Online Puja Services

గిన్నిస్ రికార్డుల కెక్కిన ఆ ఆదియోగి శిల్పం

18.191.13.255

గిన్నిస్ రికార్డుల కెక్కిన ఆ ఆదియోగి శిల్పం వెనుకున్న వాస్తవాలు ఏమిటి ?
- లక్ష్మి రమణ 

శివరాత్రి వేడుకలు అనగానే యోగాభ్యాసకులకి , యోగా విశ్వాసకులకి గుర్తొచ్చేది  కోయంబత్తూర్ లోని ఈశా ఫౌండేషన్, సద్గురు జగ్గీ వాసుదేవ్ . సద్గురువుగా ఆయన్ని ప్రస్తుతం ప్రపంచంలో చాలా మంది విశ్వశిస్తున్నారు.  ఆయన ప్రసంగాలు, వివిధ అంశాల మీద ఆయన ఇచ్చే వివరణలూ చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఎంతో లోతైన సత్యాన్ని, సున్నితమైన విషయాన్నిఆ వివరణలు చాలా తేలికగా అర్థం చేసుకునేలా చేస్తాయి . ఈశాలోని ప్రధాన ఆకర్షణ ఆ విధంగా ఖచ్చితంగా సద్గురునే! అయితే, ఆయనతోపాటుగా ఆయన ఆ ఈశాలో నెలకొల్పిన ఆదియోగి శిల్పం కూడా !! గిన్నిస్ రికార్డుల కెక్కిన ఆ ఆదియోగి శిల్పం వెనుకున్న వాస్తవాలు తెలుసుకోవడం జిజ్ఞాసకులకి ఆసక్తికరమైన అంశమే !! ఆ వివరాలు ఇక్కడ మీకోసం !!

కోయంబత్తూర్ లోని ఈశా యోగా సెంటర్ వద్ద ఉన్న, యోగాకు మూలమైన 112-అడుగుల ఆదియోగి విగ్రహం గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ను నెలకొల్పింది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్, ప్రపంచంలో అతిపెద్ద బస్ట్ (స్కల్ప్చర్) గా ఆదియోగిని ఎంపిక చేశాయి.ప్రపంచంలోని అతి పెద్ద ప్రతిమగా నిలిచింది.ఆదియోగి అద్భుతమైన ముఖం ఉక్కుతో తయారు చేయబడింది.

యోగాకు మూలమైన - 112 అడుగుల ఆదియోగి ముఖాన్ని, ఈశా ఫౌండేషన్ స్థాపకులు సద్గురు, రూపకల్పన చేసి ప్రాణ ప్రతిష్ట చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు 2017 లో మహాశివరాత్రి నాడు ఈ అద్భుతమైన విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఆదియోగి ప్రాముఖ్యతను వివరిస్తూ, సద్గురు "యోగ సంస్కృతిలో, శివుడిని దేవుడిగా కొలవరు.  ఆదియోగి లేదా మొదటి యోగి - యోగాకు మూలపురుషునిగా చూస్తారు . మీరు కృషి చేయడానికి సిద్దంగా ఉంటే, పరిణామం చెందవచ్చునన్న ఆలోచనని, మొట్టమొదట మానవ హృదయాల్లో నాటినవారు ఆదియోగి. ఆదియోగి అందించిన యోగ శాస్త్రం నుండి ప్రయోజనం పొందని సంస్కృతి లేదు. ఒక మతంగానో, నమ్మక వ్యవస్థగానో లేదా తత్వశాస్త్రంగానో కాకుండా, యోగా ఒక విధానంగా అన్నిచోట్లకు చేరుకుంది. 112 లోని ప్రాముఖ్యత ఏమిటంటే - మానవజాతి ముక్తిని చేరుకోవటానికి ఆదియోగి, 112 విధానాలను అందించార” ని చెప్పారు.

112 అడుగుల విగ్రహంతో పాటు సద్గురు ప్రత్యేకమైన ఒక లింగాన్ని ప్రతిష్టించారు. ఇదే యోగీశ్వర లింగం. ఆదియోగి ప్రతిష్టాపన సమయంలో సద్గురు మాట్లాడుతూ ఇలా అన్నారు:

"మనం ఒక నిర్దిష్టమైన ప్రయోజనం కొసం ఆదియోగిని ఏర్పాటు చేస్తున్నాం. ఏ శక్తినైతే మనం శివ అంటున్నామో, లేదా ఏ శక్తికి ఆకారం లేదో - “శివ” అంటే అర్ధం, ఏదైతే లేదో, ఏది నిరాకారమైనదో అది అని – ఈ శక్తి ఎన్నో విధాలుగా అభివ్యక్త మవ్వగలదు. భారతీయ సంప్రదాయంలో దీనిని ఇలా అర్ధం చేసుకోవటం సర్వ సాధారణం. ఒక ప్రదేశంలో, శివడు ఒక నాట్యకారుడు, మరో ప్రదేశంలో వైద్యుడు, మరో ప్రదేశంలో వరాలు ప్రసాదించే వాడు, మరో చోట అజ్ఞానాన్ని రూపుమాపే వాడు, మరో చోట భయాల్ని తొలగించేవాడు – ఈ విధంగా.. బృహదీశ్వరుడు, వైద్యేశ్వరుడు , నటరాజు - ఇలా వేల పేర్లతో, పలు విధాలుగా అవిష్క్రుతమవుతున్న ఒకే శక్తి. ప్రజల నిర్దిష్ట అవసరాలు నేరవేర్చటం కొసం, విభిన్న ప్రయోజనాల కోసం ప్రతిష్టాపనలు చేసారు.

ఇప్పుడు, ఇది యోగేశ్వరుడు. అంటే, ఈ సారి ఆయన్ని మనం ఒక పరిపూర్ణ యోగిగా ప్రతిష్టిస్తున్నాం. యోగి అంటే...ఆదియోగి, మిమల్ని మీ వ్యాధుల నుంచి విముక్తి చేసేందుకు, ఇబ్బందుల నుంచి విముక్తి చేసేందుకు, నిరాశ్రత నుంచి విముక్తి చేసేందుకు, పేదరికం నుంచి విముక్తి చేసేందుకు - అన్నిటికీ మించి జీవన్మరణాల ప్రక్రియ నుంచి కూడా మీకు విముక్తి కల్పించేందుకు, ఆయన ఇక్కడ ఉంటారు. యోగేశ్వరుడు, ప్రధానంగా ముక్తిని కల్పించే మా గురువు " అని విశ్లేషించారు . 

ఈ సారి ఈశా కార్యక్రమాలని తిలకించేందుకు ఆశ్రమానికి వెళ్లినా, లేదా మీ ఇంట్లో ఉన్న టీవీ లేదా ఇంటర్నెట్ సౌకర్యాల ద్వారా ఆ ఆదియోగిని దర్శించినా, ఈ విశేషాలన్నీ మీ మదిలో మెదులుతాయి కదూ !!

 

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha