బల్లి శాస్త్రం

54.173.214.227

బల్లి శాస్త్రం 
-లక్ష్మీ రమణ 

బల్లిని చూసి భయపడేవాళ్లు కొందరైతే, బల్లి మీదపడితే ఏంజరుగుతుందోనని ఆందోళన పడేవాళ్ళు ఇంకొందరు . పంచాంగంలో ఉండే బల్లిశాస్త్రాన్ని సంప్రదించని వారుండరంటే అతిశయోక్తి కాదు . మీసం మీద బల్లి పడితే - అధికారాలాభమని , పైపెదవిమీద పడితే- ఖర్చు ముంచుకొస్తోందని  , కిందిపెదవిమీద పడితే లాభాలొస్తాయని  ఇలా ఎన్నో నమ్మకాలు . పంచాంగాలు వీటిని రకరకాలుగా వివరిస్తుంటాయి. మన దేశంలో బల్లిపడిందనో , బల్లి కూసిందనో శాస్త్రం చూసే అలవాటు చాలామందికి ఉంటుంది . ఈ బల్లి శాస్త్రం గురించి మరింత వివరంగా చూద్దాం . 

 బల్లి మీదపడగానే అసలు ఏంచేయాలి ?

బల్లి మీదపడితే, వెంటనే తలస్నానం చేయాలి . ఇది శాస్త్ర ప్రకారమే కాదు , సైన్స్ ప్రకారంకూడా చేయవలసిన పని . విషం నిండిన జీవికనుక, దాని ప్రభావం మనమీద పడకుండా ఈ పని చేయడం శ్రేయోదాయకం . ఆ తర్వాత దీపారాధనచేసి , దైవాన్ని ప్రార్థించడం , వీలయితే, గోమూత్రాన్ని మీద జల్లుకోవడం చేయాలంటారు పెద్దలు.  

బల్లి శకునం :

బల్లి కూస్తుంటే, వినబడట్లే ! ఎక్కడికిరా ప్రయాణం అంటారు పెద్దలు . సరే, బల్లి  మాట్లాడుతుందా ? అంటే, “దానిబాష దానికుంటుంది . అది మనకి అర్థంకాదు అంతే “ అంటారు . సమాధానం సంతృప్తికరంగా లేకపోయినా తలాడించి కూర్చోవడం మన వంతవుతుంది . 

సాయి సచ్చరిత్రలో ఒక సంఘటన ఈ బల్లుల సంభాషణ గురించి ఉంటుంది . సాయి సద్గురువాకాదా ? సందేహం ఓ భక్తుడికి . గోడమీద బల్లి టిక్కు టిక్కుమని శబ్దం చేసింది . వెంటనే సాయిని పరీక్షించడానికో కారణం దొరికిందా భక్తుడికి . “బాబా , ఆ బల్లెమంటోంది ?” అని అడిగాడు . సాయికి తెలియని అంతరంగముందా ? చిరునవ్వుతో సాయి ఇలా చెప్పారు . “ఆ బల్లి చెల్లెలు ఔరంగాబాదు నుండీ వస్తోంది . అదీ దాని సంతోషం అన్నారు .” ఔరంగాబాదునుండీ చెల్లెలు వస్తోందన్న విషయం ఆ బల్లికి ఎలా తెలిసింది ? వాటికి మనకున్నట్టుగా ఉత్తరాలురాసుకోవడం , ఫోనులు చేసుకోవడం తెలీదుగా ! సరే, ఆ విషయం బాబాకి ఎలా తెలుసు ? ఇంతలో ఒక వ్యక్తి ఔరంగాబాదునుండీ రానే వచ్చాడు. తన గుర్రానికి ఉలవలు పెట్టడం కోసం దానిమీదున్న గోతాం సంచీ దులిపాడు . అంతే , దాంట్లోనుండీ బల్లి కిందకి దూకడం, తన సహోదరిని చేరుకొని గంతులు వెయ్యడం అక్కడున్న వారందరూ చూశారు . ఈ కథ బల్లికి ముందే శకునం తెలుస్తుందని చెబుతోన్నట్టే ఉంది కదూ ! 

ఇక, బల్లి మన ఇంట్లో ఏవైపు నుండీ అరిచింది , అది ఏ వారం అనే దాన్ని బట్టి కూడా శుభాశుభ ఫలితాలుంటాయంటారు పండితోత్తములు. 

ఉదాహరణకి ఇది చూద్దాం . 
తూర్పు దిక్కున - ఆదివారంనాడు బల్లి అరిస్తే, భయం . సోమవారం అరిస్తే, ధనలాహం , మంగళవారమైతే - ఐశ్వర్య ప్రాప్తి, బుధవారం - ఆనందం , గురువారం -అశుభం , శుక్రవారం -శుభం , శనివారం - శుభవార్తా శ్రవణం అని చెబుతారు . ఇలాగే మిగిలిన దిక్కులకి కూడా వేర్వేరు ఫలితాలుంటాయి . 

ఇక , ఇంటి యజమాని ఇల్లుకట్టుకునే స్థలంలో నిలబడ్డప్పుడు బల్లి కుడివైపునుండీ అరిస్తే, అతని భావిజీవితం ప్రశాంతంగా గడుస్తుందని నమ్ముతారు . 

బల్లిని చంపడం పాపమని చెబుతారు . ఈ పాప పరిహారార్ధం బంగారు బల్లిని దానమివ్వాలంటారు . కంచిలోని వరదరాజస్వామి దేవాలయంలో వెండి , బంగారు బల్లులని తాకితే, బల్లి మీదపడినా , దోషం ఉండదని విశ్వాసం. 

‘బల్లి పలుకులు వి ప్రజలెల్ల తమ పనుల్ 
సఫలమగు నటంచు సంతసించి 
కానీ పనులకు తమ కర్మమటందురు 
విశ్వదాభిరామ వినురవేమ | ‘

అని వేమన విమర్శించినా , ‘ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు ‘ అని నానుడి వాడుకలో ఉన్నా బల్లి మీదపడిందనేవారికీ, గౌళి కూసిందనేవారికీ కొదువలేదు .

Quote of the day

You cannot believe in God until you believe in yourself.…

__________Swamy Vivekananda