రోగాలని తగ్గించే శక్తి పాదరసానికి ఉందా ?

44.192.25.113

రోగాలని  తగ్గించే శక్తి పాదరసానికి ఉందా ?
-సేకరణ: లక్ష్మి రమణ  

ఆయుర్వేద శాస్త్రానికి సుశ్రుతుడు గుండెకాయ అయితే చరకుడు వెన్నెముక వంటివారు . భారతీయ ఆయుర్వేదానికి అనితరసాధ్యమైన పరిపూర్ణత సాధించి పెట్టిన చరకుడు క్రీ.పూ.3 వ శతాబ్దానికి చెందినవారు. మన పురాణాలలో “చరకులు” అంటే సంచరిస్తూ వైద్యం చేసేవారుగా చెప్పబడినది. చరకుడు తన శిష్యలైన వైద్యులతో గ్రామాలు తిరుగుతూ అక్కడి ప్రజలకు అవసరమైన వైద్యసేవలు అందించేవారని అధ్యయనాలు చెబుతున్నాయి.

ప్రాచీన ఆయుర్వేద గ్రంధాలలో చరకుని గురించి ఒక ఆశక్తిదాయకమైన కథ ఉంది. క్షీరసాగర మధనంలో పుట్టిన ధన్వంతరి, మొదటగా ఆయుర్వేద విజ్ఞానాన్ని సర్పరాజైన ఆ  ఆదిశేషుడికి  ఉపదేశించాడు. ఒకసారి ఆయన భూలోకానికి వచ్చి తీవ్రమైన ఒక వ్యాధికి గురియ్యారు . కదలడానికి కూడా కష్టమైపోయింది. ఈ విచిత్ర పరిస్థితిలో తన వ్యాధిని పోగొట్టుకోనేందుకు ముని కుమారునిగా జన్మించిన ఆదిశేషున్నే చరకునిగా చెబుతారు. “చర” అంటే భూమి మీద ధరించేవి అని అర్థం.

చరకుడు తన శిష్యులతో సంచరిస్తూ, అంటే పల్లెపల్లె తిరుగుతూ సంపన్నులకు, అతి సామాన్యులకు సమ ప్రాధాన్యం యిస్తూ వైద్య సహాయం అందించాడు. చరకుని వల్ల ఆయుర్వేదం భారతదేశంలో బహుళ వ్యాప్తి పొందింది. ఆయుర్వేద వైద్యం భారత దేశం లోని గ్రామ గ్రామాన విస్తరించి, ప్రతి ఊళ్ళోను ఒక ఆయుర్వేద వైద్యుడు ఉండేలా చేయడంలో చరకుడు – ఆయన శిష్యులు అవిరళ కృషి చేశారని చరిత్ర సాక్ష్యాలు నిరూపిస్తున్నాయి.

చరక సంహిత:

చరకుడు గొప్ప ఆయుర్వేద శిఖామణి. ఆయన  “చరక సంహిత” అనే గొప్ప ఆయుర్వేద సమగ్ర విజ్ఞాన గ్రంథం రచించారు .ఈ చరక సంహిత “అష్టాంగ స్థానములు” గా రచించబడినది. దీనిలో మొత్తం 120 అధ్యాయాలున్నాయి.

సూత్రస్థానం : 30 అధ్యాయములు
నిదానస్థానం : 8 అధ్యాయములు
విమానస్థానం : 8 అధ్యాయములు
శరీరస్థానం : 8 అధ్యాయములు
ఇంద్రియస్థానం : 12 అధ్యాయములు
చికిత్సస్థానం : 30 అధ్యాయములు
కల్పస్థానం : 12 అధ్యాయములు
సిద్ధిస్థానం : 12 అధ్యాయములు

చరకుని ఆయుర్వేద పరిజ్ఞానం మహోత్కృష్టమైనది. చరక సంహిత వెలువడిన కొన్ని శాతాబ్దాల తరువాత కూడా అనేక మంది వైద్య శాస్త్రవేత్తలు చరక సంహితను మళ్ళీ మళ్ళీ తిరిగి రచించి ఎన్నో వ్యాఖ్యానాలు రాశారు . వాళ్ళలో కాశ్మీకరుడు, ధృవబాల మొదలైన వాళ్ళు ముఖ్యులు. “చరకసంహిత” క్రీ.శ.987 లో అరబ్, పర్షియన్ భాషల్లోకి అనువదింపబడినది.

శరీరానికి కలిగే వ్యాధులు ముఖ్యంగా వాత,పిత్త,శ్లేష్మ దోషాల వల్లే కలుగుతాయని సిద్ధాంతీకరించాడు చరకుడు. ఆయుర్వేద వైద్యుల చిట్టాలో ముఖ్య ఔషధాలలో ఒకటైన ఉసిరి కాయ, తానికాయ, కరక్కాయ లతో తయారైన త్రిఫల చూర్ణం చరకుడు ప్రసాదించినదే! అలాగే వ్యాధికి జరిపే చికిత్స కంటే ముందు వ్యాధి కారణాలను కనుగొనడం ముఖ్యమని ప్రతిపాదించాడు చరకుడు. క్యాన్సర్ కణాలకు, పక్షవాతం , మూర్చ , కుష్టువ్యాధి, చూపు మందగించటం లేదా పూర్తిగా పోవడం వంటి వ్యాధులకు అతి సులభమైన నివారణోపాయాలను చరకుడు తన చరక సంహితలో పొందుపరిచాడు.

మనిషి రోగాన్ని తగ్గించే శక్తి పాదరసానికి ఉందని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఎన్నో మొండి రోగాలకు పాదరసాన్ని పుటం పెట్టి చరకుడు వైద్య ప్రయోగం చేసి రోగం నయం చేసిన తీరు పెద్ద పెద్ద వైద్య ప్రముఖుల్ని సైతం విస్మయానికి గురి చెసింది. మానసిక, శారీరక, ఆరోగ్యాలు రెండూ సరిగా ఉండటమే నిజమైన సంపూర్ణ ఆరోగ్యస్థితి అని ఆయుర్వేద వైద్య శాస్త్రం ఎన్నడో పేర్కొంది. 

భౌతిక పదార్థాలైన వృక్ష,జంతు, ఖనిజ,రసాయన సంబంధమైన ఔషధాలు శారీరక రుగ్మతల్ని తగ్గిస్తే కొన్ని రకాలైన మంత్రోచ్ఛాటన ఒక క్రమ పద్ధతిలో చేయటం వల్ల మానసిక రుగ్మతలు ఉపశమిస్తాయని చరకుడు ప్రతిపాదించాదు. ఇప్పుడు ఆధునిక వైద్యులు చేస్తున్న “ఆల్టాసోనిక్” వైద్య చికిత్సా విధానానికి చరుని సిద్ధాంతమే ప్రేరన.

మనిషి ఎప్పుడూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని, శారీరక మానసిక దృడత్వాన్ని కలిగి ఉండాలని, మంచి ఆలోచనలు మంచి ఆరోగ్యాన్నిస్తాయని, ఆహార విహారాదుల విషయంలో పరిశుభ్రత విధిగా పాటించినప్పుడే శారీరక ఆరోగ్యం స్థిరంగా ఉంటుందని సిద్ధాంతీకరించాడు. కేవలం శరీరం ఆరోగ్యంగా ఉండటం సాధ్యం కాదని, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండూ బాగున్నప్పుడే మనిషి పరిపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడని ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చరకుడు స్పష్టం చేశాడు.

ఆధునిక వైద్యులు నేటికీ చరక సంహిత లోని వైద్య సూత్రాలను, సూక్ష్మాలను గ్రహించి వైద్యసేవలు అందించటం విశేషం. చరకుని వైద్యగ్రంథం “చరకసంహిత” ను అధ్యయనం చేసి మరింతగా ఆయుర్వేదవైద్యులు తమ సేవలని  విస్తరించవలసి ఉంది . అప్పుడే , మన ఈ వైద్యం తిరిగి పూర్వప్రాభవాన్ని పొందగల్గుతుంది . 

Quote of the day

God is everywhere but He is most manifest in man. So serve man as God. That is as good as worshipping God.…

__________Ramakrishna