Online Puja Services

అసలైన ఉగాది విశిష్టత !!

3.15.147.215

అసలైన ఉగాది విశిష్టత !!
-లక్ష్మీ రమణ 

మామిడి పిందెలు, మల్లెపూల సువాసనలు , చిలకపలుకుల సరిగమలు , భానుని భగభగలు వసంతమాసం రాకని సూచించడంలేదూ ! వసంత మాసం వచ్చిందంటే, తనతో ఉగాదిని తెచ్చిందన్నమాటే ! ‘వసంతి సుఖం యథా తథా అస్మిన్నితి’ అంటే, వసంత కాలంలో ప్రజలు సుఖంగా ఉంటారని అర్థం . వసంత మాసంలో వచ్చే ఉగాది పండుగ కాలానికి గుర్తు. పురాణాల ఆధారంగా మనకి నాలుగు యుగాలున్నాయి. ఉగాదిని జరుపుకునే తిధి ఈ నాలుగు యుగాల్లో నాలుగు రకాలుగా ఉంది . 

కృతయుగంలో కార్తీక శుద్ధ అష్టమి నాడు ఉగాదిని జరుపుకునేవారట. త్రేతాయుగంలో వైశాఖ శుద్ధ తదియనాడు సంవత్సరాదిని జరుపుకునేవారట. మాఘమాస బహుళ అమావాస్య ద్వాపర యుగానికి ఉగాది . ఇక, కలియుగంలో ఇప్పుడు మనం జరుపుకునే ఉగాది - చైత్ర శుక్ల పాడ్యమి నాడు వస్తుంది .  ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్పిన ప్రకారం పండగలు వ్రతాల విషయంలో కొన్ని తిథులు నిర్ణీత సమయంలో ఉండాలి . సూర్యోదయం సమయానికి పాడ్యమి తిథి ఉన్న నాడే ఉగాదిగా జరుపుకోవాలి అని చెబుతారు పెద్దలు. “యుగస్య ఆది: యుగాది” అన్నారు .

 ఉగాది లోని ఉగ అనే శబ్దానికి అర్థం నక్షత్ర గమనము అని . ఆది అంటే మొదలు అని కదా ! అంటే నక్షత్రాల గమనం మొదలైనరోజు . అంటే, అసలు కాలం గమనం మొదలుపెట్టిన రోజు ఉగాది . బ్రహ్మ తన సృష్టిని మొదలు పెట్టింది ఈరోజే అంటుంది చతుర్వర్గ చింతామణి. మన పురాణాల ప్రకారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించినదీ, కలియుగం మొదలయ్యింది ఉగాది రోజే . యుగపురుషుడైన శాలివాహనుడు, ధైర్యవంతుడైన రాజు విక్రమార్కుడు సింహాసనాన్ని అధిష్టించిన రోజు కూడా ఇదే !

ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడే కదా ! మామిడి పిందెలు , వేపపువ్వు , కొత్తబెల్లం , చింతపండు కలిపి తయారు చేసే ఈ పచ్చడి ఉగాదికి మిగిలిన పండుగలన్నిటిలో ప్రత్యేకతని ఆపాదించింది . ఈ రుచులు జీవితంలోని సుఖదుఃఖాలకి ప్రతీకలు .  వీటితోటే మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం. కానీ, అసలైన ఉగాది పచ్చడిలో అశోక చిగురు, మామిడి చిగురు కూడా కలపాలని ధర్మసింధు చెబుతోంది . అందుకే ఉగాది పచ్చడిని ‘ నింబ కుసుమ భక్షణం’ అనీ, ‘ అశోక కళికా ప్రాసనం’ అనీ అనేవారట పూర్వం. ఉగాది నాడు ఒక్కరోజు పచ్చడి ఆరగించడంతోటే, పండుగ సమాప్తం అనుకునేరు ! ఉగాది మొదలు, శ్రీరామ నవమి వరకూ తొమ్మిది రోజులపాటు రోజూ ఈ ఉగాది పచ్చడి తినాలని కూడా పెద్దలు చెప్పారు .  

ఉగాది పచ్చడి కేవలం సంప్రదాయం మాత్రమే కాదు , ఈ పచ్చడి తినడంవలన వేసవికాలం ప్రభావం వలన వచ్చే వాత , పిత్త , కఫ దోషాలు తొలగిపోతాయని చెబుతుంది ఆయుర్వేదం . ఇలా ఆలోచిస్తే, పసుపు రాసుకోవడం నుండీ మొదలైన మన సంప్రదాయాలు , పండుగలూ అన్ని కూడా ఆరోగ్యదాయకాలే కదా ! కాబట్టి , వీలైనంతవరకూ ఈ సంప్రదాయాన్ని అనుసరించ్చే ప్రయత్నం చేద్దాం.  

ప్రత్యేకించి మా హితోక్తి పాఠకులందరికీ, ‘శోభకృత్’ నామ సంవత్సర ఉగాది శుభాకంక్షాలు.  ఇప్పటివరకూ జరిగిపోయిన కాలం ప్రపంచానికి చేదు అనుభవాలని మిగిల్చింది  . ఎన్నో జీవితాలని చీకటిలోకి నెట్టి, చేదు రుచిని బాగా చూపించింది.  పేరులోనే శుభాన్ని నింపుకున్న ఈ కొత్త ఏడాది  ‘శోభకృత్’ మన జీవితాల్లో వెలుగుల్ని , శుభాలని, తీయని ఆనందాలని తిరిగి నింపాలని ఆశిస్తూ, శలవు. శుభం .   

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha