Online Puja Services

బయటకొన్న పదార్థాలని దేవుడికి నివేదించవచ్చా ?

3.138.199.50

బయటకొన్న పదార్థాలని దేవుడికి నివేదించవచ్చా ?
-లక్ష్మీ రమణ 

తల్లి తన  పిల్లాడికి అన్నం తినిపించేప్పుడు కొసరి కొసరి తినిపిస్తుంది కదా ! ఆ ప్రేమకోసమే కదా శ్రీవారు నందగోకులంలో యశోదా నందనుడై గోవులు కాశాడు. ఆ ప్రేమకు దాసుడయ్యే కదా , వకుళామాతకి పుత్రుడై , కుబేరుడికి  కలియుగాంతంవరకూ తీరని బాకీ పడ్డాడా గోవిందుడు . అన్నింటికీ మించి ఆ ప్రేమకి బందీ అయ్యేకదా , అడవుల్లో అనంతమైన కస్టాలు అనుభవించాడా రామయ్య ! అమ్మ ప్రేమంటే అంతేమరి ! అది భగవంతుడినైనా పసివాడిగా మార్చేస్తుంది . త్రిమూర్తులే అనసూయామాతకి పొత్తిళ్ళ పాపాలయ్యారుకదా ! అందుకే అమ్మ లాలన భగవంతుడికి ప్రీతిపాత్రం .  భక్తుడికి  మోక్షప్రదాయకం . 

అమ్మవారికి ఎనిమిదేళ్ళ పాపగా దర్శనమివ్వడం ఇష్టమట . అలాగే అయ్యవారికి ఆరేళ్ళ పిల్లగాడుగా దర్శనమివ్వడం చాలా ఇష్టమట. అందుకే , ఒక చిన్నపిల్లవాణ్ణి ఎలా ముద్దుచేసి, బతిమాలి, వెంటపడి అన్నం తినిపిస్తామో , అలాంటి మనస్సుతో , ఒక తల్లికి తన పిల్లాడిపై ఉండే వాత్సల్యంతో భగవంతునికి నైవేద్యం సమర్పించాలి .  

ఈ రోజుల్లో బయట కొన్న పదార్థాలని నివేదన చేసేస్తున్నారు. నిజానికి అలా చేయకూడదు .  అవి వ్యాపారనిమిత్తం వండినవి . అమ్మ మనసుతో చేసినవి కాదుకదా ! పైగా ఇవి అనేక రకాలైన అశౌచాలకి గురై ఉంటాయి.  కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను అవి పనికిరావు. 

నిలవఉన్నవీ, పులిసిపోయిన పదార్థాల్ని మన బిడ్డలకి పెడతామా ? అలాగే భగవంతునికి కూడా ! ఇంట్లో వండినా సరే ఇలాంటివి నైవేద్యానికి పనికిరావు. అయితే సంతోషీమాత తప్ప మిగతా అందరు దేవతల విషయంలోను కొత్తపెరుగుకు మినహాయింపు ఉంది. గ్రామదేవతలకైతే చద్దెన్నం మహాప్రీతికరం. తమ సొంత యింట్లోను, తమ సొంత ఆఫీసులోను నైవేద్యాన్ని తాము (గృహిణి, గృహస్థుడు/ యజమానుడు, యజమానురాలు) స్వయంగా కానీ, తాము నియమించిన వేదబ్రాహ్మణుడు కానీ సమర్పించాలి. ఇతరులు పనికిరారు. నైవేద్యంలో బెల్లం ముక్క, నేతి అభిఘారమూ తప్పనిసరి. హారతి ఇచ్చాకనే నైవేద్యం సమర్పించాలి.

నైవేద్యం పెట్టె పధ్ధతి :

నైవేద్యం పెట్టేటప్పుడు ఆహార పదార్థాల చుట్టూ కుడిచేత్తో నీళ్ళు చిలకరించి సంబంధిత దేవతాస్తోత్రం చదవాలి. ఏ దేవుడికైనా, దేవతకైనా పనికొచ్చే సర్వదేవతోపయోగి శ్లోకం :

శ్లో|| బ్రహ్మార్పణమ్ బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ |
బ్రహ్మైవ తేన గన్తవ్యమ్ బ్రహ్మకర్మసమాధినా ||

విష్ణుమూర్తికీ, ఆయన అవతారాలకూ అయితే ...
శ్లో|| పత్రమ్ పుష్పమ్ ఫలం తోయం యస్తే భక్త్యా ప్రయచ్ఛతి |
తద్భవాన్ భక్త్యుపహృతమ్ అశ్నాతి ప్రయతాత్మనః ||
శ్లో|| యత్కరోమి యదశ్నామి యజ్జుహోమి దదామి యత్ |
యత్ తపస్యామి గోవింద తత్కరోమి త్వదర్పణమ్ ||
శ్లో|| కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాఽఽత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్ సకలమ్ పరస్మై
నారాయణేతి సమర్పయామి ||

ఏ కులస్థులైనా సరే, ఏ దేవీదేవతలకైనా నైవేద్యం పెట్టేటప్పుడు ...

ఓం సత్యమ్ చిత్తేన పరిషించామి | అమృతమస్తు | అమృతోపస్తరణమసి స్వాహా |
అని నైవేద్యం చుట్టూ నీటి బిందువుల్ని చిలకరించాలి. తరువాత--

ఓమ్ ప్రాణాయ స్వాహా ! ఓం వ్యానాయ సాహా | ఓమ్ ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా | ఓమ్ బ్రహ్మణే స్వాహా |

అని కుడిచేత్తో ఆహారపదార్థాల్ని దేవుడికి/ దేవతకు చూపించాలి.

మధ్యేమధ్యే పానీయం సమర్పయామి
అని నైవేద్యం మీద మళ్లీ నీటిబిందువుల్ని ప్రోక్షించాలి.

నమస్కరోమి అని సాష్టాంగం చేసి లేవాలి.

దేవుడికి దిష్టి తగలకుండా ఆ కాసేపు గది తలుపు మూసెయ్యాలి. అందుకే దేవాలయాలలో  దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు తెరవేస్తారు. లేకపోతే భోజనప్రియత్వం గలవారు ఆ ఆహారపదార్థాల వంక కుతూహలంగా, సాభిప్రాయంగా చూసినప్పుడు, వాటిల్లో రంధ్రాలేర్పడడం, రంగుమారడం జరుగుతుంది. ఆ మార్పుల్ని యోగులు మాత్రమే తెలుసుకోగలరు. ఒకటి-రెండు నిమిషాల తరువాత లోపలికకి వెళ్ళి మళ్ళీ దేవుడికి నమస్కారం చేసుకొని ఆహార పదార్థాల్ని బయటికి తీసుకురావాలి.

Quote of the day

From the solemn gloom of the temple children run out to sit in the dust, God watches them play and forgets the priest.…

__________Rabindranath Tagore