గోత్రం అంటే జన్యుశాస్త్రమే !

100.24.115.215

గోత్రం అంటే జన్యుశాస్త్రమే !
-లక్ష్మీ రమణ 

మన పూర్వీకులు సృష్టి ధర్మం తెలిసినవారు . ఈ సృష్టి రహస్యం గురించి తెలుసుకోగలిగిన మన మహర్షులు , సృష్టి పరిణామ క్రమం గురించి తెల్సినవారు కావడంలో వింతేమీ లేదు కదా ! అందుకే వారు చేసిన ఆలోచనల నుండీ ఉద్భవించిన సంస్కృతీ ఉదాత్తమైనది . ఉన్నతమైనది . అందరికీ వారికున్నత జ్ఞానం ఉండదు కదా ! అందరూ ఆ సృష్టి ధర్మాలను దర్శించలేరు కదా ! అందుకే వాటిని ఒక సంప్రదాయంగా మలిస్తే సామాన్యులు సైతం అనుసారంచేందుకు వీలుగాఉంటుందనే ఆలోచనతో వారు ఏర్పరిచినదే గోత్రము . ఎలా ఇది సంభవము అనుకుంటే, ఈ వ్యాసాన్ని పూర్తిగా చదవండి . 

పూజ చేయించుకున్న ప్రతిసారీ పౌరోహితులు మీ గోత్రాన్ని అడుగుతారు . అది ఈ కాలం వారికి కాస్త చాదస్తంగానే అనిపించవచ్చు . ఎందుకంటె, ఇప్పుడు ఒకే గోత్రం వారు కూడా వివాహాలు చేసుకుంటున్నారు . ఇది సంప్రదాయం కాదు . సైన్స్ కూడా కాదని మన పూర్వీకుల యోచన . దీని వెనుక ఉన్న మర్మం మరేదో కాదు , నేటి మన శాస్త్రవేత్తలు చెబుతున్న ‘జీన్-మ్యాపింగ్’ !

గోత్రము మనము అనుసరించే అద్భుతమైన జన్యు శాస్త్రం. కొడుకులకి ఈ గోత్రమనేది వివాహం అయ్యాక కూడా మారదు. అది అనువంశికంగా ఉంటుంది . కానీ మహిళలకి వివాహానంతరం ఇంటిపేరుతో పాటు గోత్రం కూడా భర్తదే వర్తిస్తుంది . 

జీవశాస్త్రపరంగా, మానవ శరీరంలో  23 జతల క్రోమోజోములు ఉన్నాయి, 
వీటిల్లో ఫలిత క్రోమోజోములు (తండ్రి నుండి ఒకటి మరియు తల్లి నుండి ఒకటి) అని పిలువబడే ఒక జత ఉంది. ఇది వ్యక్తి(ఫలిత కణం) యొక్క లింగాన్ని ( gender) నిర్ణయిస్తుంది. గర్భధారణ సమయంలో ఫలిత కణం XX క్రోమోజోములు అయితే  అమ్మాయి అవుతుంది, అదే XY అయితే  అబ్బాయి అవుతాడు. స్త్రీలలో Y క్రోమోజోమ్ ఉండదు . పురుషుల్లో మాత్రం XY రెండు రకాల క్రోమోజోములూ ఉంటాయి . కేవలం పురుషుల్లో ఉండే ఈ Y కలిసినప్పుడే అది XY అయ్యి పురుషుడి జననానికి కారణం అవుతుందన్నమాట . అంటే, ఈ Y మాత్రమే వంశాన్ని కొనసాగిస్తోంది (తాత  నుండీ , తండ్రికీ , తండ్రినుండీ , కొడుకుకి ఇలా అన్నమాట ). 

మహిళలు ఎప్పటికీ Y ను జన్యుపరంగా కలిగి ఉండరు . అందువల్ల వంశవృక్షాన్ని గుర్తించడంలో, జన్యుశాస్త్రంలో Y క్రోమోజోము కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్లే స్త్రీ గోత్రం తన భర్తకు చెందినది అవుతుంది. ఆ విధంగా భర్త వంశాన్ని ఆమె కొనసాగిస్తోంది . అందుకే మనవాళ్ళు కొడుకుపుడితే , వంశం కొనసాగించబడిందన్న అర్థంలో వంశోద్ధారకుడు జన్మించాడని అంటారు. 

ఒకే గోత్రీకుల మధ్య వివాహాలు నిషేధించడానికి కూడా ఇదే కారణం. ఒకే వంశాన్నుంచి వచ్చినవారు దంపతులైతే, వారికి జన్యుపరమైన రుగ్మతలు కలిగే ప్రమాదం ఉంటుంది . ఇది ఇప్పటి సైన్స్ కూడా చెప్పే మాటే ! 

కాబట్టి గోత్రవ్యవస్థ జన్యుపరమైన లోపాలను నివారించడానికి, Y క్రోమోజోమ్‌ను వంశవాహకంగా, ఆరోగ్యవంతంగా రక్షించడానికి మన పెద్దలు పెట్టిన సంప్రదాయం. దీని ప్రకారం ఆలోచిస్తే, అర్థమవుతూనే ఉంది కదా మన ఋషులు అప్పుడే ‘జీన్-మ్యాపింగ్’ తెలిసిన ఉడ్డందులని. ఇంతకీ గోత్రమ్ అనే పదం రెండు సంస్కృత పదాల నుండి ఏర్పడింది.  

మొదటి పదం 'గౌ'- అంటే ఆవు, రెండవ పదం 'త్రాహి' అంటే కొష్టం . గోత్రం అంటే 'గోశాల' అని అర్ధం. ఆయనెవరో బఠాణీ గింజలమీద ప్రయోగం చేస్తేగానీ జన్యువుల్లో సంయోగాలు అర్థం కాలేదు . కానీ మన శాస్త్రవేత్తలు గోవుల్ని పూజించి , పాలించి , యోగముతో తెలుసుకున్న అద్భుతాలివి . 

ఇదీ మన భారతీయతలోని గొప్పదనం . అందుకే భారతీయులమని సంతోషిద్దాం . మన వారసత్వ సంప్రదాయాన్ని గౌరవిద్దాం . మన పిల్లలకూ ఈ జ్ఞానసంపదని పంచుద్దాం .

Quote of the day

It is easy to talk on religion, but difficult to practice it.…

__________Ramakrishna