ఇల్లరికం అల్లుడు... సారంగపాణి

35.175.191.36
ఓం నమో వేంకటేశాయ 
 
ఇల్లరికం అల్లుడు... సారంగపాణి
 
"భృగు" మహర్షి చేసిన ప్రార్థనలను ఆలకించిన... "మహాలక్ష్మి"... అతనికి కుమార్తెగా పుట్టడానికి అంగీకరించింది. 
 
భృగు మహర్షి భూలోకంలో "హేమ ఋషి "గా జన్మిస్తాడు. ఆయన కుంభకోణం దగ్గర లోని... "పొట్రుమరి" తటాకం వద్ద తపస్సు చేస్తూ ఉంటాడు. 
 
లక్ష్మీదేవి తటాకంలో తామర పూల మధ్య నుంచి ఉద్భవిస్తుంది.
మహర్షి ఆమెకు "కోమలవల్లి" అనే పేరు పెట్టి...పెంచి పెద్ద చేశాడు. 
 
"లక్ష్మీదేవి"ని వెదుక్కొంటూ వచ్చిన శ్రీనివాసుడికి ప్రస్తుతం సారంగపాణి దేవాలయం ఉన్న చోట... "కోమలాంబాళ్" కనిపిస్తుంది. 
 
ఆమె లక్ష్మీదేవిగా గుర్తించిన శ్రీనివాసుడు ఆమెను ఉడికించాలనే ఉద్దేశంతో భూ పొరల్లో కొద్దిసేపు దాక్కొంటాడు. అలా దాక్కొన్న శ్రీనివాసుడిని ప్రస్తుతం... 
"పాతాళ శ్రీనివాసుడు" పేరుతో కొలుస్తున్నారు. 
 
అయితే వైకుంఠం నుంచి విష్ణువు... ఇక్కడికి వచ్చి అమ్మవారిని వివాహం చేసుకొన్నాడు. అటు తర్వాత స్వామి వారు ఇక్కడే ఉండిపోయాడు. అంటే "ఇల్లరికపు అల్లుడు" అన్నమాట. 
 
అందువల్లే "సారంగపాణి"ని  భక్తులు......"వీట్టోడు మాపిళ్ళై" అని పిలుస్తుంటారు. అంటే "ఇల్లరికం అల్లుడు" అని అర్థం. 
 
మహా విష్ణువు విల్లు పేరు "సారంగం". కోమలవల్లిని వివాహం చేసుకోవడానికి విష్ణువు... విల్లు ధరించి, రథంపై వివాహానికి వచ్చాడట! అందుకే ఈ స్వామిని... "సారంగపాణి పెరుమాళ్‌" అని పిలుస్తారు. 
 
ప్రధాన ఆలయం దిగువన భూగర్భంలో పాతాళ శ్రీనివాసుడు కొలువై ఉంటాడు. 

తొలి పూజ అమ్మకే!

లక్ష్మీదేవి కోమలవల్లిగా అవతరించిన చోటు ఇది. పుట్టిల్లు కాబట్టి స్థానబలం ఆమెదే! అందుకే ఈ ఆలయంలో మొదట అమ్మవారిని దర్శించుకొని... పూజలు చేసిన తరువాతే... ఇల్లరికం అల్లుడైన స్వామివారిని దర్శిస్తారు.
ఇక్కడ స్వామివారు పడుకొన్న స్థితిలో నుంచి కొంచెం పైకి లేచిన స్థితిలో ఉంటారు. దీనిని "ఉద్దాన శయన భంగిమ" అని అంటారు. ఇటువంటి స్థితిలో విష్ణువు విగ్రహం ప్రపంచంలో ఇదొక్కటే. ఇందుకు సంబంధించిన పురాణ కథనం ఒకటి ఉంది.

ఆళ్వారుల్లో ఒకరైన "తిరుమలేశాళ్వార్" స్వామిని సందర్శించి స్తుతిస్తాడు. 
భక్తుడిని ఆదరించడానికి అన్నట్లు... పవళించిన స్థితిలో ఉన్న స్వామి కొంచెం పైకి లేస్తాడు. 

ఆ భంగిమలో స్వామిని చూసి మైమరిచిపోయిన తిరుమలేశాళ్వార్... ఆ స్థితిలోనే భక్తులను కరుణించమని కోరుతాడు. 

అందువల్లే ఇక్కడ స్వామివారు ఉద్దాన శయన భంగిమలో భక్తులకు దర్శనమిస్తాడని చెబుతారు.

ఓం నమో వేంకటేశాయ

- సత్య వాడపల్లి 

Quote of the day

The one excellent thing that can be learned from a lion is that whatever a man intends doing should be done by him with a whole-hearted and strenuous effort.…

__________Chanakya