Online Puja Services

భగినిహస్త భోజనం

3.142.250.114

అపమృత్యు దోషాలు తొలగించే భగినిహస్త భోజనం 
(06-11-21 - యమ విదియ ప్రత్యేకం )
-లక్ష్మీ రమణ 

అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే వేడుకల్లో భగినీ హస్త భోజనం ఒకటి .  మన సంప్రదాయం ఏ మాట చెప్పినా , దాంట్లో ఒక స్పష్టమైన ప్రయోజనం ఉంటుంది. భారతదేశంలో పెళ్లి తర్వాత, అమ్మాయి అత్తవారింటికి వెళ్ళిపోతుంది . పెళ్ళితోటి ముడిపడిన బాధ్యతలు , కొత్తగా వచ్చిన బంధాలు అప్పటివరకూ ఉన్న చిన్నతనానికి , పెద్దరికం ముసుగు వేసేస్తాయి . కొత్తజీవితం ఇక పుట్టింటిని వదిలేయ్ . ఇదే నీ జీవితం , నీ బంధం , నీ కుటుంబం అంటుంది . కానీ, తల్లిదండ్రులు , అన్నదమ్ములు వాళ్ళ ఆప్యాయతలు , అనురాగాలు మరిచిపోవడం , కనీసం అలా అనుకోవడం ఆ చిన్ని తల్లికి సాధ్యమేనా ?

సమాజంలోని  కట్టుబాటు నిర్దేశించొచ్చు గాక, మెట్టినిల్లు మరిచిపొమ్మనచ్చు గాక , కానీ నాన్న తర్వాత నాన్న బంధాన్ని కొనసాగించే అన్న దమ్ములని వీడడం ఏ ఆడబిడ్డకైనా సాధ్యం కాదుగా ! అటువంటి అపురూపమైన అనుబంధాన్ని , ఆత్మీయంగా కలుపుకునే తోబుట్టువుల పండుగ భగినీ హస్త భోజనం . భగినీ అంటే, అక్కయ్య లేదంటే, చెల్లెలు .  హస్త భోజనం అంటే, ఆమె చేతి భోజనం .  అక్కాచెల్లెళ్ల చేతి భోజనం ఈనాడు తప్పక తినాలని శాస్తం చెబుతుంది . ఈ రోజుని యమ ద్వితీయ అనికూడా అంటారు . ఈ పండుగ గురించి మనకి సనత్కుమార సంహితతోపాటుగా, లింగపురాణం  కూడా వివరిస్తుంది . ఇంతకీ ఈ సంప్రదాయం మొదలవ్వడానికి కారణం యమధర్మరాజు , ఆయన చెల్లెలు యమి (యమున ). ఆ కథని చెప్పుకుందాం రండి . 

 సూర్యునికి ఇద్దరు భార్యలు ఛాయా, ఉష. సూర్యునకు ఛాయాదేవి వలన కలిగిన సంతానం యముడు, యమున. యముడు - సమవర్తి . ధర్మాన్ని అనుసరించి జీవుని కాలంతీరితే, జీవుణ్ణి తీసుకుకొచ్చే పని అయినది. పనిలో ఆదిత్యుడు సస్యములను పోషిస్తూ క్షణం తీరికలేకుండా గడిపితే, యముడు వాటిని లయం చేస్తూ అరక్షణం తీరికలేకుండా గడిపేస్తుంటారు . ఆయన రథం ఆగదు , ఈయన పాశం నిలువదు .  సరే, అలాగే అల్పాయుష్కుడైన మార్కండేయుని ప్రాణాలు తీయడానికి వెళ్లారు సమవర్తి . పాశం వదిలారు . యముడి రూపాన్ని చూసి భయపడిన మహా శివభక్తుడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నాడు . అలాంటి సమయంలో యమపాశం ఆయన్ని తాకింది . లయకారుని మీదికే , పాశము వదిలెంత గొప్పవాడివయ్యావా సమవర్తీ , అంటూ లింగంలోనుండీ కాలరుద్రుడు కరాళ ఢంకానాదం వినిపించాడు .  ఆ రుద్రుని రౌద్రాన్ని చూడలేని యముడు పంచప్రాణాలు చిక్కబట్టుకొని  పరుగు లంఖించాడు . శివుడు వెంబడించాడు. 

