అభినవ సత్యభామ - డాక్టర్ శోభానాయుడు

54.174.225.82

అభినవ సత్యభామ - డాక్టర్ శోభానాయుడు  
-లక్ష్మీ రమణ  

సాయంత్రం సమయం . కారుమబ్బులు కమ్మి చీకట్లు ముసురుకున్నాయి . జోరున కురుస్తున్న వాన . అరుగులు కట్టి ఉన్న ఆ పాతకాలం ఇంటిముందు , ఒక పెద్ద చెట్టు . అంతవానలో, ఆ చెట్టుకింద నిలబడి నిలువునా నీరై పోతున్నా , కదలకుండా నిలబడే ఉంది ఆ అమ్మాయి . చంపకి చారడేసి కళ్ళు . చక్కని చుక్కలాంటి పిల్ల . నింగినించి కురుస్తున్న నీరు ,  ఆ విశాలమైన కాటుక కనుల నుండీ ధారాపాతంగా కురుస్తున్న వర్షాన్ని కప్పెట్టేసింది . ఇంతలో ఇంటి గుమ్మం నుండీ ఆపిల్ల గురువుగారి భార్య తొంగిచూసింది . వెంటనే మాతృవాత్సల్యంతో తపించిపోయింది . ఆ పిల్ల అలా నిలబడడానికి కారణమైన తన భర్తకి నాలుగు మాటలు అంటిస్తూనే  , చకచకా ఆ అమ్మాయిని లోపలికి తీసుకొచ్చి , తలతుడిచి తాగడానికి వేడివేడిగా కాఫీ ఇచ్చి అమ్మలా అనురాగాన్ని కురిపించి, అనునయించింది .  ఆ గురువు ప్రఖ్యాత నాట్యాచార్యులు చినసత్యం గారు . ఆ శిష్యురాలు నాట్యకళాకారిణి శోభానాయుడు . 

చండాలిక పాత్రని అభినయించడానికి ఆ శిష్యురాలినే ఎంచుకున్నారు చినసత్యం . ఆమె చేయకపోతే, ఆ నృత్యరూపకమే వద్దనుకున్నారు . కానీ వేదికమీద నర్తించేప్పుడు , సినిమాల్లోలాగా గ్లిజరిన్ తో ఏడవడం కుదరదు కదా ! మసస్సుచేసే మ్యాజిక్కే అక్కడ నవ్వయినా, ఏడుపైనా ! శోభ గారికి ఏడుపురాలేదు . ఇంకా నేర్చుకునే వయసు . ఉదయమంతా ప్రయత్నించినా ,మనసు ఆ భావంలో లయం కాలేదు .  దాంతో, వెళ్ళిపో , నీకు నాట్యం రాదనేశారు గురువుగారు . వెళ్ళిపోయి పడుకున్నారు . 

జీవితమే నాట్యమనుకుంది తాను . అప్పుడు ఆ పాత్రలోని బాధ ఆమె అంతరంగం గ్రహించింది . ఆమె కనులలో చండాలిక రూపుకట్టి ఆడింది . మనసుని  ఆమె పాత్రలోని ఆర్ద్రం మేఘమై చుట్టేసింది . ధారాపాతమైన ఆమె కళ్ళు నిరంతరంగా కొన్ని రోజులపాటు అలా వర్షిస్తూనే ఉన్నాయని, ఆవిధంగా గురువుగారు తనకి భావాన్ని మనసుకి పట్టించుకునే కళని నేర్పించారని , తానె స్వయంగా ఎన్నో ఇంటర్వ్యూ లలో చెప్పుకున్నారు శోభానాయుడు . ఆ రోజుల్లో గురువులూ , శిష్యుల అనురాగం, ఆప్యాయత, అనుబంధం అంతగొప్పగా ఉండేవి.  

కర్పూరం వెలిగినంత సేపూ కమ్మని పరిమళాన్ని పంచుతుంది . ముద్దగా ఉన్న ఆ తెల్లని కర్పూరం, వెలిగించగానే  కరిగి నీరై , ఆవిరై చివరికి దాని పరిమళాన్ని వదిలి తాను మాయమై పోతుంది .  కళాకారులు కూడా అంతే . శుద్ధమైన కర్పూరంలాంటి కళని జీవితంగా అభ్యసించి , తమ ప్రదర్శకి ప్రజలు కొట్టే  చప్పట్లలో కరిగిపోతూ , తమ కళా పరిమళాన్నిశాశ్వతంగా ఈ లోకంలో  పదిలపరుస్తారు . అటువంటి కళా మూర్తుల్లో ఒకరు నాట్యకళాకారిణి , శ్రీమతి శోభానాయుడు . 

గానములోలీనమై,  భావములో మనసుని, మనసులో ఆంగికాన్ని లయించి,  నర్తిస్తే, అది నాట్యం .నటరాజ నీరాజనం . ఆ నీరాజనాన్ని ప్రేక్షకుల సాక్షిగా ఆ నటరాజ పాదాలకి అర్పించిన శోభానాయుడు విశాఖ జిల్లా అనకాపల్లిలో 1956 లో జన్మించారు. వెంపటి చిన సత్యం శిష్యురాలు. వెంపటి నృత్యరూపాలలో ఈమె అన్ని ప్రధాన పాత్రలనూ పోషించారు. స్వచ్చమైన నృత్యరీతి, అంకితభావం ఉన్న నాట్యకారిణిగా ఆమె అనేక పురస్కారాలను అందుకున్నారు .అంతకుమించి , నాట్యమంటే, శోభానాయుడిదే అనిపించేలా , ప్రేక్షకుల మదిలో చెరగని సంతకం చేశారు . 

ఒడిదుడుకుల ప్రయాణం - గురు శిష్యుల అనుబంధం :

పుటంపెట్టనిదే , పుత్తడికి మెరుపెక్కడిది ? శోభానాయుడు డాక్టార్ శోభానాయుడిగా, నాట్యాచారిణిగా ప్రకాశించడానికి ముందర  ఎన్నో కొలిమి దెబ్బలు తిన్నారు . అభ్యాసం ఆరంభించిన తొలినాళ్లలో  అసలు ఈ అమ్మాయి రూపురేఖలు నృత్యానికి ఏమాత్రం సరిపోవని కొంతమంది  గురువులన్నారు. ఆరంగేట్రం చేయిస్తానని మాటిచ్చి, తీరాబయలుదేరాక , ఆమెకి అవకాశం లేదని తిరస్కరించారు . ముద్రపట్టడమే రాదు పొమ్మన్నారు . కానీ ఆమెకి నృత్యంపైన ఉన్న ఇష్టం , ఆ కళని నేర్చుకోవాలన్న తపన , ఆరాటం , పట్టుదల వెంపటి చినసత్యం గారి శిష్యురాలిని చేశాయి .  ఆ రోజుల్లో ఆయనకీ నృత్యకారునిగా ఎంతటి గొప్ప పేరుండేదో , నాట్యాచార్యునిగా  ‘చండశాశనుడని’ అంతటి పేరుండేది . అది తల్లికి తన పిల్లాడిని ముద్దుచేస్తే చెడిపోతాడనే ప్రేమతో కూడిన కాఠిన్యం ఉంటుంది కదా ! అటువంటి శిష్యవాత్సల్యమే ఆయనదీ ! 

ఆ వాత్సల్యమే ఆమెను కూచిపూడి నాట్యకళలో ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేసింది . ఇక్కడ ఆవిడే స్వయంగా చెప్పిన ఒక సందర్భం ఉటంకించాలి అనిపిస్తుంది . ఆ రోజుల్లో పొంగు  (చికెన్ పాక్స్ ) వచ్చిందంటే, చాలా భయం . ఎవ్వరూ ముట్టుకునే వారేకాదు .  ఒక ప్రదర్శనకి వెళుతుంటే, రైల్లో ఆవిడకి ముఖమంతా బొబ్బలు బొబ్బలుగా పొంగు వచ్చేసింది . వళ్లంతా జ్వరంతో కాలిపోతోంది . గురువుగారు తోడుగా ఉన్నారు . ఆయన , శోభగారిని చూసి ఖంగారు పడిపోతున్నారు . 

ప్రదర్శన ఆపేందుకు వీలులేని పరిస్థితి . టిక్కెట్లు అమ్ముడయ్యాయి . ఎక్కడెక్కడి నుండో అభిమానులు తరలి వస్తున్నారు .చినసత్యంగారు స్పాన్సర్లని పిలిపించి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు . కాన్సిల్ చేయమని చెబుతూ  “ ఈ ప్రదర్శన ఆపేయండి . ఆ పిల్ల ఎలా చేయగలదు . కనీసం ముఖానికి కూడా రంగువేసుకొనే పరిస్థితిలో లేదామె” అని చ్ఛివరకి అభ్యర్ధించారు  . ప్రదర్శకులు అలా కుదరదని వాదిస్తున్నారాయనతో . 

గురువుగారు అభ్యర్ధించడం విన్నారు శోభగారు . అది ఆవిడకి నచ్చలేదు . ‘ఫర్వాలేదు నేను చేస్తాను’ అన్నారు . ఆరోజు  మేకప్ వేసే ఆర్టిస్ట్ ఆమెని ముట్టుకోవడానికే భయపడ్డాడు . ఆమె తనకి తోచినట్టు అలంకరించుకున్నారు . అద్భుతమైన తన నాట్యంతో ప్రేక్షకులని రసజగత్తులో ఓలలాడించారు . ప్రదర్శన అయిపోయాక , స్టేజీ దిగుతూ ఒళ్ళుతెలీని పరిస్థితిలో కిందపడిపోయారు . అప్పుడు చినసత్యంగారు ‘ఇవాళ నువ్వు నాకు కళాకారిణివిగా కనిపించావమ్మా’ అన్నారు . నా జీవితంలో గురువుగారి నోట విన్న అభినందన ఇదే ! అంటారు ఆ శిష్యురాలు . అంతటి అనుబంధం వారిద్దరిదీ ! 

నాట్యవిలాసం  :

శోభానాయుడు పేరు చెప్పగానే , జడపట్టుకొని రంగప్రవేశంచేసే సత్యభామ చటుక్కున మదిలో మెదుల్తుంది . కానీ మొదట ఆమె భామాకలాపంలో రుక్మిణిగా పాత్రపోషించారట . ఒక ప్రముఖ పేపరువారు ‘ఆ రుక్మిణి , సత్యభామయితే, ఆ తీరే వేరుగా ఉండేది’ అని రాశారట. దాంతో  ఆతర్వాత నుండీ శోభానాయుడు  ‘భామనే… సత్యభామనే..’ అంటూ సిద్ధేంద్ర యోగి తీర్చిదిద్దిన సత్యభామగా మారిపోయారు . అలా వేదికపై శోభానాయుడు చేసిన కూచిపూడి  అభినయం ఆమెకు ‘కలియుగ సత్యభామ’గా పేరు తెచ్చిపెట్టింది. తనకి సత్యభామ పాత్రలో ఉండే ‘శకునాలు’ ఘట్టాన్ని అభినయయించడం చాలా ఇస్టమని , అమాయకత్వం , గడుసుదనం , సౌదర్యం మూర్తీభవించిన సత్యభామ పాత్రలో తానూ లీనమై పోతానని ఆమె చెప్పేవారు .  

ఆమె సత్యభామగానేకాక , పద్మావతిగా, చండాలికగా ఇలా వేసిన ఏ పాత్రలోనైనా లీనమైపోయేవారు . నవరస నృత్యాభినయానికి మారుపేరుగా నిలిచిపోయారు. లయబద్ధంగా చురుకుగా కదిలే శోభానాయుడు పాదాలు, శిల్ప సదృశ దేహ భంగిమలు, ముఖంలో ప్రతిబింబించే భావాలు, నేత్రాభినయం, కనురెప్పల కదలికలు, కనుబొమ్మల ముచ్చట్లు, హస్త ముద్రలు ప్రేక్షకులను తన్మయత్వంలో ముంచెత్తేవి.

నాట్యాచారిణిగా ఆమె  80వైయక్తిక ప్రదర్శనలకు, 15నృత్య రూపకాలకు ఆమె రూపకల్పన చేశారు. ఈ క్రమంలో సాయిబాబా చరిత్రని , వివేకానందుడి చరితకీ కూచిపూడి గజ్జె తొడగడం ఆమెకే చెల్లిందేమో !  దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు అమెరికా, ఇంగ్లాండు, సిరియా, టర్కీ, హాంకాంగ్, బాగ్దాద్, కంపూచియా, బ్యాంకాక్, వెస్టిండీస్, మెక్సికో, వెనిజులా, ట్యునీషియా, క్యూబా, పశ్చిమాసియా తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలిచ్చి, కూచిపూడి కళకు ప్రాచుర్యం కల్పించారు. దేశం ప్రతినిధులుగా వివిధ దేశాల్లో పర్యటించిన భారతీయ కళాకారుల బృందానికి ఆమె నాయకత్వం వహించారు. ‘తానా’ ఆధ్వర్యంలో  అమెరికాలోని పలు ప్రాంతాల్లో నృత్య ప్రదర్శనలు చేశారు.

చలనచిత్రాలు - అవకాశాలు :

శ్రీమతో శోభానాయుడు చాలా మృదువైన వ్యక్తితంతో ఉండేవారు . అదే సమయంలో పట్టుదలని , తన విశ్వాసాల్ని , భావాన్ని బలంగా చూపించేవారు .  ఎన్నో నృత్య ప్రధానమైన చిత్ర్రాలలో ఆమెకి వెండితెర అవకాశాలు లభించాయి .  ఎందరో దిగ్గజాలు ఆమె ఇంటికి వచ్చి తమ చిత్రాల్లో నటించమని , కుదరకపోతే, నృత్య దర్శకత్వం వహించమని కోరారు . కానీ ఆమె అంగీకరించలేదు . ఇరుకైన చట్రంలో తన కూచిపూడి కళని ఇరికించాలని అనుకోలేదు . కమర్షియల్ హంగులతో స్వచ్ఛమైన కళని కలుషితం చేయదలుచుకోలేదు .  కూచిపూడి సంప్రదాయ నాట్యాన్ని స్వచ్ఛంగా , స్వేచ్ఛగా ఉండనిచ్చారు . అభ్యసించారు . ప్రదర్శించారు , ప్రయోగాలు చేశారు .  భారతీయ కీర్తి పతాకాన్ని వినువీధుల్లో రెపరెపలాడించారు . 

తెలుగులో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సిరిసిరి మువ్వ’ను హిందీలో ‘సర్గం’ పేరుతో పునర్మిర్మించే సందర్భంలో ఆ సినిమాలో నటించేందుకు ఆమెకు అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమాతో పాటు పలు ఇతర సినిమాల్లోనూ నటించేందుకు వచ్చిన అవకాశాలను శోభానాయుడు వదులుకున్నారు. కూచిపూడి నాట్యం తనకు మొదటి ప్రాధాన్యత కావడం ఇందుకు ఒక కారణమైతే ప్రఖ్యాత నాట్య కళాకారిణి రుక్మిణీ దేవి అరండేల్ కు ఇచిన మాట ఒక కారణం. శోభానాయుడు లోని ప్రతిభను అరంగేట్రం నాడే గుర్తించిన రుక్మిణీదేవి సినిమాల్లోకి వెళ్ళనన్న హామీని శోభానాయుడు నుండి పొందారు.  

కూచిపూడే  జీవితం :

శోభానాయుడు తన జీవితాన్ని పూర్తిగా కూచిపూడి నృత్యానికే అంకితం చేశారు. నేతి శ్రీరామశర్మ దగ్గర కర్ణాటక సంగీతం అభ్యసించినా, పూర్తిదృష్టి కూచిపూడి నృత్యంపైనే పెట్టారు. నాట్యంలో ఆమె నైపుణ్యానికి ఆశ్చర్య భరితులైన  ప్రముఖ భరతనాట్య గురువు వళ్లువూర్ బాగ్యతమ్మాళ్ రామయ్య పిళ్ళై ఆమెకు ఉచితంగా భరతనాట్యం నేర్పుతానన్నారు. పిళ్ళై అన్నా, భరతనాట్యమన్నా తనకు అభిమానమేనని, అయితే కూచిపూడి నేర్చుకునేందుకు తన జీవితకాలం సరిపోదని సున్నితంగా ఆ ప్రతిపాదనను తిరస్కరించారు శోభానాయుడు.  

అవార్డులు -రివార్డులు :

వెంపటి చినసత్యం ముఖ్య శిష్యురాలిగా కూచిపూడి నృత్యంలో శిఖరారోహణ చేశారు శోభానాయుడు. నృత్య రంగంలో విశిష్ట సేవలందించినందుకు కేంద్రప్రభుత్వం 2001లో ఆమెను ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని 1991లో శోభానాయుడు పొందారు. చెన్నై లోని కృష్ణ గాన సభ 1982లో ఆమెను ‘నృత్య చూడామణి’ బిరుదుతో సన్మానించింది. 1996లో నృత్య కళా శిరోమణి పురస్కారాన్ని, 1998లో ఎన్టీరామారావు అవార్డును, 2001లో తంగిరాల కృష్ణ ప్రసాద్ స్మారక పురస్కారాన్ని పొందారు. ఇవే కాకుండా పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను, సత్కారాలను, ఎన్నో బిరుదులను ఆమె పొందారు.

హైదరాబాదులో అకాడమీ :

ఆమె ప్రాణం నృత్యమైతే, జీవితం ఈ అకాడమీ . శోభానాయుడు హైదరాబాదులో కూచిపూడి డ్యాన్స్ అకాడమీని నెలకొల్పారు. అకాడమీ ప్రిన్సిపాల్ గా పనిచేశారు. కూచిపూడి అభ్యసనం తల్లిదండ్రులకు భారం కాకూడదన్న సదుద్దేశ్యంతో అతి తక్కువ ఫీజుతో అకాడమీలో కూచిపూడి నేర్పించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు రెండువేల మందికి కూచిపూడి నృత్యాన్ని బోధించారు.ఆమె శిష్యులు ఎందరెందరో విదేశాల్లో స్థిరపడ్డారు . భారతీయ కళా గొప్పదనాన్ని విశ్వయవనికపైన చిరుమువ్వలతో రచిస్తున్నారు . ఇంతకన్నా వారి గురువుకి ఏ విలువైన దక్షిణ ఇచ్చుకోగలరు ?  
  

నిర్యాణం :

నటరాజపాదాన నటియించి, నయనాభిషేకాలు కురిపించి కూచిపూడి కళకు విశేష ప్రాచుర్యం తెచ్చిన శోభానాయుడు 2020 అక్టోబరు 14వ తేదీన కన్ను మూశారు. ‘కూచిపూడి నృత్యం ద్వారా పొందే ఆత్మ సంతృప్తి, మానసిక ప్రశాంతత, వైద్యపరమైన ప్రయోజనాలను కీర్తి, కాసులతో ముడి పెట్టలేమ’ని పేర్కొన్న శోభానాయుడు అందేల రవళి,  ఎన్నటికీ ఆమె అభిమానుల గుండెల్లో శాశ్వతంగా రవళిస్తూనే ఉంటుంది .

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya