తినకుండా ఉపవాసం ఉండడానికి

3.239.129.91

తినకుండా ఉపవాసం ఉండడానికి - భగవంతునితో సన్నిహితంగా ఉండడానికి సంబంధం ఏంటి ?
-లక్ష్మీ రమణ 

భక్తి శ్రద్దలతో భారతీయులు ఒక క్రమ పద్దతిలో లేదా పండుగల వంటి ప్రత్యెక సందర్భాలలో ఉపవాసాన్ని పాటిస్తారు. అటువంటి రోజుల్లో వాళ్ళు ఏమీ తినకుండా ఉండడం , రోజులో  ఒక్కసారి తినడం లేదా పండ్లు, అల్పాహారమును ఆహారముగా తీసికొని ఉపవాసము చేస్తుంటారు . కొందరు రోజంతా కనీసం మంచి నీళ్ళు అయినా త్రాగకుండా కఠిన మైన ఉపవాసము చేస్తారు. భగవంతుని కోసం లేక సంయమనం కోసం, అసమ్మతిని తెలియ పరచడానికి కూడా ఉపవాసం చేయడం భారతీయులకి అలవాటు . ఇంతకీ ఉపవాసం అంటే ఏమిటి ? ఎందుకీ సంప్రదాయాన్ని పాటించాలి ?

నిజానికి సంస్కృతంలో ఉప అంటే ‘దగ్గరగా’ + వాస అంటే ‘ఉండడం’ అని అర్ధము. కాబట్టి ఉపవాసము అంటే దగ్గరగా ఉండడం. ఎవరికి దగ్గరగా ఉండడం ? భగవంతునికి దగ్గరగా ఉండడం .  భగవంతునితో సన్నిహిత మానసిక సామీప్యతను సంపాదించడం.

తినకుండా ఉండడానికి - భగవంతునితో సన్నిహితంగా ఉండడానికి సంబంధం ఏంటి ? శరీరం ఎంతసేపూ ఇవాళ ఏంతిందామనే ఆలోచనలో ఉంటుంది . ఇక లోపలున్న యంత్రాంగం (జీర్ణవ్యవస్థ ) తిన్న ఆహారాన్ని ఏవిధంగా జీర్ణం చేయాలా అని ఆలోచిస్తుంటుంది .  దీనికి తినడం అరిగించుకోవడం ఈ రెండే పనులు అయిపోతే, ఇక భగవంతునివైపు ప్రయాణం అనే భావనకి తావెక్కడుంది . అలాగని , పూర్తిగా తినడం మానేయమని చెప్పడం ఉద్దేశ్యం కాదు . అది సబాబుకూడా కాదు . ఏ యంత్రానికైనా చోదకశక్తి (ఉదాహరణకి పెట్రోల్ / విద్యుత్తు ) అవసరమే కదా ! ఆహారం లేకపోతె, మన శరీరం కూడా చోదక శక్తి లేని యంత్రంలా అయిపోతుంది . 

కానీ అమితమైన ఆహారం తీసుకోవడం కూడా మంచిది కాదు . కార్తీకమాసాలలో ఉపవాసాలు , ఒక్కపూట భోజనం చేయమంటారు . చలి ఎక్కువగా ఉండే ఈ రోజుల్లో ఇలా నత్తం చేయడం వలన శరీరానికి మంచి శక్తి లభిస్తుంది.  బుద్ధి చురుగ్గా పని చేస్తుంది .  దానివల్ల శరీరం తక్కిన ఏడాదంతా ఉత్సాహంగా ఉండేందుకు వీలవుతుంది .  

ఆహారములలో విహితమైనవి , తినకూడనివి ఏమిటని యోగశాస్త్రం మనకి వివరిస్తుంది . భగవంతునివైపు ప్రయాణం చేయాలనుకుంటే, ఈ ఆహార నియమాలు చక్కగా ఉపయోగపడతాయి . కొన్ని రకాల ఆహారము మన బుద్ధిని మందకొడి గాను , మనసులో అలజడిని కలిగగించే విధంగానూ ఉంటాయి .  అందువలన మానవుడు కొన్ని నియమిత రోజుల్లో నిరాహారముగా లేక అల్పాహారముగా గాని ఉండి తన సమయాన్ని శక్తిని ఆదా చేసికోవాలి . తద్వారా బుద్ధి చురుకుగాను మనసు పవిత్రముగాను అవుతుంది. అది వరకు ఆహారపుటాలోచనలు కలిగిన మనస్సు ఇప్పుడు ఉన్నతమైన ఆలోచనలతో కూడి భగవంతుని వద్ద నిలుస్తుంది. తనకు తాను నియమించుకొన్న క్రమశిక్షణ కాబట్టి ఆనందంగా ఆ నియమాన్ని మనస్సు అనుసరించే ఉంటుంది.

ఏ పని తీరుకైనా కూడా అది బాగా పనిచేయాలంటే మరమ్మత్తూ , పూర్తి విరామము అవసరము. ఉపవాసంలో నిరాహారముగా లేక అల్పాహారముగా ఉండడం  వలన జీర్ణ మండలానికి విశ్రాంతి లభిస్తుంది.

ఇంద్రియాలతో విషయ భోగాలు అనుభవించే కొద్దీ అవి వశము కాక ఇంకా ఎక్కువ కావాలని మారం చేస్తాయి . కల్పించే భౌతికమైన కోర్కెలకు అంతం ఉండదు . కానీ,  ఉపవాసము మనకు ఇంద్రియ నిగ్రహము అలవరచుకోవడానికి, కోర్కెలను ఉదాత్తమైన వాటిగా చేసికోవడానికి, శాంతియుత మనస్సును కల్గి ఉండడానికి మార్గము చూపి సహాయ పడ్తుంది.

ఉపవాసము మనలని నీరస పరిచేదిగాను, తొందరగా కోపం కల్గిన్చేటట్లుగాను , మనసు వెళ్లిన చోటికల్లా వెళ్లి , దీన్ని తరువాత అనుభవించ వచ్చుననే ప్రేరణ నిచ్చేదిగాను ఉండకూడదు. ఉపవాసము వెనుక ఉన్నతమైన లక్ష్యము లేనప్పుడు ఇట్లా జరుగుతుంది. కొందరు కేవలము బరువు తగ్గించుకునే నిమిత్తమే ఉపవాసం లేదా పత్యం (diet) పాటిస్తారు. మరి కొందరు భగవంతుని మెప్పించడానికి ప్రతిజ్ఞగా లేదా తమ కోరికలను తీర్చుకొనేందుకు, మరి కొందరు సంకల్ప శక్తి వృద్ధి చేసికోవడానికి, సంయమనానికై, కొందరు ఒక విధమైన తపస్సు గాను ఉపవాసము చేస్తారు. మరీ తక్కువగా కాక ఎక్కువగా కాక యుక్త ఆహారము తీసికోవలసినదని కేవలము ఉపవాసము చేయునప్పుడే కాక మిగతా రోజుల్లో కూడా శుచి ఐన బలవర్ధకమైన సాత్విక ఆహారము తీసికోవలసినదిగా భగవద్గీత మనకు బోధిస్తుంది.

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi