విశ్వమోహిని - యామినీ కృష్ణమూర్తి

3.230.142.168

విశ్వమోహిని - యామినీ కృష్ణమూర్తి 
-లక్ష్మీ రమణ 

 చిత్తూరు జిల్లా, మదనపల్లి. తేదీ 1940 డిసెంబర్ 20 . ఆ రోజు నిండు పున్నమి. అప్పుడో నక్షత్రం చటుక్కున జారి , భూమిమీద ప్రాణంపోసుకుంది. ఆ పాప తండ్రి  మంగరి కృష్ణమూర్తి. పున్నమి జాబీలే  నాపాప అనుకున్నారు . నాట్య వినీలాకాశంలో ఈపాప వెన్నెల పంచాలి.  అనుకున్నారు . అందుకోసం ఆమె వెంట నీడలా , ఆమె ఆశయాలకి ఊపిరిగా , తోడై నిలిచి గెలిపించారు.  ఆమె కూడా తండ్రి ఆశయాన్ని పుణికి పుచ్చుకొని నాట్యమే జీవితంగా శ్వాసించారు . ఆమె పద్మవిభూషణ్ గౌరవాన్ని అందుకున్న నాట్య విదుషీమణి యామిని కృష్ణమూర్తి . 

యామిని కృష్ణమూర్తి పేరే నాట్యానికి చిరునామా . ఒక్క భాషలో ప్రావీణ్యత సంపాయించడం ఎంతకష్టమో , ఒక నాట్య సాంప్రదాయంలో ప్రావీణ్యత పొందడం కూడా అంతే కష్టం . కానీ యామిని భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నృత్యాలలో నిష్ణాతురాలు. హేమాహేమీలైన గురువుల వద్ద శిష్యరికం చేసి వీటిని నేర్చుకున్నారామె .  అయినా వీటన్నింటినీ  కలగాపులగం చేసి, వడ్డించడం ఆమె ప్రవ్రుత్తి కాదు . ఏ నృత్యం చేస్తున్నారో , ఆ సంప్రదాయానికి , ఆ అభివ్యక్తికీ కట్టుబడి నృత్యం చేయడం ఈమె ప్రత్యేకత.  అందులో నూ ప్రత్యేకంగా  "ఇది నా ఒరవడి" అని చాటే ఒకానొక విశిష్ట బాణీని  ప్రదర్శిస్తారు యామిని.

తండ్రి దీవెన :

యామిని మదనపల్లెలో జన్మించినా , పెరిగింది తమిళనాడులోని చిదంబరంలో. అక్కడి నటరాజు దీవెనలు అందుకున్నారేమో , నాట్య విద్యను అభ్యసించారు.  ‘‘మా నాన్నగారికి నన్ను విద్వాంసురాలిని చేయాలని బలమైన కోరిక ఉండేది. నేనా అస్సలు కుదురులేని అమ్మాయిని. ఎప్పుడు చూసినా చెట్లు ఎక్కడం, గోడలు దూకడం... ఒక్క క్షణం కూడా కదలకుండా కూర్చునేదాన్ని కాదు. నాలో నాన్నగారికి ఏమి కనిపించిందో కాని, నా ఏడవ ఏటే భరతనాట్యం నేర్పించడం ప్రారంభించారు. పది సంవత్సరాల వయసు వచ్చేసరికి నాట్యంలో నైపుణ్యం సాధించాను’’ అని తన నాట్య ప్రస్థానం గురించి ఒక పత్రికా ఇంటర్వ్యూలో చెప్పుకున్నారామె .  నలుగురూ మెచ్చుకున్నప్పుడే కదా పుత్రికోత్సాహము తల్లిదండ్రులకి . ఆమె లక్ష్యసాధనలో ఆయన వెలుగు దివిటీలా నిలిచారు.  అందుకోసం రెండు ఇళ్లు, కొంత పొలం కూడా అమ్మేశారు. అనుక్షణం వెంటుండి ముందుకు నడిపించారు . 
 

నాట్యాచార్యులు :

మొదట చెన్నైలోని రుక్మిణీ అరండేళ్‌ కళాక్షేత్రానికి చిన్నారి యామినిని తీసుకువెళ్లారు ఆమె తండ్రి . యామిని నాట్యానికి ముగ్ధులయిన రుక్మిణీ అరండేళ్, ఆమెకు తన దగ్గరే నాట్య శిక్షణ ప్రాంభించారు. అలా ఆమె రుక్మిణి గారిదగ్గర భరతనాట్యం లో అడుగుపెట్టారు. ఆతర్వాత  కాంచీపురం ఎల్లప్ప పిళ్ళై, చొక్కలింగం పిళ్లై, బాలసరస్వతి, తంజావూర్ కిట్టప్ప, దండాయుధపాణి, మైలాపూర్ గౌరి అమ్మ మొదలైన దిగ్గజ భరతనాట్య గురువుల వద్ద అభ్యాసం కొనసాగింది  . 

భరతనాట్యం నేర్చుకునే సందర్భంలోనే, నాటకీయతకి అవకాశం ఉన్న కూచిపూడి నాట్యం వైపు యామిని మనసు మళ్లింది. దీంతో  వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, చింతా కృష్ణమూర్తి, పసుమర్తి వేణుగోపాల కృష్ణశర్మ వంటి వారి దగ్గర కూచిపూడి నడకలు నేర్చుకున్నారు . ఆ తర్వాత కూచిపూడి వైభవానికి ఆమె ఎంతో పాటుపడ్డారు. 

తర్వాత ప్రముఖ ఒడిస్సీ ఆచార్యులు పంకజ చరణ్‌దాస్, కేలూచరణ్‌ మహాపాత్రల  దగ్గర ఒడిస్సీ నృత్యం అభ్యసించారు.  ‘‘నేను మూడు గంటల పాటు చేసే నా నాట్యప్రదర్శనలో కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ ఇలా ఒక్కోటి ఒక గంట సేపు ప్రదర్శించేదాన్ని” అని చెప్తారామె .అలా తానూ నేర్చుకున్న ఆ అద్భుత కళ కి సమన్యాయం చేశారేమో !  

నృత్యరీతులు అధ్యయనముతో పాటు , సంగీత సాగర మథనం కూడా చేశారు యామిని . ఎం.డి.రామనాథన్ దగ్గర కర్ణాటక సంగీతం, కల్పక్కం స్వామినాథన్ దగ్గర వీణ నేర్చుకున్నారు . 

 తన తొలి నాట్య ప్రదర్శనను 17వ యేట చెన్నైలో 1957వ సంవత్సరంలో ఇచ్చారు . ఆమెకి  20సంవత్సరాల వయసు వచ్చే సమయానికి ఈమె ఒక ప్రతిభావంతురాలైన నర్తకిగా గుర్తింపు పొందారు . 

దేవాలయ కుడ్యాల అధ్యయనం :

యామినీ కృష్ణమూర్తి ఇల్లు, చెన్నైలోని చిదంబర నటరాజ దేవాలయానికి చాలా దగ్గరగా ఉండేది . దీంతో  దేవాలయ కుడ్యాల మీద కొలువుతీరిన శిల్పాల భంగిమలు ఆమె మీద చెరగని ముద్ర వేశాయి. ‘‘రోజూ గుడికి వెళ్లేదాన్ని. ఆ శిల్పాలు చూసి ఇంటికి వచ్చాక, అదే భంగిమలో నిలబడేదాన్ని. నేను నాట్యభంగిమలు, ముద్రలు అందంగా పెట్టడానికి ఇది ఒక కారణం అయి ఉంటుంది’’ అంటారామె . చిన్నప్పుడు ఆమె పండుగలన్నీ దేవాలయాల భూమిగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తమిళనాడులోని  ఆలయాల మండపాల్లోనే జరిగేవి .  ప్రతి పండుగ సందర్భంలో నిర్వహించే వేడుకలలో యామిని  నాట్యం తప్పనిసరిగా ఉండటమే ఇందుకు కారణం. దీంతో ఆమె నాట్యం మరింత వన్నెను సంతరించుకుంది . 

ఉన్నత నాట్య శిఖరం :

 దేవులపల్లి కృష్ణశాస్త్రి "క్షీరసాగరమధన"మనే నృత్యరూపకాన్నిఆకాశవాణి కోసం రచించారు . కాని దాన్ని కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రంలో నాట్యాచార్యుడు చింతా కృష్ణమూర్తి ప్రిన్సిపల్‌గా ఉన్న రోజుల్లో అక్కడ ప్రదర్శించ తలపెట్టి, ఈ రూపకానికి నృత్యం కూర్చవలసిందిగా ప్రఖ్యాత నర్తకుడు, నాట్యాచార్యుడు వెంపటి చినసత్యంకు అప్పగించారు . అప్పుడు ఆయన నేతృత్వంలో మొట్టమొదట ప్రదర్శించిన "క్షీరసాగరమథనం"లో యామినీ కృష్ణమూర్తి "విశ్వమోహిని" పాత్రలో, ధన్వంతరి, మహావిష్ణువు పాత్రల్లో వేదాంతం సత్యనారాయణ శర్మ నటించి ఈ ప్రదర్శనను రక్తి కట్టించారు. ఆనాటి నుండి ప్రజలు ఈమెను "విశ్వమోహిని" అని సంబోధించడం మొదలు పెట్టారు. 

తరువాత ఈమె క్షీరసాగరమథనం నృత్యనాటికను అప్పటి భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాక్రిష్ణన్ ముందు ప్రదర్శించి అతని నుండి ‘భామావేణీ’ అనే  బిరుదును అందుకున్నది.

 ఇక యామిని "భామాకలాపం"లో సత్యభామగా అవతరించే వైఖరి, "మండూక శబ్దం"లో కృష్ణదేవరాయల ప్రశస్తిని లీలగా చూపే అభినయం, భంగిమల్లోని ఠీవి, ఔచిత్యం, "సింహాసనస్థితే" శ్లోకంలో దేవిని కళ్ళకు కట్టిస్తూ పట్టే భంగిమలు, "కృష్ణశబ్దం"లో భావతీవ్రత, లాలిత్యం, వైవిధ్యం యామిని  ప్రతిభకు తార్కాణాలు. వేదాలకు కొన్ని పసందైన జతులతో యామిని  కూర్చిన నృత్యం తనలోని పాండిత్యానికి ఉదాహరణ.

యామిని కూచిపూడి నృత్యానికి సంబంధించి డీవీడీలు విడుదల చేశారు . తన నృత్యప్రస్థానాన్ని "రేణుకా ఖాండేకర్" సహకారంతో "ఎ ప్యాషన్ ఆఫ్ డాన్స్" పేరుతో పుస్తకంగా మలిచి ప్రజాబాహుళ్యానికి అందించారు . నృత్యకళ పట్ల జనసామాన్యంలో అవగాహన కలిగించడానికి అభిరుచి పెంచడానికి సుమారు మూడేండ్ల పాటు పరిశోధన చేసి "నృత్యమూర్తి" సీరియల్‌ను పదమూడు భాగాలుగా దూరదర్శన్ మాధ్యంగా ప్రసారం చేశారు . 

మన సంస్కృతీ వైభవానికి గోపురమై నర్తనశిల్పాల ఆధారంగా, స్థలపురాణాలు, చరిత్ర జోడించి వ్యాఘ్రపాద, పతంజలి సూక్తులు, కర్ణాటక సంగీతం రుచిచూపిస్తూ ఈ సీరియల్‌లో నృత్య సర్వస్వాన్ని ఇమిడ్చి చూపించడం విశేషం .

“ఇందిరాగాంధీకి నేనంటే చాలా ఇష్టం. ఢిల్లీలో ఏ ప్రభుత్వ కార్యక్రమం ఉన్నా, ఏ పండుగ సంబరాలు ఉన్నా వెంటనే ‘యామిని ఉందా’ అని అడిగేవారు’. అని అభిమానంగా చెబుతారామె .  

అవార్డులు రివార్డులూ :

యామిని సేవలను గుర్తించిన ప్రభుత్వం 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్‌ 2016లో పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రదానం చేసింది. 2014లో మహిళా దినోత్సవం సందర్భంగా శాంభవి స్కూల్‌ ఆఫ్‌ డాన్స్‌ సంస్థ యామినికి నాట్య శాస్త్ర పురస్కారాన్ని అందించింది. 2017లో విశాఖపట్నంలో విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వారు ఈమెకు స్వర్ణకమలం బహూకరించి "నాట్య విద్యాభారతి" అనే బిరుదును ఇచ్చి సత్కరించారు. న్యూఢిల్లీలోని ఇందిరా ప్రియదర్శిని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మ్యూజిక్ అండ్ డాన్స్ అనే సంస్థకు ఈమె డైరెక్టరుగా సేవలను అందించారు. ప్రస్తుతం ఢిల్లీలోని ‘యామినీ స్కూల్‌ ఆఫ్‌ డాన్స్‌’ నాట్యాచార్యురాలిగా బోధనాంశాలలో నిమగ్నమై వున్నారు. 

చివరిగా :

“వేదాంతం రాఘవయ్య గారి ‘రైతు బిడ్డ’ సినిమా చూశాక నాకు నాట్యం నేర్పించాలనే కోరిక కలిగిందట నాన్నగారికి. అప్పటికే వెంపటి పెద సత్యం, చిన సత్యం, పసుమర్తి కృష్ణమూర్తి వీరంతా సినిమాలకి వెళ్లిపోయారు. వేదాంతం లక్ష్మీనారాయణ గారి దగ్గర నా కూచిపూడి నాట్యం ఆరంభమైంది”అంటూ చెబుతూ బందిపోట్లకోసం కోసం తానిచ్చిన నృత్య ప్రదర్శన గురించి ఒక పత్రికా ఇంటర్వ్యూ లో ఉద్వేగంగా ఇలా చెప్పారు. “ఒకప్పుడు నాట్యానికి వెళ్లడమంటే దేవాలయానికి వెళ్తున్నట్లు భావించేవారు. ఇప్పుడంతా మారిపోయింది. నేను నాట్యం కోసమే పుట్టాను. నా జీవితాన్ని నాట్యానికే అంకితం చేశాను. వివాహానికి దూరంగా ఉన్నాను. మధ్యప్రదేశ్‌లో బందిపోట్ల దగ్గర సైతం రెండు సార్లు ప్రదర్శన ఇచ్చాను. నాన్నగారు భయపడొద్దని చెప్పారు. వారు నా నాట్యం మెచ్చుకోవడమే కాదు, నన్ను బిజిలీ అన్నారు.” అని . 

నిజంగానే ఆమె ఒక బిజిలీ. నాత్యంకోసం నటరాజు పాదమై దిగివచ్చిన మెరుపుతీగ . భారతీయ నృత్యానికి మునుపటి శోభను తీసుకురావాలనే ఆమె కృషి ఫలించాలని మనసారా కోరుకుందాం . 

Quote of the day

The season of failure is the best time for sowing the seeds of success.…

__________Paramahansa Yogananda