కాలగతిలో మార్పు అనివార్యం

100.24.115.215

కాలగతిలో మార్పు అనివార్యం 
-సేకరణ: లక్ష్మి రమణ 

సమగ్రమైన రీతిలో విశ్వదర్శనం చేస్తే,  మార్పు లేనిది ఏదీ మనకు ఈ ధరిత్రిలో కనిపించదు. ప్రతి విషయంలోనూ, ప్రతి వస్తువులోనూ, జీవనగమనంలోనూ నిత్యం ఎంతో మార్పు కనబడుతూ ఉంటుంది. ఒక దశాబ్దం క్రితం మన జీవన శైలిని, ఇప్పటి జీవన శైలితో పోల్చుకుంటేనే, మనకు ఎంతో భేదం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. నిరంతరాయంగా కదిలిపోయే కాలంతో సంభవించే మార్పులు అత్యంత సహజమైనవని మనం గ్రహించాలి. మార్పు అనేది నూతనత్వంతో ఎప్పుడూ ముడిపడే ఉంటుంది. అంటే, ఇంతకుముందు మనం చూసిన విషయం గానీ, వస్తువు కానీ మార్పులతో ద్యోతకమవుతుంది. అదే నూతనత్వం. విశ్వం ఈ నూతనత్వాన్ని వెంటనే అంగీకరిస్తుందా అంటే.. కాదు అనే సమాధానం చెప్పాల్సి వస్తుంది. అయితే, ఆ మార్పులను, చేర్పులను ఎందరో మహనీయులు తమ చేతల ద్వారా ఎంత ప్రయోజనకరమైనవో చూపించి, మిగిలిన వారికి పథనిర్దేశం చేయడం అనాదిగా జరుగుతున్న విషయమే.కాలం చలనశీలం.

కదిలేకాలం ఎవరికోసమూ ఆగదు. కాలంతో నిరవధికంగా పరుగెత్తుతూ, ఆగకుండా పరుగెత్తే కాలమనే పంచకళ్యాణి వేగాన్ని తమకు నచ్చిన విధంగా అందుకుని వలసిన కార్యాన్ని సాధించిన వినూత్న పథగాములే విజేతలు. భువికి తమదైన శైలిలో ఏదో అందించాలనే ఉత్సాహమే ఊతంగా ఉరకలేస్తూ, ఉద్వేగంతో సాగుతూ సాధించిన విజేతల విజయం, మానవాళి నుదుటిపై దిద్దిన అందమైన చరిత్ర. వారి చేతల్లోని నూతనత్వం భూతలానికి మనోహరంగా అద్దిన మహత్తు. విజేతలు కొత్తగా ఏ పనులనూ చేయరనీ, ఇంతకుముందు  అందుబాటులో ఉన్న, అందరికీ తెలిసిన విషయాలనే కొత్త దక్కోణంలో పరిశీలించి, పరిశోధించి, నూతన శైలిలో ఆవిష్కరిస్తారనీ మనకు నిత్యమూ ఎదురయ్యే అనుభవాలను చూస్తే అర్థమవుతుంది.

నూతనత్వం అన్న విషయం గుర్తుకు రాగానే, దాదాపుగా దానికి సమానార్థంగా నిలిచే సృజనాత్మకత కూడా స్ఫురణకు వస్తుంది. నూతనత్వం, సజనాత్మకతల మధ్య అవినాభావ సంబంధమే ఉంది. కొత్తవిషయాల గురించి, కొంగ్రొత్త ఆవిష్కరణల గురించి ఆలోచించే తీరే సృజనాత్మకత. సృజనాత్మకమైన ఆలోచనలను అమలుపరచే ఆచరణాత్మక విధమే నూతనత్వం.

బాహ్యమైన స్పందనల ద్వారా  మనిషిలోని సంస్కారం చేతనమవుతుంది. కానీ, అంతఃకరణలో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుని, తాను నూతన పోకడను ప్రవేశపెట్టదలచిన హృదికి కలిగేది సంకల్పం. దృఢమైన సంకల్పమే నూతనత్వానికి గట్టి పునాదిగా మనం భావించవచ్చు. మానవమేధ ఎంతో శక్తివంతమైనది. నూతన ఒరవడిని సృజించడానికి సంకల్పం మదిలో జనిస్తే, సాధించడానికి ఊతమిచ్చేది మేధస్సు.. ఆదిమానవునిలా సంచరించిన సమయంనుంచి నేటి కంప్యూటర్‌ యుగం వరకూ మానవుడు చేతనతో సాధించిన నూతన విజయాలు మస్తిష్కంలో మెరిసిన విద్యుల్లతలవంటి యోచనలేకదా..

సిసిలీరాజు ఒక స్వర్ణకిరీటాన్ని తయారుచేయించాడు. రాజుకు కిరీటానికి వాడిన బంగారంలో వెండి కల్తీ చేసినట్లు అనుమానం వచ్చింది. కిరీటాన్ని చెడకొట్టకుండా అది స్వచ్ఛమైన బంగారంతో చేయబడిందా లేకపోతే కల్తీ జరిగిందా అనే విషయాన్ని తేల్చమని ఆర్కిమెడిస్‌ను అదేశించాడు. ఆర్కిమెడిస్‌ సున్నితమైన ఈ సమస్యను ఆ కిరీటాన్ని చెడకొట్టకుండానే పరిష్కరించాడు. అక్రమాకార కిరీటాన్ని క్రమాకారానికి మార్చకుండానే దాని సాంద్రతను కనుగొన్నాడు. రాజు చెప్పిన విషయాన్ని గురించి ఆలోచిస్తూ అతను స్నానాల తొట్టెలో స్నానం చేస్తున్న సందర్భంలో తాను తొట్టెలో మునిగినప్పుడు కొంత నీరు బయటికి పోతున్నట్లు గమనించాడు. ఈ చిన్న విషయమే అతనిలో గొప్ప ఆలోచనకు దారి తీసింది. ఆ విషయం తెలిసిన వెంటనే వీధులలో ‘యురేకా!‘ అని అరుస్తూ రాజుగారికి విషయం చెప్పడానికి పరుగెత్తాడు. గ్రీకు భాషలో ‘యురేకా’ అంటే ‘నేను కనుగొన్నాను‘ అని అర్థం.

ఏ వస్తువైనా నీటిలో ముంచినప్పుడు ఆ వస్తువు తన ఘనపరిమాణానికి సమానమైన నీటిని వైదొలగిస్తుందని ఆర్కిమెడిస్‌ తెలుసుకున్నాడు. ఆ విధంగా బంగారు కిరీటాన్ని నీటిలో ముంచినపుడు అది తొలగించిన నీటి ఘనపరిమాణం ఆధారంగా కిరీటం ఘనపరిమాణాన్ని కనుగొన్నాడు. అంతే, అతని ఆనందానికి అంతే లేదు. రాజు తనకు అప్పగించిన విషయం లో దాగున్న సిద్ధాంతాన్ని కనుగొన్న అవధుల్లేని ఉత్సాహంలోనే ఆర్కిమెడిస్‌ ఆ విధంగా ప్రవర్తించాడు. తాను కనుగొన్న విషయం ఎన్నో నూతన ఆవిష్కరణలకు దారితీస్తుందని గొప్పవాడైన ఆ శాస్త్రజ్ఞునికి తెలుసు. 

రేడియోను కనుగొన్న మార్కోనీ తనలో తాను ఎంతగానో పరవశిస్తూ ఉండేవాడట. దీనికి కారణం వారి హృదయంలో నూతనత్వాన్ని జగతికి అందించినందుకు కలిగిన ఆత్మానందమే..

భారతదేశంలో అనాదికాలం నుంచీ ఎన్నో ఆవిష్కరణలు జరిగి విశ్వానికి కొత్త మార్గాలను దర్శింపజేశాయి. ఆయుర్వేదంలో కొంగ్రొత్త ఔషధాలను కనుగొన్న చరకుడు, శుశ్రుతుడూ నేటి ఆధునిక ఔషధాలెన్నిటికో మార్గం చూపారు. ఆనాడే వైద్యరంగంలో వారు చూపిన దార్శనిక ప్రతిభతో కూడిన నూతనత్వమే నేటికీ విశ్వయవనికపై వెలుగులీనడం గమనార్హం. ఖగోళ శాస్త్రంలో ఆర్యభట్టు, వరాహమిహిరుడు చూపిన నూతనత్వం నేటికీ స్మరణీయమే.. ఇక కంప్యూటర్, సెల్‌ ఫోన్‌ మనవ జీవితంలో నింపిన నూతనత్వాన్ని గురించి ఎంత విశదీకరించినా తనివి తీరదు కదా..

మానవునిగా జన్మించిన అపూర్వమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, విశ్వానికి తమ నూతన ఆలోచనా ధోరణితో, ఎన్నో రకాల ఆవిష్కరణలు చేసిన వీరి చరిత మనకు బోధించేది ఒక్కటే.. దైనందిన జీవికలో భాగంగా భుజించడం, నిద్రించడం అన్నవే కాకుండా, జగతికి ‘‘నూతనత్వాన్ని జోడించి నేను ఏం చేయగలను’’ అని ఆలోచించినప్పుడే చేతనుడు అవుతాడు మానవుడు. భూమిలో జనించిన ప్రతి మనిషీ నవీన జీవనానికి బాటలు చూపే శాస్త్రవేత్త కాకపోవచ్చు. నవ్యమైన కోణంలో ఆలోచనలు సాగితే, ఖచ్చితంగా చేతనామయమైన జగతికి తనవంతు సహకారాన్ని అందించే హితవర్తనుడవుతాడు.

Quote of the day

It is easy to talk on religion, but difficult to practice it.…

__________Ramakrishna