Online Puja Services

భావనామాత్ర సంతుష్ట హృదయాయై

3.145.60.166

భావనామాత్ర సంతుష్ట హృదయాయై

అమ్మవారి నామాలలో ఇది ఒక నామం. కేవలం ‘భావన చేత సంతృప్తి చెందే తల్లి హృదయం కలిగినది' అమ్మవారు అని అర్థం. ఆ అమ్మవారి స్వరూపమైన పరమాచార్య స్వామి వారు కూడా అంతే. అందుకు ఉదాహరణ నా జీవితంలో జరిగిన ఈ సంఘటన.

2014 వైశాఖ బహుళ పాడ్యమి పరమాచార్య స్వామి వారి 120వ జయంతి సందర్భంగా, స్వామి వారికి 120 ద్రవ్యాలతో అభిషేకం చేద్దామని ఆ ద్రవ్యముల పేర్లు అన్నీ రాసుకుని అలా చేయాలి ఇలా చేయాలి అనుకుంటున్న సమయం. కానీ, తీరా చేయవలసిన రోజున చేయలేక పోయాను. 

అందుకు రెండు రోజులు ముందు మా బాబాయి గారు నన్ను తమ ఇంట్లో వైశాఖ పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతం చేసుకుందాం రమ్మన్నారు. నేను బయలుదేరి వారి ఊరికి వెళ్ళాను. మా పిన్ని గారి స్నేహితురాలు ఒకావిడ వస్తుండడం వల్ల తనని ఇంటికి తీసుకురమ్మని చెప్పారు. నాకు ఆవిడ ముందే పరిచయం ఉండడం వల్ల నేను వెళ్ళి ఆవిడను ఇంటికి తీసుకుని వచ్చాను. 

ఆమె వాళ్ళ ఊరికి వెళ్తూ బస్సు ప్రయాణ బడలిక వల్ల వెన్నునొప్పి ఎక్కువ అవడంతో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని ఇలా మా ఇంటికి వచ్చారు. పిన్నిగారు పూజకు సిద్ధం చేస్తూ, పరమాచార్య స్వామి వారి గురించి ఆవిడతో మాట్లాడుతున్నారు. వెంటనే ఆవిడ ఏదో గుర్తుకు వచ్చినట్టుగా తన బ్యాగులో నుండి కంచిలో పరమాచార్య స్వామి వారి బృందావనానికి అభిషేకం చేసిన నీటిని ఒక బాటిల్ లో ఇచ్చారు. మేము దాన్ని తీసుకుని కళ్ళకద్దుకుని, తరువాత పుక్చుకుందామని దాచి పెట్టాము. ఆవిడ భోజనం చేసి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. 

మరుసటి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుని మా పనుల్లో నిమగ్నమైపోయాము. బాబాయి, పిన్ని వాళ్ళ పనులపైన వేరే ఊళ్ళకు వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు, అనగా పరమాచార్య స్వామి వారి జయంతి రోజు, ఉదయం లేచి సంధ్యావందనం చేస్తూ, “ఇంట్లో ఉండి ఉంటే పరమాచార్య స్వామి వారికి కనీసం మామూలు పూజ అయినా చేసుకునేవాడిని కదా” అని అనుకున్నాను. 

అంతలోనే బాబాయి నుండి కబురు వచ్చింది. తను రావడం ఆలస్యమవుతుంది కనుక ఇంట్లో నిత్యపూజ చెయ్యమని. ఆహా! ఏమి మహాస్వామి వారి కరుణ. మస్సులో తలచుకోగానే ఆ అదృష్టాన్ని కల్పించారు. సంతోషంగా బాబాయి ఇంట్లో ఉన్న శివ పంచాయతనానికి శ్రీరుద్రంతో అభిషేకం చేసి, పరమాచార్య స్వామి వారి పటానికి అష్టోత్తరంతో పూజ చేసుకున్నాను. 120 ద్రవ్యాలతో చేద్దామనుకున్న కాని ఒట్టి నీటీతో చేయవలసివచ్చినందుకు బాధపడుతూ, పూజ ముగించి తీర్థం తీసుకోబోతున్నాను. అప్పుడు గుర్తుకు వచ్చింది, నిన్న ఆవిడ ఇచ్చిన మహాస్వామి వారి బృందావన అభిషేక తీర్థం ఉంది కదా అని. వెంటనే ఆ తీర్థం చేతులలోకి తీసుకోబోతూ మన్సులో అనుకున్నాను.

అసలు ఈ తీర్థం ఇక్కడికి ఎలా వచ్చింది? అసలు బాబాయి అంత ఆతృతగా సత్యనారాయణ వ్రతం చేసుకుందామని అనుకోవడం, దానికి నన్ను పిలవడం ఏమిటి? కంచి నుండి వారి ఊరికి వెళ్తూ ఆవిడకు కలిగిన అసౌకర్యం వల్ల మా ఇంటికి రావడం ఏమిటి? ఇచ్చిన తీర్థాన్ని అప్పుడే పుచ్చుకోకుండా అలా ఉంచేయడం ఏమిటి? సరిగ్గా నేను పూజ పూర్తి చేసుకుని తీర్థం తీసుకుంటున్న సమయంలో ఇది గుర్తుకురావడం ఏమిటి? ఇలా అనుకున్నంతనే నా శరీరం రోమాంచితమై కళ్ళ నీరు కారుస్తూ మహాస్వామి వారి పటం వైపు చూశాను. 

స్వామి వారి ఆ కరుణారస పూరితమైన నేత్రాలలో “120 ద్రవ్యాలతో నాకు అభిషేకం చెయ్యలేకపోయాని బాధపడకు. చెయ్యాలి అని అనుకున్నావు కనుక కంచి నుండి బృందావన అభిషేక తీర్థాన్ని పంపిస్తున్నాను. తీసుకో” అని అన్నట్టు అనిపించి సంతోషంతో కళ్ళ నీరు కారుస్తూ ఆ తీర్థం తీసుకున్నాను. 

--- వెల్లంకి కార్తికేయ శర్మ, “కంచి పరమాచార్య వైభవం” అడ్మిన్
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha