Online Puja Services

గంధర్వులు ఎవరు ?

18.118.137.243

గంధర్వులు ఎవరు ? 
-సేకరణ : లక్ష్మి రమణ 

వేదాది సాహిత్యం లోనూ, పురాణాలలో, ఇతిహాసాలలోనూ ఈ "గంధర్వుల" ప్రస్తావన ఉన్నది. పురాణాల ప్రకారం వీరు "కశ్యప ప్రజాపతికి" పుట్టిన వారు. వీరు మనుజులలా, మనకు భౌతిక నేత్రాలకు కనిపించకపోవడం వలన(సామాన్య దృష్టికి) , వీరు మానవ తలాలకు (dimensions)చెందిన వారు కాదని అర్థం చేసుకోవాలి. మహా భారతంలో సాత్యవతేయుడైన చిత్రాంగదుడు, ఒక పరాక్రమ వంతుడైన గంధర్వరాజుతో పోరాడి మరణించడం మనం గాంచవచ్చు. దీనిని బట్టి గంధర్వులలో పరాక్రమశాలురు కూడా ఉన్నట్లు గమనించవచ్చు. అలాగే, భారతంలో అంగార పర్ణుడు అను వీరుడైన గంధర్వుడు, అర్జునుడి చేతిలో ఓడి, అర్జునిడికి , "చాక్షుసి" అనే విద్యను ఇస్తాడు. ప్రతిగా అర్జునుడు ఇతనికి "ఆగ్నేయాస్త్రాన్ని" ఇస్తాడు. ఈ అంగార పర్ణునికే " చిత్ర రథుడు" అనే పేరు కూడా ఉన్నది.ఈ అంగార పర్ణుడు, యక్షరాజైన "కుబేరుని" మితృడు కూడా.

    మనము, "త్రిమితీయ" (Three Dimensional) తలాలకు చెందిన వారము. వారు 4th లేదా అంతకంటే ఉన్నత తలాలకు చెందిన వారు గానీ అయ్యుండవచ్చును. చరాచరమైన, స్థావర జంగమాత్మక మైన ఈ భగవత్ సృష్టిలో ఎన్నో తలాలు (Dimensions) ఉన్నాయి. ఆయా తలాలలో ఒకానొక తలానికి చెందిన వారై ఉండవచ్చును, ఈ గంధర్వులు. మన పురాణాలలో, ఇతిహాసాలలో , వీరు మానవ లోకాలకు - గంధర్వ లోకాలకు సంచారం చేసినట్లు చెప్పబడినది. వీరు అదృశ్య ప్రపంచానికి చెందిన జీవులు. వీరు  దేవతలు పానం చేసే "సోమ రసాన్ని" రక్షించే వారిగా చెప్పబడ్డారు. స్వర్గలోకపు సభ అయిన అమరావతిలో, వీరు ఆస్తాన సంగీత కారులు కూడా. పురాణాలు, ఇతిహాసాల ప్రకారం ఈ గంధర్వులు మనవ లోకానికి-దేవ లోకానికి మధ్య అనుసంథాన కర్తలుగా కూడా పనిచేసారు.  హిందూ సాంప్రదాయ వివాహ పద్ధతుల్లో "గంధర్వ వివాహం" ఒకటి. కొన్ని సార్లు గంధర్వులు ప్రకృతి దేవతలు గానూ, అప్సర స్త్రీల భర్తలుగా కూడా ఉన్నారు. ఇదంతా ఇతిహాస, పురాణ ప్రశస్తి. అలాగే శ్రీమద్రామాయణంలో కూడా, "దనువు" అనే గంధర్వుడు, కబంధుడిని  రాక్షసుడు కమ్మని శపించబడతాడు. అయితే గంధర్వులలో కూడా కొన్ని వర్గాలున్నట్లు మన పురాణాల సమాచారం. వారు

1. అశ్వ తారలు
2. మౌనీయులు - ముని నుండి పుట్టిన వారు(ఇక్కడ ముని అంటే తపము నాచరించే వాడు)
3. రోహితులు
4. శైలీశులు
5.ఉచ్ఛైశ్రవులు
6. వాలీయులు

అథర్వ  వేదంలోని ఈ మంత్రం, వీరిలో స్త్రీలను భోగులుగా వర్ణిస్తుంది.

మంత్రం :

జాయా ఇద్వో అప్సరసో గంధర్వాః పతయో యూయమ్|
ఆప ధావతామర్త్యా మర్త్యాన్ మా సచధ్వమ్ ||

(అథర్వ వేదం  4 - 37 - 13)

అయితే గంధర్వులు గొప్ప కళాకోవిధులుగా కూడా వర్ణించ బడ్డారు. గొప్ప గాన కళా లోలురుగానూ,చిత్ర కళా విశారదులుగానూ, వీరు వర్ణించ బడ్డారు.

   యజుర్వేదం లోని 18వ అధ్యాయంలోని కొన్ని మంత్రాలు, "అగ్ని-సూర్య-చంద్రాదులను" గంధర్వులుగా పేర్కొంటున్నాయి. గంధర్వులకు గొప్ప సౌందర్యము కలవారనే పేరు కూడా కలదు. 

మరొక అర్థంలో, " గాంధరతి ధారయతి ఇతి గంధర్వః" అనగా గోవును ధారణ చేయువాడు "గంధర్వుడు" అని కూడా అంటారు. ఇక్కడ "గో" శబ్దానికి నిఘంటువు ఏం చెబుతుందంటే,సూర్య రశ్మి, వాణి, పృథివి మరియూ స్తుతి చేయువాడు మున్నగు నామములు ఉన్నాయి. ఈ విధంగా ఎలాంటి ప్రయాస లేకుండా "గో" అనగా "రశ్మి" ని ధరించే సూర్యుడు గానీ,చంద్రుడు గానీ, గంధర్వుడుగానే పిలువబడుతున్నాడు. 

"గాం" అనగా స్తుతిని ధరించే వారు అనగా స్తుతము చేయుటలో ప్రవీణులు, గాన విద్యా విశారదులు "గంధర్వులు" గానే పిలువబడ్డారు. ఉదాహరణకు "తుంబురుడు". అలాగే మన పురాణ, ఇతిహాసాల ప్రకారం అలంకార భూషితుడు(గంధర్వ రాజు), అర్క పర్ణుడు, ఔదుంబురుడు, భీమ సేనుడు, బ్రహ్మచారి, చిత్రాంగదుడు, దుంధుభి(వాలి సంహరించిన వాడు కాదు), హాహా, హూహూ, మనోరమ, నలుడు, నారదుడు (ఒక గంధర్వ రాజు), తుంబురుడు, రైవతుడు, అంగార పర్ణుడు.....ఇలా....బౌద్ధ, జైన వాఙ్మయంలో కూడా ఈ గంధర్వుల ప్రశస్తి ఉన్నది.

   స్థూలంగా, యోగ పరంగా చెప్పాలంటే "గంధర్వులు" భోగ యోనులు. భిన్న కోరికలతో కూడిన సాధనలు చేసి , మృత్యువునొందిన జీవాత్మలు ఈ "గంధర్వ" అవస్థలో తిరుగుచుందురు. ఈ "గంధర్వ అవస్థ" ఈ చరాచర విశ్వంలో స్వతంత్ర వ్యక్తిత్వం గల అవస్థ. దానికి తగిన కార్య కారణ లోకములు       "ఆప తత్వము" ద్వారా క్రియాన్వితమగును. అందుకని, యోగ శాస్త్రంలోనూ, దర్శన శాస్త్రాలలోనూ ఆపతత్వ సిద్ధి సాధకులను "గంధర్వులు" అనికూడా అంటారు. ఆ "యోగ భగవానుడు" గొప్ప సిద్ధి పొందినట్లయినచో,  వారి శరీరము నుండి "గొప్ప సుగంధము" వచ్చుచుండును. అనగా ఆ యోగి ఆప తత్వ అవస్థలో సిద్ధి పొందినట్లయినచో, ఆ యోగి సంకల్ప మాత్రంచేత సుగంధం వెదజల్లుతాడు. 

ఒక యోగి ఆత్మ కథలో (శ్రీ విశుద్ధానంద సరస్వతి) "గంధ బాబా" వృత్తాంతము దీనికి ఉదాహరణ. వీరు వారణాసికి చెందిన వారు. శ్రేష్ఠులైన ఆ ఉన్నతాత్మలను "గంధర్వులు" అని కూడా అంటారు. అట్టి గంధర్వులకు సిద్ధులన్నీ కరతలామలకాలు. ఆ సిద్ధుల మాయలో పడ్డవారు, చాలా కాలం వరకు ఆ గంధర్వ,అప్సర అవస్థలలోనే ఉంటారు. ఆయా భోగాలు అనుభవిస్తారు. వారుండే లోకమే " స్వర్గము". ఈ స్వర్గము అనేది ఒక "అవస్థ". ఒక "తలం". ఈవన్నీ సూక్ష్మ లోకాలుగా కూడా అనుకోవచ్చు. 

గంధర్వ లోకము : 

నీటిలో చెట్ల నీడలు కనిపించు రీతిలో , మరీచికల్లా....గంధర్వ లోకము అనుభూతికి వచ్చును. అనుభూతి అని ఎందుకన్నామంటే, ఇవి మనస్సు యొక్క అవస్థలు. జడ శరీర అవస్థలైతే భౌతిక అనుభవాలు అంటాము. ఉపనిషత్తుల నందు "తథా అప్సు పరీబ దదృశే తథా గంధర్వ లోకే ఛాయా" అని వర్ణించబడింది. ఏ యోగిలోనైనా, ఆప్ తత్వం అనగా జల తత్వం చైన్యవంతమైతే, అందుండి వచ్చెడి వారే "గంధర్వులు,అప్సరసలు". అందు చేత గంధర్వులు,అప్సరసలు ఆప్ తత్వీయులు 

భట్టాచార్యగారి రచన నుండీ కృతజ్ఞతలతో .

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore