Online Puja Services

అగ్నిగర్భ అయిన అపరాజితే అందుకు కారణం !

18.222.113.111

అగ్నిగర్భ అయిన అపరాజితే అందుకు కారణం !
-లక్ష్మీ రమణ 

ప్రకృతిని పూజించడం అనేకంటే, ప్రక్రుతి లోని విశిష్టతలని పూజించడం మన సనాతన ధర్మం అనుగ్రహించిన వరం . భగవంతుడు ఎక్కడున్నాడు అంటే, చెట్టులో ఉన్నాడు , పుట్టలో ఉన్నాడు , పిట్టలో ఉన్నాడు , నీలోనూ నాలోనూ చలానా చలన ప్రతి అణువులోనూ ఉన్నాడని ప్రహ్లాదుడి వృత్తాంతం ద్వారా చెప్పిన మన ఋషులు, ఆ చరణలోనూ దాన్నొక సంప్రదాయంగా ధర్మంగా నిర్దేశించారు . అటువంటి వాటిల్లో ఆరణిగా , అపరాజితా దేవిగా , అగ్నిగా పూజలందుకొని శమీవృక్షం లేదా జమ్మి చెట్టు కూడా ఒకటి . పాండవులు ప్రపంచంలో వేరే  చోటే దొరకనట్టు, ఆ శమీవృక్షం పైనే తమ ఆయుధాలను ఎందుకు పెట్టారు ? ఇది మనం ఖచ్చితంగా చర్చించాల్సిన అంశమే కదూ !

చెట్టుని దేవతా స్వరూపంగా పూజించడం మనకి వేదకాలం నుండీ వస్తున్న సంస్కృతి. తులసి , ఉసిరి , మారేడు , వేప , మోదుగ, రావి , జమ్మి వంటి ఆయుర్వేద ప్రాధ్యతలు గల  చెట్లని మనం దేవతా వృక్షాలుగా పూజిస్తుంటాం . వీటిల్లో జమ్మి వృక్షం (లాటిన్ Prosopis) ఫాబేసి కుటుంబానికి చెందినది. శాస్త్రీయ నామం ప్రోసోపిస్ సైసిజెరా. వైదిక భాషలో శమీ వృక్షాన్ని 'అరణీ' అనే పేరుతో పిలుస్తారు. అగ్నిని ఉద్భవించేందుకు మధింప యోగ్యమైన కాండమే  ఈ "ఆరణి'.  

శ్రౌతాగ్ని:
పూర్వం అగ్గిపెట్టెలు లేని కాలంలో , అగ్నిని పుట్టించేందుకు చెకుముకి రాళ్ళని, చెక్కముక్కలని ఉపయోగించేవారనేది మానవ పరిణామ క్రమంలో వివరంగా ఉంది కదా ! అలా అగ్నిని రగిలించడానికి ఉపయోగపడిన చెక్క వేరేదో కాదు .  ఈ జమ్మి వృక్షమే . ఇప్పుడు ఆధ్యాత్మికకోణంలో ఆలోచిద్దాం . జమ్మి వృక్షము ఆ పరమాత్మిక - అంటే ప్రకృతి . ఇక రావి చెట్టు పరమాత్మ అని శ్రుతివచనం (శమింతా, అశ్వత్థ:). పరమ శివుని లింగాకృతిలో పానవట్టం పరమాత్మిక అయితే, లింగం పరమాత్మ కదా ! అలాగే ,ఆ శివలింగం ఏవిధంగా పానవట్టంలో ఉందొ అదేవిధంగా , ఈ జమ్మి కాండంలో రావి కాండాన్ని ఉంచి మధిస్తారు . అప్పుడు ఆ గర్భం నుండీ వెలువడేది శుద్ధమైన అగ్ని (శమీగర్భాదగ్నింమన్థతి) . సృష్టికి ప్రతీక . ఇలా పుట్టిన అగ్ని కల్మషాలు లేనిది .  స్వచ్ఛమైనది . సాక్షాత్తూ ఆ అగ్నిదేవుడే ! ఇప్పటికీ యజ్ఞ , యాగాదులు నిర్వహించేప్పుడు ఈ అగ్ని మధనం చేస్తారు. చెప్పినంత సుళువువేమీకాదు ఈ అగ్ని జననం . ఆరణిని మధించేప్పుడు, చెమటలు కక్కుతారు పురోహితులు . ఇలా పుట్టేఅగ్నిని  శ్రౌతాగ్ని అంటారు . ఈ విధంగా  జనించిన నిప్పుతో అగ్ని హోత్రాన్ని వెలిగిస్తారన్నమాట.     

రాజులచేత పూజలందుకున్న అపరాజిత :

పూర్వకాలంలో రాజులు తమ విజయ యాత్ర సన్నాహక కార్యక్రమాలుగా అగ్నిపూజ చేసేవారు. దానిలో భాగంగానే శమీవృక్ష పూజ చేసి, యుద్ధానికి వెళ్ళేవారు. దీనికి సంబంధించిన  కొన్ని విశేషాలను కాళిదాసు రఘువంశ మహా కావ్యములోని నాలుగవ సర్గలో సూచించారు. అగ్ని తత్వమున్న జమ్మిచెట్టుని ‘అపరాజిత’ అని పిలుస్తారు .  అమ్మవారి నామాలలో ఇదికూడా ఒకటి . పరాజయము లేనిది అని అర్థం . అంటే, విజయానికి సంకేతం.  ఇక, శమీవృక్షంలో అగ్ని నిక్షిప్తమై ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. భృగు మహర్షి కోపం నుంచి తప్పించుకోవడానికి స్వయంగా ఆ అగ్ని దేవుడే ఈ చెట్టులోదాగి ఉన్నాడని కథ. అగ్ని వీర్యమే సువర్ణం ని చెబుతారు . ఆ విధంగా కూడా అగ్ని సంబంధమైనదిగా , శక్తినిప్రసాదించే వృక్షంగా శమీ వృక్షం మనకి కనిపిస్తుంది . 

పుట్టుక :
శమీవృక్షం గురించి మన పురాణాలు గొప్ప కథల్ని వినిపిస్తాయి .దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఆవిర్భవించిన దేవతా వృక్షాల్లో శమీవృక్షమూ ఒకటి . నాడు శమీవృక్షంతోబాటు ఆవిర్భవించిన తులసి, పారిజాత, బిల్వ వృక్షాలకు వనమాలి అనే ఓ అధిష్టాన దేవత ఉందనీ, ఆమెనే శమీ దేవత అని కూడా చెబుతారు . 

రామాయణంలో శమీవృక్షం : 
త్రేతాయుగాన వనవాససమయంలో శ్రీరాముడు కుటీరాన్ని జమ్మి చెట్టు కలపతోనే నిర్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ముందే చెప్పుకున్నట్టు , రాజులు యుద్ధసమయాల్లో అపరాజితా స్వరూపంగా శమీ వృక్షాన్ని పూజించడం అనేది రామాయణ కాలం నుండీ ఉన్నట్టు రామాయణ కావ్యం చెబుతుంది . రాముడు రావణునితో యుద్ధానికి ముందు శమీ పూజచేశారని, అప్పుడా అపరాజితాదేవి రాముని విజయం కలుగుతుందని ఆశీర్వదించింది అని ఈ ఇతిహాసం చెబుతుంది . 

పాండవులు శమీవృక్షాన్నే ఎందుకు ఎంచుకున్నారు ?

ఆయుధాలు అగ్ని తత్వాన్ని కలిగి ఉంటాయి . శత్రుసంహారం చేసేవి కనుక వాటిలో ఆ తత్త్వం ప్రజ్వలిస్తుంటుంది . పైగా పాండవులదగ్గరున్న ఆయుధాలు సామాన్యమైనవి కావు . అవి దేవప్రసాదాలు . అనుపమానమైన శౌర్యాగ్నిని కలిగిన వీరులయిన పాండవుల చేత ప్రయోగించబడేవి . ఏ గూటి చిలక ఆ పలుకే పలుకుతుందన్నట్టు , ఆ ఆయుధాలు పాండవులవి కావడమే వాటి గొప్పదనాన్ని తెలుపుతుందంటే, అతిశయోక్తికాదు .  

వీరులకు ప్రాణం కన్నాముఖ్యమైంది వారి ఆయుధం. నిజమైన వీరుడు తన ఆయుధాన్ని వీడి ఉండడు. అలాగే నేలమీద కూడా పెట్టడు. దానికి అనేక కారణాలు ఉంటాయి. వీరుడి స్పర్శతగిలితే ఆయుధంలోకి చేతనత్వం ప్రవేశిస్తుంది. దాని వల్ల ఆ ఆయుధం మహాశక్తిమంతమవుతుంది. ఒక సారి ఆయుధాన్ని చేత పట్టాక దాన్ని ఎప్పుడూ నేల మీద పెట్టరు. అలా పెడితే ఆయుధంలో చేరిన వీరుని శక్తి భూమి లాగేసుకుంటుంది. భూమికి ఆ విధమైన ఆకర్షణ శక్తి ఉంది (గ్రావిటీ). కనుకనే నేటికీ ఆధునిక సైనికులు కూడా నేల మీద ఆయుధాన్ని పెట్టరు. అంతేకాదు నేల వైపు ఆయుధాన్ని చూపరు కూడా. కేవలం మహామహులు చనిపోయినప్పుడు మాత్రమే ఆయుధాన్ని నేలవైపు చూపుతారు.

ఈ నేపథ్యంలో పాండవులు వనవాసం చేసి అజ్ఞాతవాసానికి వెళ్ళే టప్పుడు తమ ఆయుధాలు ఎక్కడ ఉంచాలి అనే సంశయం కలిగింది. ఎందుకంటే అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలు తమతోనే ఉంచుకుంటే వాటి కారణంగా తాము దొరికిపోయే అవకాశం ఉంది. అందులోనూ అర్జునుడు, భీముడు, ధర్మరాజు, నకులుడు, సహదేవుడి ఆయుధాలు దైవదత్తాలు. అవి చూడగానే ఇట్టే అవి భూమి మీద తయారైనవి కాదని తెలిసిపోయే అవకాశం ఉంది. కనుక తప్పని సరి పరిస్థితుల్లో వీటిని ఎక్కడైనా దాచాలి. కానీ ఏడాదిపాటు వాటిని సంరక్షించదగిన స్థలం ఎక్కడుంది ? అన్వేషకుడు అర్జనుడే ! 

చెట్టునే ఎందుకు ఎంచుకున్నాడు ?

చెట్టుమీదే ఎందుకు పెట్టాలి? అంటే,  భూమి మీద ఆయుధాలు ఉంచరాదు. అంతేకాదు. అరణ్యంలో భూమి మీద ఆయుధాలు ఉంచితే పందులు పందికొక్కులు వంటివి తవ్వి వాటిని బయటకు తీసే ప్రమాదం ఉంది. వర్షం పడినప్పుడు భూమి పీల్చుకునే నీరు ఆయుధాలను ఏడాది పాటు నష్టపరచవచ్చు. కనుక భూమి మీద పెట్టలేరు, భూమి లోపలా పెట్టలేరు. కాబట్టి వృక్షాన్ని ఎంచుకున్నారు . 

 అర్జునుడు అన్వేషణ చేసి , ఒక శ్మశానాన్ని నిర్ణయిస్తాడు. దాని పక్కనే ఉన్న అతిపెద్దశాఖలు ఉన్న జమ్మిచెట్టు ఎంచుకుంటాడు. ఇక్కడ మళ్ళీ ఈ వృక్షాన్నే ఎంచుకోవడానికి గల విశేషాన్ని ఒకసారి గమనించాలి . జమ్మిచెట్టు అపరాజితా దేవి స్వరూపం . దైవవృక్షం . దానిలోని అగ్నితత్వం , పాండవుల ఆయుధాల్లోని అగ్నితత్వంతో మైత్రిని కలిగిఉంటుంది . ఇక అది స్మశానం వంటి నిర్జన ప్రదేశంలో ఉంది . స్మశానమంటేనే భయపడే సామాన్యులు , ఒక శవం ఆ సమీపంలోని  చెట్టుమీద ఉన్నది అంటే, దాన్ని స్పృశించే ప్రయత్నం చేయరు .  ఇక ఆ చెట్టుకున్న ముళ్ళు ఒకంతట ఎవ్వరినీ పైదాకా ఎక్కేవీలుని కల్పించవు . పైగా బలమైన విస్తారమైన ఆ చెట్టుని  వివరిస్తూ అర్జనుడు ‘భీమశాఖా దురారోహా శ్మశానస్య సమీపతః’ భీముడువంటి బలంగలిగిన కొమ్మలతో ఉన్న వృక్షమని, ఎవ్వరూ సమీపించలేనంత ఎత్తుతో ఆరోగ్యంగా ఉన్నదని 
వివరిస్తాడు . గాండీవం వంటి ఆయుధాల్ని భరించాలంటే, అలాంటి బలం కలిగిన వృక్షం అవసరం . 

గాండీవం యెంత బరువైనదంటే, స్వయంగా అర్జునుడు కూడా దాన్ని ఎత్తలేడు. కేవలం శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల దాన్ని ప్రయోగించగలుగుతాడు. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన వెంటనే అర్జునుడు గాండీవాన్ని ప్రయోగించి బాణాలు వేయలేక కిరాకులతో గాండీవంతో కర్రసాము చేస్తూ యుద్దం చేయబోతాడు. వారు అర్జునుడ్ని చిన్నపిల్లాడిని గెలిచినట్టు గెలిచి యాదవ కాంతల్ని ఎత్తుకుపోతారు. కనుక అంత మహిమ ఉన్న ఆయుధాలు మోయాలంటే తప్పనిసరిగా అది దివ్యవృక్షమే అయిఉండాలి.

మళ్ళి  మన జమ్మిచెట్టు దగ్గరికి వద్దాం . అంతటి బలమైన , అనుకూలమైన చెట్టుని ఎంచుకొని, ఆయుధాలు అన్నీ ఒక శవం ఆకారంలో మూటగట్టి చెట్టుపై పెట్టించాడు అర్జనుడు . మూటలోకి నీటి చుక్క కూడా జారకుండా కట్టారు. ఎప్పుడైతే చెట్టు మీద శవం ఉందో ఆ చెట్టును ఎవరూ నరికే అవకాశంలేదు. అందులోనూ దానికి శవం నుంచీ వచ్చే వాసనలు వెదజల్లే ఏర్పాటు కూడా చేశారు. ఇది చాలదన్నట్లు అది తమ తల్లి శవం అనీ తమ ఆచారం ప్రకారం శవాన్ని చెట్టుమీద ఉంచాలని ప్రచారం చేశారు.

(ఆబద్ధం శవమత్రేతి గంధమాఘ్రాయ పూతికం |,
అశీతిశతవర్షేయం మాతా న ఇతి వాదినః |
కులధర్మోఽయమస్మాకం పూర్వైరాచరితోఽపి చ)

పూర్వం ప్రాణం ఉన్న మనిషికి ఇచ్చిన గౌరవం చనిపోయిన శవానికి కూడా ఇచ్చేవారు. కనుక ఎవరూ శవం ఉన్న చెట్టు మీద అనుమానం వచ్చే అవకాశం లేదు. పైగా అది జనులు తిరిగేది కాదు. వారికి కనపడే విధంగా కూడా  లేదు. చాలా మరుగు ప్రదేశంలో ఉంది. అటువంటి చెట్టు మీద దివ్యమైన ఆయుధాలు ఏడాదిపాటు భరించే శక్తి ఉండి, విరిగిపోని కొమ్మల మీద నకులుడు చెట్టు ఎక్కి, ఆయుధాలు పెట్టి కట్టి వచ్చాడు

(తాముపారుహ్య నకులో ధనూంషి నిదధత్స్వయం,
యత్ర చాపశ్యత స వై తిరో వర్షాణి వర్షతి |
తత్ర తాని దృఢైః పాశైః సుగాఢం పర్యబంధత).

జమ్మిచెట్టే ఎంచుకోవడానికి మరో కారణం ఉత్తరాదిలో జమ్మిని కలప కోసం నరకరు. అది ప్రకృతి సహజంగా మరణించిన తరువాతే కలప సేకరిస్తారు. మరో విచిత్రమైన అంశంమేమంటే అది పొలం మధ్యలో పుట్టినా దాన్ని కదల్చరు. అలాగే పెరగనిస్తారు. నేటికీ ఆచరించే మరో విశేషం ఏమిటంటే జమ్మి కలప ఉపయోగించి మంచం తయారు చేసి దానిమీద శయనించరు. అంతగా దాన్ని ఆరాధిస్తారు.

 పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద దాచిపెట్టి విరాటరాజు వద్ధ కొలువుకు వెళ్లారు. సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి ఆ ఆయుధాలు ధరించి అర్జణుడు గోగ్రహణంలో కౌరవులపై విజయం సాధించాడు. శమీ వృక్షం రూపంలో ఉన్న అపరాజితా దేవి తన్ను వేడినవారికి సదా విజయాన్నే అందిస్తుంది. అందుకే శమీ వృక్షానికి అంత ప్రాముఖ్యత. విజయదశమినాటి ఆయుధపూజ వెనుక అంతర్యము కూడా ఇదే.

తమకు విజయాలు వరించాలని విజయ దశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి, ఆ చెట్టు ఆకులను తీసుకు వచ్చి, పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకుంటారు. వాహనదారులు, మరియు ఇతర అన్ని రకాల వృత్తుల వారు వారి వారి పనిముట్లను సంబంధిత వస్తువులను శుభ్రపరచి, వాటికి శక్తినియ్యమని జమ్మి ఆకులతో 
పూజలు చేయడం ఆనవాయితీ. 

ఆయుర్వేద ప్రశస్తి :

ఆయుర్వేద మందులలో శమీవృక్షం ఆకు, పువ్వులు, విత్తనాలు చెట్టు బెరెడు అన్నీ ఉపయోగిస్తారు. కొన్ని జమ్మి ఆకులు, కొంచం చెట్టు బెరడు, రెండు మిరియాలు నూరి మాత్రలు చేసుకొని మజ్జిగతో వేసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది.

జమ్మి ఆకుల నుండి పసరు తీసి దానిని పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. జమ్మిపూలను చెక్కరతో కలిపి సేవించడం వలన గర్భస్రావం జరగకుండా నిరోధించబడుతుంది. జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. ఇలా ఎన్నో రోగాలకు ఉపయోగపడుతుంది. అందుకే ఈ చెట్టును సురభి బంగారం అనే పేరు వచ్చింది. పంచ బిళ్వాష్టకాలలో జమ్మి ఒకటి.

ఎడారి వాసులకి కల్పవృక్షం జమ్మిచెట్టు :

ఎడారి ప్రాంతవాసులకు జమ్మిచెట్టు కల్పవృక్షము అని చెప్పవచ్చును , ఎందుకంటే వీటి పొడవైన వేళ్లు నీటిని గ్రహించినందు వల్ల భూమి సారవంతముగా ఉంటుంది . వేసవి ఎండలలో ఎడారి ప్రాంత వాసులకు నీడను ఇస్తుంది. జమ్మిచెట్టుకి ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ ‘యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్’ భూసారాన్ని పెంచేందుకు ప్రతి ఇంట్లోనూ ఒక జమ్మిచెట్టుని నాటమని సూచిస్తోంది.

ఎడారి ప్రాంతవాసులకు జమ్మిచెట్టు కల్పవృక్షము అని చెప్పవచ్చును , ఎందుకంటే వీటి పొడవైన వేళ్లు నీటిని గ్రహించినందు వల్ల భూమి సారవంతముగా ఉంటుంది . వేసవి ఎండలలో ఎడారి ప్రాంత వాసులకు నీడను ఇస్తుంది. జమ్మిచెట్టుకి ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ ‘యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్’ భూసారాన్ని పెంచేందుకు ప్రతి ఇంట్లోనూ ఒక జమ్మిచెట్టుని నాటమని సూచిస్తోంది.

ముస్లింల ఆధీనంలో ఉన్న బహ్రేయిన్ దేశంలోని భయంకరమైన ఎడారిలో ఒక జమ్మి చెట్టు ఉంది. ప్రపంచవ్యాప్తంగా దీనిని చూడడానికి ప్రతీ ఏడాది దాదాపు 50 వేల మంది పర్యాటకులు వస్తున్నారు. దీని వయసు 400 ఏళ్ల పై మాటే. ఏ ప్రాణీ బ్రతికే అవకాశంలేని ఎడారిలో ఈ ఒక్క చెట్టే నిలిచి ఉంది. ఇది ప్రకృతిలోనే అరుదైన వింతల్లో ఒకటి. ఇది ఎలా నిలిచి ఉందో నేటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వారికి తెలిసిన విషయం ఒక్కటే షజరత్ అల్ హయత్ అని పిలిచే ఈ చెట్టు భూమిలో కిలోమీటర్ల కొద్దీ వేళ్లు పంపి నీరు సేకరిస్తోందని తేల్చారు. అంతేకాదు దీని ఆకులు వాతావరణంలో ఉండే కొద్ది పాటి తేమ కూడా సేకరిస్తుందని అంటున్నారు.

జమ్మి చెట్టు ఎంత దుర్భర పరిస్థితుల్లో అయినా జీవించగలదని చెప్పడానికి ఇదే సజీవతార్కాణంగా ఘోరమైన ఎడారిలో నిలిచింది. ఈ విధంగా జమ్మిచెట్టు హిందువులకే కాక మహ్మదీయులకు కూడా ప్రాణప్రదమైన చెట్టుగా మారింది . అరబ్బు ఎమిరేట్లదేశానికి జమ్మిచెట్టు జాతీయ వృక్షం. ఎడారులు ఎక్కువగా ఉండే మన దేశంలోని రాజస్థాన్ రాష్ట్రవృక్షం కూడా జమ్మిచెట్టే.

విజయదశమి నాటి శమీపూజ :

విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి, ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.

"శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ
అర్జునస్య ధనుర్దారీ రామస్య ప్రియదర్శిని
శమీ కమల పత్రాక్షి శమీ కంటక హారిణి
ఆరోగ్యంతు సదాలక్ష్మీ ఆయు: ప్రాణాంతు రక్షతు
ఆదిరాజ మహారాజ వనరాజ వనస్పతే
ఇష్ట దర్శన మృష్టాన్నం కష్ట దారిద్య్ర నాశనం"

అనే ఈ శ్లోకాన్ని చెప్తూ శమీపూజ చేస్తారు .

ఈ శ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి . 

శమీ వృక్షం దేవీ రూపమని, విజయదశమి రోజు శమీపూజ చేసేవారికి అమ్మలగన్న అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని దేవీ భాగవతం చెప్తోంది. 

కాబట్టి ఆ పరాజితాదేవికి , శమీ వృక్షానికి , అగ్నిమాతకి నమస్కారాలతో శలవు .

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha