దర్భలు అంటే వెంట్రుకలే !

54.165.57.161

దర్భలు అంటే వెంట్రుకలే !
-లక్ష్మి రమణ . 

అవును దర్భలు అంటే రోమాలే! కానీ అవి పరమాత్ముని రోమాలు . ఈ భూమి రక్షించిన , పరమ ప్రకృతిని కాపాడిన ఆ భగవంతుని రోమాలు దర్భలు . అవి ఉద్భవించిన గాథ తెలుసుకోవడమంటే , ఈ సృష్టిని గురించి , పితృ యజ్ఞాన్ని గురించి, పరమ పావనుడైన ఆదివారాహమూర్తిని గురించి తెలుసుకోవడం . 
 
సృష్ట్యాదిన బ్రహ్మదేవుడు - స్వాయంభువ మనువు, శతరూపను సృష్టించి, సృష్టిని  పెంచమని కోరారు . అప్పుడు వారు  సృష్టించబడిన ప్రాణులు నివసించడానికి ఆధారమైన భూమి నీటిలో మునిగిపోయింది కాబట్టి దాన్ని పైకి తేవలసిందని కోరారు . అది తనవల్ల అయ్యే కార్యంకాదని , సృష్టికర్త తనని సృష్టించిన నారాయాణుని ప్రార్థించారు .అప్పుడు సంకల్పమాత్రం చేత శ్రీమన్నారాయణుడుని  బ్రహ్మ నాసికా రంధ్రం నుండి అంగుష్ట మాత్ర పరిమాణంతో వరాహ స్వామి అవతరించారు . చూస్తుండగానే గండశిలా పరిమాణంలో పెరిగి పోయారు . వారాహానికి సహజమైన గూర్గురారావం చేస్తూ సముద్రంలోకి చొచ్చుకుని వెళ్లారు .  దేవతలు, మునులు, ఋషులు, యోగులు స్తోత్రం చేస్తుండగా భూమిని పైకి తీసుకుని వచ్చి సముద్రంపై నిలిపారు. 

ఈ  సమయంలోనే తనకార్యానికి అడ్డు వచ్చిన హిరణ్యాక్షుడిని సంహరించారు.  ఆ సమయంలో వరాహ స్వామి ఒంటిని ఒక్కసారి దులపగా రోమములు కుప్పలుగా రాలి కిందపడ్డాయి. అప్పుడు ఆకాశమంత రూపంతో అనంతుడైన వరాహమూర్తి  తన గిట్టలలో ఇరుక్కున్న మట్టిని రాలిపడిన రోమాలపై మూడు చోట్ల దులిపి, మూడు ముద్దలుగా చేశారు. ఈ వరాహ రోమాలే దర్భలు.

 ఆ మూడు ముద్దలు పితృ, పితామహ, ప్రపితామహ భాగములైన మూడు పిండములు. ఈ విధంగా పితృ యజ్ఞమును తాను స్వయంగా ఆచరించి లోకానికి చెప్పారు వరాహస్వామి . ఋషులకు వేదాంత సారాన్ని వరాహ పురాణంగా అందించి ఋషి యజ్ఞాన్ని నిర్వహించారు. అదేవిధంగా యజ్ఞ స్వరూపునిగా దేవ యజ్ఞమును, భూమిని నీటిపైకి తెచ్చి నిలిపి భూత యజ్ఞమును, భూమిపై పాడిపంటలకు నెలవు అందించి అతిథి యజ్ఞమును నిర్వహించి సకల లోకాలచే స్తుతించబడుతున్నారు.

అందుకే దర్భాలకి యజ్ఞయాగాలలో , ఇతరత్రా దైవిక క్రతువుల్లో , పితృకార్యాలలో అత్యంత ప్రాధాన్యత .

Quote of the day

Do not dwell in the past; do not dream of the future, concentrate the mind on the present moment.…

__________Gouthama Budda