రావణుడి పది తలల వెనుక రహస్యం ఇదే!

54.165.57.161

రావణుడి పది తలల వెనుక రహస్యం ఇదే!
-సేకరణ : Lakshmi Ramana

మనందరికీ రావణుడు పెద్ద రాక్షసుడు , కానీ వారికి మాత్రం ఆయన అంటే అభిమానం. రామాయణంలో రావణుడే ప్రతినాయకుడు. కానీ ఈ రామాయణ గాథకు మరో పార్శ్వం శ్రీలంకలో ఉంది. శ్రీలంక ప్రజల ప్రకారం రావణుడు పెద్ద హీరో. శ్రీలంక మొత్తం జనాభాలో హిందువుల సంఖ్య 12.6శాతం. ఇక్కడి హిందువులకు రావణుడిపై గొప్ప అభిమానం ఉండడం విశేషం. 

మను యుగంలో సప్తరుషుల్లో ఒకరైన విశ్రవుడి కుమారుడు రావణుడు. కైకసి, విశ్రవుడికి కలిగిన సంతానమే రావణుడు. మంచి పండిత కుటుంబంలో పుట్టిన రావణుడు గొప్పగా విద్యాభ్యాసం పూర్తిచేశాడు. యుద్ధవిద్యల్లో , సంప్రదాయమైన వేదాభ్యాసాలలో ఆరితేరిన పండితుడు రావణుడు.

రావణుడికి 10 తలలున్నాయి, కనుక రాక్షసుడంటే మీరు పొరపడ్డట్టే అని లంకేయులు వివరిస్తారు. అపారమైన విజ్ఞాన సంపదను సొంతం చేసుకున్న కారణంగా రావణుడికి పది  తలలు బహుమానంగా లభించాయి. అంతేకాదు పది తలలంటే అర్థం గొప్ప పండితుడని. విజ్ఞాని అన్నది ఇక్కడ ఉన్న అసలు అర్థం. అంటే, రావణాసురుడు పదిరకాలైన వ్యక్తిత్వాలని కలిగిఉన్నాడన్నమాట . 

రావణుడు గొప్ప రాజు, పరిపాలనపై ఎంతో అనుభవం ఉన్నవాడు. రావణుడు గొప్ప వైద్యుడు కూడా. అందుకే ఆయుర్వేదంలోని 7 పుస్తకాల్లో ఆయన పేరు కూడా ఉంది. తన భార్య విజ్ఞప్తిమేరకు రావణుడు చిన్నపిల్లలకు వచ్చే అనారోగ్యాలు, చికిత్సలపై ఆయుర్వేదలో ఏకంగా ఒక పుస్తకాన్ని కూడా రాసిన అపరజ్ఞాని. పలు రంగాల్లో తనదైన చెరగని ముద్ర వేసుకున్న రావణుడు అపర మేధావి. భార్యతో కాలక్షేపం చేస్తూ ఆడుకోవడానికి చదరంగాన్ని సృష్టించింది ఆయనే అనేది లంకేయుల నమ్మకం .  

పుష్పక విమానం సృష్టికర్త!

రామాయణంలో సీతాపహరణ సమయంలో పుష్పక విమానంలో రావణుడు వస్తాడన్న ఘట్టం మీకు గుర్తుందా.  ఈ పుష్పక విమానం సృష్టికర్త స్వయంగా రావణుడే అంటారు లంకావాసులు . ఈ పుష్పక విమానం గొప్పతనం, ప్రత్యేకతలు విన్న దేవతలు సైతం రావణుడిని చూసి ఈర్ష్యపడేవారట. అంటే శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో కూడా రావణుడిది అందెవేసిన చెయ్యి అన్నమాట.

అపారమైన భక్తి.

అపారమైన భక్తిభావం కల అపర భక్తుడు రావణుడు. శివుడికి అతిపెద్ద భక్తుడైన రావణుడు ధ్యానంలో నిమగ్నమైతే కొన్నిరోజులపాటు అలాగే ధ్యానముద్రలో గడిపేవాడని ఇక్కడివారు నేటికీ గొప్పగా చెప్పుకుంటారు. తన భక్తితో శివుణ్ణి సైతం మెప్పించి, ఆత్మలింగాన్ని చేజిక్కించుకున్న గొప్ప భక్తాగ్రేసరుడు రావణుడు అని వీరు సగర్వంగా చెబుతారు.

రావణుడు తప్పు చేయలేదు!

శ్రీలంకన్లు ఇప్పటికి కూడా రావణుడు తప్పుచేయలేదని ఇదంతా రాముడు చేసిన తప్పేనని చెబుతారు. రాముడి అందాన్ని చూసి పరవశించిన రావణుడి సోదరి సూర్పణఖ తనను వివాహం చేసుకోమంటే రాముడు తిరస్కరిస్తాడు. ఆతరువాత లక్ష్మణుడు సూర్పణఖ ముక్కు కోసేస్తాడు. దీంతో తన సోదరికి జరిగిన పరాభవాన్ని తిప్పికొట్టేందుకే రావణుడు సీతను ఎత్తుకొచ్చాడు. అన్నగా రావణుడు చెల్లి తరపున ప్రతీకారం తీర్చుకునేందుకు ఇలా చేశాడు. పెద్దన్నగా ఆయన ప్రవర్తన చూస్తే ఏ అన్న అయినా ఇలాగే స్పందిస్తాడని శ్రీలంకన్లు వాదిస్తారు.

దేవుడిగా ఆరాధించరు కానీ,

ఇదంతా చదివి శ్రీలంకన్లు రావణుడిని దేవుడిగా ఆరాధిస్తారని మాత్రం తప్పుగా అర్థం చేసుకోకండి. గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న గొప్ప రాజుగా, పరిపాలకుడిగా రావణుడిని వీరు అభిమానిస్తారు. రావణుడు ఓ పెద్ద ట్రాజిక్ హీరో అని, సొంత తమ్ముళ్లే ఆయన్ను వంచించినట్టు లంకన్లు భావిస్తారు. చెల్లికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్న గొప్ప అన్నగా రావణుడు ఇక్కడి చరిత్రలో మిగిలిపోయాడు. మరో విశేషం ఏమిటంటే శ్రీలంకన్లు రావణుడిని ఆరాధించేందుకు ఎటువంటి గుళ్లూ, గోపురాలు కట్టలేదు, పైపెచ్చు ప్రత్యేకంగా ఆయన కీర్తిని, గొప్పతనాన్ని చాటేందుకు ఉత్సవాలంటూ ఏమీ జరుపుకోరు.  కానీ ఆరాధనా భావంతో రావణుడి కీర్తిని వీరు తరతరాలుగా కొనియాడుతూ వస్తున్నారు.

రావణుడి పాత్ర ఇతిహాసాల్లో గొప్ప వింతగా మిగిలిపోయింది, ఎందుకంటే అపర శివ భక్తుడు, గొప్ప పరిపాలనా దక్షత ఉన్న మేధావి ఒక స్త్రీలోలుడిగా ఎలా మారిపోయారన్నది అంతుచిక్కని ఆసక్తికరమైన రహస్యం. ఒకే వ్యక్తిలో ఇలా విపరీతమైన విచిత్ర పార్శ్వాలుండటం అరుదులో అరుదుమరి.

Quote of the day

Do not dwell in the past; do not dream of the future, concentrate the mind on the present moment.…

__________Gouthama Budda