Online Puja Services

పుట్టుమచ్చల శాస్త్రాన్ని గురించి చెప్పుకోవాల్సిందే మరి !

3.146.255.127

తిక్క నాటుగా , ఊర నాటుగా అనిపించినా పుట్టుమచ్చల శాస్త్రాన్నిగురించి చెప్పుకోవాల్సిందే మరి ! 
- లక్ష్మీ రమణ  

‘పొట్టమీద పుట్టుమచ్చతో పుట్టిందే, ఇది మహా తిండిపోతు. ఆమ్మో , వాడికి నాలికమీదే పుట్టుమచ్చవుంది కాస్త జాగ్రత్తగా ఉండాలి. మచ్చనాలిక వెధవ ! మాటన్నాడంటే, జరిగిపోతుంది .’ లేచింది మొదలై కర్రపొటేసుకుని తిరుతున్నా, మా పుట్టుమచ్చల మీద కామెంట్ చెయ్యడం మాత్రం మర్చిపోదు మా బామ్మ . బామ్మోవాచంటే మజాకానా అని మరో సమర్ధింపుకూడా ! అయితే, డౌట్ ఏంటంటే, నిజంగానే పుట్టుమచ్చలు నడవడికని నిర్దేశిస్తాయా ? ఒకవేళ నిజం అయితే, అవి ఎలాంటి ఫలితాలు ? ఇవి కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తున్నాయి. వెతికితే, ఇవి దొరికాయి.  

మాన‌వుడి జాత‌కాన్ని నిర్థేశించ‌డంలో పుట్టుమ‌చ్చ‌ల‌దీ ఓ పాత్ర అని చెప్ప‌వ‌చ్చు. వ్య‌క్తుల స్వరూప స్వభావాలను తెలుప‌డంలో పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. శరీరంపై ఆయా స్థానాల్లో కనిపించే ఈ పుట్టుమచ్చలు అందాన్ని పెంచడంలోనే కాకుండా, అదృష్ట.. దురదృష్టాలకు కూడా సంకేతంలా పనిచేస్తాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎవరి నమ్మకాలు వారివి.

పుట్టుమచ్చలు శరీరంలో ఉండే ప్రదేశం, వాటి రంగు, గాఢత , ఆకారం, వాటిపైన ఉండే వెంట్రుకలు వంటి విషయాలన్నీ కూడా మానవుని అదృష్టాన్ని దురదృష్టాన్ని, అతని లక్షణాలని సూచిస్తాయంటుంది, పుట్టుమచ్చల శాస్త్రం . దీనిప్రకారం , కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాన్ని ఇవ్వగా, మరికొన్ని పుట్టుమచ్చలు వేరు ఫలితాలను ఇస్తాయి. 

మాన‌వ దేహంలోని కొన్ని ప్రదేశాల్లో గల పుట్టుమచ్చలు ధనయోగాన్ని సూచిస్తాయని శాస్త్రం స్పష్టం చేస్తోంది. తలపై కుడి భాగంలోనూ, నుదురు మధ్య భాగంలో, కుడి కణతపై, ఎడమ కణతపై, కుడి కన్ను రెప్పపై, కుడి కన్ను లోపలి భాగంలో పుట్టుమచ్చలు ఉంటే ధనయోగం కలుగుతుంది. ముక్కు కుడి భాగంలోనూ, కుడి చెంపపై, చెవులపై,. నాలుక చివరి భాగంలోనూ ఉండే పుట్టుమచ్చలు ధనవంతులను చేస్తాయి.

ఇక మెడ ముందు భాగంలో ఏ వైపున ఉన్నా, కుడి భుజం పైన, పొట్ట పైన, హృదయ స్థానంలోను, మోచేతి పైన, కుడి అరచేతిపై, కుడి తొడపై, కుడి మోకాలుపై గల పుట్టుమచ్చలు శ్రీమంతులను చేసేవిగా చెప్పబడుతున్నాయి. ఈ ప్రదేశాల్లో గల పుట్టుమచ్చల వలన కష్టపడటం వలన గానీ, కాలం కలిసిరావడం వలన గాని ధనయోగం కలుగుతుందనేది స్పష్టమవుతోంది.

తలపై మాడు భాగానికి కుడి వైపున పుట్టుమచ్చ ఉన్నట్టయితే.. రాజకీయాల్లో రాణిస్తూ.. ఏదో ఒక పదవిలో కొనసాగుతూ ఉండే అవ‌కాశం ఉంటుంది. మంచి ఆలోచనాపరులైన వీరు తెలివిగా డబ్బు సంపాదించడమే కాకుండా, ముందుచూపుతో ధైర్యంగా వ్యాపారాలు చేస్తుంటారు. అణకువగల భార్య.. వినయం కలిగిన సంతానంతో వీరి జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతూ వుంటుంది.

ఇక మాడుకు ఎడమ వైపున పుట్టుమచ్చ ఉంటే గ‌న‌క‌.. మంచి తెలివితేటలతో పాటు వాక్ చాతూర్యం ఉంటుంది. సమాజ హితాన్ని గురించి ఆలోచించే వీరు సంపాదనకి పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వరు. సంసారాన్ని.. సంతానాన్ని ప్రతి బంధకాలుగా భావించే వీరు, వేదాంతిలా కనిపిస్తూ దేశ సంచారం చేయడాన్నే ధ్యేయంగా పెట్టుకుంటారు.

మాడు భాగానికి ముందువైపున పుట్టుమచ్చ ఉన్నట్టయితే.. ప్రతి విషయంలోనూ కాస్త దూకుడుగా వ్యవహరిస్తుంటారు. ఎవరైనా సరే తన మాట వినవలసిందే అనే విధంగా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు. వీరికి సంపాదనే కాదు.. సంతానమూ ఎక్కువే.

ఇక మాడుకు వెనుక వైపున పుట్టుమచ్చ ఉన్నట్టయితే.. పేరు ప్రతిష్ఠలకన్నా డబ్బు గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. భార్యపై ప్రేమానురాగాలే కాదు.. ఇతర వ్యామోహాలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. సంపాదనకు కొదవ ఉండకపోవడంవల్ల వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ వుంటారు.

ఇక స్త్రీల విషయానికి వస్తే తలపై పుట్టుమచ్చ అంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వదనే చెప్పాలి. దురుసుతనానికి.. నిదర్శనంగా వీరు కనిపిస్తారు. 

ఇలా చాలా విశేషాలే పుట్టుమచ్చల శాస్త్రం విశదీకరిస్తుందట. సరే, నమ్మినవారికి నమ్మినంత. నమ్మనివారికి, సరదాగా ఛలోక్తులు విసురుకునేంత. మరింత కలాపోసన  ఉంటె, సినిమాలు తీసినంత. తిక్క నాటుగా , ఊర నాటుగా అనిపించినా, మరి ఈ విషయాన్ని నమ్మేవారికీ కొదవలేదు. 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha