గంగకి ‘గోదావరి’ అని పేరెలా వచ్చింది ?

44.192.25.113

గంగకి ‘గోదావరి’ అని పేరెలా వచ్చింది ?
-లక్ష్మీరమణ 
 
భారతీయ సనాతన ధర్మం , పరమాత్మని, ఆయన సృష్టించిన ప్రకృతినీ దేవీ దేవతలుగా ఆరాధించడాన్ని బోధిస్తుంది.  సృష్టిని చూసి ఆశ్చర్యంతో విస్తుపోయి, ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేయడాన్నినేర్పుతుంది .ఆ వరుసలో ఒక గొప్ప విశేషమే మనం నీటి తావులేని దేవీదేవతలుగా ఆరాధించడం . కృష్ణ, యమున, సరస్వతి , గోదావరి, గంగ ఇలా ఒక్కో నదిని దేవతగా నదీమతల్లిగా ఆరాధిస్తాం. ఆ నది పుట్టుక గురించిన గాథలు అంతర్లీనంగా భగవంతుని తత్వాన్ని, వ్యక్తులు ఆచరించవలసిన ధర్మాన్నీ ప్రబోధిస్తాయి .   స్వయంగా శివుని జటాఝూటము లోని గంగమ్మ , ఈ భువిపైన గోదావరిగా పేరొందడము కూడా అటువంటి మహత్తరమైన ఒక కథతో ముడిపడినదే !
  
శివపురాణము , బ్రహ్మ పురాణము , వరాహ పురాణాలలో గంగమ్మ గౌతమిగా , గోదావరిగా మారిన కధలు మనకి కనిపిస్తున్నాయి . ఈ కథ గౌతముడు , అహల్యలది . వారి గొప్పదనాన్ని చెప్పేది . నేటి చలన చిత్ర పరిశ్రమ చెప్పిన కధనాన్ని, దానివల్ల అహల్యామాత మీదున్న అభిప్రాయాన్ని మార్చుకోవడం అవసరమని ఈ కథ చదివాక మీరు తప్పకుండా అనుకుంటారని, ఆచరిస్తారని ఆశిస్తాం . 

అహల్య బ్రహ్మమానస పుత్రిక . విష్ణుమూర్తి మోహినీ అవతారాన్ని చూసి, అటువంటి సౌందర్యరాశిని తయారుచేయాలనే తపస్సుతో బ్రహ్మ చేసిన అద్భుత సృష్టి . ఆమెను పొందాలని తపించని దేవలోక ధీరుడు లేదంటే అతిశయోక్తికాదు .  కానీ ఆ తండ్రికి తాన్ కూతురికి తగిన వరుడు గౌతమ మహర్షేనని గట్టినమ్మకం. తండ్రి నమ్మకానికి మించినదేముంది. బ్రహ్మ గౌతమమహర్షి కె ఇచ్చి అహల్య వివాహం చేశారు . 

ఆ దంపతులు దండకావనం చేరారు. అక్కడ గౌతమమహర్షి చాలాకాలము బ్రాహ్మను గురించి తపస్సు చేశారు. అల్లుడే కదా , తపస్సు చేయాల్సిన అవసరమేమొచ్చే , మామగారిని ఏదికోరినా ఇవ్వాల్సిందే కదా! అని అనుకోవడం ఆ ధర్మనిరతుడైన మహర్షికి చాతకాలేదు . బ్రహ్మ కూడా అల్లుడని ఉపేక్షించలేదు . ఎంతకాలం తన అనుగ్రహం కోసం తపసు చేయాలో అంతకాలం ఎదురు చూశాక , ప్రత్యక్షమయ్యారు .  అప్పుడు గౌతముడు ‘ నేను విత్తిన ధాన్యం ఒక్క జాము కాలంలో పంటకు రావాలి ‘  అని కోరుకున్నారు . బ్రహ్మ దేవుడు తథాస్తూ అని దీవించాడు . 

ఆ తర్వాత గౌతముడు అహల్యతో కూడి  'శతశృంగగిరి' కి చేరుకొని, అక్కడొక పర్ణశాల నిర్మించుకొని, ఆ వార మహాత్యముతో అతిధిలకు షడ్రసోపేతముగా భోజనాలు పెడుతూ కాలం గడపసాగారు . అహల్య పాటి అడుగుజాడలలో నడుస్తూ , ఆయన సేవలో తరిస్తూ ఉండేది . అందువలన ఆయన తపస్సు చేసుకుంటున్న ఆ ప్రదేశం నిత్యం సస్యశ్యామలంగా ఉండేది . 

ఇదిలా ఉండగా, భయంకరమైన క్షామం భూమిపైన అవతరించింది . జనాలకి తాగడానికే నీరు కరువయ్యింది. పచ్చని చేలు బీళ్లయ్యాయి. చెట్లన్నీ ఎండిపోయాయి . ఆహరం అనేది తినేసంగతి దేవుడెరుగు, చూడ్డానికే లోకం నోచుకుంటుందా అన్న పరిస్థితి . దుర్భర దారిద్య్రం . పశుపక్ష్యాదులు ఆకలితో మాడిపోయాయి .  మానవులు తినడానికి దొరక్క , మృతకళేబరాలని పీక్కుతినే దుస్థితిలో అలమటిస్తున్నారు . అటువంటి దుర్భర స్థితిలో కూడా కేవలం గౌతముని ఆశ్రమం పక్షుల కిలకిలా రావాలతో , గోమాతల పాద ధూళితో , చక్కని క్షీర ధారలతో , సస్యాలతో - సస్యశ్యామలంగా వర్ధిల్లింది. 

ఆయన అతిథి సత్కారాలగురించిన కీర్తి కూడా అప్పటికే భూమండలంలోని దశ దిశలా వ్యాపించి ఉండడం చేత జనాలు , వేలాదిగా,  లక్షలాదిగా ఆశ్రమానికి రాసాగారు . వారిలో మునులు, బ్రాహ్మణులు ఎందరో ఉన్నారు .  ఆయన వారందరినీ ఆదరించి, తన తపశ్శక్తి చేత వారిని పోషిస్తూ, కొత్త బట్టలు నిస్తూ పోషించసాగాడు . ఆ విధంగా గౌతమునికి రానురానూ యావత్ప్రపంచమే ఒక అతిథిలోకం అయ్యింది . తాపసి అయిన  గౌతమమహర్షే భిక్షాప్రదాత అయ్యారు .  ప్రపంచమంతా తన ఆతిధ్యాన్ని స్వీకరించడానికి వచ్చినా , మర్యాదకి లోపం కలగకుండా చూసుకున్న పుణ్యదంపతులు అహల్యా , గౌతములు . క్షణమైనా ఏమారకుండా అతిథి సేవల్లో తరిస్తున్నారు . వీరి కీర్తి ఇంద్ర లోకంతో పాటు , మిగిలిన అన్నిలోకాల్లోనూ మార్మ్రోగసాగింది .  

ఇదిలా ఉంటె, కైలాసంలో పార్వతీ తనయుడైన విఘ్నేశ్వరుడు తల్లికిచ్చిన వాగ్దానము ప్రకారం  ఆమెకి సవతిబాధని తగ్గించడానికి , లోకానికి ఉపకారం చేయడానికి సంకల్పించుకొని ఉపాయాన్ని ఆలోచించారు . గంగమ్మని భూమికి పంపితే, ఈ రెండూ సమకూరినట్టేనని తలపోశారు . ఈ కార్యాన్ని సాధించతగిన వాడు గౌతముడి వంటి మహనీయుడి కానీ సామాన్యులవల్లకాదని నిశ్చయించుకొని,  మాయా బ్రాహ్మణుడై గౌతమమహర్షి ఆశ్రమంలో చేరాడు . 

పార్వతీదేవి చెలికెత్తెలలో ఒకరిని పిలిచి, మాయా గోవువై గౌతముని పొలాలలో మేయమని, ఆటను ఏమాత్రం అదిలించినా మరణించమని ఆజ్ఞాపించాడు. ఆమె సరేనని , పొలంలో మేయసాగింది. పండినపైరంతా ఆవు తినేస్తే, ఇక బ్రాహ్మణ సంతర్పణ ఎలా చేయా అని ఆలోచింది, గౌతముడు ఆ ఆవుని అదిలిస్తూ, మీదికి ఒక గడ్డి పరకని వేశాడు. అంతే, బ్రహ్మాస్త్రం తగిలిన వీరునిలాగా కిందపడి చనిపోయింది ఆ ఆవు .  

మంచిపనులు తాము చేయకపోయినా , చేసినవారి కీర్తిని భరించలేని వారుకొందరుంటారు . అలా అసూయాపరులైన బ్రాహ్మణులు గౌతముని గోహత్యాపాతకుడని నిందించి, అతని చేతి భోజనం తినకూడని పరుషంగా మాట్లాడి , తమ భార్యలను కూడా తీసుకొని ఆశ్రమము విడిచి వెళ్ళిపోసాగారు . వారిని మరింతగా ప్రజ్వరిల్ల జేశాడు. అప్పటికి కూడా గౌతముడు తన అతిథి మర్యాదని కోల్పోక ఆ బ్రాహ్మణులని క్షమించమని, ఆశ్రమంలో ఉండమని పరిపరి విధాలా ప్రార్ధించాడు. దయచేసి గోహత్యా పాతకాన్ని పోగొట్టుకునే మార్గాన్ని ఉపదేశించమని అర్థించాడు . 

కొద్దిసేపు బ్రతిమాలించుకొని విఘ్నేశ్వరుడు , పరమ శివును ప్రార్ధించి, గంగని భూలోకానికి తీసుకురావడమే, ప్రాయశ్చిత్తమని పలికాడు. అక్కడినుండి బ్రాహ్మణ సమాజాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ లోగా వర్షాలు పడి  క్షామం కూడా తగ్గుముఖం పట్టింది . 

అసలు ఇందుకు కారణం ఏమిటని తన యోగశక్తితో చూసిన గౌతమునికి విఘ్నేశ్వరుడు కనిపించాడు. లోకకల్యాణం కోసం ఆయన చేసిన యోచనన కనిపించింది. దేవకార్యాన్ని సిద్ధించేందుకు పూనుకున్నాడు . వెంటనే, ఆ ముని తపోవనానికి వెళ్లి శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. ప్రసన్నుడైన శివుడు , గంగమ్మని భువికి పంపాడు . ఆ గంగ తరంగవాహినిగా వచ్చి ,గోవు చనిపోయిన చోట ప్రవహించింది .  

అలా గౌతమ మహర్షి తపము చేయుటవలన దిగివచ్చిన గంగమ్మ గౌతమి అని పేరుపొందింది . గోవుని బ్రతికించడం చేత గోదావరి అని పేరొందింది. అనవసరంగా గౌతముని నిందించిన బ్రాహ్మణులు కొందరు ఆయన శాపానికి గురై పాషాణాలై పడిఉండగా, మరికొందరు ఈ గంగమ్మలో మునిగి తమ పాపాలను తొలగించుకున్నారని పురాణాలు చెబుతున్నాయి . కాబట్టి పుణ్య చరితులు, తపోనిస్తులూ అయినా ఆ గౌతముడు , అహల్య దంపతులకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ , పరమపావని అయినా ఆ గోదారమ్మకు వందనాలర్పిస్తూ , శలవు . 

Quote of the day

God is everywhere but He is most manifest in man. So serve man as God. That is as good as worshipping God.…

__________Ramakrishna