Online Puja Services

రాక్షసులకీ, ఇంద్రుడికి తేడా ఏంటట ?

3.15.147.53

మునుల తపస్సులని నాశనం చేసిన రాక్షసులకీ, ఇంద్రుడికి తేడా ఏంటట ? 
లక్ష్మీ రమణ 

ఇంద్రుడికి వేదాలన్నీ గొప్ప స్థానాన్ని ఇచ్చాయి. దేవతలకి రాజుని, వారందరూ నివశించే స్వర్గానికి అధిపతిని చేశాయి.  కానీ , ఇంద్రుడు మన రాజకీయ నాయకుల్లాగా ఎందుకెప్పుడూ తన పదవికి ఎవరైనా ఎసరు పెడతారేమో అని భయపడుతుంటారు ? పైగా మహర్షుల తపస్సును కూడా తన భయంతో నాశనం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి . అలాంటప్పుడు, మునుల తపస్సులని నాశనం చేసిన రాక్షసులకీ, ఇంద్రుడికి తేడా ఏంటట ? 

ఇంద్రుడు దేవతలరాజు,స్వర్గలోకాధిపతి. పైగా ఇంద్రుడు ఇంద్రియాలకు అధిపతి. కాబట్టి ఈ ఇంద్రునికి మానవస్వభావాలన్నీ(కామ,క్రోధ,లోభాది గుణాలు)అంటగట్టబడ్డాయి. ఋషులు భగవంతుని కోసం చేసే తపస్సులో ముందుగా జయించాల్సినవి ఇంద్రియాలు . అవి కల్పించే భ్రమలు , చాపల్యాలు. వాటిని జయిస్తేనే , జయించ గల్గితేనే, భగవంతుని దర్శనం ప్రాప్తిస్తుంది.

ఇక వేదాలలో ప్రస్తుతింపబడ్డ లేక పూజింపబడిన ఇంద్రుని విషయానికి వద్దాం.

అసలు విషయం ఏమిటంటే, వేదాలలో ఇంద్రునిగా భావించి పూజించినది ఇంద్రుడు అనే దేవతను కాదు, “ఇంద్ర” అనే శబ్దాన్నిలేక ఆ శబ్దానికి అర్హులైనవారిని.

ఈ “ఇంద్ర” అనే శబ్దానికి అర్థం ఏమిటి? ఎందుకని పూజించారు?. అన్న ప్రశ్నలకు ఋగ్వేదము యొక్క ఐతరేయోపనిషత్తు సమాధానం చెబుతుంది. ఇందులోని 1వ అధ్యాయం, 3వ అనువాకంలోని 13,14 శ్లోకాలు అర్థం ఒకసారి చూద్దాం. 

13.మనుష్యరూపమున ఉత్పన్నమైన జీవుడు ఈ విచిత్ర జగత్తును చూచి దీని కర్త, ధర్త(ధరించువాడు) మరియొకరు ఉండవలెనని భావించి తన హృదయమందు అంతర్యామి రూపమున విరాజిల్లు పరమాత్మ సాక్షాత్కారము పొందెను. పరమాత్మయే ఈ విచిత్ర జగత్తుకు కర్త,ధర్త(ధరించువాడు)యని, ఆయన శక్తి యందు పూర్ణ విశ్వాసముకలిగి, ఆయనను పొంద ఉత్సుకతతో ప్రయత్నించిన ఆయనను పొందగలడు, మనుష్య శరీరము ద్వారానే ఆయనను పొందవచ్చును. కావున మనుష్యుడు తన అమూల్య సమయమును వృధాచేయక పరమాత్మ ప్రాప్తికి సాధన చేయవలెను.

14.మనుష్య శరీర రూపమున ఉత్పన్నమైన జీవుడు పై చెప్పిన విధమున పరమాత్మను సాక్షాత్కరింప జేసుకొనుటచే పరమాత్మను ఇదం+ద్ర= ఇదంద్ర. అంటే “నేను చూచితిని” అను పేరుతో చే పిలుతురు. అదియే పరోక్షరూపమున అంటే వ్యావహారిక రూపమున “ఇంద్ర” అనే పేరుతో వ్యవహరింతురు.

కాబట్టి వేదాల ప్రకారం ఇంద్రుడు అంటే కేవలం ఒక్కరే కాదు. ఎవరెవరు భగవంతుని చూసారో లేక ప్రత్యక్షం చేసుకొన్నారో వారందరూ ఇంద్రులే. అటువంటి ఇంద్రులను లేక ఇంద్ర శబ్దాన్ని పొందినవారినే వేదాలలో పూజించారు. అంతేకాని ఒకే ఇంద్రున్ని లేక ఇంద్రుడనే వ్యక్తిని అని కాని కాదు.

విజ్ఞానాన్ని పరీక్షచేసే కదా ఇప్పటికైనా సర్టిఫికేట్ ని పొందేది. అటువంటి పరీక్షలనే  ఇంద్రియాలకి పెట్టడం ద్వారా, వాటిని జయించి సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా  భగవంతుని పొందండి  అని చెప్పడమే ఇంద్రుని ప్రకటనలో ఉన్న ఉద్దేశ్యం . మహర్షులు సామాన్యులకి అర్థమయ్యేలా ఆ విషయాన్ని చక్కని కథలుగా మలిచి బోధించారని మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం .  

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore