Online Puja Services

చిన్ని కృష్ణుని పాదాలు

3.15.219.217

చిన్ని కృష్ణుని పాదాలు

ఒకావిడ తరచుగా చెబుతుండేది “పరమాచార్య స్వామివారు శ్రీకృష్ణుడు. మనం ఆయన సన్నిధాన భాగ్యంగా ఆయనచుట్టూ తిరిగే గోవులవంటి వారము” అని. ఆరోజు గోకులాష్టమి. తెల్లవారుఝామున నాలుగు గంటలప్పుడు మహాస్వామివారు వెనకవైపుకు వెళ్ళారు. శ్రీకార్యం శ్రీకంఠన్ నాతో, “మామి నేను రహస్యంగా నీకోసం తలుపుతీస్తాను. నువ్వు తొందరగా నేలపైన రంగవల్లికలు దిద్ది, చిన్ని కృష్ణుని పాదాలు వేసి ఇక్కడినుండి వెళ్ళీపో... సరేనా!!” అని చెప్పాడు. 

నేను సరేనన్నాను. అతను నాతో, “నువ్వు కావాలంటే వెనుకవైపు తలుపులు వేసేస్తాను. నువ్వు నీ ముగ్గులు వేసినతరువాత చెప్పు నేను తలుపులు తీస్తాను స్వామివారికోసం” అన్నాడు. 

నేను మొత్తం రంగవల్లికలు వేసాను. ఆరోజు చిన్ని కృష్ణుని పాదాలు చాలా ముద్దుగా వచ్చాయి. వెనక తలుపు నుండి స్వామివారు పూజ, అనుష్టానం చేసుకునే గదివరకు వంటగది వరకు కూడా చిన్ని కృష్ణుని పాదాలు వేశాను. ఎక్కువ సమయం తీసుకున్నందుకు శ్రీకంఠన్ అరుస్తాడని ఇక బయటకు వచ్చేశాను. 

నేను ఒక కిటికీ వెనకాతల నిలబడి జరబోయే దాన్ని కన్నార్పకుండా చూస్తున్నాను. మహాస్వామివారు తలుపులు తీసారు. చిన్ని కృష్ణుని పాదాలు, రంగవల్లులు చూసి కట్టుకున్న వస్త్రాన్ని కొద్దిగా పైకెత్తారు. మెల్లగా చిన్ని కృష్ణుని పాదాలపై ఒక్కక్కొక్కటిగా వారి పాద పద్మములు ఉంచి చిన్నగా వారి గదిలోకి వెళ్ళిపోయారు. అలా వెళ్తున్నంతసేపు స్వామివారు కిటికి గుండా నన్ను చూస్తూనే ఉన్నారు. అచ్చం శ్రీకృష్ణ పరమాత్మ లాగే స్వామివారు నడిచి వెళ్ళిపోయారు. 

ఎంతటి కరుణ ఈ సర్వేశ్వరునిది!! 

ఇప్పటికి ప్రతి కృష్ణాష్టమికి నేను ఆ సంఘటనను గుర్తు చేసుకుంటాను.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

--- శ్రీమతి ప్రత్యంగిర పద్మాసిని

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/paramacharyavaibhavam
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha