Online Puja Services

అపర గౌరమ్మ తిరుపతమ్మ తిరణాలకి వెళ్లారా!

3.145.131.238

అపర గౌరమ్మ తిరుపతమ్మ తిరణాలకి వెళ్లారా!
సేకరణ  

దైవం మానుష రూపేణా అన్నది ఈ భారత భూమిలో మాత్రమే కనిపించే సత్యం కాదు . విశ్వవ్యాప్తంగా “ ధర్మానికి విఘాతం కలిగినప్పుడల్లా నేను జన్మించి ధర్మోద్ధరణ చేస్తానని గీతలో భగవానుడు చెప్పిన మాటని నిజంచేస్తున్నారా” అన్నట్టు ఎందరో మహానుభావులు ఉదయించి మానవజాతికి దిశానిర్దేశనం చేశారు . అటువంటి  సత్‌ప్రవర్తనతో జీవితాన్ని పునీతం చేసుకున్నవారు,  జనం గుండెల్నే గుడిగా మలచుకుని అర్చనలు అందుకుంటూ ఉంటారు . అటువంటి వారిలో ఒకరు ఇప్పటికీ తన సత్యాన్ని చూపుతూ శరణన్నవారిని అనుగ్రహిస్తున్న  శ్రీ తిరుపతమ్మ తల్లి అమ్మవారు.

కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో పెదగంచిప్రోలు మండలం కేంద్రంలో తిరుపతమ్మ తల్లి వెలసి ఉన్నారు . ఈ ప్రాంతాన్ని గురించి శ్రీనాధుడు ఒక మాట చెబుతారు . “అచట పుట్టిన చివురు కొమ్మయిన చేవ “ అంటారు . అటువంటి చేవని కలిగిన పేరంటాలు తిరుపతమ్మ .  సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఈ నేలపై నడయాడి, ఇక్కడ గాలి పీల్చి, నీరు తాగి జన జీవనంలో ఒకటిగా మసలి, సామూహిక జన సంక్షేమం కోసం తనవంతు కృషి చేయడమే కాకుండా అవధుల్లేని ప్రేమని పంచి ఇచ్చిన మహిమాన్విత. ధన్యచరిత. 

 అపర గౌరమ్మ తిరుపతమ్మ:
శ్రీ తిరుపతమ్మ తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వరప్రసాదం. గోపినేనిపాలెం గ్రామంలో కొల్లా శివరామయ్య, రంగమ్మ దంపతులు సంతానం లేక కలత చెంది సంతాన ప్రాప్తికోసం శ్రీ తిరుమలేశుడిని వేడుకున్నారు. ఆ స్వామి అనుగ్రహ ఫలితంగా వారికి ఆడపిల్ల జన్మించింది. తిరుపతాంబ అనే పేరుతో ఆ అమ్మాయిని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. తిరుపతాంబకు చిన్నతనం నుంచీ ఆధ్యాత్మిక భావజాలం ఎక్కువే. భగవంతుడి సేవలో తరించేది. నిత్యం దేవతార్చనలో పునీతమయ్యేది.

ఆమె యుక్తవయసుకు రాగానే, పెనుగంచిప్రోలుకు చెందిన  కృష్ణయ్య, వెంకమ్మ దంపతుల కుమారుడు గోపయ్యకి ఇచ్చి వివాహం చేశారు . వివాహానంతరం తిరుపతాంబ అత్తవారి ఊరైన పెనుగంచిప్రోలుకి వచ్చింది. బిడ్డొచ్చినవేళ  అంటారుకదా , అలా ఆమె అడుగిడిన వేళావిశేషంతో ఆ గ్రామం సుభిక్షంగా మారింది. ఏ కష్టం లేకండా గ్రామస్థులందరూ సుఖసౌఖ్యాలతో జీవిస్తున్నారు. 

అయితే, సుభిక్షమైన ఆ ప్రాంతాన్ని కరువు కబళించడం మొదలు పెట్టింది . ప్రజలంతా ఆహారం కోసం అలమటిస్తుంటే... పశుగ్రాసం దొరక్క పశువులు సైతం చిక్కి శల్యమవుతున్నాయి. ఆ సమయంలో గోపయ్య తమ ఆవుల మంద పోషణార్థం భద్రాచలం సమీపంలోని అడవులకు తోలుకుని వెళ్లాడు.

దీంతో అత్తగారి వేధిపులు తిరుపతమ్మకి మొదలయ్యాయి . అత్త , ఆడపడుచుల ఆరళ్ళు పెట్టినా, కుష్ఠువ్యాధితో అలమటించినా  ఆదరించే దిక్కులేక, గొడ్లచావిట్లో  ప్రాణంలో ప్రాణంగా ప్రేమించిన తన భర్త కోసం కొనఊపిరి బిగబట్టి ఎదురుచూసిన సాధ్వి తిరుపతమ్మ .  చివరికి గోపయ్య తన ఆవుల్ని రక్షించబోయి పులికి బలయ్యాడు . ఆయన  మరణవార్త తాళలేక తననితానే యోగాగ్నిలో దహింపజేసుకుని తనువు చాలించింది  అపర గౌరమ్మ తిరుపతమ్మ.  

భర్తతో ఇలా యోగాగ్ని ప్రవేశం చేసేముందు, తిరుపతాంబ అక్కడికి చేరుకున్న గ్రామస్థులతో యోగాగ్ని ప్రదేశంలో మంగళసూత్రాలు, కుంకుమభరిణె, రూపులు కనిపిస్తాయంటూ గ్రామాధికారులు వీటిని భద్రపరచి ఆలయాన్ని నిర్మించాలంటూ ఆదేశించింది. అదే సమయంలో ప్రతి మాఘపౌర్ణమినాడు చంద్రునిలో తన రూపాన్ని దర్శించుకోవాల్సిందిగా కూడా సూచించింది. తిరుపతాంబ యోగాగ్ని ప్రవేశం తర్వాత గ్రామాధికారులు ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయమే ఇపుడు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి పొందింది. వివిధ సమస్యలున్నవారు అమ్మవారి కళ్యాణం జరిపించి, అమ్మవారి పసుపు కుంకుమ, అక్షితలు స్వీకరించి అన్నప్రసాదలు సేవిస్తే పరిష్కారమవుతాయని భక్తుల విశ్వాసం.  తిరుపతాంబను కష్టకాలంలో ఆదుకున్న పాపమాంబ వంశీకులైన ముదిరాజులే ఈ ఆలయంలో అర్చనాదులు నిర్వహిస్తున్నారు.

తిరుపతమ్మ మహిమ :
 పెళ్లికాని కన్యలు కాని బ్రహ్మచారులు కాని ఉంటే వారు ఈ అమ్మవారికి మొక్కుకుని ఇక్కడకు వచ్చి ఈ తిరుపతమ్మ, గోపయ్య ఉత్సవ మూర్తులకు కళ్యాణ వైభోగ సేవ చేయిస్తే చాలు వారికి వెనువెంటనే కళ్యాణ యోగం పడుతుంది. కలతలు కాపురాల్లో చోటు చేసుకొంటే కూడా ఆ దంపతులు కూడా ఇక్కడకు వచ్చి ఈ కళ్యాణ మూర్తులకు వివాహశోభ ను జరిపిస్తే వారింట కలతలు పోయి ఆ దంపతులు అన్యోన్యఅనురాగాలతో కాపురాలు చేసుకొంటారు. ఇదే నమ్మకంతో ఇక్కడ ఈ శ్రీగోపయ్య, తిరుపతమ్మ అమ్మవార్ల ఉత్సవ మూర్తులు నిత్యకళ్యాణశోభతో అలరారుతుంటాయి. 

శ్రీజేష్టాదేవి పెద్దమ్మ అమ్మవారు: 
గోపయ్య భౌతిక దేహానికి మరణాన్ని ఇచ్చిన ఈపులిరూపంలోని ఈ పెద్దమ్మ అమ్మవారు తిరుపతమ్మ అమ్మవారి గుడికి వచ్చి అమ్మకు మోకరిల్లి, తిరిగి ఇక్కడి మఱ్ఱిచెట్టుకు ప్రదక్షిణలు చేసి ఇక్కడే తుదిశ్వాస విడిచింది. ఈపులిరూపంలోని ఉన్న అమ్మకు సమాధిచేయడానికి తవ్వగా ఆ గోతిలో పెద్దపులివాహన రూఢియై పెద్దమ్మ తల్లి విగ్రహం లభ్యమైంది. అందుకే ఈ అమ్మవారికి ఇక్కడే దేవాలయాన్ని నిర్మించి ఈ తల్లిని కూడా పూజిస్తున్నారు.

తిరుపతమ్మ తిరునాళ్లు:
మాఘపౌర్ణమి నుంచి ఐదురోజులు అత్యంత వైభోగంగా అమ్మవారికి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. మాఘ పున్నమికి 41రోజుల ముందు భక్తులు అమ్మవారి మాలధారణ స్వీకరించి దీక్ష పూనుతారు. పెద్దతిరునాళ్ల సమయంలో భక్తులు తిరుముడిని అమ్మవారికి సమర్పిస్తారు. ఇవి మాఘ మాసంలో జరుగగా చినతిరునాళ్లు అని ఫాల్గుణ పౌర్ణమి నుంచి ఐదురోజులు తిరిగి తిరునాళ్లు జరిపిస్తారు. ఈ చిన తిరునాళ్లల్లో పసుపుకుంకుమ బండ్లు రావడం ప్రత్యేకం.

వందల సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ శ్రీతిరుపతమ్మ అమ్మవారి సేవలో తరిస్తూ ఆమె అనుగ్రహానికి పాత్రులయ్యేందుకు భక్తజనం తహతహలాడడం, తపన పడడం, తపస్సు చేయడం దైవత్వానికి అచ్చమైన, స్వచ్ఛమైన ప్రతీక. ఒక్కసారి కృష్ణాజిల్లాలోని పెనుగంచిప్రోలు వెళ్లి అక్కడ వెలసిన అమ్మవారినోసారి దర్శించుకోండి. మనసా వాచా ఆ తల్లి మహిమల్ని తలచుకుని సేదతీరండి.

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha