Online Puja Services

అభినయ దీపిక- బళ్ళారి రాఘవ

18.219.224.103

అభినయ దీపిక- బళ్ళారి రాఘవ 
-లక్ష్మీ రమణ 
 
సినిమా నేటి ప్రధాన వినోద సాధనం . సినిమా ఇంకా పుట్టని రోజుల్లో...  నాటకం ఆ లోటును తీర్చేది . సినిమా కి నాటకమే తల్లి !రంగస్థల వేదికపై రీ - టేక్ లకి చోటుండదు. అంతా లైవ్ షో నే !అయినప్పటికీ .. ఆ నాటి నటులు తడబాటు లేకుండా ,తత్తర పడకుండా , తమ నటనా చాతుర్యం తో ప్రేక్షకులను కట్టి పడేసేవారు. వాక్ఫటిమ తో అబ్బురపరిచే వారు . ఆ వేదికలపై వన్స్ మోర్ లకి మాత్రమే చోటుండేది . అలాంటి అభినయ దీపికల్లో బళ్ళారి రాఘవ ఒకరు .
 
 బళ్ళారి రాఘవ జననం తెలుగు నాటకరంగ జననం ఒక్కటే కావడం ముహూర్త బలమో, యాదృశ్చికమొ .. గానీ , 1880 వ సంవత్సరం ఆగస్ట్ 2 వ తేదీన అనంతపురం జిల్లా , తాడిపత్రి లో  రాఘవ జన్మించారు . శ్రీ నరసింహాచారి, శ్రీమతి శేషమ్మ దంపతులు ఆయన తల్లిదండ్రులు.బళ్ళారి రాఘవ అసలు పేరు బసప్ప .సంప్రదాయమైన వైష్ణవ కుటుంబంలో పుట్టడం వల్ల ఆయన పేరును తాడిపత్రి రాఘవాచార్యులుగా మార్చారు . కానీ , చివరికి కళా పిపాసులు, రసజ్ఞ్యులైన ప్రేక్షకుల మదిలో మాత్రం ఆయన బళ్ళారి రాఘవగానే చిర స్థాయిగా నిలిచి పోయారు. రాఘవ జననాంతరం వారి కుటుంబం బళ్ళారిలో స్థిరపడింది . అక్కడే రాఘవ ప్రాధమిక విద్యని అభ్యసించారు . ప్రాధమిక విద్యతో పాటు నాటకరంగ ప్రవేశము చేశారు . 
 
రాఘవ మేనమామ , ఆంద్ర నాటక పితామహులుగా పేరుగాంచిన ధర్మవరం రామకృష్ణాచార్యులు. మేనత్త పోలిక మేనమామ చాలిక వచ్చితీరుతాయంటారు కదా పెద్దలు .బహుశా అందుకేనేమో రాఘవకి నాటకాలంటే అంత  మక్కువ పెరిగింది . మేనమామ నాటక పితామహుడు కావడం వల్ల రంగస్థల వాతావరణం చిన్ననాటినుండే అలవాటయ్యింది రాఘవకు . ఆరోజుల్లోనే బళ్ళారిలో మేనమామకు జూనియర్ గా ఉంటూ .. నాటకాల్లో పాత్రలు ధరించేవారు . మామ ధర్మవరం రామకృష్ణాచార్యులు గారి  'సరస వినోదిని సభ ', ఆంధ్ర చారిత్రిక నాటక పితామహులు గా పేరొందిన కోలాచలం శ్రీనివాసరావు గారి సుమనోరమ సభ నాటకాల్లో రాఘవ అభినయించేవారు . ఇవే కాకుండా .. బళ్లారిలో షేక్ స్పియర్ క్లబ్ ని స్థాపించి దాని ద్వారా  షేక్ స్పియర్ నాటకాలను ప్రదర్శించేవారాయన. అలా రంగస్థల ప్రదర్శనలిస్తునే ..ప్రాధమిక విద్యని పూర్తి చేసుకొన్నారు రాఘవ . 
 
  ప్రాధమిక విద్యని పూర్తి చేసుకొన్న  రాఘవ - బళ్ళారి నుండి మద్రాసుకు పయనమయ్యారు .  మద్రాసు లోని క్రిస్టిన్ కళాశాలలో  న్యాయశాస్త్ర విద్యలో చేరారు .  అయినా ఆయన కళా రంగాన్ని , రంగస్థలాన్ని వీడలేదు . కళాశాల రంగస్థలం పై ఎన్నో ఆంగ్ల నాటకాలను ప్రదర్శించి భళా అనిపించుకొన్నారు . 
 
ఒక పక్క న్యాయశాస్త్ర విద్య ని అభ్యసిస్తూనే.. సుప్రసిద్ధ ఆంగ్ల నాటకాలలోని షైలాక్, హామ్లెట్ , ఒథెల్లో వంటి సుప్రసిద్ధ పాత్రలు పోషించి మెప్పించేవారు రాఘవ . కళాశాలలో నాటకాలు వేస్తూ ... విద్యని అలక్ష్యం చేయలేదాయన  . అనతికాలంలోనే న్యాయశాస్త్ర విద్యలో పట్టా పుచ్చుకొని , న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు .  కొద్ది కాలంలోనే క్రిమినల్ కేసులు వాదించడంలో దిట్ట గా పేరు గణించారు.  అప్పటికింకా భారత దేశం బ్రిటిష్ పాలనకిందే ఉంది . బ్రిటిష్ ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రొసిక్యుటర్ గా నియమించబడ్డారు రాఘవ .అంతే కాదు బ్రిటిష్ పాలకులచే 'రావు బహద్దూర్ ' అనే బిరుదుని కుడా అందుకొన్నారు .తాను నమ్మిన సిద్ధంతానికి కట్టుబడి న్యాయవాదిగా ఎంతో సంపదని ఆర్జించారు .  అలా ప్రఖ్యాతనొందిన  క్రిమినల్ న్యాయవాది గా లక్షలు సంపాదించి నప్పటికీ ... నాటక రంగం పై మక్కువ తీరలేదు రాఘవకు . ఆ మక్కువ తోనే యెంత గా సంపాదించారో నాటక రంగం కోసం అంతగా విరాలిచ్చారు. రంగస్థల ఉన్నతికి ధారాళంగా ఖర్చు చేసి వితరణ శీలి అనిపించుకొన్నారు . ఒక వైపు న్యాయవాద వృత్తిలో రాణిస్తూనే ... రంగస్థలం పై మెరుపులు మెరిపించారు. రంగస్థలంపై హావభావాలు ప్రకటించడం లోను , డైలాగులు చెప్పడం లోను అసమానుడనిపించుకొన్నాడు బళ్ళారి రాఘవ.  విదూషక పాత్రైనా , మహారాజ పాత్రైనా .. అవలీలగా పోషించగలగడం ఆయన  ప్రత్యేకత .
 
 రాఘవకు రంగస్థలమే దేవాలయం . నటనే దైవం. రాఘవ వేదికపై నటిస్తుండగా చూడగలగడం ఒక అద్భుతమైన అనుభుతని కళా ప్రియులు భావించేవారు .  తెలుగు , హిందీ , కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో నటించి నాటకరంగానికే తలమానికంగా నిలిచారు రాఘవ. బళ్ళారి రాఘవ అద్భుతమైన నటుడే కాదు , మంచి సమయస్పూర్తి వున్నా నటుడు కుడా !  
 
 బళ్ళారి రాఘవకు హరిశ్చంద్ర , పాదుకా పట్టాభిషేకం, సావిత్రి , బృహన్నల ,  రామరాజు చరిత్ర, రామదాసు, తప్పెవరిది, సరిపడని సంగతులు .. మొదలైన నాటకాలు  బాగా పేరు తెచ్చిపెట్టాయి . నాటకరంగం లో సాటిలేని మేటి నటుడని ఘనకీర్తిని తెచ్చాయి . రావణాసురుడు , హిరణ్య కశ్యపుడు , దుర్యోధనుడు వంటి ప్రతినాయకుడి పాత్రల్లోనూ ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారు బళ్ళారి రాఘవ . ఒకసారి రాఘవ సావిత్రి నాటకం లో యముడి పాత్రలో నటిస్తున్నారు .  అది అర్థరాత్రి సమయం . సావిత్రి పతిభిక్ష పెట్టమని వేడుకొంటోంది. రాఘవకు నిద్ర ముంచుకొస్తోంది .రంగస్థలం పైన అలా నటనలోనే కళ్ళు మూతలు పడ్డాయి రాఘవకు . ఇంతలో ... "యముడు నిద్ర పోతున్నాడు రోయ్  "అంటూ కేకలు , ఈలలు ! వెంటనే తేరుకొన్న రాఘవ "ఏమీ ఈ సావిత్రి పాతివ్రత్య మహిమ ! యమ ధర్మరాజు నైన నాకే నిద్దుర తెప్పించుచున్నది " అని సమయస్పూర్తితో సవరించి అందరినీ ఆశ్చర్యపరచారట .ఇలాంటి  సంఘటనలు రాఘవ నటనా జీవితంలో కోకొల్లలు !!ఐతే , రాఘవకు పౌరాణికాలకంటే కూడా , సాంఘిక , చారిత్రిక నాటకాలంటేనే మక్కువ ఎక్కువ గా వుండేది . పౌరాణిక నాటకాలలో తారస్థాయిని చేరుకొన్న పద్యాల వినియోగం తెలుగు నాటకాల్లో కాస్త తగ్గాలని , సహజనటనకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని రాఘవ అభిప్రాయం. సమాజ చైతన్యానికి, సాంఘిక ప్రయోజనాలకు నాటకాలు ఉపయోగపడాలని ఆయన చెప్పేవారు .
 
భారత రంగస్థల కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఘనుడుళ్ళారి రాఘవ .పాత్రల మనస్తత్వాలను బాగా అర్థం చేసుకొని, భావ సంఘర్షణను ప్రతిబింబిస్తూ నటనకు వెలుగుబాటలు వేసిన మహా నటుడు. రంగస్థలం పై బారెడు రాగాలు, తబలామోతలు లేకుండా భావ ప్రధానమైన అభినయంతో ప్రేక్షకులను రంజింపజేసే వారు .  మహాత్మా గాంధీ, రవీంద్రనాధ టాగూరు, జార్జి బెర్నార్డ్ షా వంటివారు రాఘవ నాటకాలను, నటనను ఎంతగానో ప్రశంసించారు. విదేశీ వేదికలపైన భారతీయుడి నటనా వైదుష్యాన్ని ప్రదర్శించి భారతీయ షేక్ స్పియర్ అనిపిలిపించుకొన్నారు బళ్ళారి రాఘవ .
 
బళ్ళారి రాఘవ రంగస్థలం పై నటిస్తుంటే ... నవరసాలు ఒకదానివెంట ఒకటి జీవంపోసుకు వస్తున్నట్లుండేది . ఒకసారాయన  విజయనగర పతనం అనే నాటకాన్ని బెంగళూరులో ప్రదర్శించారు . ఆ నాటకంలో పఠాన్ రుస్తుం గా నటించారు రాఘవ . ఆ అభినయానికి పులకించిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ , రాఘవుడి భుజం తట్టి ప్రశంసించారు. మరోసారి బెంగళూర్ లోనే రాఘవ తన   ఆధ్యాత్మిక గురువు తారానాధ్ రచించిన "దీనబంధు కబీర్ " హిందీ నాటకాన్ని ప్రదర్శిస్తున్నాడు. అప్పుడు మహాత్మా గాంధీ సమీపంలోని గాంధిజీ నందిహిల్స్ లో విశ్రాంతి తీసుకొంటున్నారు.ఆ నాటకానికి గాంధీజీ ని  ఆహ్వానించారు.కొద్దిసేపు మాత్రం చూసి వెళ్ళిపోతా నంటూ ... బాపు ఆ నాటకానికి హాజరయారు . రంగస్థలం పై రాఘవ తన పాత్రలో లీనమై, జీవిస్తున్నాడు, నవరసాల సేద్యం చేస్తున్నాడు . కొద్దిసేపు మాత్రం నాటకాన్నిచుసి వేల్లిపోదామనకున్న గాంధీజీ రాఘవ అభినయానికి కట్టుబడిపోయారు . కొద్దిసేపయ్యాక ,గాంధి జీ కార్యదర్శిగా వున్నా రాజాజీ "బాపూ ! ప్రార్ధనకి వేళయ్యింది ! ఇక వెళ్దామా !" అని గుర్తుచేశారు . అప్పుడు గాంధీజీ ... "ఇప్పుడు మనం ప్రార్ధన లోనే ఉన్నాం " అని సమాధానమిచ్చి, నాటకం పూర్తయ్యే వరకు చూశారు. ప్రదర్సన ముగిసాక  "జై రాఘవ " అని నినదించి బాపూజీ రాఘవని ప్రశంసించారు .
 
  బళ్ళారి రాఘవ నటనా చతురుడే కాదు. మంచి వక్త కూడా !అనేక దేశాలలో పర్యటించి, విదేశీ వేదికలపై భారతీయుడి గళాన్ని వినిపించారు . ఆయన  శ్రీలంక, ఇంగ్లాండు, ఫ్రాన్సు, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి దేశాలు పర్యటించి భారతీయ నాటకాలు, కళలగురించి అనేక ఉపన్యాసాలు, సెమినార్లు ఇచ్చారు . 1927లో ఇంగ్లాండులో లారెన్స్ ఆలివర్, ఛార్లెస్ లాటన్ ‌ప్రభృతులతో కలిసి నాటక  ప్రదర్శనలిచ్చారు. లండన్ లో ప్రముఖ నాటక రచయిత, విమర్శకుడు జార్జ్ బెర్నార్డ్ షా తో నాటక కళని గురించి చర్చలు జరిపారు . ఆయన కోరిక మేరకు షైలాన్ గా అభినయించి ఆయన అభిమానాన్ని సంపాదించు కొన్నారు .  "రాఘవా ! మీరు ఇంగ్లాండ్లో పుట్టి వుంటే ... షేక్ స్పియర్ కంటే గొప్పవాళ్ళయ్యేవారని" జార్జ్ బెర్నార్డ్ షా రాఘవ ని ప్రశంసించారు .
 
  అటు తర్వాత రాఘవ మిత్రుల బలవంతం తో చిత్రసీమలో అడుగుపెట్టారు . ఐతే సహజ స్వతంత్ర నటుడైన రాఘవకు సినిమా రంగం నచ్చలేదు . దాంతో అతి కొద్ది సినిమాలలో మాత్రమే నటించారు . 1936 లో H . M . రెడ్డి గారి "ద్రౌపతి మాన సంరక్షణం " లో దుర్యోధనుడిగా నటించారు. ఆ సినిమా అంతగా రక్తి కట్టలేదు . ఆ తర్వాత గూడవల్లి రామబ్రహ్మమం గారి' రైతు బిడ్డ' , రాజ రాజేశ్వరి వారి 'చంద్రిక ' సినిమాల్లో రాఘవ నటించారు .
 
 బళ్ళారి రాఘవ కవి బాంధవుడు , సంఘసంస్కర్త కూడా ! హరిజనోధరణకు ఆయన కృషి చేశారు. రంగస్థలం పై స్త్రీ పాత్రలను స్త్రీలే ధరించాలని ప్రతిపాదించి , ఆ దిశగా మహిళలకు ప్రోత్సాహమందించారు.
 
రాఘవ తన ఇంట్లో ప్రతి రోజు సాయంత్రం కవిపండితుల గోష్టి ని ఏర్పాటు చేసే వారు . ఈ సమావేశాల్లో నాటకాల గురించి విస్తృతంగా చర్చించే వారు రాఘవ . కులమతాలకతీతంగా ... ఉదాత్తమైన దృష్టి గలిగిన ఆయన హరిజనుల కోసం 'ముద్దు దార ' అనే పాఠశాలని తన సొంత ఖర్చులతో నిర్వహించేవారు . ఇక పండుగ రోజుల్లో తనింట్లో హరిజన బాలలకు విందు భోజనం ఏర్పాటు చేసేవారు రాఘవ . వారి ఇండ్లలో వివాహానికి ఖర్చులు కుడా ఇచ్చేవారు . రంగస్థలం పై స్త్రీల పాత్రలు వారే పోషించాలని విప్లవాత్మక ప్రతిపాదన చేసి, అందుకు ముందు గా తన భార్యని వేదిక పై నటింప చేశారు రాఘవ. స్త్రీలు గడప దాటి బయటకు రాని ఆ రోజుల్లో అది ఒక సాహసమే !!
 
  రాఘవ నాటక రంగానికి చేసిన చిరస్మరణీయమైన సేవలకు గాను ఆయనని అనేక పురస్కారాలు వరించాయి . విజయ నగరం లో ఆంద్ర , దినర్స్ విశ్వవిద్యాలయం వారు రాఘవను నాట్య కళా ప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించారు. తపాలా శాఖవారు రాఘవ పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశారు . తెలుగు ప్రజలకే కాక యావత్ భారతావనికీ గర్వకారణమైన రాఘవ శిలా విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై నెలకొల్పింది ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం .
 
  నాటక కళా రంగం లో తనంతటి వాడు లేడ ని,ఇక రాడని అనిపించుకొన్న బళ్ళారి రాఘవ 1946 ఏప్రిల్ 16 వ తేదీ న నటరాజులో లీన మయ్యారు . ఆ జ్యోతి అఖిల కళా లోకంలో  అఖండ నీరాజనాలందుకొంది . కళాకాసంలో వినీల ధ్రువ తారగా వెలుగులు చిమ్మింది . కళా ప్రియుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి పోయింది .

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha