Online Puja Services

షష్టిపూర్తి ఎందుకు చేస్తారు ?

13.59.82.167

షష్టిపూర్తి ఎందుకు చేస్తారు ?

మనుష్యయణాం ఆయురభివృధ్యర్ధం  వింశత్యుత్తర శతఆయుర్మధ్యే షష్టి వర్షే (60-120 వయసు మధ్య), జన్మ మాసే, జన్మ నక్షత్రే, జన్మ తిథౌ, వారే , యోగే, కరణే, లగ్నే , అఖాండ నక్షత్రేవా, శాంతిం యథా విధిం కుర్యాత్ | 

అని సంకల్పం చెప్పుకొని షష్టిపూర్తి మహోత్సవాన్ని నిర్వహిస్తుంటారు . కానీ అసలు ఎందుకీ ఉత్సవం అనేది చాలామందికి అవగాహన లేని అంశమే . తెలుగిళ్ళల్లో ‘పెళ్లి సాధారణంగా జరగాలి.  షష్టిపూర్తి ఘనంగా జరగాలి’ అంటూంటారు .  

ఇందులోని మర్మాన్ని జ్యోతిష్య శాస్త్రవేత్తలు ఇలా వివరిస్తున్నారు . మానవుని సంపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది. 60 సంవత్సరాలు నిండినప్పుడు చేసుకునేది షష్టిపూర్తి. ప్రతివారికీ మృత్యువు 60 వ యేట ఉగ్రరథుడు అను పేరుతో , 70 వ యేట భీమరథుడు అను పేరుతో, 78 వ యేట విజయరథుడు అనుపేరుతో ఎదురుచూస్తుంటాడు. అలాంటి సమయాల్లో ఆరోగ్య సమస్యలను తట్టుకోవటానికి చేసే శాంతి ప్రక్రియ షష్టిపూర్తి.

తెలుగు సంవత్సరాలు 60. రాసులు తొమ్మిది . బృహస్పతి , శని మానవుని జన్మకాలంలో ఉన్నరాశికి తిరిగి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది.వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవటంతో మానవుని జీవితం మరలా ప్రారంభమవుతుంది. అంటే , జీవితం మల్లి మొదటినుండీ ప్రారంభమైనట్లు సంకేతం.

 షష్టిపూర్తి  సందర్భంగా  ఆయుష్కామన యజ్ఞము చేస్తారు. ఆయుష్కామన అంటేనే ఆయువును కోరి చేయునది అని అర్థం కదా ! పెద్దలు ఈ ఆయుష్కామన యజ్ఞాన్ని చేసే పధ్ధతిని ఇలా చెప్పారు.

‘’  తెల్లని నూతన వస్త్రముపై తూర్పు దిక్కుగా 12 గీతలు గీచి వాటిమీద అయిదు గీతలు గీసి మొత్తము 60 గదులు వచ్చే విధంగా చేస్తారు . వరుసకు 12 అయిదు వరుసలు తూర్పు దిక్కున బియ్యం పోసి కలశం ఉంచుతారు. ప్రభవ నుంచి క్షయ వరకు 60 సం " అధిదేవతలతో ఆవాహన చేస్తారు. దక్షిణాయన ఉత్తరాయణ దేవతలను, 6 ఋతువులను 12 మాసములను ఆవాహన చేస్తారు. పక్షములను,తిదులను వారములను - వారదేవతలు అయిన - సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని ని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు - అగ్ని, జలము , భూమి, విష్ణువు ఇంద్రుడు, ప్రజాపతి లని ఆవాహన చేస్తారు - వీరికి అధిదేవతలు శివుడు, దుర్గ, కుమారస్వామి, బ్రహ్మ - ఇంకా ఏకాదశ రుద్రులు, నక్షత్ర దేవతలు 27 యోగములు 11 కరణములు ఇలా అందరి దేవి దేవతా స్వరూపాలని మృత్యుంజయుని ఆవాహన చేసి బ్రాహ్మణోత్తములు మంగళాచరనములతొ వేదయుక్తంగా ఈ కార్యక్రమం జరిపిస్తారు. అపమృత్యు నివారణార్థం హోమాల్ని, జపాలని కుడా చేస్తారు.తదుపరి బ్రహ్మలను సత్కరించి బంధుమిత్రులతో విందు ఆరగిస్తారు. 

పూర్వకాలంలో  పురుషుడు ఏ వేడుక చేసుకున్నా భార్యకు కూడా జరగినట్టే భావించేవారు. కాబట్టి  స్త్రీలకు మళ్ళీ విడిగా షష్టిపూర్తి చేసే ఆచారంలేదు.  బిడ్డలు తమ కృతజ్ఞతను తమ తల్లిదండ్రులకు  అర్పించుకొనే అపురూప సందర్భం  షష్టిపూర్తి. కుటుంబ ఐక్యతను చూసి పెద్దలు పరమానందభరితులయ్యే మధురక్షణాలీ షష్టిపూర్తిమహోత్సవ వేడుకలు. ఇది  దృఢమైన ఆత్మీయతల సుగంధం పరిమళించే పండుగ.

- లక్ష్మి రమణ 

Quote of the day

God is to be worshipped as the one beloved, dearer than everything in this and next life.…

__________Swamy Vivekananda