భోజనం చేసే విధానం

100.24.115.215
అమ్మా.అన్నపూర్ణా దేవి.
 
శ్రీ అన్నపూర్ణా దేవిని ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్ సిద్ధి, శుద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. "సృష్టి" పోషకురాలు శ్రీ అన్నపూర్ణా దేవి. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుద్ధి, జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారం ఈమె వహిస్తుందని ఆర్షవాక్యం.
 
`ఓం సహనా వవతు
సహనౌ భునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు
మా విద్విషావహై
ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః'
ఇదే అన్న సూక్తం.
 
అన్నపూర్ణాష్టకం
 
నిత్యానందకరీ వరాభయకరీ - సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిలఘోరపాపనికరీ - ప్రత్యక్షమహేశ్వరీ
ప్రాలేయాచలవంశపావనకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 1
 
నానారత్నవిచిత్రభూషణకరీ - హేమాంబరాడంబరీ
ముక్తాహారవిడంబమానవిలస - ద్వక్షోజకుంభాంతరీ
కాశ్మీరాగురువాసితాంగరుచిరా - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 2
 
యోగానందకరీ రిపుక్షయకరీ - ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ - త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపఃఫలకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 3
 
కైలాసాచలకందరాలయకరీ - గౌరీ హ్యుమా శాంకరీ
కౌమారీ నిగమార్థ గోచరకరీ - హ్యోంకారబీజాక్షరీ
మోక్షద్వారకవాటపాటనకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 4
 
దృశ్యాదృశ్యవిభూతిపావనకరీ - బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్రఖేలనకరీ - విజ్ఞానదీపాంకురీ
శ్రీవిశ్వేశమనఃప్రమోదనకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 5
 
ఆదిక్షాంతసమస్తవర్ణనికరీ - శంభుప్రియా శాంకరీ
కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రిణయనీ - విశ్వేశ్వరీ శ్రీధరీ
స్వర్గద్వారకవాటపాటనకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 6
 
ఉర్వీ సర్వజయేశ్వరీ జయకరీ - మాతా కృపాసాగరీ
నారీ నాలసమానకుంతలధరీ - నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 7
 
దేవీ సర్వవిచిత్రరత్నరచితా - దాక్షాయణీ సుందరీ
వామా స్వాదుపయోధరప్రియకరీ - సౌభాగ్యమహేశ్వరీ
భక్తాభీష్టకరీ సదా శుభకరీ - కాశీపురధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 8
 
చంద్రార్కానలకోటికోటిసదృశా - చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమానకుండలధరీ - చంద్రార్కవర్ణేశ్వరీ
మాలాపుస్తకపాశసాంకుశధరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 9
 
క్షత్రత్రాణకరీ సదా శివకరీ - మాతా కృపాసాగరీ
సాక్షా న్మోక్షకరీ సదా శివకరీ - విశ్వేశ్వర శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ - కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ - మాతాన్నపూర్ణేశ్వరీ| 10
 
అన్నపూర్ణే సదాపూర్ణే - శంకరప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం - భిక్షాం దేహీచ పార్వతి,
మాతా చ పార్వతీ దేవీ - పితా దేవో మహేశ్వరః
బాంధవ శ్శివభక్తాశ్చ - స్వదేశో భువనత్రయమ్‌|
 
ఇతిః శ్రీ అన్నపూర్ణాష్టకం సంపూర్ణమ్‌
 
అన్నమధికమైన అరయ మృత్యువు నిజము
అన్నమంటకున్న ఆత్మనొచ్చు
చంప బెంప బువ్వ చాలదా వేయేల
విశ్వధాభిరామ వినుర వేమా!
 
అన్నాడు యోగి వేమన. అన్నానికున్న ప్రాధాన్యతని వేదాలు కూడా వక్కాణించాయి. అన్న సూక్తాన్ని పఠించడం కూడా అన్నం మీద మన భక్తి భావాన్ని నిలుపుకోవడమే. అందుకే ఆర్యులు `అన్నం పరబ్రహ్మ స్వరూపం' అన్నారు. అన్నమే జీవిని బతికిస్తుంది. అన్నమే పోషిస్తుంది. అన్నమే ఆరోగ్యాన్నిచ్చి కాపాడుతుంటుంది. అన్నమే మనుగడకి ఆలంబనగా ఉంటుంది.
 
అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చు. అన్ని దానాల్లోకీ అన్నదానం గొప్పదని పెద్దల వాక్కు.
 
పూర్వం అన్ని లోగిళ్ళలోను నిత్యం ఇంటిల్లిపాదికీ వండే టప్పుడు ఒక గుపెడు బియ్యం ఎక్కువ పొయ్యిమనేవారు. ఎందుకంటే, అతిధి, అభ్యాగతుల కోసం, అన్నార్తులెవరైనా వస్తే పెట్టాలనే ఉద్దేశ్యంతోను అలా చేసేవారు.
 
భోజన విధానం
 
1. అన్నాన్ని భుజించేటప్పుడు కూడా పద్దతి పాటించాలి. శుభ్రంగా అలికిన నేల మీద కంచంలోగానీ, అంతకన్నా శ్రేష్టమైన అరటి ఆకులో గానీ అన్నం, శాకాలు వడ్డించుకుని పీటలు వేసుకుని ఇంటిల్లిపాదీ కింద కూర్చుని భుజించడం చాలా ఉత్తమం.
 
2. భుజించే ముందు అందరూ అన్నానికి నమస్కరిస్తూ దానిని మనకి ప్రసాదించిన దేవుని దివ్యప్రసాదంగా భావించి, కళ్ళ కద్దుకుని తినడం ప్రారంభించాలి.
 
3. సోఫాల్లోను, కుర్చీలోను కూర్చుని భుజించడం నిషిద్ధం. వీలైతే అన్న సూక్తం పటించడం మరీ మంచిది.
 
4. అన్నం భుజించేటప్పుడు మనం అన్నం మీదే దృష్టి నిలిపి తింటే అది వంటపడుతుంది.
 
5. అన్నానికి ఉన్న మరో శక్తి ఏమిటంటే, అన్నం తినే సమయంలో మన భావాలు ఏవి ఉంటాయో, శారీరకంగా అందుకు తగిన ఫలితాలే తిన్న అన్నం వలన కలుగుతాయి. అందుకే టీవీలు చూస్తూ, కబుర్లు చెప్పుకుంటూ, చాడీలు మాట్లాడుకుంటూ తింటే నెగెటివ్ ఆలోచనలు వృద్ధిచెందుతాయి
 
6. భగద్భక్తితో, మనసులోకి ఎటువంటి ఆలోచనల్నీ రానీయకుండా, పద్దతిని పాటిస్తూ భుజిస్తే పాజిటివ్ ఆలోచనలు వృద్ధిచెందుతాయి. మనసు ప్రశాంతంగా ఉండి చేసే అన్ని పనులు విజయవంతంగా ముందుకు సాగుతాయి.
 
7. ఎవరైనా భోజనం చేసి వెళ్ళమని ఒకటికి రెండు సార్లు అడిగితే తిరస్కరించకూడదు. వండి వడ్డించిన వారిని లోపాలు ఎంచకూడదు.
 
8. ఇంట్లో పెద్దవారు, పిల్లలు ఉంటే, ముందుగా వారికి భోజనం పెట్టాలి. అందువల్ల ఆకలితో వేచివున్న వారి ఆత్మ శాంతిస్తుంది
 
అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారిని కూడా చూడవచ్చు. అన్నదానం చేయలేకయినా అన్నం పెట్టే ఇంటినన్నా చూపించమని పెద్దలు చెప్తారు. దీనికి సంబంధించి ఒక కథనాన్ని కూడా చెప్తారు.
 
మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభించాయి. స్వాగత
సత్కారాలు లభించాయి. ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది. అన్నీ అందుబాట్లో ఉన్నాయి. ఏంలాభం...! కర్ణుడికి ఏదో అసంతృప్తి. ఏదో వెలితి. ఎంత తిన్నా కడుపు నిండినట్టుండడంలేదు. సంతృప్తినేది లేదు. ఎందుకు ఈ విధంగా ఉంటుందో అతనికర్థం కావడంలేదు. ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు.
 
అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో, నీవు అనేక దానాలు చేసావని, అడిగినవాడికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడివని చెప్తారు. మరి.. ఎప్పుడైనా అన్నదానం చేసావా?’’ అనడిగాడు. దానికి సమాధానంగా
' లేదు..నేనెన్నో దానాలు చేసాను గాని అన్నదానం మాత్రం చేయలేదు '. అన్నాడు కర్ణుడు.
 
పోనీ అన్నం పెట్టే ఇల్లయినా చూపించావా? అనడిగాడు దేవేంద్రుడు.
 
కాస్త ఆలోచించిన కర్ణుడు చెప్పాడు- అవును. ఓ బీద బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు. అపుడు
నేను ఏదో ధ్యాసలో ఉండి, నాకు అవకాశం లేదు గానీ... అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను. అని చెప్పాడు
కర్ణుడు.
 
నీవుఅన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలిను నోట్లో పెట్టుకో అన్నాడు ఇంద్రుడు.
సరేనని ఆ వేలిని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు. ఒక్క గుటక వేసాడు. ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది. అంతవరకున్న అసంతృప్తి మటుమాయమైంది. ఎనలేని తృప్తి కలిగింది.
 
ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్మ్యం, దాని ప్రాశస్త్యం తెలుస్తోంది. నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేక ఇబ్బందులనుండి, ఇక్కట్ల నుండి బయటపడడానికి చక్కటి రెమిడీగా పనిచేస్తుంది అన్నదానం అని చెప్తారు పండితులు.
 
అన్నదానం విశిష్టత ...
 
1. అన్నదానం వలన ఎన్ని సమస్యలున్నా పరిష్కారమవుతాయని చెప్తారు. అన్నదానం చేసేటప్పుడు దైవభక్తులకు తాంబూలంతో పాటు దక్షిణ ఉంచి దానం ఇస్తేఅద్భుతమైన ఫలితాలు పొందవచ్చని ప్రతీతి.
 
2. కొందరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎంత ప్రయత్నించినా సరైన రాబడి లేకపోవడం, దానికితోడు విపరీతమైన ఖర్చులతో సతమతమవడం జరుగుతుంది. అలాంటివారు అన్నంతో లడ్డు పెట్టి, తాంబూల సహితంగా దానం ఇస్తే అధిక ఆదాయం పొందడంతో పాటు శ్రీమంతులయే అవకాశం ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి.
 
3. ఇక అనారోగ్యంతో బాధపడుతున్నవారు, దీర్ఘ రోగాలతో సతమతమవుతున్నవారు అన్ని రోగాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. కొన్నిసార్లు ఇంటిపై మాంత్రిక దోషాలు కూడా కలుగుతుంటాయి. అటువంటప్పుడు చిత్రాన్నంతోపాటు వడ దానం చేస్తే గృహంపై జరిగే ఏ విధమైన మంత్ర, తంత్ర సంబంధమైన దోషాలైనా తొలగిపోతాయి.
 
4. బెల్లం అన్నం దానం చేస్తే శ్రీమంతులవుతారు.
 
5. భోజనం చేసేముందు మొదటి ముద్దను పరమేశ్వరార్పణం చేసి దానిని కాకులకో, ఇతర పక్షులతో ప్రాణులకో పెడతారు. ఇలా చేయడంవలన భగవంతునికి సమర్పించినట్లు అవుతుంది. ఇక అన్నం తినేముందు కొద్దిగా అన్నాన్ని కాకులకు వేయడం వలన శని దోషాలనుంచి బయటపడవచ్చని కూడా చెప్తారు..
 
ఇలా చిన్న చిన్న విషయాలు పాటిస్తుంటే మనకి, ఇంటిల్లిపాదికీ ఆయురా రోగ్యాలకి ఎటువంటిలోటూవుండదు. అందరి ఆలోచనలు సన్మార్గంలో నడుస్తాయి. తినే పదార్ధాలని వృధాచేయకుండా, సద్వినియోగం చేస్తూవుంటే ఆ అన్నపూర్ణమ్మ తల్లి నిత్యం మనింట్లో ధాన్యరాసుల్ని కురిపిస్తుంది. అలక్ష్యం చేస్తే భుక్తికోసం వెంపర్లాడక తప్పని పరిస్థితిని చవిచూడవలసి వస్తుంది. కనుక అన్నాన్ని గౌరవిద్దాం..నలుగురిని ఆదరిద్దాం...తృప్తిగా జీవిద్దాం..
 
ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు
 
- సూర్యప్రకాష్ సాధనాల

Quote of the day

It is easy to talk on religion, but difficult to practice it.…

__________Ramakrishna