Online Puja Services

వరాహమిహిర

3.147.89.85

మన ఋషులు గొప్ప శాస్త్రవేత్తలు . ఖగోళం గురించి , గ్రహ గమనాలగురించి , వాటిపైన నెలకొని ఉండే పరిస్థితుల గురించి ఎన్నో అపురూపమైన విశేషాలు అందించారు . అవి శాస్త్రీయమా కాదా ? అనే పరిశోధనలు ఇప్పుడు ఇంకా జరుగుతూనే ఉన్నాయి . పరిశోధన అనేది ఖచ్చితంగా పరిశోధకుడి అవగాహనా సామర్థ్యం , అతనికున్నపరిజ్ఞానం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇక మన గురించి మనం చెప్పుకోకూడదు కానీ, మనం పెరటికూరని ఖచ్చితంగా ముందుగా వినియోగించం . పాశ్చ్యత్త దేశాల పుల్లకూర బహురుచి మనకి . అందువల్ల వసిష్ఠుడు , యాజ్ఞవల్క్యుడు, వరాహమిహిరుడు మనకి శాస్త్రవేత్తల్లా కనిపించలేదు . వాళ్ళు ఋషులు . పూర్వీకులు అంతే . కానీ పాశ్చాత్యులు వీటి ప్రాశస్త్యాన్ని మనకన్నా ఎక్కువుగా ఆకళింపు  చేసుకుంటున్నారు . ఈ క్రమంలో , ఇవాళ  మనం గణితంలో , ఖగోళంలో అసామాన్య విషయాలని గురించి , చెప్పిన వరాహ మిహిరుని గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం .  

ప్రస్తుతం మనదేశం నుండి ఇస్రో, అమెరికా నుండి నాసా అంతరిక్ష వీక్షణం చేస్తూ మన విశ్వం గురించి ఎన్నో విషయాలను కనుగొంటున్నారు. అయితే భారతదేశానికి చెందిన ఉజ్జయిని దేశస్థుడు ఖగోళ, గణిత శాస్త్రజ్ఞుడు, జ్యోతిష్కుడు అయిన వరాహమిహిర దాదాపు 1500 సంవత్సరాల క్రితమే విశ్వం గురించి, మన గ్రహాల గురించి తాను ప్రకటించిన గ్రంధంలో తెలియజేయడం విశేషం . ఆయన రాసిన వాటిని గురించి తెలుసుకున్న మన శాస్త్రవేత్తలు ప్రస్తుతం షాక్ కు గురవతున్నారు. వరాహమిహిర చేసిన పరిశోధనల గురించి కాస్తంత తెలుసుకుందాం.

వరహమిహిర ఎవరు?

499 సంవత్సరంలో కపిత అనే ప్రాంతానికి దగ్గరలో గల ఉజ్జయినిలో జన్మించారు  వరాహమిహిర. ఇతని తండ్రి ఆదిత్యదాసుడు సూర్యభగవానుడికి గొప్ప భక్తుడు. వరాహమిహిరుడు ఖగోళ శాస్త్రం , గణిత శాస్త్రాలలో నిపుణుడు . సాటిలేని  జ్యోతిష్కుడు. వరాహమిహిర ‘సూర్య సిద్ధాంత’ అనేపేరుతో తన మొదటి గ్రంథాన్ని రాశారు . గొప్ప భూగర్భ శాస్త్రవేత్త, ఆయుర్వేద నిపుణులు . 

"దకార్గాళాధ్యాయం" అనే పేరుతొ ఆయన రాసిన గ్రంధంలో , భూగర్భంలోని నీటి జాడలని కనిపెట్టే విధానాల గురించి వివరించారు . నీటి జాడలు , ఖనిజ ,లవణాల లభ్యతకి సంబంధించిన ఎన్నో విషయాలు ఈ గ్రంథం మనకి తెలియజేస్తుంది . మనుష్యుని శరీరంలోని రక్త నాడులలో రక్తము ఎలా ప్రవహిస్తోందో , భూమిలోఉన్న  జల నాడులలో జల ప్రవాహములు అలా ఉన్నాయని , వాటిని గుర్తించటానికి భూమిపై నున్న చెట్లు పుట్టలు ఉపయోగ పడతాయని తన పరిశోధనలతో నిరూపించారు . 

చంద్ర, సూర్య గ్రహణాలు రాహు, కేతువులనే రాక్షసులు సూర్యుడిని మింగడం వలన సంభవించడంలేదని ,  భూమి మీద నీడ పడటం చేత చంద్ర గ్రహణం, చంద్రుని నీడ పడటం చేత సూర్య గ్రహణము కలుగుతున్నాయని మొట్టమొదట తాత్వికంగా చెప్పినవాడు వరాహమిహిరుడే. సామాన్యులకి కూడా అర్థమయ్యేలా ఉండేందుకే  పూర్వ ఋషులు ఈ విధంగా వివరించారని గొప్ప ఖగోళ సత్యానికి సంబంధించిన శాస్త్రీయ  సత్యాన్ని ఈయన వివరించారు. తోకచుక్కలు, వాని రకాలు గురించి వివరంగా తెలియజేశారు .

సూర్య సిద్ధాంతం:

సూర్య సిద్ధాంత గ్రంధంలో నక్షత్ర మండలాలు, ఇతర సౌర గ్రహాలు , వాటి స్థానాలను గురించి వరాహమిహిర తెలిపారు . ఇందులో , కాలానికి చెందిన వివరణలు అంటే,  పగలు , రాత్రి, ఏర్పడడం , సంవత్సరాల గణన , గ్రహణాలు ,  గ్రహాల గురించి పేర్కొన్నారు.  భూమి వ్యాసం, చుట్టుకొలత, చంద్రుడి రంగు ,చుట్టుకొలతలను ఈ పుస్తకంలో వరాహమిహిర తెలిపారు. సౌరవ్యవస్థలోని ప్రతి గ్రహం సూర్యునిచే సృష్టించబడింది అంటారాయన .  ఇంకా ఈ రచనలో ఆయన అంగారక గ్రహం గురించి ఎంతో వివరంగా తెలియజేయడం విశేషం . ఆయన ఆ పుస్తకంలో అంగారక గ్రహంపై నీరు , ఇనుము ఉన్నట్లు ఆ కాలంలోనే  చెప్పారు. ఈ విషయాన్ని నాసా , ఇస్రో ఈ మధ్యకాలంలో పరిశోధనలు చేశామని , మేము కనుక్కున్నామని వెల్లడి  చేశాయి. 

ఈ సూర్యసిద్ధాంతం దొంగలించబడింది:

కొన్ని ఏళ్ళ క్రితం వరాహమిహిర రాసిన సూర్యసిద్ధాంత గ్రంధం ప్రస్తుతం దొంగలించబడింది. అయితే ముందుచూపుగా కొందరు మేధావులు రికార్డ్ చేసుకోవడం వలన ముందుముందు పరిశోధనలకు ఉపయోగపడింది. ఇలా రికార్డ్ చేయబడిన ఆ గ్రంధంలోని విషయాలను చాలా భాషలలోకి అనువాదం చేయడం జరిగింది. నాసా అంగారక గ్రహంపై పరిశోధన చేస్తున్నప్పుడు, రిటైర్డ్ ఐపిఎస్ అయిన అరుణ్ ఉపాధ్యాయ్ వరాహమిహిర అంగారక గ్రహం గురించి రాసిన విషయాలను అధ్యయనం చేశారు . ఆ అధ్యయనంతో  ఆయన అంగారక గ్రహంపై ఒక పుస్తకాన్ని రాశారు.

జ్యోతిష్యశాస్త్రం:

వరాహమిహిర జ్యోతిష్యంలోనూ తనదైన ప్రతిభను కనబరిచారు. వీటిని వర్గీకరించి ,  బృహత్ జాతక, లఘు జాతక, సమస సంహిత జాతక, బృహత్ యోగయాత్ర, యోగాయాత్ర, బృహత్ వివాహ పతల్,లగ్న వారాహి, కుతూహల మంజరి, దైవాంజ వల్లభ అనే పేర్లతో ప్రకటించారు . 

వరాహమిహిర తనయుడు ప్రితుయాసస్ కూడా జ్యోతిష్య గ్రంధాన్ని రాశాడు. ఈయన ‘హోరా సర’జ్యోతిష్యంలో జాతకం గురించి చాలా గొప్పగా రాశాడు. మధ్యయుగ బెంగాలీకి చెందిన ఖానా (లీలావతి) కవయిత్రి, జ్యోతిష్యురాలును వరాహమిహిర కోడలుగా చెబుతారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారకుడు భూమి సుతుడే !! అందుకే వరాహమిహిరుల వారు అంత ఖచ్చితంగా అంగారకుడిపై నీరు మరియు లోహాల ఉనికిని చెప్పారెమో మరి !!

పురాణాలు, శ్రుతులు పుక్కిటి కథలు కాదు. పూర్వాపరాలు, తల్లిదండ్రులు, ఆ కథల్లోని పేర్లతో సహా అమితమైన విజ్ఞాన ప్రదాయకాలు . కాబట్టి మన విజ్ఞానాన్ని గౌరవిద్దాం . వీలయినంతవరకూ ఆ జ్ఞాన నిధిలోని  మణిమాణిక్యాలను మనం ఏరుకొని, భావితరాలకు  అందిద్దాం. 

Quote of the day

In the sky, there is no distinction of east and west; people create distinctions out of their own minds and then believe them to be true.…

__________Gautam Buddha