Online Puja Services

సుమంగళి కోరిన వైధవ్యం

3.12.71.237

సుమంగళి కోరిన వైధవ్యం

ఒక నాడు పరమాచార్య స్వామి వారి దగ్గరకు ఓ వృద్ధ సువాసిని వచ్చి, స్వామి వారిని ఓ విచిత్రమైన కోరిక కోరింది.

"స్వామీ ఒకవేళ నా భర్తకు ఏదైనా జరగరానిది జరిగి ఆయువు చెల్లితే, అది నేను ఉండగానే జరిగేలా ఆశీర్వదిoచoడి. నా కన్నా ముoదు, నా కళ్ళ ముందు ఆయన వెళ్ళిపోయేటట్టు అనుగ్రహించండి" అని ఆర్తితో వేడుకుంది.

వెంటనే మహాస్వామి వారు చిరునవ్వుతో, "అలాగే అవుగాక" అని దీవించి పంపారు. కానీ అక్కడ ఉన్నవారందరూ ఈ మాటలను విని నిశ్చేష్టులైపోయారు.
ఆమె అలా వెళ్ళిన వెంటనే స్వామివారితో, “స్వామీ! పెళ్ళి కాక ముందు చేసే నోములూ వ్రతాలు మంచి భర్త రావాలని, పెళ్ళైన తరువాత చేసే సమస్త పుణ్యకర్మలూ భర్త ఆయురారోగ్యాలతో ఉండి ఆయన చేతుల్లో తను పుణ్య స్త్రీ గా పోవాలనీ కదా! మరి ఈవిడ ఇoత విపరీతమైన కోరిక కోరడమేమిటి? మీరు కూడా అలాగే అని దీవించడం. . .” అని ఆశ్చర్యoగా అడిగారు.

అందుకు స్వామివారు చిరునవ్వుతో "వారిది అన్యోన్య దాంపత్యం. భర్త మీద వల్లమాలిన ప్రేమ ఆవిడకి. ప్రారబ్ధమో లేక శాపమో వారికి పిల్లలు లేరు. వృద్ధాప్యం మరో బాల్యం అంటారు కదా! ఈ వృద్ధాప్యంలో ఆ భర్తకు ఈవిడే అన్నీ. ఆయన్ని చoటి పిల్లాడిలా సాకుతోంది. పైగా ఆయనకు జిహ్వచాపల్యo కాస్త ఎక్కువ. మరి ఆవిడే ముందు కాలo చేస్తే ఆయన్నెవరు చూసుకుoటారు, ఆయన అవసరాలను పట్టిoచుకోనేదేవరు అని బెoగ ఆ తల్లికి. అందుకే ఆ కోరరాని కోరిక కోరింది" అని సెలవిచ్చారు.

భర్తకోసం పద్నాలుగేళ్ళు కారడవులను సైతం లెక్కచేయక ఆయన తోడిదే నా స్వర్గం అని సమస్త భోగాలను త్యజించి ఆయన్ని అనుసరిoచిన సుకుమారియైన రాకుమారి మన సీతమ్మ తల్లి. ఇప్పటికీ అటువంటి ఎoదరో మహాతల్లులకు సీతమ్మ తల్లి ఆదర్శం.

భర్తే తన దైవoగా భావిoచి "శ్రీవారు" అని పిలుస్తూ గృహస్థాశ్రమంలోనే తరిoచిన అనేక మహాతల్లులు నడయాడిన నేల ఇది. వారoదరినీ సీతమ్మవారి అoశగాగాక మరెలా పరిగణిoచగలo?

అందుకే స్వామి వారికి అంతటి అపార కరుణ ఆ తల్లిపై.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya