Online Puja Services

అమ్మవారి చీరను (శేష వస్త్రం) మనం ధరించవచ్చా ?

13.59.130.130
అమ్మవారి చీరను (శేష వస్త్రం) మనం ధరించవచ్చా ?
 
 శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు అనేక ప్రాంతాల్లో వివిధ రూపాల్లో కొలువుదీరి భక్తులచే నిత్య నీరాజనాలు అందుకుంటోంది. సాధారణంగా దేవాలయాలకి స్త్రీలు ఎక్కువగా వెళుతూ వుంటారు. అదే అమ్మవారి ఆలయమైతే వీరి సంఖ్య మరింత ఎక్కువగా వుంటుంది. ఇక అమ్మవారిని దర్శించడానికి వెళుతున్నప్పుడు ఎవరూ కూడా ఉత్తచేతులతో వెళ్లరు. పూలు .. పండ్లు .. గాజులు .. రవికె .. చీర .. కానుకలుగా సమర్పిస్తుంటారు.
 
అమ్మవారికి చీరను సమర్పించిన భక్తులు విశేషమైన రోజుల్లో ఆ చీరను మూలమూర్తికి కట్టమని చెబుతుంటారు. ఇలా అమ్మవారికి కట్టిన చీరల సంఖ్య పెరిగిపోయినప్పుడు, ఆలయ నిర్వాహకులు భక్తుల సమక్షంలో వాటిని వేలం వేస్తుంటారు. అమ్మవారి చీరను ధరించడం అదృష్టంగా భావించే భక్తులు ఆ వస్త్రాలను సొంతం చేసుకుంటూ వుంటారు. అమ్మవారి చీర తమకి దక్కడాన్ని ఆమె అనుగ్రహంగానే వాళ్లు భావిస్తుంటారు. సంతోషంతో ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి కూడా చెప్పుకుంటూ వుంటారు.
 
అయితే అసలు అమ్మవారి చీరను (శేష వస్త్రం) ధరించవచ్చా ... లేదా ? అనే సందేహం కొంతమందికి కలుగుతూ వుంటుంది. 
 
అమ్మవారి చీరలను ధరించవచ్చని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అయితే అమ్మవారి చీర ధరించిన తరువాత, ఆ పవిత్రతను కాపాడటం కోసం తప్పని సరిగా కొన్ని నియమాలను పాటించాలని అంటున్నాయి. తిథి - వర్జ్యం చూసుకుని శుక్రవారం రోజున అమ్మవారి చీరను ధరించవచ్చు. అది కూడా ఉదయం వేళలో కొంతసేపు మాత్రమే ధరించాలి.
 
ఈ చీరను ధరించినంత సేపు ప్రశాంతంగా ... పవిత్రంగా వుండాలి. మంచి ఆలోచనలు చేస్తూ ... మంచి విషయాలను గురించి మాత్రమే మాట్లాడవలసి వుంటుంది. రాత్రి సమయాల్లో ఈ చీరను ధరించ కూడదు, ఎప్పుడు ఉతికినా ఆ నీటిని ఎక్కడపడితే అక్కడ కాకుండా మొక్కలకు పోయవలసి వుంటుంది. పుణ్యక్షేత్రాల్లోని అమ్మవారి ఆలయంలో లభించిన వస్త్రమైనా, మారుమూల గ్రామంలోని అమ్మవారి ఆలయంలో లభించిన వస్త్రమైనా పవిత్రత విషయంలో ఒకే విధమైన నియమాలను పాటించవలసి వుంటుంది.
 
- త్రిమూర్తి యెల్లపు 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha