ఆ కుంచె దివిలో మెరిసే రంగుల హరివిల్లు.

44.192.25.113

అతను భువిపై కురిసిన జానపద జల్లు. ఆ కుంచె దివిలో మెరిసే రంగుల హరివిల్లు.- (చిత్రకారులు డాక్టర్ కాపురాజయ్య )
 - లక్ష్మీ రమణ
 
  అతను భువిపై కురిసిన జానపద జల్లు. ఆ కుంచె దివిలో మెరిసే రంగుల హరివిల్లు. అతని కాన్వాస్ పల్లె సీమల సోయగానికి పుట్టినిల్లు.  ఆ చిత్రాల వెలుగులు  ఏ మెరుపుల మెలికలో తెలియదు గానీ , అంతర్జాతీయ వేదికలపై అవి అమూల్య చిత్రరాజాలు. జానపద భావాల వెల్లువలైన ఆ అపురూప చిత్ర రాజాల సృష్టి కర్త కళా ప్రవీణ డాక్టర్ కాపు రాజయ్య
 
తెలంగాణకు అచ్చమైన జానపదం చీర కడితే ... అది రాజయ్య చిత్రం. పల్లె సొబగులు పల్లకీ లో నడిచివస్తే ....  అది రాజయ్య గీతల్లోని రాజసం. పచ్చని పైరులు, చేతివృత్తులు, శ్రద్ధగా తలలూపితే ... అది రాజయ్య చిత్రించిన శ్రమైక జీవన సౌందర్యం. కుంచె పంచిన రంగుల్లోనే .. జీవన మాధుర్యాన్ని వెతుక్కొన్న కళా కారులు డాక్టర్ కాపురాజయ్య. వృత్తి రీత్యా అధ్యాపకులు. ప్రవృత్తి రీత్యా చిత్రకారులు. అతని వృత్తి ప్రవృత్తిని ప్రేమించింది. పేరెన్నిక గన్న మరెందరో చిత్రకారులకు మార్గదర్శనం చేసింది. 
 
రాజయ్య గారి  చిత్రాలు రాజులు,రాచరికాలను చూపించవు. ఆధునిక చిత్ర కళలోని గడబిడకి తావివ్వవు. అచ్చమైన సంప్రదాయాన్ని, స్వచ్చమైన మనసులని, స్వేచ్ఛగా ఉండే వాతావరణాన్నిసుందరంగా ప్రతిబింబిస్తాయి. సామాన్య జన జీవనాన్ని కళ్ళకు కడతాయి. మన పండుగలు, ఆచార వ్యవహారాలూ రాజయ్య గారి చిత్రాల్లో దర్శన మిస్తాయి. తెలంగాణాకే చెందిన మరో ప్రముఖ చిత్రకారులు, రాజయ్య గారి సహాధ్యాయి శ్రీ కొండపల్లి శేషగిరి రావు గారు ఒక సందర్భం లో ఇలా అన్నారు. "రాజయ్య పల్లెల్లోని జీవనానికి అలవాటుపడి, ఆ జీవనం లోని రస మాధుర్యాన్ని తనివితీరా గ్రోలి, తన చిత్రాలలో నింపి తెట్టెలు గట్టినాడు."  కళా హృదయులు ఈ రోజుకీ ఆయన చిత్రాల నుండీ జాలువారే ఆ మధువును గ్రోలుతూనే ఉన్నారు.
 
మోడరన్ ఆర్ట్ పేరుతో నేలవిడిచి సాము చేయడం కాపు రాజయ్య గారికి కేనాడు అలవాటులేదు. జానపద జీవనం లోని ముగ్ధ మనోహర సౌందర్యమేదో ఆ చిత్రాలలో దోబూచులాడుతుంటుంది. ఎన్నిసార్లు చూసినా... మరో సారి ఆ చిత్రాలవైపు ఆకర్షిస్తుంటుంది. అందుకే ఆ చిత్రాలకి ప్రపంచ మంతా బ్రహ్మ రథం పట్టింది.
 
రాజయ్య గారి నాయికలు అందాల అప్సరసలు కారు. మిరిమిట్లు గొలిపే వర్ణ విన్యాసం ఆయన చిత్రాల్లో గోచరించదు. పైగా ఒక సంప్రదాయ ఒరవడి ఉన్న శైలి. ఎక్కడ దాగుంది రాజయ్య చిత్రాల్లో ఆకర్షణ ? అని ప్రశ్నిస్తే ... వాటికన్నా ఎన్నో రెట్లు గొప్పవైన అంశాల గురించి రాజయ్య చిత్రాలు మాట్లాడతాయి. తరతరాలుగా గ్రామీణ జీవనం తో మమేకమైన ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతి, కళలు ఆ చిత్రాల్లో సజీవంగా సాక్షాత్కరిస్తాయి.
 
సహజత్వాన్ని నింపుకొన్న రాజయ్య  చిత్రాలు కళాహృదయాలలో సజీవంగా వుంటాయి. జానపదఆత్మని ప్రతి గీతలో ప్రతిఫలిస్తాయి. లండన్ సుప్రసిద్ధ పత్రిక "ది స్టూడియో " లో ఆయన రాసిన బోనాలు చిత్రం ప్రచురింప బడింది. దాంతో అంతర్జాతీయం గా రాజయ్య పేరు పరిచయమయ్యింది. రాజయ్య  గారు ప్రకృతిని యథా తథం గా అనుకరించ లేదు. అలాగని పూర్తిగా పట్టించుకోకుండా వదిలివేయలేదు. తనదైన శైలి లో ఆ రెంటినీ సమన్వయం చేశారు. ఆయన భావనలో చుట్టూ వున్న సమాజం లోని అంశాలు సరళంగా ప్రతిఫలించాయి. తెలంగాణా ఆత్మలో పలికిన ఈ చిత్ర సుమస్వరం ప్రపంచ విపంచి లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకొంది. 
 
ప్రపంచ చిత్రకళలో వినూత్న ధోరణులు రాజయ్య గారి మీద ప్రభావాన్ని చూపలేక పోలేదు. అయినా ఆయన మనసుపై చెరగని ముద్ర వేసిన జానపద పథం లోనే రాజయ్య ముందుకు సాగారు. సంప్రదాయ వాష్ పధ్ధతిలో చిత్ర రచన చేసిన ఆయన నకాషి నైపుణ్యం వైపు ఆకర్షితులయ్యారు. టెంపెరా రంగుల వాడకం మొదలు పెట్టారు. ప్రపంచ మంతా ... డాక్టర్ కాపు రాజయ్యని అభినవ జామినీరాయ్ గా కొనియాడింది.
 
బెంగాలీ నకాషి చిత్రకారుడు జామినీరాయ్ తో రాజయ్య చిత్రాలను పోల్చారు. కానీ ఈ ఇద్దరు నకాషి చిత్రకారుల శైలి కి మధ్య హస్తిమ శకాంతర భేదం ఉంది. జామినీరాయ్ - భావాన్ని అత్యంత క్లుప్త మైన రేఖల్లో వ్యక్త పరుస్తారు. బలమైన గీతలు, మిశ్రిత వర్ణాలతో ఒక ఆధునిక శైలిని సృస్టించిన కళాకారునిగా ప్రపంచ ప్రశంశలు అందుకొన్నారు. కాపు రాజయ్య గారు బలమైన ఉష్ణ రంగుల్ని, ప్రాథమిక రంగుల్ని ఎక్కువగా ఉపయోగించారు. తెలంగాణలోని సూటిదనానికి, స్వచ్ఛతకు ప్రతీకలుగా తన చిత్రాలను మలిచారు. అటు మాధ్యమం లో, ఇటు వస్తువులో, శైలిలో వినూత్నతను చాటారు. టెంపెరా రంగులతో కార్డుబోర్డుపై, కాగితంపై, వస్త్రాలపై గ్రామీణ జీవనాన్ని, జానపదుల గాథలను, ఆచారాలను వస్తువులుగా ఎంచుకుని అద్భుత కళాఖండాలు సృష్టించారు.
 
 చిత్రం సందేశాన్ని అందించినా అందించలేకపోయినా చూపరులను నిలబెట్టాలి. ఆకట్టుకోవాలి.వీక్షకులతో చిత్రం మాట్లాడాలి. అప్పుడే అది ఉత్త మ చిత్రంగా కాలపరీక్షకు తట్టుకుంటుందని రాజయ్య విశ్వసిస్తారు.  రామాయణ, మహాభారత, భాగవతాల నుంచి అన్వయించుకున్న అనుభూతులతోనూ ఎన్నో చిత్రాలు గీశారు. చిత్రాల్లో అంతఃసారమైన సంప్రదాయాన్ని వీడకుండా ఎన్నో తైలవర్ణ చిత్రాల్నిరచించారు. తన జీవితాన్ని ముడుపుకట్టి జానపద అధునాతన అభివ్యక్తితో చిత్రించారు. ఈ పరంపరలోనే ఆయన  సృజనాత్మక సేవను గుర్తించి కేంద్ర లలితకళా అకాడమీ ‘కడగండ్ల బ్రతుకులు’ (కల్లు గీసే దృశ్యం) చిత్రానికి జాతీయ అవార్డు ప్రకటించింది.
 
కాపు రాజయ్య భావ విన్యాసాలకు చిత్రకళా వేదికలు ప్రసంసల జల్లు కురిపించాయి. స్వర్ణ పతకాన్ని బహూకరించి తమని తాము సత్కరించుకొన్నాయి.  ఎన్నో అవార్డులు రివార్డులు వరించి వచ్చాయి. దేశ విదేశాలలో ఆయన చిత్రాలు అపూర్వ ఆదరణకు నోచుకోన్నాయి.
 
 రాజయ్య గారు బహుముఖ ప్రజ్ఞావంతులు. రసరమ్య చిత్రాలను కాన్వాసు పై ఆవిష్కరించడమే కాదు, రంగస్థలం పై నవరసాలను పండించేవారు. కలం పట్టి అక్షర సేద్యమూ  చేసేవారు.ఆరు దశాబ్దాల  కళా జీవనంలో ఆయన  చిత్రాలు జాతీయంగా అన్ని ప్రధాన ఆర్ట్ గ్యాలరీల్లోనూ ప్రదర్శింప బడ్డాయి.  అంతర్జాతీయంగా జెకోస్లోవేకి యా, హంగరీ, రుమేనియా, బల్గేరియా, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశా ల్లోని  ప్రదర్శనల్లోనూ చోటు చేసుకొన్నాయి. జేఎన్‌టీయూ గౌరవ డాక్టరేటు, కళా ప్రవీణ బిరుదుతో సత్కరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళావిభూషణ్, హంస, లలితాకళారత్న, రాజీవ్ ప్రతిభా జీవన సాఫల్య పురస్కారాలతో సత్కరించాయి.
 
1973 నుంచి 1993 వరకు 20 సంవత్సరాల పాటు కేంద్ర లలిత కళా అకాడమీ న్యూఢిల్లీ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నత పదవిలో కొనసాగారు. 1988 లో ఎన్నికై రెండు పర్యాయాలు సర్వే ఆఫ్ ఫోక్ ఆర్ట్స్ కమిటీ సభ్యునిగా వ్యవహరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం అకాడమీ పదవులతోపాటు 1996లో రాష్ట్ర ఆర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షునిగానూ పనిచేశారు. అంతర్జాతీయ ఖ్యాతి, దేశంలో ఉన్నత పురస్కారాలు అందుకొన్నా, సిద్దిపేటలో అతి సామాన్య జీవనం గడిపారు. ఆడంబరతకు ఆయన జీవనంలో స్థానం లేదు. చెరగని స్వచ్ఛమైన చిరునవ్వు తో, పలకరింపుతో రాజయ్య స్నేహ శీలిగా పేరు తెచ్చుకొన్నారు. యెంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సత్యం ఆయన ఆచరణలో చూపారు. సిద్ధి పేటలో సైకిల్ పై తిరుగుతూ అచ్చమైన పల్లె వాసనలతో జీవన యానం సాగించారు.  
 
జానపద ఆత్మను పట్టి నిలపడం రాజయ్య గారికి ఎలా సాధ్యమైంది! ఎంతో  సూక్ష్మమైన, లోతైన పరిశోధన ఆయన ఎలా చేయగలిగారు! అంటే ... ఆయన పుట్టి పెరిగిన నేపధ్యాన్ని  తెలుసుకోవాలి. ఆయన జీవన ప్రస్థానాన్ని అవలోకించాలి.
 
  గ్రామీణ జానపద సంస్కృతిని సజీవ చిత్రకళా రూపాలుగా తీర్చిదిద్దడంలో సిద్ధహస్తులైన కాపు రాజయ్య 1925 ఏప్రిల్‌ 7న సిద్ధి పేటలో జన్మించారు.  శ్రీయుతులు  రాఘవులు, భూలక్ష్మీ దంపతులు ఆయన తల్లిదండ్రులు. కళలకు నెలవైన సిద్ధి పేట లోని పారుపల్లి వీధిలో వీరి నివాసం. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం ఇలా .. అనేక గ్రామీణ వృత్తుల శ్రమైక జీవన సౌందర్యం ఆ వీధంతా పరుచుకొని ఉండేది.  సిద్ధి పేట లోని ప్రాంతీయ సంప్రదాయాలు, వ్యవసాయ విధానాలు ఇలా పచ్చని పల్లె లోని ప్రతి దృశ్యం ఆయన కుంచె కి ప్రాణం పోశాయి. అతని భావాలకు ప్రేరణగా నిలిచాయి. 1943లో స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి పెయింటింగ్‌లో  డిప్లొమా పొందారు. ఆతర్వాత ఆయనకు 1946లో డ్రాయింగ్ టీచర్‌గా సిద్దిపేట హైస్కూల్లో ఉద్యోగం వచ్చింది.
 
 జానపద నేపధ్యానికి తోడైన రాజయ్య గారి నిరంతర పరిశ్రమ ఆయనకో ప్రత్యేకమైన శైలిని సమకూర్చింది. అలా బతుకమ్మ, బోనాలు, మొహర్రం, ఎల్లమ్మజోగి, బుర్రకథ, శారదగాళ్లు వంటి తెలంగాణ కళా, వారసత్వ సంపదలను మొదటగా ప్రపంచానికి పరిచయం చేశారు రాజయ్య. జీవితంలోని ఆటుపోట్లను భారతీయ కళా చరితలో దృశ్యబద్ధం చేసిన చిత్రకారుడాయన.  ఈయన శిష్యులుగా ఎందరో ఎన్న దాగిన చిత్రకారులు నేటికీ జానపద సౌరభాలు పంచుతూనే వున్నారు. నిరంతర చిత్రకళా తవస్విగా జీవనం సాగించారు డాక్టర్ కాపు రాజయ్య. చిత్రకళా చరిత్రలో తనకంటూ ఒక పేజీని పదిల పరుచుకొన్నారు.
 
 రాజయ్య వేసిన చిత్రాలు న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్స్ పార్లమెంట్‌లో, హైదరాబాద్ సాలర్‌జంగ్ మ్యూజియంలో, న్యూఢిల్లీలోని లలిత కళా అకాడమీలో, రాష్ట్ర లలిత కళా అకాడమీ యుఎస్‌ఎస్‌ఎస్‌ఆర్‌లోని మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో, క్యూబా దేశంలోని హవానా క్యూబన్ నేషనల్ మ్యూజియంలో, తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం మ్యూజియంతోపాటు ఇంకా అనేక దేశాల్లో ప్రదర్శితమవుతున్నాయి. సిద్దిపేటలో లలిత కళా అకాడమీ స్థాపించి తద్వారా ఎంతోమంది వర్ధమాన చిత్రకారులకు శిక్షణనిచ్చారు. ఈ తరం చిత్రకారులు గౌరీ శంకర్, లక్ష్మా గౌడ్, యాసాల బాలయ్య మొదలైన వారు ఈయన శిష్యులే.
 
 జానపద కళా బ్రహ్మగా విశ్వకళా వేదిక పై నిలబెట్టిన పల్లెని  కడదాకా వీడలేదు రాజయ్య గారు. తెలంగాణా మట్టిలో పుట్టి, జానపదచిత్ర కళారాజుగా అవతరించారు కాపు రాజయ్య. జీవితాంతం ఒక నిబద్ధత, పట్టుదలతో చిత్ర రచనలో కృషి చేశారు. కళా ప్రేమికుల హృదయాల్లో చెరగని సంతకం చేశారు. 2012 ఆగస్టు 20 వ తేదిన నింగికెగసి హరివిల్లు రంగుల్లో కలిసిపోయారు.

Quote of the day

God is everywhere but He is most manifest in man. So serve man as God. That is as good as worshipping God.…

__________Ramakrishna