఇజ్రాయిలీ వాసులు దక్షిణ భారతదేశంలో తలదాచుకున్నపుడు వారిని మా హృదయాలకు హత్తుకున్నాం.

పార్సీ మతం వారికి ఆశ్రయం ఇచ్చిన మతానికి చెందిన వాడినైనందుకు నేను గర్విస్తున్నాను. మేం ఇప్పటికీ వారికి సహాయం చేస్తున్నాము.

ఈ సందర్భంగా నేను చిన్ననాటి నుంచి వింటున్న, అనేక లక్షల ప్రజలు ఇప్పటికీ చెప్పే మాటలను చెప్పాలనుకుంటున్నాను. నదులు ఎలాగైతే వివిధ ప్రాంతాలలో పుట్టి, వివిధ భూభాగాల గుండా ప్రవహించి, చివరకు సముద్రంలో కలుస్తాయో, అలాగే మనిషి తనకు నచ్చిన దారిని ఎన్నుకుంటాడు. చూడడానికి ఈ దారులన్నీ వేరైనా, అవన్నీ కూడా దేవుణ్నే చేరుకుంటాయి.

ఇక్కడ జరుగుతున్న ఈ మత సమ్మేళనం అత్యంత పవిత్రమైన సంగమం. గీతలో భగవానుడు చెప్పినట్టు , ‘నా దగ్గరకు వచ్చిన దేన్నైనా, అది ఎలాంటిదైనా, నేను దానిని స్వీకరిస్తాను. మనుషులు వేర్వేరు దారులను ఎంచుకుంటారు, కష్టాలను ఎదుర్కొంటారు. కానీ, చివరకు నన్ను చేరుకుంటారు' అన్న వాక్యాలు దీనికి నిదర్శనం.

మతతత్వం, మూఢ భక్తి, దాని పర్యవసానాలు ఈ అందమైన భూమిని పట్టి పీడిస్తున్నాయి. అవి సృష్టించిన హింసతో ఈ భూమిపై ఉన్న మట్టి ఎర్రబడింది. వాటి కారణంగా ఎన్నో నాగరికతలు నాశనమయ్యాయి, ఎన్నో దేశాలు నామరూపాలు లేకుండా పోయాయి.

ఆ భయానకమైన మతతత్వం, మూఢభక్తి లేనట్లయితే మానవ సమాజం ఇంతకన్నా మెరుగైన స్థితిలో ఉండేది. ఈ సర్వమత సమ్మేళనం - అది కరవాలం ద్వారా కావచ్చు, కలం ద్వారా కావచ్చు - అన్ని రకాల మూఢభక్తిని, పిడివాదాన్ని, హింసను దూరం చేస్తుందని విశ్వసిస్తున్నాను.
ఇలా, విశ్వవేదిక పైన వివేకానందుని తోలి ప్రసంగమే , భారతీయుల గొప్పదనాన్ని చాటి చెప్పింది. భారతీయ ఆధ్యాత్మిక విశ్వాసాన్ని విశ్వజనీనం చేసిన వివేకానందులవారు 

1902 జూలై 4వ తేదీన బ్రిటీషు పరిపాలనలోని బెంగాలు ప్రెసిడెన్సీ (ప్రస్తుత పశ్చిమ బెంగాల్)లోని, బేలూరు రామకృష్ణ మఠంలో మరణించారు. అప్పుడు ఆయన వయస్సు 39 ఏళ్లు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన జన్మదినం జనవరి 12వ తేదీని.. 1984వ సంవత్సరం నుంచి భారత ప్రభుత్వం జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తోంది.

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore