ఆ ఉంగరాలజుట్టు వెనుక రహస్యం ఏమిటి ?

44.192.25.113

ఇంతకీ , ఆ ఉంగరాలజుట్టు వెనుక రహస్యం ఏమిటి ?
-లక్ష్మీ రమణ

ధ్యానమగ్నుడైన గౌతమబుద్ధుని చూడగానే మనసుని ఏదో అలోకికమైన శాంతి ఆవరిస్తుంది . ఆ మహనీయుని బోధనలు మదిలో మెదలగానే , అప్రయత్నంగా చేతులుజోడించి నమస్కరించాలనిపిస్తుంది .  ఆయన రూపం , మాట అలాంటి మహత్తరమైనవి మరి !  ఇంతకీ చారడేసి కళ్ళతో, కోటేరులాంటి ముక్కుతో, ప్రశాంతమైన వందనంతో, తలనిండ ఉంగరాల జుట్టుతో కనిపించే ఆ యోగీశ్వరుని రూపంలో జుట్టుమాత్రం అబద్ధమే అంటోంది బౌద్ధం . ఇంతకీ , ఆ ఉంగరాలజుట్టు వెనుక రహస్యం ఏమిటి ?

ఆ తత్త్వం బోధపడాలంటే, బౌద్ధ సన్యాసుల వేషధారణ ఒకసారి పరిశీలించాల్సిందే ! జ్ఞాన సముపార్జనకోసం తపించే పవిత్రాత్ములు భౌద్ధ భిక్షువులు . కఠినమైన నియమాలతో ఇంద్రియ విషయలోలత్వాన్ని నిగ్రహించి , భగవంతునివైపు ప్రయాణం చేసే ధర్మాత్ములు . అటువంటి ధర్మానికి ఆద్యుడైన ఆ బుద్ధుడే కదా వారి విధానాలకి మార్గనిర్దేశకుడు . వీఅందరూ కూడా ధ్యానంలో ఉన్నతమైన శిఖరాన్ని అధిరోహించేందుకు దీక్షని పాటిస్తారు. దానిలో భాగంగానే తలపైన వెంట్రుకలు తీసేస్తారు . సహస్రారం వరకూ ప్రయాణించాలని తపించే ఆ భిక్షువులు ఎప్పుడూ వారి శిరస్సులపై వెంట్రుకలు లేకుండా చూసుకుంటారు . 

ఆ బుద్ధుడు కూడా అందుకు అతీతుడు కాదు .  ఆయన శిరస్సుపై ఉన్నది ఉంగరాల జుట్టుకాదు . అవి నత్తగుల్లలు .  ఒకనాడు గౌతమబుద్ధుడు శరీర స్పృహని మరిచి గాఢమైన ధ్యానంలో లీనమై ఉన్నారు. అది మిట్టమధ్యాహ్న సమయం. ఎండ మండిపోతోంది . 

ధ్యానంలో ఉన్నవారికి , ప్రపంచంలోని అణువు అణువూ పరమాత్మ స్వరూపమే కదా ! అవి కూడా అటువంటి మహనీయులు సేవకై ఎదురు చూస్తుంటాయి. జ్ఞానసముపార్జనం కోసం తపిస్తున్న ఆ యోగిని అక్కడే ఉన్న నత్తలు గమనించాయి . తలపైన వస్త్రంకూడా లేకుండా ధ్యానమగ్నుడైన ఆ బుద్ధునికి ఎటువంటి హానీ కలుగ కూడదని ఒక్కొక్కటిగా ఆ శిరస్సుపైకి చేరుకున్నాయి. అలా 108 నత్తలు బుద్ధుని తలని ప్రచండ సూర్యతాపం నుండీ కాపాడాయి .  బుద్ధుడు ఆ స్పర్శాజ్ఞానాన్ని ఎప్పుడో కోల్పోయారు. ఇక ఒక్కొక్కటిగా ఆయన శరీరం మీదినుండీ పైకి ఎగబాకి , శిరస్సుపైన చుట్టూ రక్షణగా నిలిచాయి .  

చివరికి ,ఆ సూర్యతాపానికి అవి చనిపోయాయి కూడా . అయినా బుద్ధుని శిరస్సుని మాత్రం వీడలేదు .  చివరికి ధ్యానం నుండీ మెలుకువ కలిగిన తర్వాత , బుద్ధుడు ఇహాప్రపంచ జ్ఞానం కలిగినాక చూసుకుంటే, పాపం ఆ నత్తలన్నీ , కైవల్యాన్ని పొంది ఉన్నాయి . 

ఆ బుద్ధుని జ్ఞానోదయానికి , రాములోరికి సాయపడ్డ ఉడతల్లా , సాయపడ్డ నత్తల్ని గౌతముడు , తన స్వరూపాలలో శాశ్వత స్థానాన్ని కల్పించారు .   

బౌద్దులు వాటిని అమరులుగా గుర్తించి, వాటిని బుద్ధుని తలపై చిత్రీకరించి, తమ దేవునితోపాటు వాటికీ పూజలు, నమస్కారాలు చేస్తారు . అదన్నమాట సంగతి ! 

Quote of the day

God is everywhere but He is most manifest in man. So serve man as God. That is as good as worshipping God.…

__________Ramakrishna