ఏరువాక పౌర్ణమి

3.239.58.199

ఏరువాక పౌర్ణమి

భారతీయ సంస్కృతికి , జీవన విధానానికి మూలస్తంభం లాంటిది వ్యవసాయం.  

దానికి తొలి పనిముట్టు నాగలి , ముఖ్యవనరు వర్షం.  ఆ వర్షం కురిసే కాలం మొదలయ్యేప్పుడు రైతులు కృతజ్ఞతతో జరిపే పండుగ 'కృషిపూర్ణిమ'. దీనికే హలపూర్ణిమ, ఏరువాక పున్నమి అనే పేర్లున్నాయి. 

'ఏరు' అంటే నాగలి అని , 'ఏరువాక'  అంటే దుక్కి ప్రారంభం అనీ అర్థాలున్నాయి. 

వ్యవసాయానికి కావలసిన వర్షాన్ని కురిపిస్తాడని భావించే ఇంద్రుణ్ని పూజించడం , నాగలిని పూజించి వ్యవసాయ పనులు మొదలుపెట్టడం జ్యేష్ఠ పూర్ణిమ పర్వదిన ముఖ్యాంశాలు. 

రైతులు ఈ పండుగ జరపడానికిగల కారణాన్ని పరిశీలిస్తే - నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి నక్షత్రం జ్యేష్ఠ అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. 

ఆ నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే రోజు జ్యేష్ఠపూర్ణిమ. చంద్రుడు ఓషధులకు అధిపతి. ఓషధులు (మంచు , ఎరువు , సూక్ష్మధాతువులు) పుష్కలంగా ఉంటేనే వ్యవసాయం అధిక ఫలసాయాన్నిస్తుంది. 

పై కారణాలన్నింటివల్ల జ్యేష్ఠపూర్ణిమనాడు ఈ పర్వదినాన్ని జరుపుతారు...
వ్యవసాయానికి ఆలంబన అయిన పశుసంపద , భూమి , పనిముట్లకు ప్రాధాన్యమిచ్చి పూజించడం ఈ పూర్ణిమ ప్రత్యేకత. 
నాగలిని శుభ్రపరచి , పసుపు , కుంకుమలతో అలంకరించి పూజిస్తారు, దానితోపాటు పశువులను అలంకరించి వాటితో వ్యవసాయ భూమికీ పూజచేస్తారు. 

పశువుల కొట్టాలు , కళ్ళాలు మొదలైనవాటినీ శుభ్రంచేసి అలంకరిస్తారు. 
ఆపైన పొంగలిని (కొన్ని ప్రాంతాల్లో పులగం) వండి వర్షానికి అధిదేవత అయిన ఇంద్రుణ్ని పూజించి నివేదన చేస్తారు. 
ఆ తరవాత ఆ పదార్థాలను ఆవులకు , ఎడ్లకు తినిపిస్తారు, నాగలిని పూజించి , పశువులను , బళ్లను మేళతాళాలతో ఊరేగించి భూమిలో తొలి వ్యవసాయ పని ప్రారంభిస్తారు. 

కొన్నిచోట్ల తొలిదుక్కిలో రైతులు కూడా ఎడ్లతో సమానంగా కాడికి రెండోవైపు నిలిచి భూమిని దున్నుతారు.

 పశువులగెత్తం (ఎరువుగా మారిన పశువుల పేడ) పొలాలకు తరలించే ప్రక్రియా ఈ పూర్ణిమనాడే ప్రారంభిస్తారు.

ఉత్తర భారతదేశంలో దీన్ని 'ఉద్‌వృషభయజ్ఞం' అని పిలుస్తారు. వృషభం అంటే ఎద్దు. 
ఉద్ధృతం అంటే లేపడం. అంతవరకు వేసవివల్ల కాస్త విశ్రమించిన పశువులను వ్యవసాయం కోసం సిద్ధపరచడమని అర్థం. 

రుగ్వేదంలోనూ వ్యవసాయ పనుల ప్రారంభ దినాన చేసే గౌరవసూచకమైన ఉత్సవ ప్రసక్తి ఉంది. 
అధర్వణ వేదంలోనూ 'అనడుత్సవం' అనే పేరుతో ఒక ఉత్సవం జరపాలని ఉంది. 

దీనిలో భాగంగా హలకర్మ (నాగలిపూజ) , మేదినీ ఉత్సవం (భూమి పూజ) , వృషభ సౌభాగ్యం (పశువుల పూజ) మొదలైన ప్రక్రియలు చేయాలని చెబుతున్నాయి.

 ఇవేకాకుండా అనేక పురాణాల్లోనూ 'కృషిపూర్ణిమ' ప్రసక్తి ఉంది. వరాహమిహిరుడు రచించిన 'బృహత్సంహిత' లోను , పరాశరుడు రాసిన 'కృషిపరాశరం' లోనూ ఈ ఉత్సవ ప్రసక్తి ఉంది. కర్ణాటక ప్రాంతంలో 'కారణిపబ్బం' అని పిలుస్తారీ ఉత్సవాన్ని .

- సేకరణ 

Quote of the day

And as long as you're subject to birth and death, you'll never attain enlightenment.…

__________Bodhidharma