Online Puja Services

యాజ్ఞవల్క్యుడు -ఒక మహాపురుషుడు

3.136.97.64

యాజ్ఞవల్క్యుడు -ఒక  మహాపురుషుడు
(యాజ్ఞవల్క్య జయంతి ప్రత్యేకం - నవంబర్ -12 - 2021)

గంగా తీరంలో చమత్కార పురమని ఒక ఊరు ఉండేది. అక్కడ వేదాధ్యయన తత్పరుడైన ఒక విప్రశ్రేష్ఠుడు ఉండేవాడు. ఎల్లప్పుడు యజ్ఞాలు వేదాలు సలక్షణంగా వచించడం వలన యజ్ఞవల్క్యుడు అనేపేరు, నిరతాన్నదానం వలన వాజసని అనేపేరు, వేదాధ్యనం, అధ్యాపనం  వలన బ్రహ్మరాతుడు అనేపేరు, దేవవరప్రసాదంచేత ఒక పుత్రుని పొందడం వలన దేవరాతుడనే పేరు  ఆయన పొందాడు. ఆయన భార్య సునంద. బ్రహ్మవిద్యను బోధించి వ్యాపింపచేయగల పుత్రునికోసం ఆ దంపతులు తపస్సుచేయగా బ్రహ్మ దర్శనం ఇచ్చాడు. వాళ్ళు ఆయననే తమ కుమారునిగా జన్మించమని కోరారు. సహజమైన  బ్రహ్మ తేజస్సుటో జన్మించిన ఆపుత్రుడే యాజ్ఞవల్క్యుడు, వాజసని. చిన్నతనంలో ఉపనయనాది సంస్కారముల అనంతరం  వేదవిద్యకు పంపించారు. బాష్కలుని వద్ద ఋగ్వేదం,  జైమిని వద్ద సామవేదం, ఉద్దాలకునివద్ద అధర్వణ వేదం, తండ్రివద్ద యజుస్సు నేర్చుకున్నాడు. తరువాత వ్యాసునియొద్ద నియోగించబడి యజుర్వేదాన్ని శిష్యులకు చెబుతున్న వైశంపాయనుని వద్దకు యజుర్వేదం పూర్తిగా అధ్యయనం చేయడానికి వెడతాడు.  

తైత్తిరీయ సంహిత:  

"గురువును మించిన దైవములేడు. నీ సర్వస్వము గురువే అని యాజ్ఞవల్క్యునికి తండ్రిబోధించి గురువు వద్దకు పంపిస్తాడు. యాజ్ఞవల్క్యుడు భక్తితో గురువును సేవించి, అక్కడ ఉన్న విద్యార్థులలో ప్రథమునిగా నిలిచి, గురువు వద్ద సంపూర్ణ యజుర్వేదము, అనేక రహస్య విద్యలు నేర్చుకున్నాడు. సంపూర్ణమైన బ్రహ్మ తేజస్సు, గురుసేవా పుణ్యఫలమూ అతనికి లభించాయి. దీనితో కొంత సాత్త్వికాహంకారము అతనికి వచ్చిందట. ఒకరోజు గురువుగారిఎదుటే "గురుసేవ వలన ఎంతో తపోబలం జ్ఞానం వచ్చాయి. గురువుగారికి బ్రహ్మహత్యాపాతకంవంటిది వస్తే నాతపస్సుతో ఆయనకు దానినుండి విముక్తి కలిగించగలను" అంటాడు.  

వైశంపాయనుని శిష్యులలో  ఆయన మేనల్లుడు ఉండే వాడు. అతడు ఒకనాడు తనపట్ల అవిధేయతను ప్రదర్శిస్తే వైశంపాయనుడతన్ని కాలితో తన్నాడట. ఇంతలో సంబాళించుకొని "నేనూ కూడా వాని వలెనే ప్రవర్తించాను.నాదోషం కూడా బ్రహ్మహత్యతో సమానం" అంటాడు. అక్కడే ఉన్న యాజ్ఞవల్క్యుడు "నేను నా తపః శక్తితో గురువుగారి దోషం నివృత్తిచేస్తాను. ఈ పని ఇంకెవరూ చేయలేరు" అన్నాడు. గురువుగారికి కోపము వచ్చి, "నాకంటె గొప్పవాడివయ్యావా? నిన్ను నాగురుకులం నుండి బహిష్కరిస్తున్నాను. నీఅహంకారానికి ప్రతిఫలంగా నావద్ద నేర్చుకొన్న విద్య ఇక్కడే వదిలేసి పో" అని ఆజ్ఞాపిస్తాడు. యాజ్ఞ వల్క్యుడు గురువు పాదాలపై పడి, క్షమాపణ వేడి, ఆయన ఆజ్ఞ ప్రకారం యజుర్వేద విద్యనంతా అక్కడ రక్తసిక్త వమనంతో వదలిపెడతాడు. తన మాట ప్రకారం గురువుగారి  దోషంకూడా తొలగించాడు. ఆ విద్యను తిత్తిరి పక్షులు గ్రహిస్తే వాని పలుకులు విని ఇతరులు గ్రహించారు. ఇదే తైత్తిరీయ సంహిత. 

శుక్లయజుర్వేదం:

తరువాత యాజ్ఞవల్క్యుడు సూర్యుని ఉపాసించి కొంచెంభిన్నమైన శుక్లయజుర్వేదం నేర్చుకుంటాడు. ఇది ఉత్తరభారతంలో ప్రచారంలో ఉన్నది. మన ప్రాంతంలో ప్రథమ శాఖ బ్రాహ్మణులది ఈవేద శాఖ. సూర్యుడు శుక్లయజుర్వేదాన్ని యాజ్ఞవల్క్యునికి ఇచ్చినతరువాత సరస్వతీదేవిని ఆరాధించి ఇతరవిద్యలను పొందమని చెబుతాడు. యాజ్ఞవల్క్యుని తపోనిష్ఠ ఫలంగా సరస్వతీదేవి దర్శనం లభించినది. ఆమె అన్నివిద్యలూ ఎల్లవేళలా అతని హృదయఫలకంపై ఉండేటట్లు అనుగ్రహించినది.

సర్వోత్తముడు యాజ్ఞవల్క్యుడు :

బృహదారణ్యక ఉపనిషత్తు యాజ్ఞవల్క్యుని ప్రతిభను ఆవిష్కరిస్తుంది. మిథిలనుపాలించే జనక మహారాజు ఒకసారి ఈయనను యాగంచేస్తూ ఆహ్వానించాడు. అనేక మంది మహర్షులుకూడా ఆయాగానికి వచ్చారు. జనకుడు అక్కడ అపారమైన ధన రాశినీ, గోసంపదను అక్కడ ఉంచి "మీలో అందరికంటే శ్రేష్ఠుడను అనుకునేవారు ఈ సంపదను తీసుకు వెళ్ళండి" అన్నాడు.అక్కడ ఉన్న ప్రతివారికి ఆ సంపద మీద ఆశ పుట్టి, తానేశ్రేష్ఠుడనని చెప్పాలని మనసులో ఉన్నా భయంతో సంకోచించారు. యాజ్ఞవల్క్యుడు లేచి తన శిష్యులను పిలిచి ఆసంపదను తన ఆశ్రమానికి తరలించమని ఆజ్ఞాపిస్తాడు.

వెంటనే సభలోని కొందరులేచి "నీవు అంత గొప్పవాడివా? నీజ్ఞానము ఏపాటిదో పరీక్షిస్తాం. ముందు మాప్రశ్నలకు సమాధానం చెప్పు" అని అతడితో వాదన లోనికి  దిగారు.  తాను గోసహస్రాన్ని అందరిలో శ్రేష్ఠుడనననే ఉద్దేశ్యంతో తీసుకోవడంతో యాజ్ఞవల్క్యునకు అందరిముందు తాను బ్రహ్మజ్ఞానిననీ, అందరికంటే అధికుడననీ నిరూపించుకోవలసి వచ్చినది. అందరిప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అందరి సందేహాలు తీర్చాలి. యజ్ఞయాగాదులు చేసి, జ్ఞానార్జనకూడాచేసి బ్రహ్మజ్ఞాన సిద్ధినిపొందినవారు కూడా తమ సందేహాలు తీర్చుకునేందుకు, అతడు తమమీద అధికుడౌనోకాదో తేల్చుకునేందుకు ప్రశ్నించారు.  కొందరు ఒకమార్గములో ఉండి ఇతరుల మార్గములు ఖండించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంకా సాధనదశలోనే ఉండి కొంత అహంకారం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాల వారు ఈ ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యునితో వాదించడం కనుపిస్తుంది. యాజ్ఞవల్క్యుని వాదనా విధానం  వాదమా? జల్పమా? అని ప్రశ్నించినవారున్నారు.  యాజ్ఞవల్క్యుడు వారిప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. వాదనలో వారు అతనిని జయించలేక ఓటమిని అంగీకరించారు.

యాజ్ఞవల్క్యుని అర్థాంగి -కాత్యాయని: 

మిథిలా నగరానికి సమీపంలోని ఒక అరణ్యంలో కతుడనే మహర్షి నివసించేవాడు. ఆయన కుమార్తె కాత్యాయని. అమెకు యుక్తవయస్సు వచ్చాక ఆమె తండ్రి ఆమెను యాజ్ఞవల్క్యునకిచ్చి వివాహంచేస్తానని అడిగితే ఆయన అంగీకరించి వివాహం చేసుకున్నాడు. వారికి చంద్రకాంతుడు, మహామేఘుడు, విజయుడు అని ముగ్గురు పిల్లలు కలిగారు. ఈ ఘట్టం బృహదారణ్యకములో ఉన్నది. కాత్యాయని మంచి గృహిణి. ఇల్లు గడపడం, ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను సేవించడం వంటి పనులలో ఆమె నిమగ్నురాలై ఉండేది. 

రెండవ వివాహం -మైత్రేయి :

మిత్రుడు అనే బ్రాహ్మణునికి మైత్రేయి అనే కుమార్తె ఉండేది. ఆమె రాజ సభలలో యాజ్ఞవల్క్యుని బోధలను, సంవాదాలను విని ఉన్నది. యాజ్ఞవల్క్యునివద్ద ఆత్మజ్ఞానాన్ని గ్రహించడం ఆమె కోరిక. ఇది సులభసాధ్యం కావడానికి ఆయనను పెండ్లిచేసుకోవాలని అనుకున్నది. ఆకాలంలోనే గార్గి అనే యోగేశ్వరి, మహాజ్ఞాని ఉండేది. ఆమె ఈ మైత్రేయిని తీసుకొనివెళ్ళి  కాత్యాయని అనుమతితో ఆమెను యాజ్ఞవల్క్యుని సేవలో నియోగించినది. ఆయన అనుగ్రహంచేత మైత్రేయిని భార్యగా అంగీకరించేటట్లు చేసినది గార్గి.   మైత్రేయి ఆకాలములోని మహిళలలో ప్రఖ్యాతి వహించినది. ఋగ్వేదములోని కొన్ని మంత్రాలకు ఆమె ఋషిగా చెప్పబడినది. ఆమెను బ్రహ్మవాదిని అనేవారు.

సన్యాసాశ్రమం : 

యాజ్ఞవల్క్యునికి వృద్ధాప్యం వచ్చాక అతడు సన్యాసం స్వీకరించాలనుకున్నాడు. దానికి ముందు తనవద్ద ఉన్న సంపదను భార్యలకు పంచుదామనుకున్నాడు. "మీకేమి కావాలో కోరుకోండి" అని అడుగుతాడు. మాకు సంపద అక్కరలేదు. జరామృత్యువులు లేని మోక్షమార్గం చూపండి అని అడిగారు వాళ్ళు. అప్పుడు యాజ్ఞ వల్క్యుడు వారికి ధర్మబోధచేశాడు. భర్త “భార్యను ప్రేమిస్తున్నాను, నేను ఆమెకు ప్రియుడిని అనుకుంటాడు. కాని అతడు తనకొరకే, తన ఆత్మకొరకే ఆమెకు ప్రియుడవుతున్నాడు. భార్యను భర్త ప్రేమించడంలో ఉద్దేశ్యం అతని ఆనందం, తద్వారా తన సుఖం కోసమే. ఎవరూ ఎవరినీ నిస్వార్థంగా ప్రేమించరు. తమకొరకే వాళ్ళను ప్రేమిస్తారు. ఇదే సూత్రం మిత్రులకు, పుత్రులకు, సమస్తానికీ వర్తిస్తుంది. అంతా నాకొరకే అంటున్నావు కదా! ఎవరీ నేను? - అని విచారణ చేయాలి.   అంతా ఆత్మయే” అంటూ బోధించాడు. “ఆత్మావా అరే ద్రష్టవ్యో, శ్రోతవ్యో, మంతవ్యో నిధిధ్యాసితవ్యో” - అని చెప్పబడేది ఇదే. అజ్ఞానంచేతనే దేహేంద్రియాత్మకమైన జీవభావం కలుగుతుంది. ఆత్మజ్ఞానమే అమృతత్వమని వారికి బోధించి అతడు సన్యసించి వెళ్ళిపోతాడు.

యాజ్ఞవల్క్యుడు ఎప్పటివాడు: 

వేద ఋషులలో అర్వాచీనుడు యాజ్ఞ వల్క్యుడు. శ్రీకృష్ణుని కాలపు వాడు (సుమారు 5000 సంవత్సరాల చరిత్ర). ఇది చెప్పడంతేలికే. యాజ్ఞవల్క్యుడు ప్రధమంగా వైశంపాయనుని శిష్యుడు. కృష్ణుడు చదివిన (కృష్ణ) యజుర్వేదాన్నే ఆయన అధ్యయనం చేసి తరువాత గుర్వాజ్ఞ వలన దానిని వదలిపెట్టాడు.సూర్యుని వద్ద (శుక్ల) యజుర్వేదాన్ని నేర్చుకుంటారు .  పరీక్షిత్తు కుమారుడు, జనమేజయుడు  ఈ వేదం, అనుబంధ బ్రాహ్మణం ఆధారంతోనే అశ్వమేధంచేస్తాడు.  

యాజ్ఞవల్క్యుడి గురించి ప్రాచుర్యములోనున్న విషయము తక్కువే. యాజ్ఞవల్క్యుడు సూర్యుని నుండీ నేర్చుకున్న శుక్ల యజుర్వేదమే  - వాజసనేయ సంహితగా పేరుపొందింది.  ఇక  బృహదారణ్యకోపనిషత్ - యాజ్ఞవల్క్య , జనకుల సంవాదము .  మైత్రేయ్యుపనిషత్తు  మైత్రేయి , యాజ్ఞవల్క్యుల సంవాదము.  

ఒక వేదము , ఒక బ్రాహ్మణము , ఒక ఉపనిషత్తు మానవ లోకానికి తెచ్చి ఇచ్చి, ఇంకొక ఉపనిషత్తుకు కారణమైన యాజ్ఞవల్క్యుడు మహాపురుషుడు . శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారు యాజ్ఞవల్క్య మహర్షిని గురించి రాసిన - మహాదర్శనము గ్రంథాన్ని చదవడం ఆ మహర్షిని గురించి వివరణాత్మకమైన విజ్ఞానాన్ని అందిస్తుంది . ఆధ్యాత్మికాభిలాషులు ఆ పుస్తకాన్ని చదవడం ఒక గొప్ప అనుభూతిగా అభివర్ణిస్తారు .

- లక్ష్మి రమణ 

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore