భాద్రపదమాస విశేషం

3.239.58.199

భాద్రపదమాస విశేషం 

భాద్రపదం అనగానే మనకు గుర్తొచ్చేది వినాయకచవితి పర్వదినమే...
కాని...

బలరామ జయంతి, 
వామన జననం, 
రుషి పంచమి, 
ఉండ్రాళ్ల తద్దె, 
పితృదేవతలకు ఉత్తమగతులు కల్పించే మహాలయ పక్షం...ఇలా ఈ మాసానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి... 

     
దేవతా పూజలకు, పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం ‘భాద్రపద మాసం’...
చాంద్రమానం ప్రకరం భాద్రపద మాసం ఆరవమాసం. 

ఈ మాసంలోని పూర్ణిమ తిథినాడు చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రం సమీపంలోగాని, ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలోగానీ ఉండడంవల్ల ఈ మాసానికి ‘భాద్రపద మాసం’ అనే పేరు ఏర్పడింది...

భాద్రపద మాసం వర్షఋతువులో రెండో మాసం...
భాద్రపద మాసంలోని శుక్లపక్షం..
దేవతాపూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెబుతున్నాయి...
దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు శ్రీమహావిష్ణువు దశావతారాలను ధరించినట్లు అందరికీ తెలిసిన విషయమే. 

అట్టి దశావతారాలలో మూడవ అవతారమైన శ్రీ వరాహ అవతారాన్ని, 
ఐదవదైన శ్రీ వామనావతారాన్ని,
ఏడవ అవతారమైన బలరామ జయంతి... భాద్రపద మాసంలోనే శ్రీమన్నారాయణుడు ధరించి దుష్టశిక్షణ గావించాడు.
అందుకే ఈ మాసంలో ‘దశావతార వ్రతం’ చెయాలనే శాస్త్ర వచనం...

భాద్రపదమాసంలోని అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. 
ఈనాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి...

ఈ దినానికి ‘రాధాష్టమి’ అని పేరు. 
ఈ దినం రాధాకృష్ణులను పూజించడంవల్ల, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది...

మహాలయ పక్షం ;...!!
భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు, ఈ పక్షానికే ‘మహాలయ పక్షం’ అని పేరు.  
ఈ పక్షంలో పదిహేనురోజులపాటు పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్ధవిధులను నిర్వహించడం, పిండప్రదానం చేయడం ఆచరించాలని 
శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి...

ఈ రకమైన విధులను నిర్వహించడంవల్ల... గయలో శ్రాద్ధ విధులను నిర్వహించినంత ఫలం లభిస్తుందని శాస్త్ర వచనం...

భాధ్రపదంలో స్త్రీలు చేయాల్సిన వ్రతాలు :
హరితాళిక వ్రతం , లేదా సువర్ణగౌరీ వ్రతం,
భాద్రపద శుక్ల పక్ష తదియనాడు  
‘హరితాళిక వ్రతం’ లేదా  
‘సువర్ణ గౌరీ వ్రతం’ 
‘పదహారు కుడుముల తద్ది’ ఆచరిస్తారు...
శివపార్వతులను పూజించి, పదహారు కుడుములను తయారుచేసి నైవేద్యంగా సమర్పించవలెను...

ఈ పూజను కన్యలు పాటించడంవల్ల వారికి 
మంచి భర్త లభిస్తాడని పురాణాలు చెబుతున్నాయి...
ముత్తయిదువలు పాటించడంవల్ల వారి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుందని శాస్త్ర వచనం...

శుక్ల తదియ : ఉండ్రాళ్ళ తద్ది...!!
భాద్రపద బహుళ తదియ నాడు అవివాహితలు చేసే వ్రతం...

తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి దేవతాపూజ చేసి, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి సాయంత్రం ఊయలలో వూగుతారు.
ఇదే రోజున బలరామ జయంతి మరియు వరాహ జయంతులు జరుపుకుంటారు.

భాద్రపద శుక్ల చవితి : వినాయక చవితి....!!
ఏ పూజ అయినా, వ్రతమైనా, 
చివరకు ఏ పని ప్రారంభించాలన్నా 
ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. 
అటువంటి వినాయకుడి జన్మదినంను ‘వినాయక చవితి’ లేదా  ‘గణేశ చతుర్ధి’ పర్వదినంగా జరుపుకుంటారు...

ఈనాడు వినాయకుడి ప్రతిమను ఇంటిలో ప్రతిష్టించి స్వామివారికి పూజ చేసి గరికతో పాటు, 21 పత్రాల్తో పూజించి , వ్రతకథ చెప్పుకుని, ఉండ్రాళ్ళు, కుడుములను నైవేద్యంగా సమర్పించవలెను.

శుక్ల ఏకాదశి : పరివర్తన ఏకాదశి....!!!
తొలి ఏకాదశినాడు క్షీరాబ్దిపై శేషతల్పంమీద శయనించిన శ్రీమహావిష్ణువు ఈ దినం ప్రక్కకు పొర్లుతాడు అంటే పరివర్తన చెందుతాడు కనుక దీనికి ‘పరివర్తన ఏకాదశి’ అని, ‘విష్ణు పరివర్తన ఏకాదశి’ అని ‘పద్మ పరివర్తన ఏకాదశి’  అని పేరు...

ఈనాడు ఏకాదశి వ్రతం ఆచరించడంవల్ల కరువుకాటకాలు రావని, వచ్చి వుంటే విముక్తి లభిస్తుందని కథనం.                                            
     

ద్వాదశి : వామన జయంతి.....!!!

దశావతారాల్లో ఐదవదైన వామనావతారాన్ని శ్రీమహావిష్ణువు ఈ దినం ధరించినట్లుగా 
పురాణాలు చెప్తూ ఉన్నాయి. 

ఈనాడు వామనుడిని పూజించి, 
వివిధ నైవేద్యములు సమర్పించి, 
పెరుగును దానం చేయాలని శాస్త్ర వచనం...

శుక్ల చతుర్డశి : అనంత చతుర్ధశి...!!!
అనంతుడు అనేది శ్రీమహావిష్ణువుకు ఉండే 
పేర్లలో ఒకటి, శ్రీమహావిష్ణువును అనంతుడిగా పూజిస్తూ 
చేసే వ్రతమునకే ‘అనంత చతుర్దశి వ్రతం’ లేదా ‘అనంత పద్మనాభ వ్రతం’ అని పేర్లు...

ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. 

కృష్ణ పక్ష ఏకాదశి : అజ ఏకాదశి...

అజ ఏకాదశికే ‘ధర్మప్రభ ఏకాదశి’ అని కూడా పేరు. 
పూర్వం గౌతమ మహర్షి చెప్పిన ఈ వ్రతం చేసి రాజ్యాన్ని, భార్యాకుమారులను పోగొట్టుకుని కాటికాపరిగా పని చేసిన హరిశ్చంద్రుడు వాటిని తిరిగి పొందినట్లు పురాణ కథనం. 
ఈ ఏకాదశినాడు వ్రతం ఆచరించడంతోపాటు నూనెగింజలు దానం చేయాలని శాస్త్ర వచనం..!!!

 

 

Quote of the day

And as long as you're subject to birth and death, you'll never attain enlightenment.…

__________Bodhidharma