గుర్తు చేసుకోవాల్సిన మహనీయుల్లో విభీషణుడు ఒకరు .

100.24.115.215

కలియుగంలో, గుర్తు చేసుకోవాల్సిన మహనీయుల్లో విభీషణుడు ఒకరు . 
-లక్ష్మీ రమణ 

బురదలోనుండీ పుట్టినా , కమలం తన స్వచ్ఛతను, సుగంధాన్ని , సౌందర్యాన్ని , స్వాభావికతనీ కోల్పోదు. అది ఖచ్చితంగా పవిత్రమే . అలాంటి వాడే రామాయణం లోని రాక్షసోత్తముడు విభీషణుడు . ఈయన కైకసీ - విశ్రవుల మూడో కొడుకు.  రావణునికి  సోదరుడూ, మంత్రి.  శ్రీరామచంద్రునికి అత్యంత ఆప్తుడు. శైలూషుడనే గంధర్వరాజు కూతురు సరమ ఈతని భార్య.

 మహావీరుడూ, ధర్మశాస్త్ర, నీతిశాస్త్ర సారమెరిగినవాడూ, సకల కళలలో ప్రావీణ్యం గలవాడూ, లంకను సర్వస్వతంత్ర సామ్రాజ్యంగా నిలబెట్టిన చక్రవర్తి, బంగారు లంకను స్థాపించిన రావణుడంటే విభీషణునికి అభిమానం, ప్రేమ, గౌరవం. రావణుడు తన అన్న అయినందుకు ఒకింత గర్వం. కానీ ఒక స్త్రీ వ్యామోహంతో లంకాపతనానికి పూనుకున్నందుకు రావణున్ని వారించిన తీరు ధర్మజగతిలో ఓ మైలురాయి.

అంతటి గౌరవము అన్నగారి మీద ఉన్నా , మారయ (మారవి) వెంకయ్య కవి తన భాస్కర శతకంలో ఉపమానానికి అన్నట్టు ,

‘కట్టడ దప్పి తాము చెడు కార్యము చేయుచునుండిరేని దో
బుట్టిన వారినైన విడిపోవుట కార్యము; దౌర్మదాంధ్యమున్
దొట్టిన రావణాసురునితో నెడబాసి విభీషణాఖ్యుడా
పట్టున రాము జేరి చిరపట్టము గట్టుకొనండె భాస్కరా!’

‘చెడుపనులు, చేయకూడని పనులు చేసేవాడు స్వయంగా సోదరుడే అయినప్పటికీ, వానిని విడిచిపెట్టటం మంచిది. అలా చేయటం వలన మంచి జరుగుతుంది. ఈ పద్ధతిని అనుసరించే రావణుని సోదరుడయిన విభీషణుడు తన అన్నను విడిచి శ్రీరామునిచేరి, శాశ్వతమైన లంకానగర ఆధిపత్యాన్ని పొందాడు.’ అని వివరించారు . 

దండకారణ్యం నుంచి సీతాపహరణం చేసుకొని వచ్చాడన్న వార్త వినగానే ఆగామి రోజుల్లో జరుగబోయే పీడను శంకించిన విభీషణుడు, రావణుడు చనిపోయేంత వరకూ తను చేసేది, చేస్తుంది అధర్మమని చెబుతూనే ఉన్నాడు. బతిమాలాడూ, వాదించాడూ, చర్చించాడూ, హెచ్చరించాడు. అయినా రావణుడు పంతం వీడలేదు.

హనుమంతుడు దూతగా వచ్చినప్పుడు రావణుడు ఒక కోతి వచ్చి నాకు ధర్మబోధ చేస్తుందా! అని పరిహసిస్తూ హనుమను చంపమని ఆదేశిస్తే, విభీషణుడు దూతను చంపడం అత్యంత దుర్మార్గమనీ, కావాలంటే అతను మనకు చేసిన నష్టానికి గానూ ఏదైనా శిక్షను విధించి వదిలేయమని సమాధానపరుస్తాడు.రావణునితో ప్రశాంతంగా ఆలోచించు! నీ శత్రువుకు నీవేంటో తెలియాలంటే దూతను వదిలేయడమే ధర్మమని చెబుతాడు.

రామరావణ యుద్ధాన్ని వారించేందుకు విభీషణుడు పడ్డపాట్లు అన్నీ, ఇన్నీ కావు. రావణునితో విభీషణుడు చెప్పిన మాటలు నాడు త్రేతాయుగాన్నే కాదు, నేటి కలియుగాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అహంకారం నాడే కాదు, నేడు కూడా కుటుంబాలు నాశనమయ్యేందుకు, జీవితాలు పతనమయ్యేందుకు కాచుకొని కూర్చుంటుందనే గుణపాఠం ఆ మాటల అంతరార్థం.

విభీషణుడు రావణునితో ‘స్త్రీ వల్లే ధనం, కీర్తి వస్తాయి. స్త్రీ వల్లే సర్వం తుడిచిపెట్టుకుపోతాయి. దేవతలకు కూడా లభించని అమరసుఖాలు మన లంకలో ఉన్నాయి. వాటిని అనుభవించే అదృష్టాన్నీ చేజేతులా పాడుచేసుకోవద్దు. నిన్నే నమ్ముకొని ఉన్న లంకానగరవాసుల్ని ఒక స్త్రీ కారణంగా మృత్యుఒడిలోకి నెట్టొద్దు. నేను నీకు ఆప్తుడనూ, మంత్రినీ. అహాన్ని వదిలి సీతమ్మను సగౌరవంగా శ్రీరామునికి అప్పగిద్దాం. అన్నింటినీ సమూలంగా నాశనం చేసే కోపాన్ని విడిచిపెట్టు. అన్నింటికీ ఆలవాలమైన ధర్మాన్ని పాటించు’. అని చెబుతాడు. కోపాన్నీ, అహాన్ని, మైథిలినీ వదిలి రావణుడు కీర్తిని పోందాలనీ, అధర్మాన్ని వీడి ధర్మమార్గంలో నడవాలనీ భావించే ఈ విభీషణుడు నీ మంచే కోరుకుంటాడని ప్రాధేయపడతాడు.

రావణుని మిగతా సోదరులూ, మంత్రులూ, కొడుకులూ రావణుని వైభవాన్ని చాటుతున్నామనుకొని రావణున్ని రెచ్చగొడుతుంటే చూసి సహించలేని విభీషణుడు వారితో రాచధర్మాన్ని నిలబెట్టాలనుకుంటే రాజుకు మంచే చెప్పాలి. అది కఠినంగా ఉన్నా సరే. అధర్మంతో రాక్షస వినాశనానికి పూనుకుంటుంటే సమర్థించడం ఎంత మాత్రం మంచిది కాదని హెచ్చరించాడు. ఇలా ఎన్నో విధాలుగా చెప్పీ, చెప్పీ అలిసిపోయిన విభీషణుడు ధర్మమే నిలబడుతుందనీ, న్యాయమే గెలుస్తుందనీ నమ్మి రాముని శరణుకోరాడు. 

రావణుని జయించడానికి అనేక ఉపాయాలూ, రహస్యాలూ రామునికి తెలిపి సహకరించాడు. రావణుడు నేలకొరగడం చూసి తట్టుకోలేక విలపించాడు. అనుకున్నదంతా అయ్యిందనీ, ఒక స్త్రీ వ్యామోహంతో రావణుడంతటి వాడూ, అనంతమైన లంక పతనం అయ్యిందనీ బాధపడి రావణునికి అంతిమ సంస్కారం చేసి సద్గతులకై ప్రార్థించాడు విభీషనుడు.

అందుకే ఆయన రాక్షసోత్తముడయ్యాడు .  ఆయన రావణుడికి చెప్పిన ధర్మం , నీతి నేటికీ అనుసరణీయం కాదా ? వార్తాపత్రిక ముట్టుకోవాలంటే,  ఆరోజు ఎటువంటి కిరాతకాలు జరిగాయో చదవాల్సి వస్తుందోనన్న భయం వెంటాడుతున్న ఈ కలియుగంలో, గుర్తు చేసుకోవాల్సిన మహనీయుల్లో విభీషణుడు ముందువరసలో ఉంటాడు . కావడానికి రాక్షసుడే, అయినా ఆయన సంస్కారం నమస్కార యోగ్యం కదూ . ఆ బాటలో నడిచే యత్నం పరిపూర్ణంగా చేద్దాం.  శుభం .

Quote of the day

It is easy to talk on religion, but difficult to practice it.…

__________Ramakrishna