పట్టాలపైన పరిగెడుతున్న రైలు

3.234.244.105

పట్టాలపైన పరిగెడుతున్న రైలు- అమాంతం అదృశ్యమైపోతే ఎలా ఉంటుంది ? 
-లక్ష్మీరమణ 

అది 1911వ సంవత్సరం . ఒక రైలు పట్టాలపై పరుగెడుతోంది . అందులో ప్రయాణీకులున్నారు . తర్వాత స్టేషన్లో దిగాల్సినవాళ్లు హడావుడిగా అందుకు సిద్ధపడుతున్నారు. నించొనున్నవాళ్ళు , సీట్లకోసం వెతుక్కుంటున్నారు . చిన్నపిల్లల కేరింతలు, పెద్దవాళ్ళ అరుపులతో రైలు లోపలి వాతావరణం చాలా కోలాహలంగా ఉంది . స్టేషన్ చేరుకునే ముందు ఒక పెద్ద సొరంగం గుండా ఆ రైలు ప్రయాణించాల్సి ఉంది. సొరంగంలోకి రైలు అడుగుపెట్టింది . ఉన్నట్టుండి ఏదో పొగమబ్బు లాంటిది రైల్ ముందర కనిపించడాన్ని ప్రయాణికులు అనుభూతి చెందారు . అంతే , ఆ తర్వాత ఆ రైలు అప్పటి నుండీ ఇప్పటిదాకా ఎవ్వరికీ కనిపించలేదు . 

ఇది మొదటి ప్రపంచ యుద్ధానికి ముందరిమాట. 1911 జూన్ నెలలో ఇటాలియన్ రైల్వే కంపెనీ అయిన జనెట్టి (Zanetti)  తమ నూతనమైన రైళ్లని పరిచెయ్యాలనే ఉద్దేశ్యంతో ఒక ఫ్రీ రైడ్ ని ప్రకటించింది . రోమ్ నుంచి లోంబాయీ వరకూ ప్రయాణం .  రోమ్ లో అదృష్టవంతులైన 100 మంది ప్రయాణీకులు, ఆరుగురు రైల్వే సిబ్బంది రైలెక్కారు  ఎక్కారు . అందులో చక్కని ఆహార పానీయాల ఏర్పాట్లు చేశారు .  అన్ని సౌకర్యాలతో బయల్దేరిన ఆ రైలు ఇక గమ్యస్థానాన్ని చేరుకోవడమే తరువాయి . దారిలో ఒక పెద్ద సొరంగమార్గం గుండా ప్రయాణిస్తోందా ట్రైన్ . సొరంగంలోకి వెళ్లెవరకూ దాని ఆనుపానులు తెలిసాయి. ఆ తర్వాత ఎక్కడికి మాయమయ్యిందో అంతు చిక్కలేదు . 

ఆ రైలు పిల్లలాడుకునే బొమ్మకాదు . పాడేసుకుంటే, కనిపించనంత చిన్నదికాదు. సిబ్బందితోకలిసి 106 మంది  జనంతో ఇబ్బంది లేకుండా ప్రయాణమైన భారీ వాహనం . ఆ సొరంగం కనిపిస్తూనే ఉంది . అది సాధారణంగా ఆ దారిలో వెళ్ళే రైళ్లు ఉపయోగించేదే ! మరి జనెట్టి ఏమయ్యింది ? మూడు బోగీలున్న ట్రైన్ అలా ఎలా మాయమౌతుంది. ఇప్పటి వరకూ అందరూ ఊహాగానాలు చేస్తున్నట్టు , దెయ్యాలే ఈ రైలుని  మాయం చేసేసాయా? లేకపోతె, హ్యారీపోటర్ సినిమాలో మ్యాజిక్కుల్లా , కాలంలో ప్రయాణించే (time travel ) ద్వారమేదైనా ఉన్నటుండి అక్కడ తెరుచుకుందా ?ఇలా సమాధానం లేని ప్రశ్నలు , అవధులు మించిన ఊహాగానాలే తప్ప , వీటికి జవాబులు మాత్రం తేలలేదు . రైలుకి రైలు మాయమయితే, అసలు ఈ కథ ప్రపంచానికి ఎలా తెలిసింది ? ఈ ఊహాగానాలకు రెక్కలు ఎలా మొలిచాయి ? 

ఈ విష్యం పైన గొప్ప పరిశోధనలే జరిగాయి. ఒక కిలోమీటరు పొడవుండే ఆ సొరంగం చాలా చీకటిగా ఉంటుంది. అలాంటి చీకటి సొరంగంలో ఆ ట్రైను ఏ మూలకు వెళ్లి  పడిపోయినా ఖచ్చితంగా కనబడి తీరాలి. కాని కనబడలేదు. ఒకవేళ భూమిలోకే క్రుంగిపోయిందా, లేక సొరంగం పక్కనే ఉన్న లోయలోకి పడిపోయిందా, ఇలా రకరకాల అనుమానాలతో ఆ సొరంగం చుట్తుపక్కల ప్రాంతాల్లో అణువణువునా గాలించారు. కాని  ఆ ట్రైను ఆచూకీ గానీ, ప్రయాణికుల ఆచూకీ గానీ దొరకనే లేదట. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా దాని అవశేషాలయినా కనబడాలి. కాని అక్కడ ట్రైన్ కి సంబంధించి గాని, ప్రయాణికుల గురించి గాని ఏ ఆచూకీ దొరకనేలేదు. 

కానీ ఆ సంఘటన గురించిన ఒక ఆసక్తికర వాస్తవం బయటపడింది . ఆ రైలులో ప్రయాణించిన వారిలో ఇద్దరు  ప్రయాణీకులు మాత్రం ప్రాణాలతో దొరికారు. వారీ సంఘటన గురించి వివరంగా మాట్లాడేందుకు ఇష్టపడకపోయినా , కొన్ని విషయాలు మాత్రమె తెలియవస్తున్నాయి . ఆ టన్నెల్ లో అడుగుపెట్టిన కొద్దిసేపటికే, ఏదో పొగ రైలుని చుట్టుముట్టినట్టయ్యిందట . లోపాలున్నవారు భయంతో, అదిరిపోయారట. ఏదో పెను ప్రమాదం సంభవించిందన్న ఉద్రిక్తతకి లోనయ్యారట. వారిలోనుండి ఈ ఇద్దరు మాత్రం సాహసించి బయటికి దూకేశారట. అలా బయటపడ్డప్పటికీ వారి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం. వారిద్దరూ కూడా మానసికమైన బాధలతో దీర్ఘకాలం చికిత్సని తీసుకున్నారని వార్తాపత్రికలు, ఈ వార్తను గురించి ప్రచురించిన పరిశోధనాత్మక వ్యాసాలలో పలుసార్లు పేర్కొన్నాయి. మరికొన్ని వార్తల్లో అసలు వారు ఆ తలుపులు మూసి ఉన్న రైలులోనుండీ ఎలాబయటపడ్డామో , తెలియదని పేర్కొన్నట్టుగా రాశాయి. 

ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన సంగతిని గురించి చెప్పుకోవాలి . ఈ రైలు టైం ట్రావెల్ చేస్తూ, కాలంలో వెనక్కి పరిగెత్తి 1840లనాటి మెక్సికో కి చేరిందని, అక్కడ ఇటువంటి రైలులో ప్రయాణంచేస్తూ , మానసికంగా విచిత్రమైన స్థితిలో ఉన్న 104 మంది హాస్పిటల్లో చేరడం తనకి తెలుసునని ఒక డాక్టర్ (1911-1840=71 ఏళ్ళు ) చెప్పడం విశేషం. దశాబ్దాల తర్వాత ఇటలీ, రష్యా, జర్మనీ, రొమేనియా  లలోని పలు ప్రాంతాలలో కూడా అచ్చంగా 1911 లో కనిపించకుండాపోయిన జనెట్టి లాంటి రైలుని తాము చూశామని చెప్పిన సంఘటనలు బయల్పడ్డాయి. 

ఇంతకీ , కనీసం ఆనవాలు కూడా దొరక్కుండా ట్రైన్ ని, ప్రయాణికులను మాయం చేసేసింది దయ్యలా ? టైం ట్రావెల్ లా ? ఏది నిజమో తెలీనే  లేదు . కానీ ఈ  సంఘటనని  కథలు కథలుగా చెప్పుకోవడం మాత్రం మొదలయింది. ఆ తరువాత జనాల నోళ్ళల్లో నాని , జనేతి ట్రైన్ కాస్తా ఘోస్ట్ ట్రైన్ గా పేరు మారిపోయింది. మరిన్ని సంఘటనలు జరుగుతాయేమో నన్న భయంతో   ఆ సొరంగ మార్గాన్ని ప్రభుత్వం మూసి వేసింది . విచిత్రం ఏమిటంటే శతాబ్దం తరువాత ఇప్పటికీ కూడా ఆ జనేతిట్రైను   గురించి వెదుకుతూనే ఉన్నారు.  కాని ఆచూకీ మాత్రం లభించనేలేదు. ఈ ఆ ట్రైను మిస్సింగు ఇప్పటికీ పరిశోధనలకందని, అంతుపట్టని మిస్టరీగానే మిగిలిపోయింది.

Quote of the day

It is easy to talk on religion, but difficult to practice it.…

__________Ramakrishna