ఎక్కడికని పారిపోతాడు ? త్రిమూర్తులూ ఒక్కటేననే తత్త్వం తెలిసిన ధర్మరాజు కదా ఈ సమవర్తి ! ఏ లోకానికి పారిపోయినా , సృష్టి, స్థితి, లయకారులు లేని చోటెక్కడుంది ? ఇలాంటి పరిస్థితుల్లో తన చెల్లెలు గుర్తొచ్చిందాయనకి .  ఎన్నోసార్లు భోజనానికి కబురు చేసినా , విధి నిర్వహణలో మునిగి అలక్ష్యం చేశానే గానీ , చెల్లెలి చేతి వంట తిననలేదుకదా ? ఆమె గుమ్మం తొక్కలేదు కదా , అని వగచాడు . అయ్యో , ఇలాంటి స్థితిలో ఆమె తప్ప నన్ను ఆదరించేవారెరు అని పరి పరి విధాలా ఆలోచిస్తూ , యమునాదేవి ఇంటికి వెళ్ళాడు .  అది కార్తీక మాసం, విదియ రోజు . యమున శివుని అర్చించి , తన ఇంటికి వచ్చిన అన్నగారిని ఆప్యాయంగా ఆహ్వానించి, విందుభోజనం వడ్డించింది .  కాసేపు తాను వదిలిన పాశం , తరుముకొస్తున్న కాలుడు ఏదీ గుర్తులేదు యముడికి . చెల్లెలి సన్నిధిలో , ఆమె ఆప్యాయతానురాగాల జావళిలో సేదతీరారు .  యముడిని తరుముతూ అక్కడికి వచ్చిన శివుడు ఆ అన్న చెల్లెళ్ళ అనురాగాన్ని చూసి ఆనందపరవశుడయ్యారట .  దాంతో యముడు చేసిన అపరాధాన్ని మన్నించి , దీవించి , వెళ్లిపోయారట . శివాగ్రహానికి పాత్రుడినైన తనని , యమి తన ఆప్యాయతానురాలతో శివ అనుగ్రహాన్ని పొందేలా చేయడంతో యముడు ఊపిరి పీల్చుకున్నాడు . ఇంత ఉపకారానికి కారణమైన తన చెల్లెల్ని, వరం కోరుకోమన్నాడు .    

యమున “అన్నా! ప్రతిసంవత్సరం ఇదే విదియ నాడు నా ఇంటికి వచ్చి, నా చేతి వంటలు స్వీకరించి, నన్ను దీవించాలి. అంతేకాదు, ఈ కార్తీకశుద్ధవిదియ నాడు ఎవరు సోదరిహస్త భోజనం చేస్తారో వారు నరకాన్ని పొండకూడదు” అని అర్ధించింది. యముడు “తధాస్తు! శుభమస్తు! ” అని అనుగ్రహిస్తూ “అమ్మా!ఈ దినం ఎవరు యమునా నదిలో స్నానం చేసి, పితృదేవతలకు తర్పణం చేసి, తన సోదరిని గౌరవించి, ఆమె చేతి భోజనం చేస్తారో వాళ్లు ఎన్నటికి నరకద్వారాన్ని చూడరు” అని వరాన్ని అనుగ్రహించారు. అందువల్ల భగినీ హస్త భోజనం చేసిన అన్నదమ్ములకు అపమృత్యు దోషాలుంటే, తొలగిపోయి, పూర్ణ ఆయుష్మంతులవుతారని శాస్త్ర వచనం . 

దక్షిణాదిన ఈ ఆచారం చాలా చోట్ల కనిపిస్తుంది . ఉత్తరాదివారు రాఖీ పండుగని యెంత ప్రాముఖ్యతతో జరుపుకుంటారో , అంతటి ప్రాముఖ్యతతో దక్షణాది వారు భగినీ హస్త భోజనాన్ని స్వీకరిస్తారు . భోజనం వడ్డించిన అక్కా, చెల్లెళ్లని కానుకలతో సత్కరిస్తారు . అయినా వారి  అనురాగానికి , ఆశీర్వాదానికి సాటిరాగల భౌతికమైన బహుమతులు ఏముంటాయిగనుక ! కాబట్టి ఈ సారి భగినీ హస్త భోజనాన్ని తప్పకుండా స్వీకరించేందుకు వెళ్ళండి . అక్క చెల్లెళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని, మీ ఆశీస్సులు వారికి అందించండి .  ఆప్యాయతల ముందు ఎంతటి సమస్యలైనా , చిన్నవే నని గుర్తుంచుకోండి . బంధాలను కలుపుకొని, అనుబంధాల్ని పెనవేసుకొని, ఆప్యాయతలు ముడివేసుకుని ఆనందంగా ఉండండి .  

శలవు .

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore