Online Puja Services

పుట్టలో పాలు పొయ్యడానికి , పిల్లలుపుట్టడానికి ఏమిటీ సంబంధం?

3.143.4.181

పుట్టలో పాలు పొయ్యడానికి , పిల్లలుపుట్టడానికి ఏమిటీ సంబంధం?
-లక్ష్మీ రమణ 

సంతానలేమితో బాధపడేవారికి సుబ్రహ్మణ్యారాధన చేయమని చెబుతారు . 12 మంగళవారాలు ఉపవాసం ఉండి  , పుట్టలో పాలుపోయామని చెబుతారు . పుట్టలో పాలు పొయ్యడానికి , పిల్లలుపుట్టడానికి ఏమిటీ సంబంధం . కాసేపు దైవ అనుగ్రహం అనే మాట పక్కన పెడదాం . ఇందులో దాగున్న వైజ్ఞానికత వైభవాన్ని పరిశీలిద్దాం . 

వివాహమయ్యాక కడుపు పండని నెలతకి మనసంతా విచారం , సంసారంలో చికాకులు , సమాజంలో దెప్పిపొడుపులు ఇలా రకరకాల బాధలు . చేయని ప్రయత్నం , తిరగని ఆసుపత్రి ఉండవు . పట్టని నోములు , తిరగని దేవాలయాలూ , చేయని పరిష్కారాలు ఉండవు . అలాంటి వారికి పండితులు చెప్పే పరిష్కారం సుబ్రహ్మణ్యారాధన . ఆయన స్వరూపమైన పాముకి పాలుపోయ్యడం . ఇక , పంచమి/నాగుల చవితి నాడు కూడా పుట్టలకు పూజ చేయించడం, పాలు పోయడం వంటివి వంశాభివృద్ధి కోసం చేయడం మన సంప్రదాయంలో అనాదిగా ఉన్నదే !

‘చీమలు పెట్టిన పుట్టలు 
పాముల కిరవైన యట్లు పామరుడు దగన్ 
హేమంబు గూడబెట్టిన 
భూమిశుల పాలజేరు భువిలో సుమతీ !’

 
అని ఉపమానానికే చెప్పినా , పాములు పుట్టలు పెట్టవని చక్కగా చెప్పారు సుమతీ శతకకారుడు . ఈ మాట అక్షరాలా నిజం కూడా ! చెద పురుగులు, చీమలు పెట్టిన పుట్టాలని పాములు తమ ఆవాసంగా మార్చుకుంటాయి . వానాకాలములో పిల్లలను పెట్టి, వేరే చోటికి వెళ్తాయి. చెదపురుగు పుట్ట పెట్టేటప్పుడు దాని నోటి నుంచి ఒక ద్రవము వస్తుంది. ఆ ద్రవము మెత్తటి మట్టిలో కలిసి, గట్టి పడుతుంది. ఎంత గట్టి పడుతుంది అంటే వానలు వచ్చినా ఆ మట్టి కరుగదు. ఈ మెత్తటి మట్టిలో రాయి రప్పలు ఉండవు. ఇదే పుట్టమట్టి లోని విశిష్టత. వానాకాలములో, ఈ పుట్టలలో  సంచరించే  పాముల నుండి విడుదల అయ్యే రేతస్సు, రజస్సు ఈ మట్టిలో కలిసి ఉంటుంది.

ఇక పాము గుడ్లు పెడుతుంది . పిల్లల్ని పొదగదు.  ఎండ వేడికి అవి పిల్లలగును. ఇది ప్రకృతి నియమము.  అలా ఈ మట్టిలో కలిసిన ఈ పదార్దములు మనము పోసే పాలు, తేనే, వివిధ రకాల ఫలములు కలిసి ఒక రకమైన సువాసనలు వెదజల్లుతాయి. ఆ వాసనల వల్ల మన శరీరములో తగు హార్మోనులు ఉత్పత్తి అయ్యి పిల్లలు పుట్టేందుకు దోహద పడుతుంది . వాసన పీల్చడం ద్వారా అంతటి మార్పు శరీరంలో కలుగుతుందా ? అని అనుమానం రావొచ్చు . ఉదాహరణకి మనకి అనుభవంలోకి రావడం కోసం మెంతిపిండి, కారం  వంటి వాటిని జల్లించి చూడండి . మీరు వాసన పీల్చాలనే ప్రయత్నం  చేయరు . నోటితో రుచి చూడాలనుకోరు. కానీ మెంతిపిండి చేదు మీ నాలికకి తెలుస్తుంది . అలాగే కారం చేసే హడావిడికి తుమ్ములు వస్తాయి .  

ఇక ఆయుర్వేద శాస్త్రములో నాగు పాము కుబుసములో అరటిపండు కలిపి మందుగా ఉపయోగించడం అనే ప్రక్రియ ఉంది. పుట్టమట్టిని  ప్రయోగశాలలో పరిశీలించడం జరిగింది.  అందులో తేలిందేంటంటే, చర్మ రోగాలు నయము చేయడంలో  ఈ మట్టి ఎంతో ఉపయోగ పడుతుంది . ప్రత్యేకముగా నాగరు అనే చర్మ వ్యాధికి. ఇది ప్రకృతి సిద్ధమైన వైద్యం .

మన దేశంలో రావి చెట్టుకింద ప్రతిష్ఠించబడిన నాగవిగ్రాహాలకి కూడా పూజచేస్తుంటారు. ఆయుర్వేద శాస్త్రములో గర్భము నిలువనట్లయితే,  ఈ చెట్టు వేరుతో తయారు చేసిన మందులు వాడుతారు. అంతే కాక ఈ వృక్షము అరుణోదయ కాలములో దాని వేళ్ళ నుండి ఘనీభుతమైన అమ్ల జనకములు విడుదల చేస్తాయి. దీనిని ఒజోన్స్ అంటారు. ఈ ఒజోన్స్ మనోహరమైన వాసనలు మానవుడి ఆరోగ్యం ప్రత్యేకించి  స్త్రీల ఆరోగ్యం పైన మంచి ప్రభావము చూపిస్తాయి. 

అందుకే , రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేయడం మొదలైన నియమాలు పాటిస్తారు .40 రోజుల పాటు ఉదయమునే రావి చెట్టు ఆలింగనము, ప్రదక్షిణాలు చేసిన జననేంద్రియ దోషములు తొలగి, గర్భము ధరించుటకు సహాయకారిగా ఉంటుందని విశ్వసిస్తారు.

సాధారణంగా నాగ ప్రతిమను శాస్త్రోక్తముగా రావి చెట్టు మొదలులో ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠించేసమయంలో పంచరత్నాలు, పంచపల్లవములు, నవధాన్యములు, గోపంచకాలతో ప్రతిష్ఠించుతారు. ఇక ,నాగ ప్రతిమ చేసిన రాయి పురుష జాతిథి అయి ఉండాలి.ఇలా చేయడం వల్ల రత్నముల ద్వారా చెట్టునుండి విసర్జించబడిన ఒజోన్స్ శిలా ముఖంతరముగా మానవుని శరీరమీద ప్రభావము చూపిస్తాయన్నమాట . 

ఇక్కడ మనిషి వెన్ను పాము నాగుపాము ఆకారములో ఉంటుంది అని , శక్తి స్వరూపిణి కుండలిని సర్పస్వరూపిణి అని , ఇడాపింగళ నాడులు సర్ప స్వరూపాలేనని మన యోగా చెప్పిన విశేషాలు కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇది ఆధ్యాత్మిక విశేషమే అయినా , కుండలిని అనే సర్పము చేతనావస్థకి ప్రతిరూపం కదా ! అంటే, ఇంతకుముందర చెప్పుకున్న వైజ్ఞానిక విశేషాల వల్ల, జడమైన శరీరంలో చేతనత్వం కలుగుతుంది అనేదాన్ని అర్థం చేసుకోవచ్చు . 
 
అందువలన, పంచమి/నాగుల చవితి నాడు నాగేంద్రుని పూజించడం మన హిందు సంప్రదాయం. వంశాభివృద్ధిని కలుగజేసే ఆచారం . వీనిని తెలిసి ఆచరించినా, తెలియక ఆచరించినా మంచి ఫలితములు తప్పక పొందవచ్చు.

Quote of the day

God is to be worshipped as the one beloved, dearer than everything in this and next life.…

__________Swamy Vivekananda