తీర్థయాత్రలు ఎందుకు చేయాలి ?

54.165.57.161

తీర్థయాత్రలు ఎందుకు చేయాలి ?
- లక్ష్మి రమణ  

పూర్వ కాలం నుంచి తీర్థయాత్రలు చేయడం ఆచారంగా వస్తోంది. కురుక్షేత్ర యుద్ధం సంభవించినప్పుడు బలరాముడు శాంతికాముకుడై తీర్థయాత్రలు చేశాడు. అప్పుడు ఆయన దర్శించిన ప్రదేశాల్లో నైమిశారణ్యం, బదరికాశ్రమం, మానస సరోవరం లాంటి క్షేత్రాలు ఉన్నట్లు మహాభారతంలోని భీష్మపర్వం చెబుతోంది.

ఒకప్పుడు ప్రజల్లో శీలం, వివేకం, సచేతనత్వం పరిఢవిల్లేందుకు ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉన్నతిని కల్పించేవి. ప్రజల్లో ఐక్యత, భిన్నత్వంలో సౌభ్రాతృత్వం, అనుబంధాలు విస్తృతమై జాతిలో ఏకత్వం ప్రస్ఫుటమయ్యేది. అందువల్లే పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక దృష్టాంతాలుగా నిలిచాయి. దైవత్వపు ఉనికికి ఈ క్షేత్రాలు ధామాలై ప్రజల్లో ధర్మానికి, మానవీయ విలువలకు ప్రామాణికాలయ్యాయి. భౌగోళిక, సాంస్కృతిక వైవిధ్యాలకు అతీతంగా మానవ జాతిని తీర్థయాత్రలు ఏకంచేస్తూ వస్తున్నాయి.

ఎన్నో సామాజిక, రాజకీయ, భాషాపరమైన ఒత్తిళ్లు ఉన్నా, భారత జాతిలోని భిన్నత్వంలో ఏకత్వానికి ఈ ఆధ్యాత్మిక ప్రస్థానాలే మూలకారణమని స్వామి కువలయానంద ‘విజన్‌ అండ్‌ విజ్డమ్‌’ అనే గ్రంథం వెల్లడిస్తోంది. తీర్థయాత్రలు మనిషిని ఆధ్యాత్మికంగా మానసికంగా చైతన్యపరుస్తాయి. మనిషికి భౌతికమైన, శారీరకమైన కష్టాలు సంభవించినప్పుడు ఇష్టదైవాలకు సంబంధించిన క్షేత్రాలను సందర్శించుకొంటామని మొక్కుకుంటారు. 

భగవంతుడిపై అపారమైన నమ్మకానికి ఈ మొక్కులు నిదర్శనం. మనిషి నైజం ఎలాంటిదంటే, తనకు సంభవించిన కష్టనష్టాలను దూరం చేసుకునేందుకు దైవంపై భారం వేసినా, తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంటాడు. ఈ ప్రయత్నాల కారణంగానే కష్టాలు గండాలు తప్పినా, అవి సఫలం కావడానికి దేవుడి కారుణ్యమే కారణం అనుకొంటాడు. మనిషిలో ఇదొక విలక్షణమైన నైజం. ఆ భావంతో చేస్తున్న తీర్థయాత్రల్లో, ఆధ్యాత్మిక ఆనందమే కాక, మానసిక ప్రశాంతతా లభిస్తుంది. మనుషులు తెలిసో తెలియకో తప్పులు చేస్తుంటారు. తమ తప్పులు తాము తెలుసుకొని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సైతం తీర్థయాత్రలు చేస్తుంటారు.

పుణ్యక్షేత్రాల్లో ప్రవహించే నదీనదాలు సైతం ఆ క్షేత్ర పవిత్రతకు వాసిని తెస్తాయి. బృందావనంలో యమునా నది; వారణాశి, ప్రయాగ, త్రయంబకేశ్వరం క్షేత్రాల్లో గంగానది; శ్రీరంగం, నిమిషాంబ క్షేత్రాల్లో కావేరి; తుంగా నదీతీరంలోని శృంగేరి శారదాంబ; హుగ్లీ నదీతీరంలోని కాళీఘాట్‌, నర్మదా నదీతీరంలోని ఓంకారేశ్వరం, పంపా నదికి దాపునఉన్న శబరిమల; మంత్రాలయ క్షేత్రాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న తుంగభద్ర లాంటివి మనిషి జీవన మార్గానికి అవసరమైన ఆధ్యాత్మిక భావోన్నతిని ప్రసాదిస్తున్నాయి. ఈ తీర్థాల్లో స్నానం ఆచరిస్తే పాప ప్రక్షాళన అవుతుందన్న నమ్మకం మనిషిని పవిత్రీకరిస్తుంది. ఆ ప్రదేశాలు నైర్మల్యానికి, పవిత్రతకు ప్రతీకలు. అందుకే అవి పుణ్యక్షేత్రాలై మనిషిని జిజ్ఞాసువులుగా మారుస్తున్నాయి. 

తీర్థయాత్రలు ప్రాకృతిక ఆవశ్యకతకు, మానవుడి దివ్య చైతన్యానికి కారణాలవుతున్నాయి. నిజానికి మానవుడు స్వతహాగా ఆధ్యాత్మిక ప్రయాణం సాగించేందుకే భువిపైకి వచ్చాడని శ్రీరమణులు అనేవారు. తీర్థయాత్రలు ఆ సత్యాన్ని గుర్తుచేస్తాయని ఆయన సదా చెబుతుండేవారు. తాళ్లపాక అన్నమయ్య స్వామిని నిద్రలేపుతూ ‘విన్నపాలు వినవలె వింత వింతలు’ అంటూ గానం చేశాడు. ఎన్నో విన్నపాలు చేసుకోవడానికి మనిషి క్షేత్రయాత్ర చేస్తాడు. కానీ భగవంతుడిపై ప్రేమానురాగాలతో, నమ్మకంతోనే యాత్ర సాగుతుంది. ఈ నమ్మకమే చివరికి మోక్షమార్గంలో మానవుడి ప్రస్థానానికి కారణం అవుతుందన్న మాట పరమసత్యం.

Quote of the day

Do not dwell in the past; do not dream of the future, concentrate the mind on the present moment.…

__________Gouthama Budda