Online Puja Services

కరుగుతున్న తెలుగుభాష

3.145.15.205

కరుగుతున్న తెలుగుభాష

దక్షిణాది నాలుగు ప్రధాన భాషల్లో తెలుగు చివర పుట్టినది. తమిళ, మలయాళ, కన్నడ భాషలు మనకంటే ముందు పుట్టినవి. లిపి పరిణామ క్రమం కూడా ఇదే వరుసలో ఉంటుంది. ఇంతకంటే తెలుగు భాషోత్పత్తి, వికాసం, చరిత్ర విషయాలు ఇక్కడ అనవసరం. అయితే మిగతా మూడు భాషలకంటే ముందు అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నది మాత్రం తెలుగుకే.

తెలుగు నామరూపాల్లేకుండా ఎప్పటికి పోతుంది అన్నది మన ప్రయత్నాలను బట్టి ఉంటుంది. ఇప్పటి మన సంకల్పం, పట్టుదల ప్రకారం చూస్తే- కచ్చితంగా ఇంకో రెండు వందల ఏళ్ళల్లో మొదట తెలుగు లిపి అదృశ్యం కావచ్చు. మాట్లాడే భాషగా తెలుగు ఇంకొంత ఎక్కువ కాలం బతకవచ్చేమో కానీ- ఆ మాట్లాడే తెలుగులో తెలుగు పది శాతం మిగిలి ఉంటే గొప్ప. ఇంకో అయిదు వందల సంవత్సరాల తరువాతి వారికి ఇప్పటి మన వాడుక తెలుగు శ్రీనాథుడి పద్యాల్లా ఎవరయినా విడమరచి చెబితే తప్ప అర్థం కాకపోవచ్చు.

కనీసం ఇంకో పది వేల సంవత్సరాలయినా బతికి, బట్ట కట్టి, బలుసాకయినా తిని, నిలబడగల కండపుష్టి, ఎముకల బలం తెలుగుకు ఉన్న మాట నిజమే అయినా-ఇప్పటి పరిస్థితులు మాత్రం అందుకు అనుగుణంగా లేవు. తెలుగు లిపి నెమ్మదిగా విలువ లేనిది అవుతుంది. తరువాత మాట కూడా విలువ లేనిదే అవుతుంది. కచ్చితంగా ఇదంతా ఎప్పటికి జరుగుతుంది? అని తేల్చడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. మహా అయితే ఇంగ్లీషు రాని తెలుగువారు మాత్రమే తెలుగు మాట్లాడుతుంటారు. భవిష్యత్తులో తెలుగు మాట్లాడేవారిని అనాగరికులుగా చూడరని భరోసా అయితే ఏమీ లేదు. ఇంతకంటే లోతుగా భాష కనుమరుగయ్యే ప్రమాదం గురించి మాట్లాడి ప్రయోజనం లేదు.

మన పొరుగున కర్ణాటక సముద్రతీరం మంగళూరు-ఉడిపి ప్రాంతాల్లో తుళు మాట్లాడతారు. తుళు ప్రత్యేక భాషే అయినా, కోటి మందికి పైగా తరతరాలుగా మాట్లాడుతున్నా లిపి లేదు. కన్నడ లిపిలోనే తుళు భాషను రాయాలి. నిజానికి ఆరు వందల సంవత్సరాల క్రితం వరకు తుళుకు ప్రత్యేక లిపి ఉండేది. అనేక కారణాల వల్ల లిపిని వాడక అంతరించిపోయింది. కృష్ణదేవరాయల మాతృభాష తుళు. తుళు తన సొంత లిపిని మరచిపోయి, కన్నడ లిపిలోకి కుచించుకుపోయినట్లు- మన తెలుగు లిపి కూడా ఇంగ్లీషులోకి కుచించుకుపోయి సొంత లిపిని పూర్తిగా మరచిపోయే రోజులు ఎంతో దూరంలో లేవు.

ఒక లిపి ఏర్పడడానికి వేల ఏళ్ల సమయం పడుతుంది. మొనదేలిన రాయి ప్రవాహంలో ఒరుసుకుని, ఒరుసుకుని నున్నగా, గుండ్రంగా తయారయినట్లు తెలుగు లిపి కూడా గుండ్రంగా, అందంగా ఏర్పడింది. నవ్వుతున్నట్లు ‘అ’అక్షరం ఎంత అందంగా ఉంటుంది? పురి విప్పిన నెమలిలా ‘ఖ’ఉంటుంది. కీర్తికి పెట్టిన కిరీటంలా ‘గ’ ఉంటుంది. బుగ్గన సొట్టలా ‘ఠ’ ఉంటుంది. రాయంచలా ‘హ’ ఉంటుంది. తెలుగు వర్ణమాల అచ్చులు, హల్లుల అందం, అవి ఏర్పడ్డ పద్ధతి మనకు పట్టని పెద్ద గ్రంథం. భాషకు శాశ్వతత్వం ఇచ్చేది, తరతరాలకు భాషను అందజేసేది లిపి. మాట్లాడే మొత్తం భాషకు ఒక్కోసారి లిపి చాలకపోవచ్చు. తెలుగులో దాదాపుగా మాట్లాడే భాషకు తగిన, బాగా దగ్గరయిన వర్ణమాల ఉంది. అంత నిర్దుష్టమయిన, నిర్దిష్టమయిన లిపి తెలుగుకు ఉంది.

ముత్యాల్లాంటి, రత్నాల్లాంటి తెలుగు అక్షరాలు మనకెందుకో వికారంగా కనిపిస్తున్నాయి. అసహ్యించుకోవాల్సినవిగా అనిపిస్తున్నాయి. వాడకూడనివిగా అనిపిస్తున్నాయి. తెలుగు భాష అవసరాలకే అయినా తెలుగు లిపిలో రాయడం తక్కువతనంగా అనిపిస్తోంది. తెలుగుకు తెలుగు లిపే అంటరానిదిగా అవుతోంది. తెలుగును ఇప్పుడు ఇంగ్లీషులో రాయడం ఫ్యాషన్. మర్యాద. ట్రెండ్.

క్షుద్రులెరుగని నిర్ణిద్ర గానమిది…పాటకు fools who don’t know the song singing without sleep లాంటి అనువాదం చేస్తుంటే తెలుగు భావాన్ని ఇంగ్లీషులోకి తీసుకెళుతున్నారని సంతోషించవచ్చు. కానీ జరుగుతున్నది కేవలం లిప్యంతరీకరణ మాత్రమే. Kshudrulerugani nirnidra ganamidi అని రాస్తున్నారు. ఇలా రాయడంవల్ల లండన్ లో షేక్స్ పియర్లు, అమెరికాలో నోమ్ చాస్కీలు మన తెలుగును సులభంగా చదివి అర్థం చేసుకుంటున్నారేమో తెలియదు. తెలుగు లిపిని మాత్రం ఘోరంగా అవమానిస్తున్నారు. లిపిని రద్దు చేస్తూ దుర్మార్గమయిన పాపం మూటగట్టుకుంటున్నారు. మన నిలువెత్తు సంతకాన్ని మనది కాకుండా చేస్తున్నారు.

పలికే మాటను సంకేతించే అక్షరం పుట్టడానికి కొన్ని యుగాల సమయం పట్టింది. దాన్ని చెరిపేయడానికి పదేళ్ల సమయం సరిపోయింది. ప్రత్యేకించి సినిమా పాటల లిరికల్ రిలీజ్ లన్నీ ఇలా ఇంగ్లీషు లిపిలోనే జరగాలని తెలుగు సినీ పరిశ్రమ రాసుకున్న రాజ్యాంగం.

ఈమధ్య చిరంజీవి ఆచార్య సినిమా లాహే లాహే లాహే పాటను యూ ట్యూబ్ లో ఆరు కోట్ల మంది చూశారు. మణి శర్మ మంచి సంగీతం. రామజోగయ్య శాస్త్రి చక్కటి రచన. పాట అద్భుతంగా, నిండు తెలుగు కండతో ఉంది. ఆధ్యాత్మిక, వేదాంత విషయాలను సాధారణ పరిభాషలో ప్రతీకాత్మకంగా చెప్పిన తీరు బాగుంది. నూటికి నూరు మార్కులు వేయదగ్గ రచన. మంచి కొరియోగ్రఫీ.లవ్ స్టోరీ సినిమా సారంగదరియా సాయి పల్లవి జానపదగీతం అసాధారణంగా ఇరవై అయిదు కోట్ల మంది చూశారు. ఈ రెండు పాటలు తెలుగువే అయినా ఇంగ్లీషు లిపిలోనే ఉంటాయి.ఇవే కాదు. ఏ పాటలయినా ఇంగ్లీషులోనే ఉండాలని నియమమేదో పెట్టుకున్నట్లున్నారు. తెలుగు పాటలకు తెలుగు లిపిలో టెక్స్ట్ పెడితే జరిగే నష్టాలేమిటో, పెట్టడానికి కష్టాలేమిటో ఇంగ్లీషు తండ్రికే తెలియాలి. నిజంగా తెలుగును ఇంగ్లీషులో రాయడం వల్ల వ్యాపార ప్రయోజనాలుంటే ముందు తెలుగు లిపిలో ఇచ్చి, తరువాత ఇంగ్లీషులో ఇవ్వవచ్చు. అప్పుడు అసలు భాషకు తగిన గౌరవం ఇస్తూనే, కొసరు భాష ఉపయోగాన్ని కూడా పిండుకోవచ్చు.

ఇప్పటికీ శ్రీలంకలో ప్రభుత్వ బోర్డుల్లో మొదట వారి అధికార భాష సింహళీ, తరువాత ఎక్కువ మందికి తెలిసిన తమిళం, దాని కింద మూడో లైన్లో ఇంగ్లీషులో రాస్తున్నారు. మనసుంటే మార్గముంటుంది.

కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని ఒక మాట ఉంది. మూడో కంటికి తెలియకుండా తడి గుడ్డతో గొంతు కోయడం. చుక్క రక్తం చిందకుండా గుండె కోయడం. అలా మనం తెలుగు లిపిని సైలెంట్ గా మర్డర్ చేస్తున్నాం. ఇన్నాళ్లు ఈ లిపి హత్యా నేరంలో తెలుగు సినీ పరిశ్రమ ఒకటే ఉండేది. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీల ప్రకటనలు కూడా తోడయ్యాయి.

మనకు మనమే చెరిపేసుకుంటున్న చరిత్ర మనది. మనకు మనమే అక్షరాన్ని బూడిద చేసుకుంటున్న పాపం మనది. మనకు మనమే నిరక్షరులుగా మిగిలే దైన్యం మనది. తెలుగు అక్షరం గుక్క పట్టి ఏడుస్తున్నా వినిపించుకోని పుట్టు చెవుడు మనది. తెలుగు అక్షరం గుండెలు బాదుకుంటున్నా చూడలేని పుట్టు వైకల్యం మనది. తెలుగు పట్టని వైక్లబ్యం మనది.

ఎవ్వరూ భయపడకండి. తెలుగును నడి బజారులో పట్ట పగలు అందరు చూస్తుండగా ఖూనీ చేసినా ఎవరూ కేసులు పెట్టరు. పెట్టినా నిలబడవు. నిలబడినా శిక్ష పడదు. పడినా అమలు కాదు.

త్వరగా పిడికిలి బిగించి ఉరికి రండి!
తలా ఒక పిడిబాకు చేతబట్టి ఉబికి రండి!
తెలుగును కసితీరా పొడిచి పొడిచి చంపేద్దాం.

తెలుగును తెలుగు లిపిలో రాస్తే- అమ్మ భాష.
తెలుగును ఇంగ్లీషు లిపిలో రాస్తే-  ? ?  ?  
 

- శ్రీ లక్ష్మి 

- సేకరణ 

Quote of the day

The will is not free - it is a phenomenon bound by cause and effect - but there is something behind the will which is free.…

__________Swamy Vivekananda