Online Puja Services

ఆమె సరస్సుకి సింహాల గుంపులు కాపలాగా ఉంటాయి .

3.145.183.137

పసుపు పచ్చని ఆమె సరస్సుకి సింహాల గుంపులు కాపలాగా ఉంటాయి . 
లక్ష్మీ రమణ 

ప్రత్యంగిరామాత మహా శక్తి . ఈవిడని ఆరాధించే వారికి ఎదురు నిలవగల వారుండరు . శతృ నాశిని , అభయప్రదాయని ప్రత్యంగిర . ఇటీవల ప్రత్యంగిరా హోమాలు విశేషంగా జరుగుతున్నాయి. రకరకాల కారణాలతో ఈ హోమాలని చేయించుకుంటున్నవారు అధికమవుతున్నారు. ఇంతకీ అసలు ఎవరీ దేవత? ఏమిటావిడ ప్రత్యేకత ?
 
ప్రత్యంగిరామాత మహామంత్రభీజాలను మొట్ట మొదట దర్శించిన ఋషి శ్రేష్టులు ఆంగీరస, ప్రత్యంగిరా .ఈ ఇరువురు మహాఋషులు గాడమైన తపోసాధనలో వుండగా అగమ్య గోచరమైన అనంత శూన్యము నుండి ఉద్భవించిన ప్రత్యంగిర భీజాక్షరాలను తమ యోగ దృష్టి తో దర్శించారు. అందుకే ఇరువురు ఋషోత్తముల పేర్ల మేలి కలయకతో ఆ బీజాక్షరాలకు (ప్రత్య +అంగీర) ప్రత్యంగిర అనే పేరు స్ఠిరపడింది .ఈ ప్రత్యంగిరా మహామంత్రము అధర్వణ వేదములోని మహాకాళీ కాండములో మహాప్రత్యంగిర సూక్తములో అంతర్భాగంగా వుంది . 

ప్రత్యంగిరామాత పుట్టినవైనము :
కృతయుగములో హిరణ్యకశ్యుపుని సంహరించటానికి శ్రీహరి నరసింహా అవతారములో రాతి స్ఠంభంలోనుండి ఉద్భవించిన ఉదంతం మనకు తేలినదే . కానీ ఆ రాక్షస సంహారంతో స్వామీ ఉద్భవించిన రూపానికి కోపం చల్లారలేదు.  నరసింహుని ద్వాంష్ట్రానల జ్వాలలకి సర్వ జగత్తు నాశనమౌతుందని దేవతలు భయపడిపోయారు . ఆ కోపాన్ని  చల్లార్చమంటూ పరమేశ్వరున్ని ప్రార్ధించారు. అప్పుడు  పరమేశ్వరుడు వీరభధ్రావతారములో నరసింహుని ముందుకు వచ్చి జ్ఞానభోధతో నరసింహుని అవతార ఆంతర్యాన్ని చెప్పి ఆయన్ని ఉపశమింపచేయాలని చూస్తారు. 

 కానీ నరసింహమూర్తి మరింత కోపంతో అష్టముఖ గండభేరుండమూర్తి అవతారంతో వీరభద్రుని పైకి లంఖిస్తాడు. అప్పుడు వీరభద్రుడు శరభావతారం దాలుస్తాడు. శరభుని రెండు రెక్కలలో ఒక రెక్కలొ శూలిని, మరో రెక్కలో మహాప్రత్యంగిరా శక్తులు దాగి వుంటాయి. అష్టముఖగండభేరుండమూర్తి తనవాడి అయిన ముక్కుతో శరభేశ్వరున్ని ముక్కలు చేయ్యటానికి యత్నిస్తాడు. శరభేశ్వరుని శూలిని శక్తి దాగివున్న రెక్క అష్టముఖగండబేరుండమూర్తి ముక్కుకి చిక్కుతుంది.  రెండో రెక్క నుండి మహాప్రత్యంగిరాదేవి ఉద్భవిస్తుంది. 

మహాప్రత్యంగిర రూపం : 
నేలనుండి నింగిని తాకేటట్లుండే మహాభారీకాయంతో కూడిన స్త్రీదేహం ఆ స్త్రీ దేహము కారుఛీకటితోకూడిన నల్లనివర్ణం, మగసింహపు వేయ్య తలలతో ఆవిర్భవించారు . ఆవిడ ఒక  వైపు ఎర్రటి నేత్రాలు, మరోవైపు నీలి నేత్రాలు కలిగి , రెండు వేల ముప్పైరెండు చేతులతో ఉద్భవిస్తారు, ప్రత్యంగిరామాత! మొదటి నాలుగు చేతులలో ఒకచేతిలో త్రిశూలము మరోచేతిలో సర్పము, అలంకారంగాచుట్టుకున్న డమురుకము,మరో చేతిలో ఈటె వంటి కత్తి మరోచేతిలో అసురుని శిరస్సు మిగితా అన్ని చేతులలో విభిన్న ఆయుధాలతో మెడలో కపాల మాలతో అత్యంత పొడువైన కేశాలతో కేశాల చివర శక్తి తోకూడిన తంతువులు నాల్గు సింహల స్వర్ణ రధంపై (ఈ నాల్గు సింహలను నాల్గు వేదాలు గా, నాల్గు పురుషార్ధాలుగానూ, నాల్గు ధర్మాలుగానూ విశ్లేషిస్తారు సాధకులు) ఉద్బవించింది. 

ఇలా ఉద్భవించిన మహామాత, మహా ప్రత్యంగిర స్వరూపాన్ని చూసి నరసింహమూర్తి అహంకారాన్ని వీడి, తన అవతార రహస్యాన్ని గుర్తెరిగి ఉగ్ర నరసింహ అవతారాన్ని చాలించి యోగ నరసింహ మూర్తిగా కొలువు తీరుతాడు. అందుకే మహా ప్రత్యంగిరను కాళీ సహస్రనామస్తోత్రంలో నృసింహిక అంటూ వర్ణించారు.

ప్రత్యంగిర భువిపై ఉద్భవించిన సరస్సు :
ఈమె అలా ఉద్బవించిన సరస్సు నేటికి హిమాచల్ ప్రదేశ్ లోని ఒక రహస్య ప్రదేశములోవుందనీ, ఆ సరస్సులో నీళ్లు పసుపు పచ్చని వర్ణంలో వుంటాయనీ ,  ఈ సరస్సుకు ఎల్లప్పుడూ  సింహాల గుంపు కాపలాగా వుంటుంది అని ఎంతో మంది సిద్ధ సాదకులు నిక్కచ్చగా చెపుతున్నారు. 

శివకేశవులని రక్షించిన ప్రత్యంగిరాదేవి:
సృష్టి ఆరంభంలో దేవతలకూ దానవులకూ యుద్ధం జరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి ఒక రాక్షసుణ్ని సంహరించడానికి తన సుదర్శన చక్రాన్ని సంధించాడట. సుదర్శన చక్రం ఆ రాక్షసుణ్ని ఏమీ చేయలేక తిరిగి వచ్చిందట. ఆ సంగతి తెల్సుకుని శివుడు కోపంతో తన త్రిశూలాన్ని ప్రయోగించాడట. ముక్కంటి త్రిశూలం కూడా విఫలమవడంతో విజయగర్వంతో ఆ రాక్షసుడు శివకేశవుల వెంటపడ్డాడట. దాంతో వారిద్దరూ తమకిక ఆదిపరాశక్తే దిక్కని తలచి ఆ తల్లిని ప్రార్థించారట.

అప్పుడు ఆదిపరాశక్తి లక్షసింహముఖాలతో అతిభయంకరంగా ఆవిర్భవించి రాక్షసుడినీ అతని సైన్యాన్నీ సంహరించిందట. లోకభీకరంగా వెలసిన అమ్మవారిని చూసి దేవతలంతా భయంతో పారిపోయారనీ అందుకే ప్రత్యంగిరా దేవికి పూజాదికాలు నిర్వహించే ఆచారం అంతగాలేదనీ ఐతిహ్యం.

నికుంభల: 
అధర్వణవేదంలోని మంత్రాలలో ఈ అమ్మవారి ప్రస్తావన వస్తుంది కాబట్టి అధర్వణ భద్రకాళి అనీ శత్రువులకు వూపిరాడకుండా చేసే శక్తి కనుక నికుంభిల అనీ, ఇలా ప్రత్యంగిరా దేవికి చాలా పేర్లున్నాయి.

ఇంద్రజిత్తు ఆరాధన: 
ప్రత్యంగిరా దేవి ఆరాధన రామాయణకాలానికి ముందు నుంచే ఉంది. శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు, నరకాసురుడు, ఘంటాకర్ణుడు, జరాసంధుడు తదితరులు ప్రత్యంగిరాదేవిని అనేక రూపాల్లో పూజించారని పురాణాలు చెబుతున్నాయి.

రావణాసురుని కుమారుడైన ఇంద్రజిత్తు ప్రత్యంగిరాదేవిని 'నికుంభిల' రూపాన పూజించి ఉపాసన చేసేవాడనీ ఏదైనా యుద్ధానికి వెళ్లేముందు ఆ అమ్మవారికి యజ్ఞం చేసి జంతుబలులు ఇచ్చి బయలుదేరేవాడనీ అందుకే అతనికి అపజయమన్నదే ఉండేది కాదనీ ప్రతీతి.

రామరావణ యుద్ధం జరిగేటప్పుడు కూడా ఇంద్రజిత్తు యథాప్రకారం ప్రత్యంగిరాదేవి అభయం కోరుతూ ఒక యజ్ఞం మొదలుపెట్టాడట. అప్పుడు విభీషణుడు ఇంద్రజిత్తు యజ్ఞానికి విఘ్నం కలిగిస్తే అతణ్ణి జయించడం సులువని వానరసేనకు చెప్పాడట. దాంతో వానరులంతా వెళ్లి యాగమండపాన్నీ యజ్ఞాన్నీ ధ్వంసం చేశారట. సమయం మించిపోతుండటంతో యజ్ఞాన్ని సగంలోనే ఆపేసి యుద్ధానికి బయలుదేరాడట ఇంద్రజిత్తు. ఆరోజే లక్ష్మణుడిని ఎదుర్కొని అతని చేతిలో హతమయ్యాడట.

చంద్రఘంట :
ఘంటాకర్ణుడనే యక్షుడు ఈ అమ్మవారిని 'చంద్రఘంట'(నవదుర్గలలో మూడో అవతారం) రూపాన ఆరాధించి ఆ శక్తిని కర్ణాభరణంగా ధరించాడట. ఇలా ఎందరో పురాణపురుషులు పూజించిన దేవత ప్రత్యంగిరా దేవి. ప్రత్యక్షంగానే కాదు, పరోక్షంగానూ ఈ తల్లి తనను పూజించేవారిని కాచికాపాడుతుందని నమ్మిక. నిత్యం లలితాసహస్రనామం చదివేవారిని దుష్టగ్రహ పీడల నుంచి కాపాడేది ప్రత్యంగిరా దేవేనని భక్తుల విశ్వాసం.

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya