కార్తీకమాస పుణ్యదినాలలో స్నాన మహిమ .

3.239.129.91

కార్తీకమాస పుణ్యదినాలలో స్నాన మహిమ . 
లక్ష్మీ రమణ

స్కంద పురాణంలో కార్తీకమాసం గురించి “నకార్తీకే సమో మాసం.. న కృతేన సమం యుగం.. నవేద సదృశం శాస్త్రమ్‌.. నతీర్థ గంగాయ సమం…” అని పేర్కొన్నారు. యుగాలలో కృతయుగంతో సమానమైన యుగం, వేదాలకు సమానమైన శాస్త్రం, గంగకు సమానమైనటువంటి నది లేనట్టే, మాసాల్లో కార్తీక మాసానికి సమానమైనదేదీ లేదని పెద్దల మాట. దీనిని బట్టి కార్తీక మాస విశిష్టత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో చేసే పూజలు, నోములు, వ్రతాల వల్ల జన్మజన్మాంతర పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

కార్తీకమాస విశిష్టతని గురించి జనకమహారాజు వసిష్ఠమహామునిని ప్రశ్నించినప్పుడు  ఆయన చెప్పిన వివరణే మనకి కార్తీక పురాణంగా లభిస్తూంది . ఆ మహర్షి కార్తీకమాసవైభవాన్ని వివరంగా 30 అధ్యాయాల్లో వివరించారు ఈ గ్రంధాన్ని కార్తీకమాసంలో పారాయణ చేయడం వలన అనంతకోటి పాపరాసి దగ్దమై, అంత్యాన కైలాసపథాన్ని  పొందగలరని పురాణోక్తి . 

కార్తీకమాసంలో చేసే నదీ స్నానం , ఉపవాసం, పూజ , దీపారాధన, దానధర్మాలు వంటి ధార్మిక కార్యక్రమాలన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని అనుగ్రహిస్తాయి . ఇవి ఎలా చేయాలనే విషయాలను , వాటివల్ల కలిగే ఫలితాలనూ కార్తీక పురాణం వివరంగా  తెలియజేస్తోంది . 

సాధారణంగా కార్తీకమాసంలో శివభక్తులు సూర్యోదయానికి పూర్వమే స్నానాన్ని ఆచరిస్తూ ఉంటారు . అయితే ముందే చెప్పుకున్నట్టు ఇది శివునితో పాటు కేశవ ప్రీతికరమైన మాసం కూడా ! అందుకే శివకేశవుల పుత్రుడైన అయ్యప్పని భక్తులు ఈ మాసంలో అర్చిస్తూ ఉంటారు . ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో సంచారం చేస్తూంటాడని , అటువంటి సమయంలో ఎవరైతే, కార్తీకమాస వ్రతాన్ని చేస్తూ , నమకచమకయుక్త శివార్చనలు , విష్ణుసహస్రనామ పారాయణాలు చేస్తారో అటువంటి వారికి అగణితమైనటువంటి పుణ్యం లభిస్తుందని కార్తీకపురాణంలోని ప్రథమాధ్యాయంలో పేర్కొన్నారు . ఇంకా ఏవిధంగా ఆ వ్రతాన్ని ఆచరించాలనే విధానాన్ని కూడా జనకమహారాజుకి వసిష్ఠులవారు ఇలా వివరిస్తారు . 

 కార్తీకమాస పుణ్యదినాలలో సూర్యోదయానికి పూర్వమే లేచి , కాలకృత్యాలు తీర్చుకొని , నదికి వెళ్లి స్నానం చేయాలి . గంగా, యమున, కృష్ణ , కావేరీ, తుంగభద్ర వంటి నదుల్లో స్నానమాచరిస్తే మరింత విశేష ఫలం ప్రాప్తిస్తుంది . అలా చేయలేనివారు ఇంట్లోనైనా చన్నీటితో స్నానాన్ని ఆచరించాలి . ఆతర్వాత గంగకి (నీటికి ), కేశవునికి , శివునికి , భైరవునికి నమస్కారం చేసుకోవాలి . అంతరం సూర్యునికి అర్ఘ్యన్నీ, పితృదేవతలకు తర్పణాన్ని  సమర్పించాలి . ఆ తర్వాత షోశోపచారాలతో విష్ణుమూర్తిని అర్చించాలి. అనంతరం శివాభిషేకం చేసుకొని ఇంటివద్దగానీ, దేవాలయంలో గానీ, రావిచెట్టు మొదట్లో గానీ కూర్చొని కార్తీకపురాణాన్ని చదువుకోవాలి . 

కార్తీకస్నాన మహిమ :

కేవలం కార్తీక స్నానాన్ని ఆచరించడం వలన కలిగే పుణ్యం వలన పిశాచిజన్మలు పొందినవారికి కూడా ఆ నీఛజీవితం నుండీ విముక్తి లభిస్తుందని పురాణవచనం. ఒక సదాచారుడైన తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేయాలనే ఆసక్తితో గంగాతీరానికి బయల్దేరతారు . అక్కడి నదీ తీరంలో ఉన్న ఒక మహావటవృక్షంపైన ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసిస్తూ అక్కడికి వచ్చే మనుషుల్ని చంపి తింటూంటారు . వాళ్ళు ముగ్గురూ యధావిధిగా ఈ విప్రోత్తముడిని కూడా కబళించాలని చూస్తారు. అప్పుడా బ్రాహ్మణుడు బిగ్గరగా ‘ గజేంద్రుడిని రక్షించినటువంటి ఓ నారాయణా నన్ను ఈ రాక్షసులనుండీ రక్షించ’మని బెగ్గరగా నారాయణ నామ స్మరణం చేస్తారు. 

దాంతో పూర్వజన్మ స్మృతి కలిగిన ఆ బ్రహ్మరాక్షసులు తాము ముగ్గురూ పూర్వజన్మల్లో బ్రాహ్మణులమేనని , ఆచారాలు పాటించక , తోటి బ్రాహ్మణుల సొమ్ముని కాజేసి , పరస్త్రీలతో గడపడం, మధు మాంసములు తినడం , దైవార్చనలలో సౌచాన్ని పాటించకపోవడం వల్ల తమకీ దుస్థితి ప్రాప్తించిందని తత్వనిష్ఠునితో చెబుతారు. అప్పుడాయన వారితరఫున కూడా తానే సంకల్పాన్ని చెప్పుకొని గోదావరీ జలాలతో కార్తీక స్నానాన్ని ఆచరించి , ఆ పుణ్యాన్ని ఆ రాక్షసులకు ధారపోస్తారు . దాంతో వారు బ్రహ్మరాక్షసరూపం నుండీ విముక్తిని పొంది దివ్యరూపాన్ని ధరించి వైకుంఠవాసానికి తరలుతారు . 

అందువల్ల, కార్తీకమాసంలో స్నానాన్ని ఆచరించి , శివ కేశవులని అర్చించడం అనంత పుణ్యఫలదాయని. అలా చేసినవారికి ప్రస్తుత జన్మములోనిదే కాకుండా పూర్వజన్మలలో చేసిన పాపాముకూడా నశించిపోతుంది. వారు పరమపదాన్ని పొందడానికి అర్హతని పొందగలరు అని కార్తీకపురాణం చెబుతోంది . కాబట్టి ఈ కార్తీకమాసంలో ఆవిధంగా శివకేశవార్చనలు చేసి తరిద్దాం . 

శుభం .

Quote of the day

In a gentle way, you can shake the world.…

__________Mahatma Gandhi