Online Puja Services

నాగదేవి మనసాదేవి - సంతాన ప్రదాయని

3.137.218.230

నాగదేవి మనసాదేవి - సంతాన ప్రదాయని 
 (నాగుల చవితి ప్రత్యేకం - నవంబరు -8-2021) 
లక్ష్మీ రమణ 

పడగెత్తిన నాగమే ఆమెకి వాహనం . కాలకూట విషనాగులే ఆభరణాలు .  పరవసించిన ప్రకృతే ఆ దేవి స్వరూపం . ఆమే నాగేశ్వరి, మనసాదేవి . పూర్వం భూమ్మీద మనుషుల కంటే అధికంగా పాములు ఉండేవట. అవి విచ్చలవిడిగా సంచరిస్తూ మానవాళిని భయభ్రాంతులకు గురిచేస్తుంటే కశ్యపముని తన మనసు నుంచి ఈ ఆది దేవతను సృష్టించాడు. ఈమె సర్పాలకు అధినేత్రి. మహాయోగేశ్వరి.  కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితిగా పూజిస్తుంటాము . ఈ పర్వదినాన నాగమాత మనసాదేవిని ఆరాధించడం సర్వశుభప్రదం . సర్వమంగళదాయకం . సర్వ విషహరణం .  

ఋగ్వేదంలోని సర్పసూక్తములు , యజుర్వేదములోని సర్ప మంత్రముల ద్వారా సర్పదేవతా ఉపాసన చెప్పబడుతోంది . దేవీభాగవతం మనసాదేవిని, దేవి  ప్రధానాంశా స్వరూపాలలో ఒకరిగా పేర్కొంటోంది . కశ్యప ప్రజాపతి కూతురైన ఈమె , ఈశ్వరునికి ప్రియ శిష్యురాలు .

ఈశ్వరుడే స్వయంగా మనసాదేవికి కృష్ణ ‘శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ నమః’ అనే అష్టాక్షర మంత్రాన్ని ఉపదేశించి, దానితో పాటుగా శ్రీకృష్ణ కవచాన్ని, పూజావిధిని నేర్పించారఅని చెబుతుంది బ్రహ్మ వైవర్త పురాణం . ఇవేకాకుండా దేవతలకైనా దుర్లభమైన మృతసంజీవనీ విద్యని కూడా ప్రసాదించారట .

శంకరుని ఉపదేశానంతరం మూడు యుగాలపాటు శ్రీకృష్ణుని గురించి తప్పస్సు ఆచరించారు మనసాదేవి. అప్పుడు శ్రీకృష్ణడు ప్రసన్నుడై సాక్ష్కాత్కరించి , రాబోయే కాలంలో భూలోకంలో పూజలందుకొనెదవుగాక అని దీవించారు . 

‘జరత్కారు’ అనే మహాముని మనసాదేవి భర్త . ఆయన కఠినమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తుంటే, ఒకరోజు అతనికి పితృదేవతలు కలలో కనిపించి, ‘నువ్వు వివాహితుడవై ఉత్తమ సంతానం పొంది మాకు పిండ ప్రదానం చేస్తే ఉత్తమగతులు కలుగుతాయని’ చెప్తారు. దాంతో ఆయన కశ్యపముని సలహా ప్రకారం మానసాదేవిని వివాహం చేసుకున్నారని ఐతిహ్యం . ఒకనాడు  ఆయన ఆదమరచి మనసాదేవి ఒడిలో తలపెట్టుకొని నిద్రిస్తున్నారు . సంధ్యాకాలం సమీపిస్తోంది . సంధ్యావందన విధిని ఆచరించాల్సి ఉంది . భర్తకి నిద్రాభంగమయినా కర్తవ్యాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత భార్యదే కదా ! ఆమె జరత్కారుని నిద్రలేపింది . ఆ ముని నిద్రాభంగమవ్వడంతో , మహాకోపోద్రిక్తుడయ్యారు . ఇక నేను నీతో ఉండలేనని , వెళ్లిపోతానని తెగేసి చెప్పారు . మనసాదేవి తాను ధర్మాచరణ వారినిగానే ఆయనకీ నిద్రాభంగం చేయాల్సి వచ్చిందని ఎంగా చెప్పినా వినిపించుకోలేదు . చివరికి హరిహరాదులు దిగివచ్చి , ఆమెకో పుత్రున్నయినా ప్రసాదించమని ఆమునిని వేడుకున్నారు . అప్పుడాయన మనసాదేవి నాభిని స్పృశించారు . వెంటనే ఆమె గర్భందాల్చింది . శ్రీమన్నారాయణుడికి  మహా భక్తుడైన కొడుకుని పొందగలవాని దీవించి వెళ్ళిపోయాడు జరత్కారుమహాముని . అలా ఆమెకి సంతానంగా పుట్టిన వారే , ఆస్తీక మహర్షి. కాలాంతరంలో, ఆయన తల్లి ఆజ్ఞతో , జనమేజయుని సర్పయాగాన్ని ఆపించి దేవజాతికీ , సర్పజాతికీ ఎంతో మేలు చేకూర్చారు. లేకపోతె, ఇంద్రసహిత తక్షకాయ స్వాహా అన్నప్పుడు, పాపం ఆ యజ్ఞాగ్నికి ఇంద్రుడుకూడా బలయ్యేవారు . దానికి కృతజ్ఞతగానే  ఇంద్రుడు మనసాదేవిని షోడశోపచారాలతో అర్చించాడు . 


శ్లో || జరత్కారు జగద్గౌరీ మానసా సిద్ధ యోగినీ | 
వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ  తథా || 
జరత్కారు ప్రియాస్తీకమాతా విషహరేతిచ | 
మహాజ్ఞానయుతా చైవసాదేవీ విశ్వపూజితా || 

అని ఈ పన్నెండు నామాలనూ పూజా సమయంలో పఠించినవారికి ఏవిధమైన సర్పభయమూ ఉండదు . మనసా దేవి మూల మంత్రాన్ని లక్షసార్లు జపిస్తే, మంత్రసిద్ధి కలిగి విషాహారాన్ని తిన్నా జీర్ణించుకోగలిగిన శక్తి లభిస్తుందన్నది శృతి వచనం  .

పరమశివుడు క్షీరసాగర మథనంలో హాలాహలాన్ని మింగగా, అది ఆయనపై పనిచేయకుండా చేసింది ఈ మానసాదేవియే. అందుకే, ఈమెను ‘విష హరదేవి’గానూ పిలుస్తారు. గౌరవర్ణం కారణంగా ఆమెను అందరూ గౌరిగా ఆరాధిస్తుండటంతో ‘జగద్గౌరి’గానూ స్థిరపడింది. ఆమె శివుడి శిష్యురాలు కావడంతో ‘శైవి’ అనే పేరు కూడా వచ్చింది. మానసా దేవి మొదట విష్ణు భక్తురాలు కనుక ‘వైష్ణవి’ అయింది. పరీక్షిత్‌ మహారాజు కొడుకు జనమేజయుడు సర్పయాగం చేసే వేళ, పాముల ప్రాణాలను కాపాడింది కాబట్టి ‘నాగేశ్వరి’, ‘నాగభగిని’ అనే పేర్లతోనూ పిలువబడింది. హరుడి నుంచి సిద్ధయోగం పొందినందున ‘సిద్ధయోగినీ’ అయ్యింది. మరణించిన వారిని బతికించగలదు కాబట్టి, ‘మృత సంజీవని’. మహాతపస్వి,

మహాజ్ఞాని అయిన జరత్కారునికి ఇల్లాలైనందుకు ‘జరత్కారువు ప్రియ’ అని పేరొందింది. ఆస్తికుడు అనే మునీంద్రునికి కన్నతల్లి కాబట్టి, ఆస్తికమాతగా పిలువబడింది. ఇలా ఆమెకు మొత్తం పన్నెండు పేర్లు. 

‘మనసా కశ్యపాత్మజా’ అని చెప్పే మానసాదేవి ప్రకృతిలో వెలసిన మూడవ ప్రధానాంశ స్వరూపం. ఈమె కశ్యప ప్రజాపతి మానస పుత్రిక. 

పడగెత్తిన పామును వాహనంగా చేసుకున్నందుకు నాగ గణమంతా ఆమెను సేవిస్తుంటారు. ఈమె యోగిని. యోగులకి సిద్ధిని ప్రసాదించే దేవి . తపఃస్వరూపిణి. తపస్విలకు తపఃఫలాన్నిచ్చే తల్లిగానూ మానసాదేవిని ఆరాధిస్తారు. 

హరిద్వార్‌లో మానసాదేవి ఆలయం ఉంది. ఒంటి నిండా సర్పాలతో, తల మీద పడగతో, ఒడిలో పిల్లవాడితో ఉన్న మానసాదేవి శిల్పాలు మనకిక్కడ కనిపిస్తాయి. ఈమె నాగపూజ్యయే కాదు, లోకపూజ్య కూడా. ఈ తల్లిని ఆరాధించినవారు సమస్త కామ్యాలు పొందుతారు. చెట్టుకొమ్మ, మట్టికుండ, నాగరాయి, పుట్ట ఇలా ఏ రూపంలోనైనా ఈమెను పూజిస్తారు. అసలు ఏ రూపం లేకుండా కూడా ధ్యానం చేయవచ్చు. ఇటు ఆచారయుక్తమైన ఆలయాల్లో మూలవిరాట్టుగా, ఇటు గ్రామదేవతగానూ మానసాదేవి విశేషంగా పూజలందుకుంటున్నది.

మనసా దేవిని తెల్లని పుష్పాల చేత, సంపంగెలు , మల్లెలు వంటి సుగంధభరితాలైన పుష్పాల చేత భక్తి శ్రద్ధలతో అర్చించినవారికి సంతానలేమి తొలగిపోతుంది . ధనధాన్య వృద్ధి కలుగుతుంది . ఆరోగ్య సిద్ధి లభిస్తుంది .  

శుభం .

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha