Online Puja Services

విద్య వినయంతో పరిమళించాలి

3.15.10.137

విద్య వినయంతో పరిమళించాలి కానీ, అహంకారంతో ఉండకూడదు!
-లక్ష్మీ రమణ 

కాళీమాత లోక జనని. ఆమె అనుగ్రహాన్ని పొంది సంస్కృత కవిగా వాసికెక్కి , అఖండ మైన విద్వత్తుతో కావ్య రచనచేసి కీర్తిని పొందారు కాళిదాస మహాకవి . కాళిదాసు మొదట కట్టెలు కొట్టుకొనే వాడు. కూర్చున్న కొమ్మనే నరుక్కునేంత మూర్ఘుడు. కానీ మంత్రిలాంటి భార్యమాట విని ఆ కాళికా అనుగ్రహాన్ని పొంది , కాళికా ప్రసాదంగా విద్యని పొంది సంస్కృత కవిగా విరాజిల్లాడు. ఎంతటి వాడైనా వెనకటి రోజుని గుర్తుంచుకోవాలి. అహంకారం ఒక్కసారి అడుగు పట్టిందంటే , ఎంతటి విద్వత్తు ఉన్నా అది, అక్కరకు రాకుండా పోతుంది మరి . 

కాళిదాసు మహాకవి. 

‘శ్లో॥మాణిక్యవీణ ముపలాల యంతిం
   మదాలసాం మంజులవాగ్వేలాసారి
   మహేంద్రనీలద్యుతికోమలాంగీం
   మాతంగ కన్యాం మనసా స్మారామి

శ్లో॥ చరుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే
      కుంకుమ రాగశోణే
      పుండ్రేక్షు పాశాంకుశ పుష్ప బాణహస్తే 
నమస్తే జగదేశమాత

శ్లో॥ మాతామరకతాశ్యామా మాతంగీ మధుశాలినీ
     కుర్యసత్కటాక్షిం కల్యాణీ కదంబ వనవాసిని

శ్లో॥ జయ మాతంగతనయే జయనీలోత్పంద్యుతే
     జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే’ 

అని అమ్మవారిని ఆశువుగా గానం చేసినవాడు . కుమార సంభవము, రఘు వంశము, మేఘ సందేశము,ఋతు సంహారము అనే కావ్యాలని, మాళవికాగ్నిమిత్రము (మాళవిక, అగ్నిమిత్రుని కథ), విక్రమోర్వశీయము (విక్రముడు, ఊర్వశి కథ), అభిజ్ఞాన శాకుంతలము (శకుంతల, దుష్యంతుల కథ ). అనే నాటకాలు రాశారు . వీటిల్లో అభిజ్ఞాన శాకుంతలము అత్యంత ప్రాచుర్యము పొందింది . అంతేగాక, దాదాపు అన్ని భారతీయ భాషలతో పాటుగా  ఆంగ్లములో, జర్మనులో అనువదింపబడిన మొదటి కాళిదాసు రచన ఇది. అశేష ప్రజాదరణ పొందిన రచనలివి . 

ఇంతటి కవినికదా నేను ! అని ఎక్కడో ఆ కవి కాళిదాసుకి ఒక చిన్న అహంకారం మొదలయ్యింది . సరే, మండువేసవిలోని ఒకరోజు కాళిదాసు ఒక కుగ్రామం గుండా ప్రయాణిస్తూ, దాహంతో అలమటించసాగాడు. తాహం తీర్చుకోవడానికి దరిదాపుల్లో ఒక్క చుక్క నీరైనా కనిపించలేదా కవిరాజానికి. ఒక గుడిసె ముందు నిలబడి, ‘అమ్మా ! దాహం తీర్చుకోవడానికి నీళ్లివ్వండి’ అని అడిగాడు. లోపలినుండి తొంగిచూసి , ఒక ముసలి కంఠం బదులు పలికింది .  ‘ నాయనా !మీరెవరు ? ఎక్కడి నుండీ వస్తున్నారని ‘ ప్రశ్నించింది .  అమ్మ నేను తెలీదా?  నేను కవిని, పండితుణ్ణి , నాగురించి ఎవరినడిగినా చెబుతారు  ‘ అని ఒకింత గర్వంగా సమాధానం చెప్పాడు కాళిదాసు . 

నువ్వు పండితుడివన్న మాట నమ్మాలంటే, ప్రపంచంలోని ఇద్దరు బలవంతులెవరో చెప్పు చూద్దాం అందావిడ దాహం ఇవ్వకుండానే . ఆకలి , దాహం మనిషిలోని ఆలోచనని , మేధని చంపేస్తాయి . కాళిదాసు కూడా అందుకు అతీతుడు కాదుమరి . ‘ సమాధానం నాకు తెలీదు .  ముందర నీళ్లివ్వమ్మా !  ‘ అన్నాడాయన . 

ఆ అవ్వ నవ్వుతూ , వాళ్ళు నీతో ఇలా మాట్లాడించిన ఆకలి , దప్పికలే బాబూ ! ఇప్పుడు చెప్పు , నువ్వెవరూ ? అని అడిగింది .  పేరు చెప్పకుండా , నేనో బాటసారిని అన్నాడాయన . వెంటనే ఆమె దాహం ఇవ్వకుండా మరో ప్రశ్న సంధించింది, అవునా అయితే, ఇద్దరు అలుపెరుగని బాటసారులెవరో చెప్పు చూద్దాం? ‘అంది . 

కాళిదాసు దీనంగా ‘ నాకు తెలియదు మాతా ! ముందుగా కాసిని నీళ్లివ్వండి, గొంతెండిపోతోంది’ అని బ్రతిమిలాడాడు. అప్పుడామె వారు సూర్య చంద్రులు నాయనా ! సరే, ఇప్పుడు చెప్పు నీవెవరు ? అని అడిగింది . సమాధానంగా తన పేరు చెప్పకుండా, నేను అతిధిని అన్నాడు కాళిదాసు . కాదు కాదు , ఇదీ అసత్యమే ! ఈ సృష్టిలో అతిధులు ఇద్దరే! ఒకటి ధనం , రెండవది యవ్వనం అని వివరిస్తుంది ఆ అవ్వ . 

ఈ విధంగా కాళిదాసు తన పేరు చెప్పకుండా ఈ సారి కూడా నీవెవరని అడిగినప్పుడు ,సహనాన్ని పరీక్షించొద్దని వేడుకుంటే,   సహన శీలుడనని సమాధానం చెప్పినప్పుడు , ప్రపంచంలోని సహన శీలత్వం వృక్షం, భూమికే ఉన్నాయని; విసిగిపోయి తాను మూర్ఘుడినని చెప్పినప్పుడు ఆ రాజ్యంలో ఇద్దరే ముర్గులు ఉన్నారని వారిద్దరూ , ఆ దేశాన్ని పాలించే రాజు , ఆ రాజుకి సలహాలిచ్చే పండితుడు అని వివరిస్తుంది ఆ అవ్వ. 

అప్పుడు కాళిదాసు, ఆమె సామాన్యురాలు కాదని గ్రహించి , ఆమె పాదాలను ఆశ్రయిస్తాడు . కరుణించి కాపాడి , గుక్కెడు మంచినీళ్లిమ్మని ప్రాధేయపడతాడు .  అప్పుడు ఆ అవ్వ  సరస్వతీదేవిగా కాళిదాసు ముందర నిజరూపంలో నిలుస్తుంది . ‘ నాయనా, విద్య వినయంతో పరిమళించాలి కానీ, అహంకారంతో ఉండకూడదు . కీర్తి ప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని సరిచేసి, మందలించడానికే ఈ పరీక్ష’ అని మంచినీరు ఇస్తుంది. దాంతో కాళిదాస మహాకవికి కడుపు నిండడమే కాదు, విద్యాదేవి ఇచ్చిన దాహం పుచ్చుకున్నాక బుద్ధి కూడా నిండి వికాసాన్ని పొందుతుంది . 

అందువల్ల మన విద్య అనేది వినయంతో పరిమళించాలే గానే, అహంకారంతో నిండిపోకూడదు .        
 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha